Related Posts
– ఓ వీ వీ ఎస్
దేశం మడిలో తుపాకీ విత్తులు నాటి,
స్వేచ్ఛా పరిమళాల పూదోటలు వేద్దామనుకున్నావు
కానీ…,
అన్యాయాల కలుపు మొక్కలు చూడెలా కమ్మేస్తున్నాయో….
జనాన్ని కలిపి ‘ఉంచని’ తనాన్ని ఈసడిస్తూ….
మతాతీతంగా నువ్వెదిగిపోయావు….
కానీ, దురంతాల వామనపాదాల వికటాట్టహాసాలు
బోన్సాయ్ వృక్షాల అరణ్యాలై ఎలా విస్తరిస్తున్నాయో చూడు.
అస్వతంత్ర భారతంలో మృత్యువే నీ
వధువన్నావు….
గాంధారి పుత్రుల కీచక పర్వాల పుటలమై మేమెలా
రాలిపడుతున్నామో చూడు.
హోరెత్తిన యవ్వనాగ్ని కేతనమై నువు నిలిస్తే….
ట్రిమ్ముగడ్డాల, టిక్టాక్ల, బ్రేకప్పులమై
అఖండ భరత యవ్వనమూ మురుగు కాల్వలై
పారుతున్నది.
ఇప్పటికైనా….
ఉరికంబానికి ఊపిరిలూదిన నీ జీవితం
తెరచిన పుస్తకమై పిల్లల కళ్ళల్లో రెపరెపలాడాలి.
బిగిసిన నెత్తుటి పిడికిళ్ళై యువత మెదళ్ళలో నాటుకోవాలి