కరోనా కాటు వేటు

కరోనా కాటు వేటు

– ఉప్పెన

కరోనా కాటుకు రాలుతున్న కంఠాలు ఎన్నో

కరోనా వేటుకు తెగి పడుతున్న తనువులెన్నో

ఒక్కరా ఇద్దరా ఎందరాని చెప్పుదూ

వందలాది జనము మందలోలే కూలుతుంటే                 ॥ కరోనా ॥

ఎంత కష్టం వచ్చెనో ఎన్ని బాదలు తెచ్చెనో

ఇంత కష్ట కాలమూ చూడలేదు ఎన్నడూ

కన్నీళ్ళు తాగుకుంటు కాలమెల్ల దీసుకుంటు

కాలి నడకన వేల మైళ్ళు నడిచి వలస కూలి కూలే          ॥ కరోనా ॥

వలస వెల్లిన కొడుకు తిరిగి మల్ల వస్తడాని

రాకకోసం ఎదురు చూసే ముసలి తల్లి తండ్రులు

ఎదురు చూసి ఎదురు చూసి ఎంతకు రాకపోతే

ఊపిరాగినంక కొడుకు ఊరు చేరె శవం అయ్యి                ॥ కరోనా ॥

ఇల్లు వల్లాకాడు ఆయే ఊరు బొందల గడ్డ ఆయే

పలకరించే వాడు లేడు పాడె మోసే వాడు లేక

బ్రతికిన చచ్చినట్టుగ బ్రతుకులాను గడుపుడాయే

చచ్చిన తనివి తీర ఏడుపు నిషేధమాయే                     ॥ కరోనా ॥

బ్రతికినోడికి తిండి లేదు చచ్చినోడికి పిండం లేదు

చచ్చినా బ్రతికినా బ్రత్కు తీరులొ తేడ లేదూ

చావులేమో గోరమాయే బ్రత్కులేమో భారమాయే

కరోనా వైరస్‌ కత్తి కుత్కేమీద వేటు వేసెను                  ॥ కరోనా ॥

admin

leave a comment

Create Account



Log In Your Account