విశాఖజిల్లా ఎల్‌.జి. పాలిమర్స్‌ స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజి సంఘటన – జనసాహితి విశాఖజిల్లా శాఖ నివేదిక

విశాఖజిల్లా ఎల్‌.జి. పాలిమర్స్‌ స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజి సంఘటన – జనసాహితి విశాఖజిల్లా శాఖ నివేదిక

మే నెల 7వ తేదీ తెల్లవారుఝామున విశాఖపట్టణంలో ఎల్‌.జి. పాలిమర్స్ లో జరిగిన స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజి సంఘటన ఒక్క విశాఖ జిల్లావాసులనేగాక, యావత్‌ దేశ ప్రజానీకాన్నీ తీవ్రమైన కలవరపాటుకు గురిచేసింది. సంఘటన జరిగిన రోజునే 11 మంది చనిపోగా, తదుపరి (జూన్‌ 4 నాటికి) మరో ముగ్గురు మరణించారు. మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చెందిన యిద్దరు గర్భవతులకు అబార్షన్స్‌ జరిగాయి.

విశాఖజిల్లా జనసాహితి మరియు ఓపిడిఆర్‌ సభ్యులు కలిసి, సంఘటన జరిగిన ఆర్‌.ఆర్‌. వెంకటాపురం గ్రామాన్ని 20-5-2020న పర్యటించారు. ఆ గ్రామంలోని వెంకటాద్రి గార్డెన్స్‌ అనే నివాసిత ప్రాంతంలో ప్రధానంగా పర్యటించడం జరిగింది. సుమారు 65 వరకూ గృహసముదాయాలు, వందకు  పైచిలుకు  కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. 7వ తేదీ తెల్లవారుఝామున స్టైరిన్‌ లీకేజి సంఘటనతో ఎక్కువగా ఆస్థి, ప్రాణనష్టాలకు గురైన ప్రాంతం యిదే.

పర్యటనలో ప్రజలు, ఆనాటి నరకయాతనను, కంపెనీ దురాగతాలను, ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్య  ధోరణులను గురించి ఆవేదనాపూరితమైన తమ అనుభవాలను జనసాహితి బృందంతో పంచుకున్నారు. ఆనాటి త్లెవారుఝామున మూడు మూడున్నర గంటల మధ్య నిద్రలోనే…. ఊపిరాడని, కళ్ళుతెరవలేని ఒక భయానక స్థితిని వారనుభవించారు. చుట్టూ చావుకేకలు, హెచ్చరికల అరుపుల వల్ల, కాలనీలోని మిత్రుల ఫోన్‌కాల్స్‌ వలన వారు చనిపోబోతున్న సంగతిని గ్రహించారు. తాము చనిపోయినా పిల్లలను కాపాడుదామని కొందరు ప్రయత్నించారు. చనిపోయేటప్పుడు ఒక్కచోటే చనిపోదామని కుటుంబీకుంతా ఒకే గదిలో కొందరు చేరిపోయారు. పారిపోదామని పిల్లల్ని కారెక్కించి స్టీరింగుపైనే కొందరు వాలిపోయారు. ఊపిరాడక – కళ్ళు కనబడక ఏం చేస్తున్నామో తెలియని అయోమయావస్థలో రోడ్లపైన, తుప్పల్లో…. చివరకు మురుగుకాల్వలలో సైతం పడి అలాగే ఉండిపోయారు కొందరు. ఐదారు గంటలు గడిచాక, ఎవరెవరో విషయం తెల్సుకుని కాపాడినవారిని కాపాడగా, 11 మంది చనిపోయారని, ఇద్దరికి అబార్షన్‌ అయ్యిందని, పదుల సంఖ్యలో స్టైరిన్‌ గ్యాస్‌ ఒంటికి తగిలినమేర చర్మం కాలిపోయినవారున్నారని (నాటి రాత్రికి) తెలిసింది. మరునాటికి (8వ తారీఖు) కూడా తీవ్రత తగ్గినా లీకేజీ కొనసాగుతూనే ఉందని వారు తెలిపారు.

సంఘటన జరిగిన ప్రాంతానికి అన్నివైపులా ఉన్న ఏరియాలలో ప్రజలు సైతం ప్రాణాలరచేత పెట్టుకుని పారిపోయారు. షీలానగర్‌, గాజువాకల వైపు, తగరపువలస వైపు, సింహాచలం, హనుమంతవాకల వైపు, సబ్బవరం, చోడవరంవైపు కూడా వేలమంది జనాలతో రోడ్లు నిండిపోయాయి.

జనసాహితి బృందంతో మాట్లాడిన ప్రజలు, ఎల్‌.జి. పాలిమర్స్‌ యాజమాన్యంపై మరియు దాన్ని వెనకేసుకొస్తున్న ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాసు లీకేజి వంటి అంశాలపట్ల, నిర్వహణాంశాల పట్ల కనీస పరిజ్ఞానం ఉన్న స్కిల్డ్‌ లేబర్‌ను కంపెనీ మెయింటైన్‌ చేయడంలేదని, కనీసం అలారమైనా మోగించలేదని అన్నారు. గ్యాస్‌ లీకేజి, పేలుళ్ళు తదితర ప్రమాదాలు జరిగితే ఏమిచేయాలో తెలియజెప్పే మాక్‌డ్రిల్‌ వంటివి ఏనాడూ చేపట్టలేదని అన్నారు. హాస్పిటల్‌, అంబులెన్స్‌ వంటి కనీసపాటి వైద్యసౌకర్యాల నిర్వహణ సైతం లేనేలేవని అన్నారు. కంపెనీ వ్యర్ధాలను ఇష్టారాజ్యంగా నివాస ప్రాంతాలపైకి వదిలేస్తున్నారని చెప్పారు.

1961లో పాలీస్టెరీన్‌ ఉత్పత్తి చేయడం కోసం మొదట ఈ కంపెనీ హిందుస్థాన్‌ పాలిమర్స్ గా ప్రారంభించబడింది. 1978లో యునైటెడ్‌ బ్రువరీస్‌కు చెందిన మెక్‌డోవల్‌ కంపెనీతో విలీనమయ్యింది. అప్పటి నుండి 1997 వరకు, ఇక్కడ ఆల్కహాలు తయారయ్యేది. తదుపరి 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌.జి. కెమికల్స్‌ చేతులలోకి వెళ్ళింది. అప్పటి నుండి దక్షిణ కొరియా, అమెరికాల నుండి స్టైరిన్‌ అనబడే రసాయనాన్ని దిగుమతి చేసుకుంటూ రకరకాల కెమికల్‌ మరియు యింజనీరింగ్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నది.

ఒకవైపు క్లీన్‌ విశాఖ,  గ్రీన్‌ విశాఖ అంటూ ఆకర్షణీయ నినాదాలనిస్తూ, మరోవైపు ప్రాణాంతక పరిశ్రమల దినదినగండాలలోకి విశాఖను నెట్టేస్తున్నారు. అభివృద్ధి, ఉపాధి మంత్రాలను జపిస్తూ ప్రజాజీవితాలను విషకాలుష్య కోరకు ఎరవేస్తున్నారు. తూర్పుతీర ప్రాంతాన్ని…, ముఖ్యంగా విశాఖ నుండి కాకినాడ వరకు పెట్రో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను…. ఇంకా కెమికల్స్‌, ప్లాస్టిక్స్‌, ఔషధాలు, అణువ్యర్ధాల నిర్వహణ తదితరాలకై ప్రమాదకరంగా మార్చివేస్తున్నారు.

గోరంత ఉపాధికల్పన చూపించి…., కొండంత మానవ శ్రమను, సహజవనరులను దోచుకుపోతున్నారు. ఏ జెండాలూ, అజెండాలూ కలిగిన పాలకులైనా ఈ దోపిడికి వత్తాసు పలుకుతూ ప్రజలను పీడిస్తున్నారు. అమెరికన్‌ సామ్రాజ్యవాదపు నాయకత్వాన జరుగుతున్న, బహుళజాతి కంపెనీల దోపిడి విధానాలకు లొంగిపోయిన మనదేశ పాలకవర్గాలే ఈ మారణకాండకు కారణమౌతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలంతా సంఘటితపడి ఉద్యమించి నిలువరిస్తే తప్ప ఈ ప్రాణాంతక పారిశ్రామిక విధానాలకు అడ్డుకట్ట వేయలేము.

admin

leave a comment

Create Account



Log In Your Account