కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగ యంత్రాల పుట్టుక

కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగ యంత్రాల పుట్టుక

ఎంగెల్స్ 2వ శతజయంతి సందర్భంగా

– డా. ఆర్కే

1884లో ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన ఈ మహత్తర గ్రంథం అనేకసార్లు ప్రచురించబడి, అత్యంత ప్రజాదరణ పొందింది. పలు భాషలలోకి అనువదింపబడింది. స్త్రీ, పురుష సంబంధాలు, కుటుంబం పుట్టుక, పరిణామం గురించి ఈ పుస్తకం చెబుతుంది. నేను, నాది అంటే ఏమిటో ఎరుగని మానవ సమాజంలోకి సొంత ఆస్తి ఎలా ప్రవేశించిందో తెలియజేస్తుంది. పాలకులు, పాలితులు లేని సమాజం స్థానే శ్రమదోపిడి, వర్గసమాజం ఎలా వచ్చాయో, వాటి రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎలా అనివార్యమైందో సోదాహరణంగా వివరిస్తుంది.

          135 ఏళ్లు దాటినా ఇది కాలం చెల్లిన పుస్తకం కాదు. ఎన్ని చట్టాలొచ్చినా స్త్రీ అణచివేత, పురుషాధిక్యత ఈనాటికీ కొనసాగుతోంది. ఆకాశంలో సగభాగమైనా అవకాశాల్ని అందుకోవటంలో ఆడవాళ్లు అట్టడుగున వున్నారు. ‘అబల’ అనే ముద్రవేసి, నెపాన్ని దేవుడిపైకి, ప్రకృతిపైకి నెడుతున్నారు. మరోవైపు నేడున్నది ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం’ ప్రభుత్వం అంటున్నారు. కానీ ఆర్ధిక వనరులు కొందరి యాజమాన్యం చేతుల్లోనే వున్నాయి. అందరూ శ్రమించి సృష్టించిన సంపద ఆ కొందరికే జేరుతోంది. ఆ చేరవేతను కాపాడటానికే ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే సొంత ఆస్తి అనాదిగా వుందని, అది పూర్వజన్మ సుకృతమని అంటున్నారు. పవిత్రమైనదని, రక్షణ కల్పించాని గగ్గోలు పెడుతున్నారు.

          మేడిపండులాంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పొట్టవిప్పి పురుగుల్ని బయటకు లాగాంటే ఈ పుస్తకం చదవితీరాలి. ఈ పుస్తకంలోని ప్రతివాక్యం సాక్ష్యాధారాలతో రాయబడింది. దానివెనుక ఎంతో కృషి వుంది. అంకితభావం వుంది. ఆసక్తిదాయకమైన నేపథ్యం వుంది.

లెవిస్‌ హెన్రీ మోర్గన్‌ (1818-1881)

          అమెరికా యాంత్రపాలజీ పితామహులలో ఒకడు. న్యూయార్క్‌ రాష్ట్ర ఎసెంబ్లీ మెంబరు, సెనేటరు. వృత్తిరీత్యా లాయరు, ఈ పుస్తకానికి స్ఫూర్తి ప్రదాత.

          ఉత్తర అమెరికాలో అసలైన స్థానికులు రెడ్‌ ఇండియన్‌ తెగలు. వారిలో అతి పురాతనమైన ఒక తెగ ఇరాక్యూలు. న్యూయార్క్‌ రాష్ట్రంలోని ఇరాక్యూ తెగల భూముల్ని కాజేయటానికి ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ (Ogden) కుట్ర పన్నింది. ఇరాక్యూలు ప్రతిఘటించారు. అమెరికన్‌ ఆదివాసీలపట్ల ఆసక్తి, అభిమానం గల మోర్గన్‌ వారికి న్యాయ సహాయం చేయటానికి ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ఇరాక్యూలలోని కుటుంబ పుట్టుపూర్వోత్తరాలను గురించి పరిశోధన చేయాలనుకొన్నాడు. ఇందుకోసం 40 ఏళ్లు ఇరాక్యూలతో,  సన్నిహితంగా గడిపాడు, సనెకా తెగకి దత్తుపోయాడు. 1877లో ‘ప్రాచీన సమాజం’ అనే గ్రంథాన్ని రచించాడు.

          మోర్గన్‌కి మార్క్స్‌, ఎంగెల్స్ లు సమకాలికులు, చరిత్రను భౌతికవాద దృష్టితో చూచే పద్ధతిని అప్పటికి నలభై ఏళ్ల క్రితమే మార్క్స్‌ కనుగొన్నాడు. ఇదే పద్ధతిలో అమెరికన్‌ ఆదివాసీ జీవితాలను పరిశీలించిన మోర్గన్‌ గ్రంధం మార్క్స్ ని ఆకట్టుకొంది. దానిపై 96 పేజీల నోట్సు కూడ రాశాడు. దానికి తన పరిశోధనల నుండి కొంత సమాచారం జోడించి ఒక పుస్తకం రాయాలనుకొన్నాడు. కాని ఆ పని పూర్తిచేయకుండానే మరో ఏడాదికి మరణించటంతో ఆ బాధ్యత ఎంగెల్స్‌ తీసుకొన్నాడు.  ‘జీవశాస్త్రానికి డార్విన్‌ పరిణామ సిద్ధాంతం ఎంత ముఖ్యమో, అర్ధశాస్త్రానికి మార్క్స్‌ అదనపు విలువ సిద్ధాంతం ఎంత ముఖ్యమో, పితృస్వామ్యానికి పూర్వం మాతృస్వామ్యం వుండేదని మోర్గన్‌ కనిపెట్టిన అంశం కూడ అంతే ముఖ్యం’ అని మోర్గన్‌ గ్రంధంపై ఏంగెల్స్‌ వ్యాఖ్యానిస్తాడు.

          ఇరాక్యూ తెగల కుటుంబ వ్యవస్థలో మోర్గన్‌ రెండు అంశాల్ని గమనించాడు.

          ఒకటి : కుటుంబ పద్ధతి (ఒక భార్య, ఒక భర్త పద్ధతి అమలులో వుంది. వారికి కలిగిన సంతానం ఏ జంటదో గుర్తించవచ్చు.)

          రెండు : రక్తసంబంధాలు

          ఒక మగవాడు తన బిడ్డల్నేగాక తన సోదరుల బిడ్డల్ని కూడ కొడుకులు, కూతుళ్లు అని పిలుస్తాడు. వారు పెదనాన్న, చిన్నాన్న అంటారు. కాని అతడు తన తోబుట్టువుల బిడ్డల్ని మాత్రం మేనల్లుళ్లు, మేనకోడళ్లు అని అంటాడు. వారు ‘మేనమామ’ అంటారు. అలాగే ఒక స్త్రీ తన బిడ్డల్నేగాక తన సోదరీమణుల బిడ్డల్ని కూడ కొడుకులు, కూతుళ్లు అని పిలుస్తుంది. వారు పెద్దమ్మ, చిన్నమ్మ అంటారు. కాని ఆమె, తన సోదరుల బిడ్డల్ని మాత్రం మేనల్లుళ్లు, మేనకోడళ్లు అంటుంది. వారు ‘మేనత్త’ అంటారు.

          ఇలాంటి రక్తసంబంధాల బంధుత్వం అమెరికాలోని అన్ని తెగలలోను వుంది. వారితో ఏమాత్రం సంబంధంలేని భారతీయులలో, ఇతర ఆసియా ప్రజలలో వుంది. కొద్ది మార్పులతో ఆఫ్రికా, ఆస్ట్రేలియా తెగలలోనూ వుంది.

          కనుక ఇది ఉత్తుత్తి పిలుపులు కాదు. వీటివెనుక చారిత్రక నేపథ్యం వుందని మోర్గన్‌ భావించాడు.

          ఇరాక్యూ తెగల కుటుంబ పద్ధతిలో జంట పెళ్లి వుంది. రక్త సంబంధాల వ్యవస్థలో ఉమ్మడి దాంపత్యం రేఖామాత్రంగా కనపడుతుంది. ఈ రెంటికి మధ్య లింక్‌ను పట్టుకొంటే కుటుంబ పరిణామం అవగత మవుతుంది. ఈ దిశగా మోర్గన్‌ అమెరికన్‌ తెగలలో, హవాయి ద్వీపవాసులలో తన పరిశోధనలు కొనసాగించాడు.

కుటుంబం పుట్టుక

          కుటుంబం సమాజంలో ఒక భాగం. సమాజానికి సంబంధం లేకుండా అది మనలేదు. కుటుంబ పరిణామం సామాజిక పరిణామంలో అంతర్లీనంగా వుంటుందని మోర్గన్‌ ప్రామాణికంగా నిరూపించాడు.

          సమాజ మనుగడకి ‘ఉత్పత్తి’ కావాలి.

          ఉత్పత్తి 2 రకాలు.

          ఒకటి : వస్తూత్పత్తి. జీవితావసరములైన కూడు, గుడ్డ, గూడు లాంటివి.

          రెండు : సంతానోత్పత్తి. ఒకజాతి సజీవంగా కొనసాగాలంటే తన సంతానాన్ని నిరంతరం వృద్ధి చేసుకోవాలి.

          వస్తూత్పత్తికి పనిముట్లు కావాలి. పనిముట్లు తయారీ విధానాన్ని బట్టి సామాజిక దశలను నిర్ణయిస్తారు.

          మోర్గన్‌ ఆహారోత్పత్తి పద్ధతిని బట్టి మానవ సమాజాన్ని ఆటవిక, అనాగరిక, నాగరిక దశలుగా విభజించాడు. వీటినే ఇపుడు పాత, కొత్తరాతి యుగాలుగా, లోహయుగంగా పిలుస్తున్నాం. ఏ దశలో స్త్రీ, పురుష సంబంధాలు, కుటుంబం ఏ రూపం తీసుకున్నాయో ఇపుడు చూద్దాం.

          జంతు దశ నుండి పరిణామం చెందిన తొలి మానవులు మనుగడ కోసం గుంపులుగా నివసించేవారు. సంచార జీవితం అనివార్యం. ఈ దశలో స్త్రీ, పురుష సంబంధాలు జంతుస్థాయిని దాటిపోవు. వావి వరుసలు లేవు. అసలు కుటుంబమనే భావన కూడ లేని కాలమది. ఏ నియమాలు లేని స్త్రీ, పురుష సంబంధాల నుండి బీజరూపంలో ‘రక్తసంబంధీకుల కుటుంబం (Consanguine family) ఏర్పడింది.

          అది పాత రాతియుగం. వేట, ఆహార సేకరణ దశ. మానవ సమాజ చరిత్ర 90 శాతం ఈ యుగంలోనే గడిచింది. పళ్లు, కాయలు, దుంపలు ఏరుకొని బతికేవారు. నిప్పును కనిపెట్టారు. విల్లు, అంబుతో వేటాడారు. ఉత్పత్తి ప్రాథమికస్థాయిలో వుంది. వావి వరుసలు లేని స్త్రీ, పురుష సంబంధాలకు గండి పడింది.

          గుంపులో తరాల్ని బట్టి దాంపత్య బంధం అమలులోకి వచ్చింది. మొదటితరం ఒకరికొకరు భార్యాభర్తలు. వారి సంతానం రెండవతరం, మళ్లీ వారి సంతానం మూడవతరం ఒకరికొరకు భార్యాభర్తలు. ఒకతరం వాళ్లు మరోతరం వాళ్లతో దాంపత్యం కూడదు. అంటే తల్లిదండ్రులకు, వారి సంతానానికి మధ్య దాంపత్యం నిషేధింపబడింది. స్త్రీ, పురుష స్వేచ్ఛా సంబంధాలకి ఇది మొదటి హద్దు.

          ఈ కుటుంబం అంతా ఒకే జంట సంతానం. ప్రతి తరంలోను స్త్రీ, పురుషులు ఒకరికొకరు సోదరీ, సోదరులు మరియు భార్యాభర్తలు.

          ఈ కుటుంబ పద్ధతికి దాఖలులేవు కాని రూపురేఖలు హవాయి ద్వీపంలోని రక్తసంబంధీకుల వ్యవస్థలో మోర్గన్‌ కనుగొన్నాడు. అక్కడి వ్యవస్థలో సోదరీ సోదరుల బిడ్డలు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళుగా, బిడ్డలు మేనల్లుళ్లు, మేనకోడళ్లుగా వరుసలు లేవు. సోదరీ, సోదరుల మధ్య దాంపత్య సంబంధం హవాయిలోని రక్తసంబంధీకుల వ్యవస్థలో కనపడుతుంది. కనుక ఇలాంటి కుటుంబ పద్ధతి ప్రాచీన కాలంలో వుండి వుంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

          పాత రాతియుగం చివరిదశలో ఉత్పత్తిలో కొంత పురోగతి కనపడింది. సంచార జీవితం గడుపుతూనే మధ్య మధ్యలో తాత్కాలిక స్థిర నివాసాలు వుండేవి. ఈ సామాజిక అభివృద్ధికి తగ్గ కుటుంబ నిర్మాణం జరిగింది.

          అది పూనలాన్‌ కుటుంబం. అత్యున్నత దశకు చెందిన గుంపు పెళ్లి.

          సోదరీ, సోదరుల మధ్య దాంపత్యం నిషేధించబడింది. కుటుంబ పరిణామంలో ఇది పెనుమార్పు. కష్టంగా, క్రమక్రమంగా అమలులోకి వచ్చింది. ఆ తర్వాత తరాలలోని సోదరీ, సోదరులకు కూడ ఈ నిషేధం విస్తరించబడింది.

          ఈ నిషేధాలు ఎందుకు?

          ఇలాంటి కామ సంబంధాలు జుగుప్సాకరంగా వున్నాయని ఓ శుభోదయాన ఏ మహాత్ముడైనా బోధించాడా? గుంపు మొత్తం ఏకగ్రీవ తీర్మానంతో నిషేధం విధించుకుందా? లేదు.

          కాలం, అనుభవం పాఠాల్ని నేర్పుతుంది.

          రక్తసంబంధం గల వారికంటే రక్తసంబంధం లేనివారి సంతానం శారీరకంగా, మానసికంగా బలంగా, దృఢంగా వుండటం చూశారు. సోదరీ, సోదరుల మధ్య దాంపత్యం అనుసరింపబడుతున్న తెగలకన్నా ఆ ఆచారాన్ని నిషేధించిన తెగలు అభివృద్ధి చెందటం గమనించారు. బలమైన తెగల మార్గాన్నే బలహీనమైన తెగలు ఎంచుకున్నాయి. వేనవేల వత్సరాలలో వచ్చిన మార్పు యిది.

          ఒకే తల్లి సంతానం మధ్య దాంపత్యం నిషేధింపబడగానే పాత కుటుంబం స్థానే నూతన కుటుంబ వ్యవస్థ ఏర్పడింది.

          ఈ నూతన వ్యవస్థలో తోబుట్టువులంతా సొంత కుటుంబం లోనివారు. వారి భర్తలు బయటి కుటుంబాల నుండి వస్తారు. అందరూ ఉమ్మడి దాంపత్యం కలిగి వుంటారు. అన్నదమ్ములంతా ఇతర కుటుంబాలలోకి పోతారు. ఆయా కుటుంబాలలోని అక్క చెల్లెండ్రతో ఉమ్మడి దాంపత్యం కల్గి వుంటారు.  మోర్గన్‌ దీనికి ‘ప్యూనలాన్‌’ కుటుంబం అని పేరు పెట్టాడు. ‘ప్యూనలా’ అంటే సహచరి, సహచరుడు అని అర్ధం. సోదరీ, సోదరుల మధ్య దాంపత్యం నిషేధించబడింది గనుక మేనల్లుళ్లు, మేనకోడళ్లు, మేనమామలు, మేనత్తలు అనే కొత్త రక్తబంధుత్వాలు పుట్టుకొచ్చాయి. ఈ కుటుంబ నిర్మాణం హవాయి ద్వీపంలోని కుటుంబ పద్ధతిని, ఇరాక్యూ తెగల, భారతీయుల రక్త సంబంధ వ్యవస్థని పోలి వుంటుంది.

మాతృస్వామిక గణతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థ

          గుంపు పెళ్లి ఏ రూపంలో వున్నా సంతానానికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి మాత్రమే తెలుస్తుంది. అందువల్ల ఆ గుంపు తల్లివైపు నుండి మాత్రమే గుర్తింపబడుతుంది.

          ప్యూనలాన్‌ కుటుంబంలో ఒక తల్లి, ఆమె తోబుట్టువులు, వారందరి పిల్లలు, తల్లివైపు నుండి సోదర బంధుత్వం వున్న మగవాళ్లు ఒక ప్రధాన శాఖగా వుంటారు. ఈ కుటుంబం విస్పష్టంగా వుంది. విస్తృతంగా అభివృద్ధి చెందే లక్షణం కలిగి వుంది.

          కుటుంబం సంతానం కోసమే కాదు. సామాజిక ఉత్పత్తి కోసం కూడ. ఉత్పత్తి నిర్వహణకి ఒక వ్యవస్థ కావాలి. ప్యూనలాన్‌ రక్తసంబంధీకుల శాఖ నుండి ఆ వ్యవస్థ పుట్టింది.

          అదే గణ వ్యవస్థ.

          మానవ సమాజ చరిత్రలో ప్రప్రథమ సామాజిక వ్యవస్థారూపం ఇదే.

          గణం అంతటికీ పూర్వీకురాలు ఒకామె వంశకర్తగా గుర్తింపబడుతుంది. ఆమె వంశీకులు గణంగా ఏర్పడతారు. రక్తసంబంధం గలవారే గణంలో వుంటారు. గణసభ్యులెవరూ గణంలోనివారిని పెళ్లిచేసుకోగూడదు. గణమూల సూత్రం యిదే. మనుగడ అదే.

          ఆడవారు పుట్టినిల్లయిన తల్లి గణంలోనే వుండిపోతారు. మగవారు మెట్టినింటి గడప తొక్కాల్సిందే. గణంలో భార్యాభర్తలంతా ఉమ్మడి దాంపత్యం గనుక తండ్రి ఎవరో తెలియదు. స్త్రీలవైపు నుంచే గణ నిర్మాణం జరుగుతుంది. అందుకే దీనిని ‘మాతృస్వామిక గణవ్యవస్థ’ అన్నారు.

          రక్తసంబంధాల్ని బట్టి కుటుంబం ఆదిరూపాల్ని నిర్ధారించిన మోర్గన్‌ ఇరాక్యూ తెగలలోని గణ నిర్మాణాన్ని కూడ తొలిసారి ప్రపంచానికి వెల్లడించాడు. అంతేకాదు, ప్రాచీన అనాగరిక తెగలన్నింటిలోను గణవ్యవస్థ వుందని నిరూపించాడు.

          గణాలని గుర్తింపుకోసం తోడేలు, ఎలుగుబంటి, దుప్పి, డేగ, కొంగ తదితర జంతువుల, పక్షుల పేర్లతో పిలిచేవారు. గణనాయకులుగా ఒక శాంతికాలపు పెద్ద, ఒక సేనాపతిని ఎన్నుకుంటారు. గణంలోని స్త్రీ పురుషులందరికి ఓటింగ్‌ చేసి ఎన్నిక చేస్తారు. ఆ పదవి ఖాళీ అయితే తల్లి పరంపర వారసులనే ఎన్నుకుంటారు. అంటే తమ్ముడు, మేనల్లుడు గాని కొడుకు వారసుడు కాడు. నాయకులది నైతికాధికారమే. వారి చేతిలో సొంత బలగం వుండదు. గణం తనకు ఇష్టం లేకుంటే నాయకుల్ని రీకాల్‌ చేయవచ్చు.  తొలగింపబడినవారు సాధారణ వ్యక్తులుగా పరిగణింపబడతారు.

          గణంలోని యుక్తవయస్కులైన స్త్రీ, పురుషులందరూ గణకౌన్సిల్‌ను ఎన్నుకుంటారు. ఇది సుప్రీం కౌన్సిల్‌. సర్వం సహాధికారం కల్గి వుంటుంది. గణనాయకుల్ని ఎన్నుకునేందుకు, తొలగించేందుకు, నూతన సభ్యులను జేర్చుకొనేందుకు,  ప్రతీకారదాడులు చేసేందుకు పూర్తి అధికారం కల్గి వుంటుంది.

          అందరికీ ఆయుధాలుంటాయి. యుద్ధాలలో ఓడినవారిని చంపివేస్తారు. నోటిని పోషించే శక్తి ఆనాటి  చేతులకు లేదు. రాతి పనిముట్లతో ఉత్పత్తి సాధనాలు అతి ప్రాథమిక స్థాయిలో వున్న ఆ కాలంలో యుద్ధ ఖైదీలను చంపటం మినహా మరో మార్గం లేదు.

          సొంత ఆస్తి వుండదు, పనిముట్లు, ఆభరణాలు తప్ప. చనిపోయిన వారి కొద్దిపాటి ఆస్తి గణంలోపలే  వుండిపోవాలి. తల్లివైపువారే పంచుకోవాలి. తండ్రి ఆస్తికి బిడ్డలు వారసులు కాదు. భార్యాభర్తలు ఒకరి ఆస్తికి మరొకరు వారసులు కాదు.

          కర్మకాండలు సాధారణ స్థాయిలో గణాలకు సంబంధించినవిగానే వుండేవి. గణనాయకులే పురోహితుల పాత్రను నిర్వహించేవారు. గణం మొత్తానికి ఉమ్మడి స్మశానం వుండేది.

          శ్రమ విభజన చాల ప్రాథమిక దశలో వుండేది. స్త్రీ, పురుషుల మధ్యనే శ్రమవిభజన. యుద్ధాలు, వేటాడటం, ఆహార సంపాదనకి, పనిముట్లు తయారీ మగవాడి పని. పిల్లల్ని కనటం, పాలిచ్చి పెంచటం బాధ్యతలతో స్త్రీలను ఇంటికి పరిమితం చేసింది. వంట, కుట్టుపని, నేతపని, కాయలు, పండ్లు, దుంపలు సేకరించటం స్త్రీలే చేసేవారు. ఇల్లు, తోట, పడవ లాంటి వాటిని సమష్టిగా చేసుకొనేవారు. ఆనాటికే తమ శక్తితో స్వయంగా సంపాదించుకున్న ఆస్తిని స్వంతానికి కలిగి వుండటం, సమష్టి ఆస్తి, సమష్టి అనుభవం అమలులో వుంది.

          గణసభ్యులందరూ స్వతంత్రులు, స్వేచ్ఛాజీవులు. గణసంస్థకి కట్టుబడి వుండే ప్రజాస్వామ్యవాదులు, స్వాతంత్య్రం, సమానత్వం, సోదరత్వం గణ ప్రజాతంత్ర వ్యవస్థకు మూలస్తంభాలు.

గుంపు పెళ్లి నుండి జంట పెళ్లికి

          సుమారు 10 వేల సంవత్సరాల క్రితం. ఆహార ఉత్పత్తి దశ లేదా కొత్త రాతియుగం ప్రారంభమైంది. పశువుల్ని మచ్చిక చేసి పెంచటమూ, మొక్కా-మొటికా పెంచడమూ ఈ యుగం ప్రత్యేక లక్షణాలు. ప్రకృతి నుండి తమకు కావాల్సిన ఆహారాన్ని శ్రమించి ఉత్పత్తి చేయటంతో చరిత్ర కొత్త మలుపుకు మళ్లింది.

          ఈ మార్పు మధ్యప్రాచ్యంలో మొదలైంది. క్రీ.పూ. 10200 – 8800 మధ్య జోర్డాన్‌ నదీతీరాన నేటి పాలస్తీనాలోని జెరికో వద్ద ఆహారోత్పత్తికి బీజాలు పడినాయి. వ్యవసాయ పనులకి కొత్త పనిముట్లు వచ్చాయి. వాటిల్లో రాతి గొడ్డలి అతిముఖ్యమైనది. రాతిగొడ్డళ్లతో చెట్లు, దుబ్బులు నరికి నేలను చదును చేసేవారు. రాతి పారలతో నేలను త్రవ్వేవారు. కొయ్యనాగలితో భూమిని దున్నారు. ఎముక పిడి గల రాతి కొడవళ్లతో పంటను కోశారు. ధాన్యంపై పొట్టు తీయటానికి రోళ్లు, రోకళ్లు తయారుచేశారు.

          పచ్చిక బయళ్లున్న చోట్ల పశుపెంపకం జరిగింది. ఆవు, మేకలు, గొర్రెలు, పందులు లాంటి జంతువుల్ని చేరదీస్తే మందలు మందలుగా వృద్ధి చెందటంలోని ప్రయోజనాల్ని గ్రహించారు.

          ఆహారం కొంత మిగులు ఏర్పడింది. దాచుకోవాల్సిన అవసరం కలిగింది. కుండల్ని తయారుచేశారు.  తోళ్లు,  ఆకులతో శరీరాన్ని కప్పుకోవటం తెలుసు. ఇపుడు నార, ఉన్ని, బొచ్చుతో దుస్తులు చేయటం నేర్చుకున్నారు.

          ఆహారోత్పత్తితో సంచార జీవితానికి సుదీర్ఘ విరామం దొరికింది. ఆర్ధిక, సామాజిక, సంబంధాలేగాక, అనుబంధాలు కూడా పెరిగాయి.

          ఈ మార్పు గుంపు పెళ్లిపై పడింది. ఇప్పటికే ఎన్నో కట్టుబాట్లతో గుంపుపెళ్లి చిక్కి శల్యమైంది. మొదట తరాల మధ్య దాంపత్యాన్ని నిషేధించారు. తర్వాత సోదరీ, సోదరుల మధ్య, క్రమంగా దగ్గర బంధువుల మధ్య కూడ ఈ నిషేధం వర్తింపబడింది. ఈ విధంగా గుంపు పెళ్లి ఆచరణలో కష్టసాధ్యమైంది. ఇక మిగిలింది జంటపెళ్లి.

          నిజానికి జంటగా వుండటం కొత్తేమీకాదు. గుంపుపెళ్లి, అంతకు ముందు కూడా జంటలుగా కొద్దికాలమో, ఎక్కువకాలమో కలిసి వుండేవారు. జంటపెళ్లి ఇలాంటి లైంగిక ప్రేమ వలన వచ్చిందికాదు. అనేక నిషేధాల మధ్య అవసరంగా, అనివార్యంగా వచ్చిన ఆచారం.

          జంటపెళ్లిలో ఒక పురుషుడు, ఒక స్త్రీ కావాలనుకుంటే కలిసి వుంటారు. వద్దనుకొంటే విడిపోతారు. పర్మిషన్లు అక్కరలేదు. అంత సులువైన వివాహం. పిల్లలుంటే తల్లి దగ్గరే వుంటారు. మళ్లీ పెళ్లికి ఆటంకాలు లేవు.

          ఇలాంటి బలహీనమైన, అస్థిరమైన జంటపెళ్లి మాతృస్వామ్య కుటుంబ వ్యవస్థను రద్దుపరచలేకపోయింది.

          ఒకే భర్త, ఒకే భార్య కావాలని కోరుకొన్నది, పోరాడిందీ స్త్రీలే. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెంది, ఆర్ధిక పరిస్థితులు మెరుగవటంతో ఆలోచనాసరళిలో మార్పు వచ్చింది. అనాదిగా, ఆచారంగా వస్తున్న ఉమ్మడి దాంపత్య జీవితం అవమానకరంగా, జుగుప్సాకరంగా తోచింది. కొత్తరాతియుగంలో జంటపెళ్లి ఎక్కువగా కన్పిస్తుంది.

గణ వ్యవస్థ నుండి తెగ వ్యవస్థకి

          గణం లోపల దాంపత్యంపై అనేక నిషేధాలు ఖచ్చితంగా అమలులోకి వచ్చాయి. మరోవైపున గణ జనాభా అధికమవుతోంది. వివాహ పరిధి విస్తృతం కావాలంటే గణాల సంఖ్య పెరిగితీరాలి. ఒక గణం రెండు లేదా మూడు గణాలుగా విభజింపబడేవి. మొదట్లో విడిపోయిన గణాలు సోదర కూటమిగా వుండేవి. ఇతర కూటాల్లో వున్న గణాలు వివాహ పరిధిలోకి వచ్చేవి.

          కొన్ని గణాలు ఒక కూటమిగా, కొన్ని కూటాలు ఒక తెగగా నిర్మాణమైనాయి. తెగ వ్యవస్థ అవతరించాక, మానవ సమాజంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

          ప్రతి తెగకు గుర్తింపుకోసం ఒక పేరు వుంటుంది. నివసించడానికి కొంత ప్రాంతం వుంటుంది. వేటకి, చేపలకు మరికొంత ప్రాంతం అదనంగా వుంటుంది. నదులు, కొండలు, కోనలు, పర్వతశ్రేణులు తెగల మధ్య సహజ సరిహద్దులుగా వుంటాయి. భూమిపై తొలిసారిగా ఒక ప్రాంతాన్ని అధీనంలో వుంచుకోవటం ప్రారంభమైంది.

          కొన్ని ప్రాంతాలలో రక్తసంబంధాలున్న తెగలు సమాఖ్యగా ఏర్పడేవి. గణవ్యవస్థ వలె తెగ వ్యవస్థ కూడ పూర్తి ప్రజాస్వామికంగా వుండేది. సొంత ఆస్తిలేదు. నీ, నా భేదం లేదు. అంతా తెగే. తెగ మినహా మరోటి లేదు. శరీరానికి అంటి వుండే ఆభరణాలు, జంతు చర్మాలు, కుండలు, బుట్టలు, ఆయుధాలు మినహా అన్నీ తెగకి చెందినవే.

          భూమి అందరిదీ. దాన్ని సొంతం చేసుకోవాలనే స్పృహ కూడ లేదు. నీరు, నిప్పు, గాలి, ఎలాంటివో, భూమి కూడ అలాంటిదే.

          వస్తువులకు మార్కెట్‌ విలువలేదు. గాజు పూసలైనా, బంగారు సుద్దలైనా ఒక్కటే. అవినీతి ఎరుగరు.

          వర్గాలు లేవు. రాజరికం లేదు. ప్రభుత్వాలు లేవు. సైన్యం లేదు. చట్టాలు లేవు. న్యాయాధిపతులు లేరు. జైళ్లు లేవు. దోపిడీ లేదు. అణచివేత లేదు. తగాదాల్ని సంప్రదింపులు, సంప్రదాయాల ప్రకారం పరిష్కరించుకొనేవారు. ఏ పనిచేయాలన్నా సమష్టిగా పాల్గొనేవారు. సమానంగా పంచుకొనేవారు.

          ఇక్కడోవిషయం చెప్పాలి.

          ఆదిమ సమసమాజం అంటే ఈనాడు మనం చెప్పుకొనే కమ్యూనిస్టు సమాజం కాదు. ఆదిమ సమాజంలోని రాతి పనిముట్లు, బాణం తదితర ఉత్పత్తి సాధనాలు అతి సామాన్యమైనవి. ఎవరికి వారు తయారు చేసుకొనవచ్చు. కనుక ఉత్పత్తి సాధనాలు ప్రజలందరి యాజమాన్యంలో వుండేవి. సమిష్టి కృషి, సమిష్టి యాజమాన్యం వలన ఉత్పత్తి సమానంగా పంచబడేది.

          ఆదిమ సమసమాజంలో ఉత్పత్తిశక్తులు అతిహీనంగా వుండటం వలన అరకొర ఆహారం మాత్రమే దొరికేది. ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందే లేదా పస్తుండాల్సిందే. అందరూ కలిసి పనిచేసినా కనీస అవసరాలు తీరటం కష్టంగా వుండేది. తినగా మిగులు వుండదు. పంచుకోవటానికి, దోచుకోవటానికి ఏమీ వుండదు.

          ఆధునిక కమ్యూనిస్టు సమాజంలో ఉత్పత్తిశక్తులు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. సైన్సు అప్రతిహతంగా పురోగమిస్తుంది. ప్రణాళికాబద్దంగా ఉత్పత్తి సృష్టించబడుతుంది. ప్రజలందరూ సామర్ధ్యానికి తగ్గట్టు పనిచేస్తారు. అవసరానికి తగ్గట్టు అనుభవిస్తారు. వర్గాలుండవు. వర్గదోపిడీ వుండదు.

ఉత్పత్తి శక్తుల సాంకేతిక పురోగతి

శ్రమవిభజన – మారకం

          క్రీ.పూ. 4000-3000 రాగిని వెలికితీశారు. కరిగించి, పోతపోసి పనిముట్లు, ఆయుధాలు తయారుచేశారు. ఇది సాంకేతికంగా గొప్ప విజయం.

          వ్యవసాయంలో వినూత్న మార్పులొచ్చాయి. ఎడారులగుండా నదులు ప్రవహించే ప్రాంతాలు వ్యవసాయానికి అనువైన భూములు. వరదలలో కొట్టుకొచ్చే ఒండ్రుమట్టి ఆ మెత్తని భూముల్ని సారవంతం చేశాయి. వ్యవసాయంలో రాగి పనిముట్లను వుపయోగించారు. చిట్టడవులు, దుబ్బులు నరికి నేలను చదును చేశారు. కాలువలు త్రవ్వి నీటిని పారించారు. దుక్కి దున్ని, నీరుపోసి, విత్తనాలు చల్లి, పంటల్ని పండించారు.  వ్యవసాయం అభివృద్ధి చెందటంతో స్థిరనివాసాలు పెరిగాయి.

          కొన్ని తెగలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడ్డాయి. వ్యవసాయానికి అనుకూలత లేని మరికొన్నిచోట్ల పశుపెంపకాన్ని చేపట్టాయి. పాలపదార్థాలు, తోలు, ఉన్ని వస్తువులను తయారుచేశారు. ఈ వృత్తిలోని తెగలు శారీరకంగా ధారుడ్యమైనాయి. పశుగ్రాసం కోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లను, అడవుల్ని కేటాయించాయి.

          చేతివృత్తులు బయలుదేరాయి. స్థిరనివాసం ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించింది. ఇటుకల తయారీ  పెరిగింది. వడ్రంగి వృత్తికి ఊతమిచ్చింది. మగ్గంలో మార్పులు చేసి నేతను అభివృద్ధి చేశారు. చక్రాల బళ్లు,  కుమ్మరిసారెను కనిపెట్టటం,  జంతువుల్ని పనులకు ఉపయోగించటం ఈ కాలం సాధించిన గొప్ప పురోగతి.

          ఆనాటి భౌగోళిక, వాతావరణ పరిస్థితులకనుగుణంగా కొన్ని పురాతన తెగలు వ్యవసాయాన్ని, కొన్ని  తెగలు పశుపెంపకాన్ని ఎంచుకున్నాయి. ఇది సామాజికంగా వచ్చిన మొదటి శ్రమవిభజన. ఆహారోత్పత్తిలో ముందడుగు పడింది. తినగా ‘మిగులు’ ఏర్పడింది.

          చేతివృత్తులలో సాంకేతిక పరిజ్ఞానం సాధించాలంటే పూర్తికాలం పనిచేయాలి. ఆహారంలో ‘మిగులు’ ఈ వృత్తులవారిని పోషించటానికి వుపయోగపడింది. చేతివృత్తులు నేరుగా అభివృద్ధి చెందాయి. ఇది రెండవ శ్రమ విభజన.

          శ్రమ విభజన వస్తుమార్పిడికి ఊపిరి పోసింది.

          మొదట వ్యవసాయం, పశుపెంపకం తెగల మధ్య మారకం జరిగింది. ఒక తోలుసంచి యిచ్చి ధాన్యం, ఒక గొర్రెనిచ్చి రెండు నాగళ్లు, నాలుగు కుండలనిచ్చి పాలు, ఇలా మారకం చేసుకొనేవారు. వస్తువుకు ఉపయోగపు విలువ వుంటుంది. మార్కెట్‌ విలువలేదు. ఇది బార్టరు పద్దతి.

          చేతివృత్తులు అభివృద్ధి చెందిన తర్వాత మారకంలో అనూహ్య మార్పులొచ్చాయి. ఉత్పత్తిని తమ కోసం గాక, ఇతరుల కోసం సృష్టించాలి. కొడవళ్లు, కుండలు, నాగళ్లు ఉత్పత్తి చేశారంటే ప్రధానంగా మారకానికే.

          క్రమంగా వస్తువుల సంఖ్య పెరిగింది. ఒక వస్తువును మరొక వస్తువుతోగాక అనేక వస్తువులతో మార్చడానికి వీలు కలిగింది. అలాంటి అవసరం కూడ ఏర్పడింది. ఒక బస్తా ధాన్యాన్ని బట్టి రెండు ఉన్ని దుస్తులు, మూడు తోలు సంచులు లేదా ఒక పడవ, ఇలా శ్రమించి సృష్టించిన ఏ వస్తువుతోనైనా మార్చుకోవచ్చు. ఒక వస్తువుకు ప్రామాణికంగా తీసుకొని దానికి సమమగు ఇతర వస్తువులను లెక్కించడం మొదలైంది. ఉప్పు, తోలు, ముఖ్యంగా పశువులు ప్రామాణిక వస్తువులుగా చలామణి అయినాయి.

          సామాజిక శ్రమవిభజన, మారకం గణవ్యవస్థ నిర్మాణంలో పెనుమార్పుల్ని తీసుకొచ్చాయి.

అదనపు ఉత్పత్తి – గణవ్యవస్థ సంక్షోభం

          ఇంతవరకు రాతి పనిముట్లతో తింటానికి, వుంటానికి బొటాబొటిగా సరిపడే వెనుకబడిన ఉత్పత్తి విధానం కొనసాగింది. రాగి పనిముట్లు, నాగలి – ఎద్దు, చక్రం, నీటిపారుదలతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగింది. పశుమందలతోపాటు పాల ఉత్పత్తులు రెట్టింపయినాయి. చేతివృత్తులకు సాంకేతికత సమకూరింది.  అదనపు ఉత్పత్తి సృష్టించబడింది.

          పనిచేసే మనిషి తనకు సరిపోగా ఎంతోకొంత మిగులు ఉత్పత్తి చేయగల్గుతున్నాడు. తన కనీస అవసరాలకు పోను మిగిలిన ఉత్పత్తిని ‘అదనపు ఉత్పత్తి’ అంటారు. ఈ అదనపు ఉత్పత్తిని సృష్టించటానికి అవసరమైన శ్రమను ‘అదనపు శ్రమ’ అంటారు.

          శ్రమవిభజనకి అదనపు ఉత్పత్తి అనివార్యం. వ్యవసాయం, పశుపెంపకం వృత్తులవారికి వ్యవసాయేతర వస్తువులు అవసరం. వ్యవసాయేతర వృత్తులవారికి ఆహారం కావాలి. ఇవి సమకూరాంటే అదనపు ఉత్పత్తి జరిగి తీరాలి. అందుకు అవకాశాలు కూడ అందుబాటులోకి వచ్చాయి.

          శ్రమ సాధనాల పురోగతి ఉత్పత్తి కార్యకలాపాల రూపురేఖల్ని మార్చివేసింది. కనీస అవసరాల కోసం అందరూ ఒకే పని చేయాల్సిన అవసరం ఇంకెంతమాత్రమూ లేదు. రాతిపనిముట్లతో పొలం సాగు చేయాలంటే తెగ అంతా సామూహికంగా పాల్గొనాలి. నాగలి, ఎద్దు, చక్రం రాకతో అదే పనిని కొందరు వ్యక్తులే మరింత శక్తిమంతంగా చేయగల్గుతున్నారు. కుమ్మరిసారె, మగ్గం, తెరచాప పడవ, లోహపు పనిముట్లు తదితర నూతన ఉత్పత్తి సాధనాలతో ప్రత్యేక పనుల నైపుణ్యత పెరిగింది. వ్యక్తుల శక్తి సామర్ధ్యాలకు ప్రత్యేక విలువ, ప్రాముఖ్యత ఏర్పడింది. తెగలోనివారంతా ఉమ్మడిగా ఒకే పని చేయటం అభివృద్ధికి సరిపోకపోగా, దానిని  కుంటుపరిచే విధంగా వుంది. ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి ఆటంకంగా వుంది.

          ఇప్పుడో వైరుధ్యం తలయెత్తింది.

          అభివృద్ధి చెందిన ఉత్పత్తి శక్తులు, వాటికి సరిపోని ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఘర్షణ ప్రారంభమైంది.

          రాతి పనిముట్లు అందరివీ. వాటిపై ఉమ్మడి యాజమాన్యం వుంది. అందరూ కలిసి పనిచేస్తారు. సమానంగా అనుభవిస్తారు. మిగులు వుండదు. అభివృద్ధి చెందిన కొత్త పనిముట్లతో కొందరే పనిచేయగలరు. అవసరాలకు పోను అదనంగా ఉత్పత్తి చేయబడుతోంది. ఈ అదనపు ఉత్పత్తి ఎవరికి చెందాలి? అదే ఇపుడు చూడబోతున్నాం.

బానిసత్వం

          పూర్వం యుద్ధాలలో ఓడినవారిని చంపేసేవారు. మంత్ర తంత్ర విద్యలు, మూలికావైద్యం తెలిసినవారిని తెగలో కలుపుకొనేవారు. యుద్ధ ఖైదీలను చంపటం మినహా మరోమార్గం లేదు. వారిని పోషించగల సత్తా తెగకు లేదు. కనీస అవసరాలు అతి కష్టం మీద సంపాదించుకొనే దశ అది. అదనంగా ఉత్పత్తి చేయగల సామర్ధ్యం లేని కాలమది.

          ఇపుడు పరిస్థితులు మారాయి. ఉత్పాదకశక్తి పెరిగింది. అదనపు ఉత్పత్తికి అవకాశాలు మెండుగా వున్నాయి. పెద్ద పెద్ద పశుమందల్ని మేపటానికి మంది కావాలి. కాలువలు త్రవ్వటానికి, కరకట్టలు వేయడానికి, పొలం పనులకి, ఇంటి పనులకి పనివాళ్లు కావాలి. ఎంత ఎక్కువమంది దొరికితే అంత ఎక్కువ సంపదలు. ఈ పనులకు యుద్ధ ఖైదీలు పనికొస్తారు. కొద్దిగా తిండి పడేస్తే చాలు, పనిచేస్తారు. పిల్లల్ని కంటారు. పెద్దవారవుతారు. ఇంటా బయటా అంతా పనివాళ్లే – బానిసలే.

          యుద్ధాలలో ఓడినవారిని చంపటానికి బదులు, వారి శ్రమను దోచుకోవటానికి, సంపదలు కూడబెట్టటానికి కొత్తమార్గం దొరికింది. అదే బానిసత్వం.

          బానిసత్వం కొన్ని దశలుగా అభివృద్ధి చెందింది. ప్రారంభంలో బానిసలు తెగకు ఉమ్మడి ఆస్తిగా వుండేవారు. వారిని ఇంటిచాకిరీకి వినియోగించారు. తర్వాతి కాలంలో కుటుంబాల ఆస్తిగా ఉత్పత్తి క్రమంలోకి వారు లాగబడ్డారు.

          ఉత్పత్తిలో మిగులు లేనపుడు బానిసల అవసరం లేకపోయింది. ఉత్పత్తి సాధనాల సాంకేతికత అభివృద్ధి చెందటంతో అదనపు ఉత్పత్తి సృష్టింపబడింది. బానిసలను పోషించి, వారి శ్రమను దోపిడీ చేసి, సంపదలు పెంచుకొనే కొత్తమార్గం దొరికింది.

          మనిషిని మనిషి దోచుకొనే ఒక కొత్త అధ్యాయం మానవ సమాజ చరిత్రలో ప్రారంభమైంది.

          మాతృస్వామ్యానికి ఓటమి. పితృస్వామ్యానికి జయకేతనం.

          ఇది అదనపు ఉత్పత్తి తెచ్చిన మరో మౌలిక మార్పు.

          ఈ మార్పు మొదట ప్రాచ్య ప్రపంచంలో ప్రారంభమైంది. పశుమందలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. టైగ్రిస్‌ – యుఫ్రటిస్‌, నైలు, సింధు, గంగానదీ తీరాలలో పశుపోషణ తెగలు అభివృద్ధి చెందాయి.

          స్త్రీ, పురుష శ్రమ విభజనలో ఇంటి పని స్త్రీలది, బయటపని పురుషులది. మగవాళ్లు మొదటి నుంచి వేటగాళ్లు, పశుపోషకులు. పాలు, మాంసం సమృద్ధిగా లభించే మగవాళ్ల పశుపోషణ వృత్తికి ఇపుడు ప్రాముఖ్యత పెరిగింది. ప్రధాన వనరుగా నిలబడింది. మగవాళ్ల పరపతి పై అంతస్తుకు జేరింది. ఆర్ధిక ఆధిపత్యం చేజిక్కింది.

          ఇది క్రమంగా వ్యవసాయ తెగలకి ప్రాకింది, అయితే ఆలస్యంగా.

          నాగలికి ఎద్దు జత కలిసింది. పశుపోషకుడైన మగవాడు దున్నే రైతుగా మారాడు. పశుపాలనతోపాటు, పచ్చని పొలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. కాడెద్దుల రాకతో స్త్రీ, పురుషుల పని తారుమారయింది. అంతకు ముందు వ్యవసాయం స్త్రీలు, పశుపెంపకం పురుషుల అధీనంలో వుండేది. వ్యవసాయం పనులకు పశువులను వుపయోగించటంతో, స్త్రీలకు కాడెద్దుల భారం తగ్గింది. కాని ఒక ప్రధాన ఆదాయ వనరు పురుషుల చేతిలోకి పోయింది. కుండల తయారీని కనిపెట్టింది స్త్రీలే అయినా కుమ్మరి సారె మగవాళ్లదే అయింది. చక్రం, తెరచాప, పడవ, ఇసుకబట్టీ రవాణారంగాలలో మగవాళ్ల ఆధిపత్యం చలామణి అయింది. ఆర్ధికంగా కీలకమైన వృత్తులన్నీ మగవాళ్లవే అయినాయి.

          ఇలా అని ఆడవాళ్ల పనిపాటలు తగ్గలా. ఇంటిపని, వంటపని, పాచిపని, బట్టలపని, దంపుడు పని, పిల్లల పని అన్నీ మామూలే. క్షణం తీరిక లేదు.

          ఆర్ధికంగా వచ్చిన ఈ మార్పు స్త్రీ, పురుష సంబంధాలలో ప్రతిబింబించింది. గణంలో జంటపెళ్లి స్థిరపడింది. తల్లితోపాటు తండ్రి ఎవరో స్పష్టంగా తెలుస్తోంది. జంటలు, వారి పిల్లలు ఒక యూనిట్‌గా ఏర్పడుతున్నారు. పశుమందలు, ఇతర ఆర్ధికవనరులు పురుషుడి అధీనంలో వృద్ధి పొందుతున్నాయి. కుటుంబంలో మగవాడి పాత్ర, ప్రాముఖ్యత, ఆధిక్యత పెరిగింది.

          అంగడిలో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వున్నట్టు ఆదాయ వనరులున్నా వారసత్వ హక్కు మగాడికి లేదు. గణసంస్థ రూల్స్‌ ప్రకారం తల్లివైపు రక్తబంధువులే వారసులు. అతని కొడుకు వారసులు కారు. మాతృస్వామ్య సమాజంలో తల్లి పరంపర కొనసాగుతున్నంతకాలం ఈ ఆచారం వుండి తీరుతుంది. ఈ పద్ధతి మారాలి. తల్లి హక్కులు రద్దు చేయాలి. తన సంతానానికి వారసత్వ హక్కు కలిగించాలి. ఇది గణాలలో వచ్చిన అంతర్గత విప్లవం. ఒక ‘చట్టం’తో అంతా అయిపోయింది. కుటుంబంలో మగవాళ్ల సంతానం కుటుంబంలోనే వుండాలి. ఆడపడుచుల సంతానం వారి తండ్రి గణానికి చెందాలి. తిరుగులేని తీర్పు. మాతృస్వామ్యానికి చావుదెబ్బ. పితృస్వామ్యానికి జయకేతనం.

          ‘‘తల్లి హక్కు రద్దు చేయడం స్త్రీజాతికి సంబంధించిన పరాజయం అని చెప్పాలి. ప్రపంచ చరిత్రనే అది మార్చింది. ఇంట్లో కూడ మగవాడే పెత్తనం పట్టుకున్నాడు. స్త్రీ పరాభవం పొందింది. మగవాని కామానికి బానిస చేయబడింది. పిల్లల్ని కనే యంత్రంగా మార్చబడింది’’ (ఎంగెల్స్‌)

దంపతీవివాహం – పితృస్వామిక గణవ్యవస్థ

          జంటపెళ్లి తర్వాతి మెట్టు దంపతీవివాహం. జంట పెళ్లిలో భార్యాభర్తల బంధం అత్యల్పం. ఎవరికి యిష్టం లేకపోయినా విడిపోవచ్చు. ఇది అలాంటిది కాదు. గట్టి బంధం. ఆచరణలో మగవాడికి అనుకూలంగా ఇప్పటికీ కొనసాగుతోంది. తండ్రి ఆస్తికి బిడ్డ వారసుల్ని చేయటం దీని అంతిమ లక్ష్యం. ఇది తల్లి హక్కును రద్దుచేసింది. స్త్రీ జాతిని మగవాడి నిరంకుశత్వానికి బానిసను చేసింది. పాతివ్రత్యమనే సంకెళ్లను ఆడవాళ్లకేసి, మగవాళ్లను వదిలేసింది. భౌతికంగానే గాక మానసికంగా కూడ పితృస్వామిక భావజాలాన్ని మనిషి నరనరాన ఎక్కించింది. చివరికి స్త్రీని మనసా, వాచా, కర్మణా మగవాడికి బానిసను చేసింది.

          దంపతీవివాహం గణనిర్మాణానికి గండి కొట్టింది.

          గణం చిన్న చిన్న గ్రూపులుగా పితృస్వామిక సమష్టి కుటుంబాలుగా విడిపోయింది. ఒక భార్య, భర్త, వారి సంతానంతో కుటుంబం ఒక స్వతంత్ర ఆర్ధిక యూనిట్‌గా రూపుదిద్దుకుంది. తండ్రి హక్కు స్థిరపడింది. పురుష సంతానానికి వారసత్వహక్కు వచ్చింది. గణాల మధ్య మారకం కుటుంబాల మధ్యకు మారింది. గణం ఉమ్మడి ఆస్తులైన పశుమందలు, లోహాలు, విలాస వస్తువులు కుటుంబం వ్యక్తిగత ఆస్తులుగా మారాయి. దానితో కుటుంబంలో ఆస్తి పోగుపడింది. ఆ ఆస్తి బలంతో గణం కన్నా కుటుంబం దృఢ పడింది. మాతృస్వామ్యం స్థానే పితృస్వామ్యం, రక్తసంబంధాల స్థానే ఆస్తి సంబంధాలు అమలులోకి వచ్చాయి.

          గణనిర్మాణంలో కీలక మార్పులొచ్చాయి.

          గణం నామమాత్రంగా అలాగే కనపడుతుంది. కాని నియమాలు మారాయి. అపుడు వంశానికి మూలం మాతృమూర్తి. ఇపుడు వంశానికి మూలం పురుషుడు. దేవతలకంటె మగదేవుళ్లకు ప్రాధాన్యత పెరిగింది. ఉమ్మడి మత కర్మలను నిర్వహించటానికి పురోహితవర్గానికి ప్రత్యేక హక్కు లభించింది. ఆదిమ మూలపురుషుడిగా ఒక ప్రత్యేక దేవుడ్ని పురోహితులు పూజించేవారు. తండ్రివైపు నుంచే ఇంటిపేరు, వారసత్వ హక్కు పొందే ఏర్పాటు జరిగింది.

          గణసభ్యులెవరూ గణంలో వారిని పెళ్లి చేసుకోగూడదు. గణం మూలసూత్రం ఇది. సొంత ఆస్తి రాకతో ఈ సూత్రం గాలికెగిరిపోయింది. ఒక భాగ్యవతి అయిన యువతిని పెళ్లాడిన భర్తకు ఆమె సంపద దఖలు పడుతుంది. అంటే పితృస్వామ్యహక్కు ప్రకారం ఆమె ఆస్తి తన సొంత గణం నుండి భర్త గణంకు తరలింపబడుతుంది. ఇది మింగుడు పడక పెద్ద ఆస్తులకు వారసులయ్యే యువతులకు కొన్ని మినహాయింపులిచ్చారు. ఆ యువతి గణంలోని వారినే వివాహమాడుటకు అనుమతి యిచ్చారు. అది గణసూత్రానికి విరుద్ధం. గణపునాదినిది బద్దలు కొట్టింది.

          ఆస్తుల వ్యవహారాలు తెరపైకి వచ్చినాయి గనుక గణంలో ఒక న్యాయాధిపతిని, కోశాధికారిని నియమించుకున్నారు.

          పితృస్వామ్య వ్యవస్థలో కూడ తెగ సమితి వుంది. దానిదే శాశ్వతమైన పెత్తనం, అంతిమ అధికారం. మొదట్లో గణనాయకులు సమితి సభ్యులుగా వుండేవారు. కాలక్రమేణా సమితిలోకి కొందరు సభ్యుల్ని ఏరి కోరి తీసుకునేవారు. ఇది సంపద కల్గినవారి కోసం చేసిన పని. భవిష్యత్‌లో ఈ సమితే రాజ్యాంగాన్ని, శాసనసభను ఏర్పాటుచేసింది.

          పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడినాక తెగ ఉమ్మడి ఆస్తి శిధిలమైంది. కుటుంబాలకు కొంత వ్యవసాయ భూమి, ఇంటి స్థలం కేటాయించారు. పశువుల మేతకు బీళ్లు, జంతువుల వేటకు అడివి,  స్మశానాలు తెగ ఉమ్మడి ఆస్తిగా వుండేవి.

          ఆస్తి పంపకాలులో సమానత్వం తలక్రిందులైంది. పితృస్వామ్యంలో వచ్చిన ఆర్ధిక మార్పులు కుటుంబ ఆస్తికి పెద్దపీట వేశాయి. తెగ నాయకులు, యుద్ధవీరులు, పూజారులు, మంత్రగాళ్లు, తమ పరపతిని, పలుకుబడిని సొంత ఆస్తి కూడబెట్టుకోవటానికి సోపానంగా చేసుకున్నారు. సారవంతమైన భూముల్ని, లోహాలను, విలాస వస్తువులను కాజేశారు. ఒక కొత్త భావజాలానికి మార్గం వేశారు.

సొంత ఆస్తి

          పితృస్వామిక వ్యవస్థ వస్తూనే సొంత ఆస్తిని వారసత్వ హక్కుగా పట్టుకొచ్చింది.

          సొంత ఆస్తి అంటే గోచి గుడ్డ, చింకి చీర, తట్ట బుట్ట, గాజు, పూసలు కాదు. ఒక మనిషి కలిగి వుండే కనీస అవసరాలు కాదు. సొంత ఆస్తి అంటే ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం. ఆర్ధికవనరులపై ఆధిపత్యం. భూమి, గనులు, పశువులు, యంత్రాలు మొదలైనవి.

          సొంత ఆస్తి అనాదిగా వుందని, ఇపుడు, ఎపుడూ ఇలాగే వుందని అంటారు. తాతముత్తాతలు  యిచ్చిందనీ, పూర్వజన్మ సుకృతమని చెబుతుంటారు. పవిత్రమైనదని, రక్షణ కల్పించాలని గగ్గోలు పెడతారు.

          ఆధునిక కాలంలోని ఆటవిక, అనాగరికత గల ఆచారాలు, అలవాట్లను పరిశీలించి ప్రాచీన కాలంలోని ఆస్తి రూపాల్ని అంచనా వేయగలం. వేటలో దొరికినవీ, పండించిన పంటను ఆదివాసీలు సమంగా పంచుకుంటారు. భూమి సొంత ఆస్తిగా వుండటం వారికి తెలియదు. నీరు, నిప్పులాంటిది భూమి అని, అది మనదేకాదు, భవిష్యత్‌ తరాలది అనికూడ నమ్ముతారు.

          వ్యవసాయక తెగలలో అతి ముఖ్యమైనది భూమి. అది సుదీర్ఘకాలం ఉమ్మడి ఆస్తిగానే వుండిపోయింది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో అలెగ్జాండర్‌తో ఇండియాపై దాడిలో పాల్గొన్న నియార్కస్‌ అనే సేనాధిపతి ఇక్కడి పరిస్థితులను చూసి ఇలా రాశాడు. ‘‘ఇండియాలోని తెగలు భూముల్ని సాముదాయకంగా సాగుచేసుకుంటారు. ఏడాది చివరన పంటను అంతా కలిసి పంచుకుంటారు.’’

          అదనపు ఉత్పత్తిలో బానిసత్వం వచ్చింది. పితృస్వామికం వచ్చింది. ఈ రెండింటిపై ఏంగెల్స్‌ ఇలా అన్నాడు. ‘‘దంపతీవివాహంలో స్త్రీ, పురుషుల మధ్య పెంపొందిన వైషమ్యమూ, మొదటి వర్గవైషమ్యమూ చరిత్రలో ఏకకాలంలో తలెత్తాయి.’’

          వర్గదోపిడీకి పుట్టిన బిడ్డ సొంత ఆస్తి. దంపతీవివాహం ఆ బిడ్డకి సొంత ఆస్తిపై వారసత్వహక్కునిచ్చింది.

తెగ నుండి ప్రాంతీయ వ్యవస్థకి

          క్రీ.పూ. 3000-1000 కంచుయుగం. రాగి, తగరం, కలిపి కంచు పనిముట్లు, ఆయుధాలు తయారుచేశారు. నైలు, టైగ్రిస్‌ – యుఫ్రీట్‌, సింధు నదీ తీరాలలో మానవ నాగరికత వికసించింది. వ్యవసాయం అభివృద్ధి చెంది అదనపు ఆహారాన్ని రుచి చూపింది. దాంతో వ్యవసాయేతర వృత్తులు విస్తృతమైనాయి. లోహపరిశ్రమకు పునాది పడింది. ఎక్కడ వ్యవసాయం, వృత్తులు నిలదొక్కుకున్నాయో, అక్కడ నగర నాగరికతకు అంకురార్పణ జరిగింది.

          జీవితావసరాల కోసం గణాలు, తెగలలోని ప్రజలు, వివిధ వృత్తులవారు నగరాలకి జేరారు. ఒకే ప్రదేశంలో అనేక తెగల ప్రజలు పరస్పరం కలిసి జీవించడం సరికొత్త పరిణామం. ఏకశిలా సదృశ్యంగా వుండే  గణవ్యవస్థకి ఈ విభజన పొసగదు. పాతకాలంనాటి రక్తసంబంధీకుల గణ, తెగ వ్యవస్థకు కాలం చెల్లింది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో వివిధ గణాలు, తెగలు ఇష్టానుసారం కలిసిపోయి స్థిరనివాసం వుండటం వలన ప్రాచీన సమాజంలోని అడ్డుగోడలు బ్రద్దలైనాయి. తెగల హద్దులు చెరిగిపోయాయి. రక్తసంబంధాలు తెగిపోయాయి. ఆర్ధిక సంబంధాలే ప్రధానమైనాయి. ప్రాదేశిక సరిహద్దులు పుట్టుకొచ్చాయి. ప్రాంతాలవారీగా సమాజం విభజింపబడింది. సుదీర్ఘ పోరాటాల తర్వాతే ఈ మార్పు సాధ్యమైంది.

వినిమయ వస్తువు – వ్యాపార సరుకు

          లోహం రాకతో వస్తుమార్పిడి వెనుకడుగు వేసింది. దేనినైనా విలువకట్టే సామాన్య వర్తకపు సరుకుగా లోహాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ధనంగా రూపం పొందాయి.

          వస్తువు ఉత్పత్తి తన కోసం, తనవారి కోసం కాదు. అమ్మకం కోసం, ధనం కోసం, సంపదల కోసం. మారకం అమ్మకంగా మారింది. వినిమయ వస్తువులు వర్తకపు సరుకులుగా మారాయి. ఇక్కడ ఉత్పత్తిదారులు తాము వాడుకోగా వస్తువుల్ని మార్కెట్‌లోకి వదిలారు. అవి వారి చేయి జారిపోయాయి. అవి ఏమవుతాయో, ఎక్కడికి పోతాయో వారికి తెలియదు. ఇదివరకెన్నడూ కనివిని ఎరుగని కొత్త ఆర్ధిక పరిస్థితి. ఒకప్పుడు కూడు, గుడ్డ కోసం తపించిన సమాజంలో ఇపుడు సంపదల కోసం పెనుగులాట ప్రారంభమైంది.

          మార్కెట్‌లో అమ్మటం, కొనటం సాధారణమైపోయింది. వ్యాపారం వృద్ధి చెందింది. వర్తకులనే కొత్త సామాజికవర్గం పుట్టింది. ఇది మూడవ శ్రమవిభజన. వీరికి ఉత్పత్తితో ప్రత్యక్ష సంబంధం వుండదు. మారకంలో చురుకైన పాత్ర వహిస్తారు. ఆహారధాన్యాలు, లోహాలు, ఆభరణాలు, విలాస వస్తువుల ఎగుమతి, దిగుమతులన్నీ వీరే నిర్వహిస్తారు. కొండలు, కోనలు, సముద్రాలు దాటి దూరదేశాలతో వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం సైన్సును, అక్షరాల్ని, అంకెలను సృష్టించింది. నాగరికతా వ్యాప్తికి, మిశ్రమ సంస్కృతికి తోడ్పడింది.  ఇంతవరకు బానిసలు, బానిస యజమానులు, సామాన్యులుగా వర్గవిభజన జరిగింది. ఇపుడు నూతనంగా  నగర నాగరికతకు పుట్టిన ఈ కొత్త వ్యాపారవర్గం ఉత్పత్తితో ఎలాంటి సంబంధమూ లేకుండానే మార్కెట్‌నంతటినీ గుప్పెట్లో పెట్టుకొంది. ఉత్పత్తిదారుడికి, కొనుగోలుదారుడికీ మధ్య దళారీగా వ్యవహరించి, ఇద్దర్నీ దోచుకుంటుంది. అదనపు ఉత్పత్తిలో కొంతవాటాను స్వాహా చేస్తుంది.

          తెగ నుండి ప్రాంతీయ వ్యవస్థకు సాగిన ఈ మహాప్రస్థానం ఒక నూతన సామాజిక నిర్మాణానికి ప్రాతిపదిక అయింది. తెగ ఉమ్మడి భూములు సొంత ఆస్తిగా మారిపోయాయి. ఉత్పత్తి సొంత వుపయోగానికి గాక, సంపదల్ని ప్రోగుజేసుకొనే సరుకుగా మారింది. వ్యాపార వస్తువులకి గిరాకీ ఏర్పడింది. వ్యవసాయంలోకి వ్యాపార పంటలు ప్రవేశించాయి. లోహపు పనిముట్లు, చేతివృత్తుల ఉత్పత్తులు వర్తకపు సరుకుగా మారాయి. సముద్ర వ్యాపారం, ఎగుమతి, దిగుమతులు పెరిగాయి. ఈ నూతన మార్పులు తెగ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. సామాజిక జీవనశైలిని మార్చివేశాయి.

          ప్రాచీన గణవ్యవస్థలో ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం ఒక సమితి ఉండేది. దాని అవసరం తీరిపోయింది. ప్రాదేశిక ప్రాతిపదికపై ఒక సార్వజనీన సమితి ఏర్పడింది. ఇది నిర్దిష్ట ప్రదేశంలోని జనులందరికి చెందిన సమితి. దానికో సేనాధిపతి, ప్రధాన పూజారి నియమింపబడి, వారసత్వహక్కునిచ్చారు. దీనితో రక్తసంబంధం గల గణవ్యవస్థకి కాలం చెల్లింది. దాని అంత్యక్రియలు పూర్తయినాయి.

వాడిన పూవులా రాలిన గణవ్యవస్థ

          అదనపు ఉత్పత్తిలో మానవ సమాజంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రమశక్తితో అపార సంపదలు సృష్టించే అపూర్వ అవకాశాలు ఒకవైపు, ఆ సంపదల్ని దోచుకొని సమాజాన్ని శాసించే మైనార్టీవర్గం మరోవైపు ఆవిర్భవించాయి.

          అదనపు ఉత్పత్తి లేనిదే సామాజికాభివృద్ధి లేదు. ప్రజ అవసరాలు తీర్చలేని గణవ్యవస్థ సంక్షోభంలో పడింది. దీని నుండి బయటపడాలంటే ఉత్పాదక శక్తి పెరగాలి. చౌకగా దొరికే బానిసలు కావాలి. వారిని బలిపీఠం ఎక్కించి సామాజికాభివృద్ధి ముందుకు సాగాలి.

          ఇందుకు పెద్ద ప్రతిబంధకం ఆనాటి గణవ్యవస్థ. ఆ వ్యవస్థలోని ఉత్పత్తి సంబంధాలు.

          ఆర్ధిక వనరులు కొందరి చేతులలోకి పోయాయి. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెంది, అదనపు ఉత్పత్తికి ముంగిట నిలిచాయి. శ్రమను ఎంతగా దోచుకొంటే అంతగా అదనపు ఉత్పత్తి, అంతగా సంపదలు. కాని  గణవ్యవస్థ పునాది లేదా ఉత్పత్తి సంబంధాలు సమిష్టి యాజమాన్యం సమపంపకంపై ఆధారపడి వున్నాయి. ఇది అదనపు ఉత్పత్తికి ఆటంకం. శ్రమదోపిడీకి బద్ధ విరోధం. ఉత్పత్తిశక్తులు అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తి సంబంధాలలో మార్పు వచ్చి తీరాలి. పురోగమిస్తున్న నూతన ఉత్పత్తి శక్తులకు, సమష్టి యాజమాన్యంలో వున్న వెనుకబడిన పాత ఉత్పత్తి సంబంధాలకు మధ్య తీవ్ర వైరుధ్యం ఏర్పడింది. పరిష్కారం కోసం రంగం మీదికొచ్చింది.

          సామూహిక పనికి శ్రమవిభజన గండికొట్టింది. కొత్తరాతియుగం నాటి స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ బీటలుబారింది. అదనపు ఉత్పత్తితో శ్రమదోపిడీ ప్రారంభమైంది. బానిసలు, బానిస యజమానులుగా వర్గవిభజన వచ్చింది. ఆర్ధికవనరులపై పురుషుల ఆధిపత్యం స్థిరపడి పితృస్వామికం అమలులోకి వచ్చింది. లోహం వచ్చింది. వ్యవసాయోత్పత్తులతో నగర నాగరికత, వ్యాపారం వృద్ధి చెందింది. వినిమయ సరుకు వ్యాపార వస్తువయింది. తెగలు ప్రాదేశిక సరిహద్దులతో ప్రాంతీయ సమాజాలుగా రూపుదిద్దుకున్నాయి.

          గణవ్యవస్థ కుప్పకూలింది. అది సహజ మరణం. అందుకు విచారపడవలసిన అవసరంలేదు.

          ఉత్పత్తిశక్తులు ప్రాథమిక దశలో వున్నప్పుడు, ప్రకృతి శక్తుల ముందు మానవుడు నిస్సహాయ స్థితిలో నిలబడినపుడు, అజ్ఞానం, భయంతో మతవిశ్వాసాలు మనస్సు కెక్కినపుడు, నూతిలో కప్పవలె తెగే సర్వస్వంగా వున్నంతకాలం గణవ్యవస్థ వర్ధిల్లింది. వికసించిన పువ్వులా కనపడింది. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెంది శ్రమ విభజన, మారకం, అదనపు ఉత్పత్తి సృష్టించడంతో తెగ సరిహద్దులు చెరిగిపోగా, ఆర్ధిక వనరులపై పితృస్వామ్య వారసత్వ హక్కు స్థిరపడటంతో ఆ పువ్వు వాడిపోయి రాలిపోయింది.

రాజ్యాంగ యంత్రాల పుట్టుక

          రాజ్యాంగ యంత్రం ఎలా పుట్టిందో మన పాఠశాల పుస్తకాలు ఇలా చెబుతున్నాయి.

          ‘‘చెరువు నిండా నీళ్లున్నాయి. చుట్టూ గట్టుంది. గట్టే లేకపోతే….. ప్రభుత్వం కూడ గట్టులాంటిదే’’

          ‘‘రాజ్యాంగం పరమ పవిత్రమైనది. అది దైవ ప్రసాదం. అనాదిగా మానవ సమాజం పుట్టిననాటి నుండి వుంది.’’

          ‘‘రాజు దైవాంశసంభూతుడు. దేవుడి ప్రతినిధి.’’

          ‘‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం’’ ప్రభుత్వం.

          ఎంగెల్స్‌ ఏమి చెప్పాడో చూడండి.

          గణ వ్యవస్థ పతనమైంది. వర్గాలు పుట్టాయి. శ్రమదోపిడీతో సంపదలు సృష్టింపబడుతున్నాయి.

          ‘‘సంగ్రహంగా చెప్పాలంటే సంపదలకు మెప్పు లభించింది. ధనం సర్వసామాన్యమైంది. సంపదలను బలాత్కారంగా దోచుకొనేందుకు వెనుకటి గణసంఘ అంగాలనే వుపయోగించుకున్నారు. అప్పటికున్న లోపం ఒక్కటే. గణసంఘంలో సామూహిక పద్ధతులకు వ్యతిరేకంగా వ్యక్తులు పోగుజేసుకున్న ఈ కొత్త సంపదలను కాపాడే వ్యవస్థ కావాలి. గతంలో ఎంతో చులకనగా చూసే వ్యక్తిగత ఆస్తిని పవిత్రమైనదిగా స్థిరపరచాలి. ఆ పవిత్రతను కాపాడటమే మానవ సమాజం యొక్క ప్రధానగమ్యంగా ప్రకటించాలి. అంతేకాదు ఆస్తులు సంపాదించేటందుకు అనుసరిస్తున్న నవీన పద్ధతులకు సంపదల నిరంతరాభివృద్ధికి సమాజం ఆమోదం లభించాలి. సమాజంలో కొత్తగా తలెత్తుతున్న వర్గ విభజనే కాకుండా, ఆస్తిపరులవర్గం, ఆస్తిలేని వర్గాలను దోచుకొని పాలించే హక్కును కూడ శాశ్వతంగా సాగనిచ్చే సంస్థ కావాలి. ఈ మాదిరి సంస్థ ఏర్పడింది. రాజ్యాంగం సృష్టింపబడింది.’’

          రాజ్యాంగ యంత్రం అంటే ఏమిటి?

          ఒక నిర్దిష్ట భూభాగంలోని ప్రజలను పాలించే ప్రభుత్వం, దాని నిర్వహణలోని నిరంకుశ ఉద్యోగవర్గం, పోలీసు, సైన్యం, కోర్టులు, జైళ్లు, అన్నిటిని కలిపి ‘రాజ్యాంగ యంత్రం’ అంటారు. ఏ ఒక్కటీ విడిగా రాజ్యాంగ యంత్రం కాజాలదు.

          ఒక క్రమ పద్ధతి ప్రకారం బలాన్ని ప్రయోగించి ప్రజల్ని అణచి వుంచే ఒక ప్రత్యేక యంత్రాంగమే రాజ్యాంగ యంత్రం.

          ‘‘సమాజ పరిణామ క్రమంలోని ఒక ప్రత్యేక దశలో రాజ్యాంగం సమాజంలోంచే పుడుతుంది. రాజ్యాంగం ఏర్పడిందీ అంటే ఆ సమాజంలో సమన్వయించటానికి సాధ్యపడని వర్గ వైరుధ్యాలు వచ్చాయని అర్ధం.’’

          ప్రాచీన కాలంనాటి గణనిర్మాణానికి, ఈ రాజ్యాంగానికి తేడా ఏమిటి? అంటే

          1. రాజ్యాంగంలో సభ్యుల్ని ప్రాంతీయ పద్ధతిపై నిర్ణయిస్తారు. ప్రాచీన గణ సంస్థలు రక్తసంబంధీకులతో ఏర్పడ్డవి.

          2. ప్రభుత్వ సైన్యం – గణవ్యవస్థలో ప్రజలందరూ సాయుధులే. ప్రజలు వర్గాలుగా విడిపోవటంచేత ప్రజలందరూ అనే మాటకి అర్ధంలేదు. కనుకనే ప్రత్యేకంగా ప్రభుత్వాధీనంలో సైన్యం వుండటం అవసరమైంది. సైన్యంతోపాటు పోలీసులు, జైళ్లు వుంటాయి. ఇవేమీ గణసంస్థలో వుండవు.

          ఈ ప్రభుత్వ సైన్యాన్ని పోషించటం కోసం రాజ్యంలోని ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తారు. గణ సమాజంలో పన్ను ఎరుగరు.

          ప్రజల్ని అణచివేసి, పన్నులు వసూళ్లు చేసే అధికారులు సమాజానికి దూరమవుతారు. అందుచేత ప్రత్యేక శాసనాలు చేసి వారికి గౌరవం కట్టబెట్టారు. గణసమాజంలోని పరిపాలనాంగాలన్నింటికీ వున్న అధికారంకన్నా, నాగరిక రాజ్యంలోని పరమ నీచుడైన వాడైనాసరే పోలీసు ఉద్యోగికి వుండే అధికారం ఎక్కువ.

          వర్గాల మధ్య పోరాటం ముమ్మరంగా సాగుతున్న కాలంలో వర్గ వైషమ్యాల్ని అదుపులో వుంచటం  కోసమే రాజ్యాంగం పుట్టింది. అందుచేతనే అది సమాజంలో మంచి శక్తి, ఆర్ధిక బలమూ వున్న వర్గం యొక్క ప్రభుత్వంగానే వుంటుంది. రాజ్యాంగం సహాయంతో ఆ వర్గం రాజకీయంగా బలపడుతుంది. ఆ విధంగా పీడితవర్గాల్ని అదిమిపెట్టి, దోచుకొనేందుకు నూతన పరికరాల్ని సంపాదించుకుంటుంది.

          రాజ్యాంగ యంత్రం ఆయా దేశ కాల పరిస్థితులకనుగుణంగా రకరకాల రూపాల్ని సంతరించుకుంటుంది. బానిస, ఫ్యూడల్‌ వ్యవస్థలో రాచరికంగా, పెట్టుబడిదారీ వ్యవస్థలో రిపబ్లిక్‌గా అవతరించింది. పెట్టుబడిదారీ దేశాలలోని ఎన్నికలపై ఎంగెల్స్‌ ‘‘సార్వజనిక ఓటుహక్కు శ్రామికవర్గం యొక్క పరిణితిని కొలిచే సాధనం అవుతుంది. ఆధునిక రాజ్యాంగంలో అది చెయ్యగలిగేదంతే. అంతకంటే చెయ్యలేదు, చెయ్యదు. అయితే  అదే చాలు. ధర్మామీటరులాగ సార్వజనిక ఓటుహక్కు కార్మికులలో పొంగులువారే దశను చూపిస్తుంది.’’

          ముగింపుగా నాగరికత మీద మోర్గన్‌ రాసిన తీర్పును ఎంగెల్స్‌ ఉదహరిస్తాడు. ‘‘నాగరికత ఆరంభం నుండి ఆస్తి చాల విశేషంగా అనేక రూపాలలో పెరిగిపోయింది. దాని వుపయోగాలు విస్తరించాయి. దాని స్వంతదారులు కోసం అది ఎంతో మెలకువతో నిర్వహింపబడుతూ వుంది. ప్రజలకు సంబంధించినంతవరకు లొంగదీయలేని మహాశక్తిగా అది తయారైంది. తాను సృష్టించిన మహాశక్తి ఎదుటనే మానవ మేధస్సు కర, చరణాలాడకుండా అయింది. అయినా మానవుని బుద్ధి ఆస్తి మీద ఆధిపత్యం సంపాదించగల రోజు వస్తుంది.’’

          ‘‘ప్రాచీనకాలపు గణాలలో వుంటూ వచ్చిన స్వాతంత్య్రం, సమానత్వం, సోదరభావం ఒక నూతన ఉన్నత రూపంలో పునరుజ్జీవం అవుతాయి.’’

          ఈ పుస్తకంలో సుదీర్ఘ ఉపోద్ఘాతం తర్వాత తొమ్మిది అధ్యాయాలు వుంటాయి. చరిత్ర పూర్వదశలో పనిముట్ల వాడకంలో వచ్చిన మార్పుల్ని మొదట వివరిస్తారు. స్త్రీ, పురుష సంబంధాలు, మాతృస్వామ్యం నుండి పితృస్వామ్యానికి పయనం, కుటుంబం పుట్టుపూర్వోత్తరాల గురించి తర్వాత చెబుతారు. ఇరాక్యూలలోని గణతంత్ర వ్యవస్థను విపులీకరించి, అది గ్రీకు గణాలలో పితృస్వామ్యానికి మారే క్రమాన్ని చూపెడతారు. రక్తసంబంధీకుల తెగలు ప్రాంతీయ తెగలుగా మారటాన్ని రాజ్యాంగం పుట్టుకను ఏథెన్స్ ను వేదికగా ఉదహరిస్తారు. పాట్రీషియన్లు, ప్లెబియన్లు మధ్య, జర్మనీ అనాగరిక దండయాత్రల తర్వాత రోమ్‌ రాజ్యాంగం పాలకవర్గానికి ఎలా అండగా నిలిచిందీ చివరి అధ్యాయాలలో అర్ధమవుతుంది.

‘‘కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగ యంత్రాల పుట్టుక’’ ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిన విలువైన పుస్తకం. మోర్గన్‌ రాసిన ‘ప్రాచీన చరిత్ర’ కూడా తెలుగులోకి అనువదింపబడింది. మహీధర రామమోహనరావుగారి అనువాదం అద్భుతంగా వుంటుంది.

admin

leave a comment

Create AccountLog In Your Account