ప్రపంచవ్యాప్తంగా వైరస్ ల దాడి

ప్రపంచవ్యాప్తంగా వైరస్ ల దాడి

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్

ఈనాడు మనిషి ఎటువంటి క్రూర జంతువునైనా ఒక తుపాకీ గుండుతో లొంగదీసుకోగలడు. కానీ కంటికి కనబడని రకరకాల క్రిములు ఎప్పుడైనా, ఎక్కడైనా మన ప్రాణాలు తీయగలవు. ఎన్ని రకాల కొత్త మందులు కనిపెట్టినా అవి తమ స్వభావాలని మార్చేసుకుని మనమీద దొంగదెబ్బ తీస్తూనే ఉంటాయి. సైంటిస్టులు ఈ ఎడతెగని పోరాటంలో అహోరాత్రాలు శ్రమిస్తూ ఉంటారు. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు దేవుణ్ణి తులుచుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు (లేదా, వాటి గురించిన భయం) ప్రబలినప్పుడల్లా ప్రజల్లో సైన్స్‌ విషయాల పట్ల కాస్త ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల వార్తల్లోకెక్కిన బర్డ్‌ ఫ్లూ, కొన్నేళ్ళ కిందట కంగారుపెట్టిన సార్స్‌, దానికి ముందు పశువులకు సోకిన మాడ్‌ కౌ డిజీజ్‌ (బీఎస్‌ఈ) వగైరాలన్నీ ఈ కోవకే చెందుతాయి. వీటన్నిటికి రకరకాల వైరస్‌లే కారణం. ఎపిడెమిక్‌ రూపంలో వ్యాప్తి చెందే రోగాలు ఎల్లలూ, సరిహద్దులూ పాటించకుండా లక్షలమందిని బాధిస్తాయి. మనుషుల మధ్యగాని, దోమలూ, ఎలుకలూ వగైరా ప్రాణుల ద్వారాగాని ఒకరి నుంచి మరొకరికి పాకే భయంకరమైన రోగాలకు ‘‘ఘనమైన చరిత్ర’’ ఉంది. పధ్నాలుగో శతాబ్దంలో చెలరేగిన మహమ్మారి యూరప్‌ జనాభాలో మూడోవంతును ‘‘పొట్టన పెట్టుకుంది’’ 1918లో మొదలైన ఒక రకమైన ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా నాలుగైదు కోట్లమందిని ‘‘బలితీసుకుంది’’. యుద్ధాలూ, విదేశీ సైన్యాల దాడీ వగైరాల వల్ల రోగాలకు దారితీసే పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఇరవయ్యో శతాబ్దానికి పూర్వం యూరప్‌లో జరిగిన యుద్ధాల్లో ఆయుధాలతో పోలిస్తే ఎక్కువమంది రోగాల వాతపడి ప్రాణాలు కోల్పోయారు. యూరోపియన్లు అమెరికా ఖండాన్ని కనుక్కోవడమే కాక అక్కడ ఆరోగ్యంగా జీవిస్తున్న ప్రజలకు తమ భయంకరమైన రోగాలను ఉచితంగా సరఫరా చేశారు. వారికి ఇమ్యూనిటీ లేకపోవడంతో మెక్సికోలో కొన్ని ప్రాంతాల్లో స్పెయిన్‌ నుంచి దిగుమతి అయిన రోగాలకు 90 శాతం జనాభా చచ్చిపోయారట.

మశూచి, క్షయ, పోలియో వంటి పాతరోగాలు అదుపులో వచ్చాయనుకుంటూ ఉన్న తరుణంలో కొత్తవి మొదలయ్యాయి. 1970 తర్వాత ఎయిడ్స్‌, ఎబోలా, హెపటైటిస్‌-సి మొదలైనవి ఆవిర్భవించడమే కాక పాతవాటిలో కొన్ని మందులను నిరోధించగలిగే అవతారాలెత్తాయి. 1980లలో పశువులకు తగులుకున్న బీఎస్‌ఈ బ్రిటన్‌ నుంచి వాటి మాంసం ఎగుమతి విషయంలో పెద్ద ఉత్పాతాన్నే కలిగించింది. వైరస్‌ ప్రభావం వల్ల వాటి మెదడు తూట్లుపడినట్టుగా తయారయింది. ఎటొచ్చీ అది మామూలు వైరస్‌ వల్ల వచ్చిన రోగం కాదని తేలింది. మనం సూక్ష్మజీవులుగా పరిగణించే బాక్టీరియాకన్నా వైరస్‌లు చిన్నవైతే వాటికన్నా వందరెట్లు చిన్నవి కూడా ఉన్నాయి.  వాటిని ప్రీయాన్‌లంటారు. సూక్ష్మాతిసూక్ష్మమైన ఈ కణాలు ‘‘వక్రమార్గం పట్టిన’’ ప్రోటీన్‌ కణాల వంటివి. పశువులకు పిచ్చెక్కించి ప్రాణాలు తీసేవి ఇవే. మెదడులోని నాడులమీదా, రక్తంలోని తెల్లకణాల్లోనూ, కండరాలూ, ఇతర శరీర కణాల్లోనూ ఒక రకమైన ప్రోటీన్‌ కణాలుంటాయి. వీటిలో కొన్ని మ్యుటేషన్‌ కారణంగా వికృతి చెందుతాయి. ప్రీయాన్లలో 200 పైచిలుకు అమినో ఆసిడ్లు మూడు చుట్టలుగా చుట్టుకుని ఉంటాయి. మ్యుటేషన్‌ల వల్ల వీటి ఆకారం మారి చీరె కుచ్చిళ్ళలాగా తయారౌతుంది. ఇటువంటివి మామూలు కణాలకు తగులుకుని వాటి స్వరూపాలని కూడా  మార్చేస్తాయి. పశువుల మెదడు కణాలన్నీ నాశనమై అది స్పాంజ్‌లాగా తయారౌతుంది. మామూలుగా ఆకులూ, అలములూ తినే పశువులకు ఏపుగా పెరగడానికని వ్యాపార దృష్టితో గొర్రె మాంసం, పంది మాంసం, కోడి మాంసం వగైరాలన్నీ తినిపించడం వల్ల ఎక్కడో వాటి ఆహారంలో ఈ రోగక్రిములు ప్రవేశించాయి. చివరకు ఈ రోగ భయం వల్ల లక్షల కొద్దీ పశువులను చంపవలసి వచ్చింది. అప్పటికే బ్రిటన్‌ వంటి దేశాలనుంచి ఎగుమతి అయిన గొడ్డుమాంసం తిన్నవారంతా ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించారు. తరవాతి పరిశోధనలలో అది తిన్న మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని తేలింది. అలాగే న్యూగినీలో ఆదిమజాతుల తంతు విందుల్లో నరమాంస భక్షణ చేసిన కారణంగా కొందరికి అదే వ్యాధి సోకింది. ఇటువంటి రోగానికి గురి అయిన గొర్రెల మీద పరీక్షలు జరిపి, క్రిములను వేరు చేసిన తరువాత పరీక్షలు జరిపారు. మామూలుగా డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ వగైరాలను నాశనం చెయ్యగలిగిన అల్ట్రావయొలెట్‌ కిరణాలు వాటి మీద ప్రభావమేమీ చూపలేకపోయాయి. మరికొన్ని పరిశోధనలు చేశాక అందులో ఉన్నవి ప్రోటీన్లేనని తేలింది.

2003 ప్రారంభంలో చైనాలో తలెత్తిన సార్స్‌ వ్యాధికి కొంతమంది చనిపోయారు. దీని లక్షణాలకూ, పక్షుల ద్వారా ఈ మధ్య వస్తున్న బర్డ్‌ ఫ్లూ లక్షణాలకూ పోలికలున్నప్పటికీ వీటికి కారణమైన వైరస్‌లు ఒకటి కావు. పక్షులకు వచ్చే 15 రకాల ఫ్లూ వైరస్‌లలో హెచ్‌5ఎన్‌1 అనేది అన్నిటికన్నా తీవ్రమైనది. 22 డిగ్రీల (సెల్సియస్‌) ఉష్ణోగ్రతలో ఇది నాలుగు రోజులదాకా బతికే ఉంటుంది. చలి ఎక్కువైనకొద్దీ దీని ఆయుష్షు పెరుగుతుంది. కనక జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల రోగం త్వరగా వ్యాపించి చావుకు దారితీస్తుంది. కోళ్ళ పెంపకం జరిగే ప్రాంతాల్లో వాటి రెట్టల ద్వారా ఈ వైరస్‌ అన్ని పక్షులకూ తగిలే అవకాశం ఉంది. తక్కినవాటిలాగా కాకుండా ఇది మనుషులకు కూడా సోకే ప్రాణాంతక వ్యాధి. సార్స్ లాగా వ్యాధిగ్రస్థులని వేరుగా ఉంచడంవల్ల దీని సమస్య తీరదు. ఎందుకంటే ఫ్లూ వైరస్‌లు అతివేగంగా  మ్యుటేషన్లకు లోనవుతాయి. అటువంటిది జరిగి, దానికి మనుషులకు సోకే లక్షణాలు గనక రూపొందినట్టయితే వ్యవహారం చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉంది. ఎవరికైనా మామూలు ఫ్లూ తగిలితే ఆ పరిస్థితిలో బర్డ్‌ ఫ్లూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండు రకాల వైరస్‌లూ కలిసి కొత్తరకం తయారైందంటే అది తక్కినవారందరికీ  అంటుకోవచ్చు. దానికి ఇమ్యూనిటీ లేకపోవడంతో వ్యాధి బాగా ముదిరి ప్రాణాలు తీయవచ్చు. పక్షుల నుంచి తిన్నగా సోకేదీ తీవ్రమైన వ్యాధి. ఒక మనిషి నుంచి మరొకరికి అంటుకున్నప్పుడు దీని స్వభావం అంత ప్రమాదకరంగా ఉండకపోవచ్చు. అణుయుద్ధాలకు కూడా వెరవని పెద్ద దేశాలన్నీ ఈ సూక్ష్మక్రిముల దాడిని గురించి ఆందోళన  చెందుతున్నాయి. ఇది పెనుప్రమాదం కాకుండా అరికట్టడానికని ఈ రోగం బారినపడ్డ పక్షులన్నిటినీ చంపుతున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొంటున్నవారికి వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. దీనికి ఉన్న ఒకే ఒక్క విరుగుడు టామీ ఫ్లూ అనే మందు తయారీ గురించి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీన్ని కూడా రోగం వచ్చిన ఒకటి రెండు రోజుల లోపునే ఇవ్వాలట. ప్రస్తుతం దీనికి వేక్సీన్‌ ఏదీ లేదు. వియత్నాంవంటి తూర్పు ఆసియా దేశాల్లో ఇది మొదటగా తలెత్తినప్పుడు దాదాపు 70 శాతం రోగులు చనిపోయారు. తరువాత ఈ సంఖ్య సగానికి తగ్గింది. కాని ఇది మంచి పరిణామం కాదని శాస్త్రవేత్తల ఉద్దేశం. రోగానికి కొద్దిమంది బలైపోయినప్పటికీ రోగం వారితో బాటే సమసిపోతుంది. రోగులు కోలుకుంటున్నకొద్దీ రుగ్మత వారినుంచి ఇతరులకు వ్యాపించే అవకాశం ఎక్కువౌతుంది.

1918లో ఫ్లూ వల్ల చనిపోయిన ఒక వ్యక్తి శవం ఇటీవల అలాస్కాలో మంచులో కురుకుపోయి ఉండగా దాన్ని బైటికి తీసి, పరిశోధనల నిమిత్తమై ఆ వైరస్‌ను కృత్రిమంగా మళ్ళీ పునర్నిర్మించారు. జన్యు పరీక్షలు జరిపి ఎలుకల వంటి వాటిమీద దాన్ని ప్రయోగించినప్పుడు అది ఎలుకల్లోనూ, మనుషుల ఊపిరితిత్తుల్లోనూ అతిత్వరగా పెరిగిపో గలదని తెలిసింది. ఇలాంటి ప్రయోగాల వల్ల లక్షలమంది ప్రాణాలు తీయగలిగిన వైరస్‌ల గురించి విలువైన సమాచారం లభిస్తుంది. మనుషుల మధ్య ఎన్ని సామాజిక, రాజకీయ విభేదాలున్నప్పటికీ సూక్ష్మక్రిముల విషయంలో అందరూ ఏకమై, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి సంస్థల ద్వారా సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోతే  భయంకరమైన పరిణామాలు కలగవచ్చు. కనబడే శత్రువుకన్నా కనబడని శత్రువు వల్ల ప్రమాదం ఎప్పుడూ ఎక్కువే.

(జనసాహితి ప్రచురణ : ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ నుండి)

admin

leave a comment

Create Account



Log In Your Account