విష..వలస విలయం

విష..వలస విలయం

– సహచరి

            వాళ్ళు విమానాల్లో విహరించే వాళ్లకు

            రన్‌వేలు నిర్మించే వలస జీవులు….

            వాళ్ళు రైలు బోగీలకు పట్టాలేసి

            రహదారుల్ని నిర్మించిన బడుగుజీవులు

            వాళ్ళు కాళ్ళు తడవకుండా బడాబాబుల్ని

            సముద్రాలు దాటించగల శ్రమజీవులు….

            ఫ్యాక్టరీల పొగగొట్టాలే ఊపిరితిత్తుల్లా

            ఉఛ్వాస నిశ్వాసాల్లో విషవల(స)యంలో రాలిపోయి..

            తెగిపడిన విగత జీవులు వాళ్ళు

            కళ్ళు తడుపుకుంటూ కడుపు కాల్చుకుంటూ

            సకల సంపదల సృష్టికర్తలు వాళ్ళు..

            తాజ్మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లా

            గ్రేట్‌ ఇండియా విల్లాలకు చెమటోడ్చిన

            కష్టజీవులు వాళ్ళు….

            వాళ్లేసిన రహదారులే వాళ్ళ

            కాలినడకను నిషేధిస్తే

            వాళ్ళు నిర్మించిన ఆకాశ హర్మ్యాలే

            నిలువనీడనీయక గెంటేస్తే

            వాళ్ళ చెమటే పెట్టుబడులుగా నడిచే ఫ్యాక్టరీలు

            లాక్‌ ఔట్లలో విషం చిమ్మితే..

            విశాఖ తీరంలో ఒరిగిపోయినవాళ్లు….

            రైలు పట్టాలమీద తునకలైనవాళ్లు..

            వాళ్ళే దేశ సంపదకు రక్తం దారపోసినవాళ్లు

            వాళ్ళు వలసజీవులే కాని.. వలసపోయి

            దేశానికి రోగం తెచ్చిన వాళ్ళుకాదు..

            వలసలతో కాలినడకన కరోనా దేశానికి

            అంటకుండా ‘సామాజిక’ దూరంలో

            పేగుబంధాలను పెనవేసుకోడానికి వేలమైళ్ళు

            నడుస్తున్న వాళ్ళు.. రాళ్లు రప్పలు రైల్వే

            పట్టాల మీద నెత్తుటి కాళ్లతో నడుస్తున్నవాళ్ళ

            నర(డ)క యాతనకు రైళ్ళు.. వాళ్ళను

            ఊళ్లకు చేర్చకున్నా…. నడిచి నడిచి అలసిన

           దేహాల్ని చీల్చకుంటే చాలు!!

admin

leave a comment

Create AccountLog In Your Account