జాత్యహంకారం, వివక్ష, అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అనేక అత్యంత అసహ్యకరమైన, హేయమైన దుర్లక్షణాలలో కొన్ని మాత్రమే!

జాత్యహంకారం, వివక్ష, అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అనేక అత్యంత అసహ్యకరమైన, హేయమైన దుర్లక్షణాలలో కొన్ని మాత్రమే!

– జి.వి. భద్రం

          మే 25న సిగరెట్లు కొనటానికి 20 డాలర్ల నకిలీ కరెన్సీ నోటు ఇచ్చాడనే ఆరోపణతో అమెరికాలోని మినియాపోలీస్‌లో సౌవిక్‌ అనే తెల్లజాతి పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి ఆఫ్రో – అమెరికన్‌ను కారులో నుంచి బయటకు లాగి, సంకెళ్ళు వేసి రోడ్డుపై బోర్లా పడుకోబెట్టి, తొమ్మిది నిముషాలపాటు మెడపై మోకాలితో త్రొక్కిపట్టి, అతడికి ఊపిరాడకుండా చేసి చంపివేశాడు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని అతడు పదే, పదే ప్రాధేయపడినా కనికరం చూపించకుండా అతడి ప్రాణాలు తీశాడు.

          ఈ ఘటనను చిత్రీకరించిన వీడియో ఫుటేజి ప్రచార మాధ్యమాల్లో విరివిగా ప్రచారం కావటంతో, ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా నిరసనాగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగిన అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచమంతటా యూరోపు, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలోని పలుదేశాల్లో కూడా తీవ్రమయిన నిరసన ప్రదర్శనలు జరిగాయి – యిప్పటికీ జరుగుతున్నాయి. ప్రపంచ మంతటా ఈ శ్వేతజాతి దురహంకారపూరితమైన జాత్యహంకారాన్నీ, నల్లజాతి నీగ్రోలపట్ల అమెరికాలో అమలవుతున్న జాతి వివక్షనూ ప్రజలు నిరసిస్తున్నారు. జాతి వివక్ష అంతం కావాలని డిమాండు చేస్తున్నారు.

          కొందరు దీన్ని జాతి వివక్షగానూ, మరికొందరు దీన్ని శ్వేతజాతి దురహంకారంగానూ భావిస్తుండగా, మరికొందరు యిది అమెరికా పోలీసుల యొక్క అమానుష అణచివేత విధానంగా అర్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా అనేకులు ఈ ఘటనను, లేదా గత సంవత్సరాలలో జరిగిన యిదేరకమైన తెల్లజాతి పోలీసులు, నల్లజాతి నీగ్రోలను చంపిన అనేక ఘటనలను కేవలం ఒక పరిపాలనా సంబంధమైన పొరపాటు లేదా తప్పుగా అర్ధం చేసుకొంటూ, కొన్ని పరిపాలనాపరమైన చర్యలు, సంస్కరణలు తీసుకురావటం ద్వారా, పోలీసులపై ఆంక్షలు విధించటం ద్వారా ఈ సమస్యను సరిచేయవచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనను, వ్యతిరేకతలను వ్యక్తం చేస్తున్నవారిలో వివిధ రకాల రాజకీయ అవగాహనలు, అభిప్రాయాలు గల మానవతావాదులు, శ్వేతజాతి వ్యతిరేకవాదులు ఉన్నారు. వీరేగాక ఇంకా తమ వర్గ ప్రయోజనాలను,  పెంపొందించుకోవాలనుకొనే పెట్టుబడిదారీవర్గంవారూ, రిపబ్లికన్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారం కోసం పోటీపడుతున్న డెమోక్రాటిక్‌ పార్టీవారూ, తమతమ దేశాల్లో యిదే తరహా జాతి వివక్ష కొనసాగుతున్నా కూడా, అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షను వ్యతిరేకించే కొందరు దేశాధినేతలూ, కొన్ని బడాపెట్టుబడిదారీ మీడియా కార్పొరేషన్లవారూ, హాంకాంగ్‌లో ‘ప్రజాస్వామ్యం’ కోసం జరుగుతున్నాయనబడే నిరసనలను సమర్ధిస్తున్నారు. వాటిని పోలీసులతో అణచివేస్తున్నందుకు చైనా ప్రభుత్వాన్ని అదేపనిగా యాగీ చేసిన అమెరికన్‌ ప్రభుత్వాన్ని, యిప్పుడు యీ జాతి వివక్ష ఘటనను ఆసరా చేసుకొని, అమెరికా యొక్క రెండు నాల్కల ధోరణిని ఎండగడుతున్న చైనా ప్రభుత్వాధినేతలు, అమెరికా అనుసరిస్తున్న యితర దోపిడీ, దుర్మార్గ, దురాక్రమణ విధానాలను ఆమోదిస్తూనే ప్రస్తుత ఘటన వరకే నిరసనను వ్యక్తం చేస్తున్న సంఘాలూ లాంటి నానా గోత్రీకులూ వున్నారు. ఈ నిరసనలు తెలుపుతున్నవారిలో ఎవరి కారణాలు వారికున్నాయన్నమాట, ఎవరి ప్రయోజనాలు వారికున్నాయన్న వారి పరిమితుల వాస్తవాన్ని గమనంలోకి తీసుకొంటూనే, యీ నిరసనలు ప్రపంచమంతటా ప్రజలు ఒక అభ్యుదయకర మార్గాన్ని చేపట్టడానికి అవసరమైన చైతన్యం పొందగలిగేందుకు అవుసరమైన ప్రేరణను కల్పించేందుకు దోహదపడతాయని అర్ధం చేసుకోవలసి వుంటుంది.

          ఒకవైపున ప్రపంచమంతా, ప్రత్యేకించి అమెరికాలో యీ జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు, వ్యతిరేకతలు వ్యక్తమవుతూంటే అమెరికా అధ్యక్షుడు, అతడి ప్రభుత్వపాలనాయంత్రాంగం మాత్రం, మరింతగా దేశప్రజలలో జాతి వివక్షను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. నిరసనలను నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు  అవసరమైన కఠిన చర్యలు తీసుకొంటున్నారు.

          మరోవైపు అధ్యక్ష పదవి కోసం ఎగబడే ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ నాయకత్వం, ఈ సందర్భాన్ని రిపబ్లికన్‌ పార్టీని నేరస్థురాలిగా బోనులోకి నెట్టి, తాను అధికారంలోకి రావటానికి వీలుగా విమర్శలను గుప్పిస్తూ, శ్వేతేతర జాతి ఓటర్లను ఆకట్టుకొని వారి ఓట్లు దండుకోవటం కోసం ఆఫ్రికన్‌ అమెరికన్ల పట్ల ప్రేమ నటిస్తోంది.

          అధికారంలో వున్న రిపబ్లికన్‌ ట్రంప్‌ ప్రభుత్వం యీ నిరసనలను శాంతిభద్రతల సమస్యగా ప్రచారం చేస్తూ వాటిని సైనికుల ద్వారా – నేషనల్‌ గార్డ్స్‌ అనబడే మనదేశంలోని పారా మిలటరీ దళాల లాంటి దళాల ద్వారా అణచివేయటానికి చర్యలు తీసుకొంటూనే, అమెరికన్‌ పౌరులను అందుకు ఒప్పించే విధంగా పలు దుష్ప్రచారాలను ముమ్మరం చేస్తోంది. అధ్యక్షుడు డోనాల్డు ట్రంప్‌ నిరసనకారులను నేరస్తులైన గూండాలు (ధగ్స్‌)గా  అభివర్ణించాడు. అమెరికాలో దాదాపు 150 నగరాల్లో కర్ఫ్యూను విధింపజేశాడు. 67,000 మంది నేషనల్‌ గార్డు దళాలను దేశంలో మోహరించాడు. ఒక రాష్ట్రంలో ‘శాంతి భద్రతలను’ పరిష్కరించటం కోసమని నేషనల్‌ గార్డ్స్ ను  అంత పెద్దఎత్తున మోహరించటం రెండవ ప్రపంచయుద్ధం తర్వాత అమెరికాలో ఇదే ప్రధమం. 1991లో రోడ్నీ కింగ్‌ అనే ఆఫ్రో-అమెరికన్‌ను పోలీసులు క్రూరంగా కొట్టారు. అయితే కోర్టు ఆ  పోలీసులను నిర్దోషులుగా ప్రకటించింది. అప్పుడు అక్కడ నిరసనోద్యమం చెలరేగింది. అప్పుడు కూడా నేషనల్‌ గార్డ్స్ ను రంగంలోకి దింపింది ప్రభుత్వం. అంతేకాక సైన్యాన్ని కూడా పంపింది. ఈ రకంగా నిరసనలను అణచివేయ బూనుకొన్న అమెరికన్‌  ప్రభుత్వం,  ఆ నిరసనలను అల్లర్లగానూ, హింసాయుత  ఉద్యమంగానూ చిత్రిస్తూ, అసలు ఆ నిరసనలు చెలరేగటానికి గల మూలకారణాలను ప్రపంచపు దృష్టి నుండి మరలించటానికి ప్రయత్నిస్తోంది. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్న అనేకచోట్ల పోలీసులు నిరసనకారులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. రబ్బరు బులెట్లను పేల్చారు. పెప్పర్‌ స్ప్రే (కారపు నీళ్ళు) వారి కళ్ళల్లోకి జల్లారు. పలుచోట్ల అనేక వేలమందిని అరెస్టులు చేశారు. అమెరికన్‌ ప్రభుత్వం యీ నిరసనకారులను దేశీయ (అంతర్గత) టెర్రరిస్టులుగా అభివర్ణిస్తూ, వారే అల్లర్లను రెచ్చగొడుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఈ నిరసనకారులపై మెరుపు వేగంతో శబ్దం చేసే గ్రెనేడ్లు విసిరేటందుకు ఏర్పాట్లు చేశారు, ప్రయోగించారు. మరోవైపు స్థానిక నాయకులు నిరసనకారులను, ‘నిర్మాణాత్మక పద్ధతుల్లో’ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సిందిగా పిలుపులిస్తున్నారు. పోలీసుల చేత, ఏజెంటు ప్రొవకేటర్ల (శతృవర్గ గూఢచారుల)చేతా రెచ్చగొట్టబడిన కొందరు అక్కడక్కడా అల్లర్లకు పాల్పడితే వాటిని సాకుగా తీసుకొని పెద్దవి చేసి భూతద్ధంలో  చూపిస్తూ, తమకు అనుకూలంగా వున్న మీడియాతో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నట్లు పెద్దపెట్టున ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతూనే, చేత బైబిలును పట్టి తానొక శాంతి దూతనన్నట్లుగా నటిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా దేశాధ్యక్షునిగా ప్రజల శాంతి భద్రతల కోసం తాను పోరాడుతాననీ, శాంతిభద్రతలను పరిరక్షించటం తన విధి అనీ, శాంతియుత నిరసనలను తాను యిష్టపడతాను అనీ, ఫ్లాయిడ్‌ను పోలీసులు పొట్టన పెట్టుకొన్న తీరు సరైనది కాదనీ, అయితే ఈ రకంగా అరాచకవాదులు అల్లర్లు చేయటం వలన, లూటీలు చేయటం వలన మరణించిన జార్జి ఫ్లాయిడ్‌ స్మృతికి మనం అపచారం చేసినవారమవుతామనీ, యిది దైవాపచారం కూడా అవుతుందంటూ ధర్మపన్నాలు బోధిస్తున్నాడు. మరోవైపు ఆయన భార్య మెలనియా ‘‘ప్రజలు కర్ఫ్యూ నిషేధాజ్ఞలను పాటిస్తూ శాంతియుతంగా మెలగాలి, హింసకు తావులేదు, ఫ్లాయిడ్‌ కుటుంబానికి నా సానుభూతి’’ అంటూ మొసలి కన్నీరు కారుస్తోంది.

          ఈ రకంగా రాజ్యాధికారంలో వున్న రిపబ్లికన్‌ పార్టీ వ్యవహరిస్తూంటే జరుగబోయే ఎన్నికల్లో దేశాధ్యక్ష అభ్యర్ధిగా, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జో బిడెన్‌, యితర డెమోక్రటిక్‌ పార్టీ నాయకులూ యిళ్ళు కాలుతుంటే బొగ్గులేరుకునేవారి చందంగా, ‘‘అమెరికా ప్రజలపై, అమెరికా దేశపు మిలటరీని ప్రయోగిస్తానన్న ట్రంప్‌ను ఓడించండి’’ అంటూ పిలుపునిస్తూ, అసలు సమస్య అయిన జాతి వివక్షను ఎలా రూపుమాపాలి  అన్న విషయంపైనుంచి నిరసనకారుల దృష్టిని చాకచక్యంగా పక్కకు తప్పిస్తున్నారు. వాస్తవమైన ‘పోలీసు సంస్కరణలు’ జరగాలంటూ వారు డిమాండు చేస్తున్నారు. ఇందుకవసరమైన చర్చలను అందరితోనూ జరపాల్సి వుంటుందని అటువంటి చర్చలు జరపగల నాయకత్వం యిప్పుడు అమెరికాకు అవసరం అంటూ  ప్రచారం చేస్తున్నారు. తాను అధికారానికి వస్తే తొలి వందరోజుల్లోనే వ్యవస్థీకృత జాతి విద్వేష సమస్యను పరిష్కరిస్తానని జో బిడెన్‌ ప్రచారం చేస్తున్నాడు.

          ఈ రకంగా జాతి విద్వేష, జాతి వివక్ష, జాత్యహంకార సమస్యను అమెరికాలోని ప్రధాన రాజకీయ  పార్టీలు, అధికారం (ఓట్ల ద్వారా) పొందేందుకు ఒక సాధనంగా వాడుకొంటున్నారు. మరోవైపు వ్యవస్థీకృతమైన యీ సమస్యను శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరిస్తున్నారు.

          పాలకవర్గ పార్టీలు యీ విధంగా వ్యవహరిస్తూండగా, అక్కడి మీడియాసంస్థలు కూడా తమ వ్యాపార ప్రయోజనాలు, పెట్టుబడిదారీవర్గ లాభాలు పెంపొందించుకొనే విధానాలు అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ‘ఫాక్స్‌’ న్యూస్‌ సంస్థ గ్రాఫిక్స్‌ ద్వారా ‘‘నల్లజాతివారిపై హింసాయుత దాడులు జరిపినపుడు స్టాక్‌మార్కెట్లు ఏ రకంగా పైపైకి పోయాయో’’ వివరించింది. 1968లో మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ హత్యానంతరం మార్కెట్లు (స్టాక్‌) ఎలా పైపైకి ఎగిసిపోయాయో, 1991లో రోడ్నీ కింగ్‌ను చితకబాదిన పోలీసులను, 2014లో మైఖేల్‌ బ్రౌన్‌ మరణానికి కారణమైన పోలీసులను నిర్దోషులుగా విడిచిపెట్టినప్పుడు స్టాక్‌మార్కెట్లు ఎలా పైకి ఎగిసిపోయాయో చూపించింది. ‘ఫిఢెల్ఫియా ఇంక్వైరర్‌’ అనే పత్రిక యొక్క అత్యంత స్థాయి గల ఎడిటర్‌ తన పత్రికలో ‘‘నల్లజాతివారి జీవితాలు ముఖ్యం’’ అనే శీర్షికను ఎగతాళి చేస్తూ ‘‘భవనాలు ముఖ్యం’’ అంటూ శీర్షిక పెట్టి నిరసనలను, హింసాయుత అల్లర్లుగా చూపెడుతూ వ్యాసం వ్రాశాడు. అమెరికన్‌ కమ్యూనిస్టు  గ్రూపువారూ అరాచక, ఏంటిఫా (ఫాసిస్టు వ్యతిరేక కార్యకర్తల) సంస్థకు చెందిన కార్యకర్తలూ, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు వేన్ల నిండా రాళ్లూ, తదితర హింసకు ఉపయోగించే వస్తువులను పంపించారనీ, పిట్టకథలు రాస్తూ హింసాయుత మార్గాన్ని చేపట్టే ఉగ్రవాదులు యీ నిరసనలను నిర్వహిస్తున్నారనే కట్టుకథలను ప్రచారం చేశారు. ‘ది ఎపోటైమ్స్‌’ అనే పత్రికా విలేఖరి అయితే ‘‘ఇప్పుడు యీ జార్జి ఫ్లాయిడ్‌ మరణం సందర్భంగా యీ అల్లర్లు చెలరేగి వుండకపోతే, మరోసారి జరగబోయే అల్లర్లలో పాల్గొనటానికి మనదేశంలోనే వందలాదిమంది విదేశీ శిక్షణ పొందిన ఆందోళనకారూలూ, అదేరకంగా వేలమంది సుశిక్షితులైన క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు కార్యకర్తలు పొంచి వున్నారని’’ ప్రజలను హెచ్చరిస్తూ, కమ్యూనిస్టు భూతాన్ని (బూచోణ్ణి) చూపిస్తూ అమెరికన్‌ ప్రజలను భయపెడుతూ, జాత్యహంకార సమస్య గురించి ఆలోచించకుండా ప్రక్కదారి పట్టిస్తున్నాడు. మరోవైపు న్యూయార్కు యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ రుత్‌బెన్‌ – ఘియుత్‌ లాంటివారు; హింసాయుతపద్ధతుల వల్ల కానీ, వామపక్షాలు వారి మిలిటెంట్‌ పద్ధతుల వల్ల కానీ అధికారంలో వున్నవారు నిరసనకారులపై మరింత అణచివేత పాల్పడటానికి అవకాశాలను కల్పిస్తాయంటూ, అమెరికా పౌరులను హెచ్చరిస్తున్నారు.

          సోషల్‌ మీడియాకు చెందిన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలు కూడా అసలు సమస్యా, దాని పరిష్కారం ఆలోచించే వైపుకు కాకుండా, రిపబ్లికన్‌ పార్టీ లేదా డెమోక్రటిక్‌ పార్టీల విధానాలను సమర్ధించే వైఖరులను తీసుకొని, అసందర్భపు వివాదాలను ముందుకు తెచ్చి వాటి గురించి చర్చలు చేస్తున్నాయి.

          తెల్లజాతేతరులైన అమెరికన్‌ బడా టెక్‌ కంపెనీలకు సారధ్యం వహిస్తున్న మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ళ, గూగుల్‌ సుందర్‌ పిచాయ్‌ లేదా పెప్సీకో మాజీ సి.ఇ.ఓ. ఇంద్రానూయి లాంటివారు, లాంఛనప్రాయకంగా తామూ సమన్యాయం కోరుతున్నామనీ, నిరసనోద్యమానికి సంఫీుభావం తెలుపుతున్నామంటూ ప్రకటిస్తూ తామూ ప్రగతి కాముకులమేనన్నట్లు ప్రకటించుకొంటున్నారు. తమ సంస్థ వాణిజ్య ప్రయోజనాలను పెంపొందిస్తున్నారు. గూగుల్‌ సుందర్‌ పిచాయ్‌ అయితే జాతివివక్షపై పోరాటానికి 3.7 కోట్ల డాలర్లు విరాళంగా యిస్తున్నట్లు ప్రకటించారు. అయితే యీ విరాళం ఏ సంస్థకిస్తారు, ఏ రకమయిన పోరాట కార్యక్రమాలను సమర్ధిస్తారు అన్న వివరాన్ని చూడాల్సి వుంది. అప్పుడు కానీ ఆ విరాళం యొక్క వాస్తవ స్వభావ స్వరూపాలు అర్ధంకావు.

          మరోవైపు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కొన్ని రాష్ట్రాల గవర్నర్లు, కొన్ని పట్టణాల మేయర్లూ తాము పోలీసు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడానికి తీర్మానాలు చేస్తున్నామనీ, పోలీసులు నిందితులను నిర్బంధించటానికి ఉపయోగించే మోకాటి బంధాలు, ఊపిరిని ఆడకుండా పీకను నొక్కిపెట్టే పద్ధతులను, ఫ్లాయిడ్‌పై ఉపయోగించే పద్ధతులను ఉపయోగించటానికి రాష్ట్ర పోలీసులకు యిచ్చే శిక్షణలను రద్దుచేయ బోతున్నామనీ ఆడంబరంగా ప్రకటిస్తున్నారు. కొందరు పోలీసులకు యిచ్చే నిధులలో కోత విధిస్తామని ప్రకటిస్తున్నారు.

          మొత్తంగా చూస్తే అమెరికాలోని సకల పక్షాలవారూ, సంస్థాగతమైన ఈ జాత్యహంకార, జాతి వివక్ష సమస్యను, శాంతిభద్రతల సమస్యగానూ, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చే సాధారణ సమస్యగానూ కుదించి చూపిస్తూ – హింసాయుత పద్ధతులు అమెరికన్‌ ప్రజల, దేశ ప్రయోజనాలకు హాని కలిగించేవన్నట్లుగా చిత్రీకరించి – తేల్చిపారేశారు.

          వాస్తవానికి  అమెరికాలో నీగ్రోజాతీయులపై సాగే వివక్షా, పోలీసుల దాష్టీకం, పోలీసులు సాగించే హత్యలూ యిటీవలే తలెత్తిన పరిణామాలు ఎంతమాత్రమూ కాదు. గత రెండున్నర శతాబ్దాలుగా యివి నిరాఘాటంగా సాగుతూనే వున్నాయి. అమెరికా దేశపు పాలనా వ్యవస్థ వీటిని అరికట్టకపోగా, తన దోపిడీ విధానాల ద్వారా నానాటికీ యివి మరింతగా పెరిగిపోయేందుకే ఉపయోగపడింది – ఉపయోగ పడ్తోంది. అది రిపబ్లికన్‌ పార్టీ పాలనలో కావొచ్చు, డెమోక్రటిక్‌ పార్టీ పాలనలో కావొచ్చు. వివిధ ప్రభుత్వ విధానాల రూపంలో ఆ అకృత్యాలు కొనసాగుతూనే వున్నాయి. పోలీసులు అమానుషంగా నీగ్రోలను చిత్రవధలను చేయటం, చంపటం అన్నది నిత్యకృత్యమయిపోయింది. వివరాలను పరిశీలిస్తే, ప్రతీఏటా పోలీసులు సగటున వెయ్యిమందిని చంపుతున్నట్లు వెల్లడి చేస్తున్నాయి. అందులో జనాభా దామాషాన చూస్తే నల్లవారే ఎక్కువమంది హతువుతున్నారు. దీని అర్ధం యిది కేవలం పోలీసుల యొక్క మితిమీరిన ప్రవర్తన అని చెప్పటానికి వీలులేనిది. ఇటువంటి పోలీసు హత్యలను (నీగ్రోల) వ్యవస్థ ప్రోత్సహించి, ఆమోదిస్తున్నందువల్లనే యిలా జరుగుతోందని అర్ధమవుతుంది. నీగ్రోలను నేరస్థ జాతివారిగా మాదకద్రవ్యాల వ్యసనానికి బానిసలుగా చిత్రీకరిస్తూ, వారిపై దమనకాండను – పోలీసు అకృత్యాలను నిరాఘాటంగా సాగించటానికి వాటిని న్యాయసమ్మతమైనవే, సరయినవే అని సామాన్య అమెరికన్‌ ప్రజానీకాన్ని నమ్మించి, అంగీకరింపచేయటానికి అమెరికన్‌ పాలకులు – పాలకవర్గాలు చేపట్టిన జిత్తులమారి విధానం అని అర్ధమవుతుంది. ఇదంతా ప్రజాస్వామ్యం, ప్రజల (అమెరికన్‌) సంక్షేమ, సౌభాగ్యాల కోసమేనన్న భ్రమను కల్పించుతూ సాగుతున్న కుట్రగా అర్ధం అవుతోంది.

          అయితే ‘‘భూలోక స్వర్గంగా’’ ప్రపంచమంతటా అనేకులు భావిస్తున్న అమెరికాలో ఇలా ఎందుకు జరుగుతోందనేది, ఎందుకు జాత్యహంకారం, జాతి వివక్షలు కొనసాగుతున్నాయో అమెరికా దేశపు చరిత్ర నుండి పరిశీలించి తెలుసుకోవాల్సి వుంది.

          నేడు అమెరికాలోని మెజార్టీ పౌరులతోబాటు, పశ్చిమ దేశాల్లోని మెజార్టీ పౌరులేకాక, ప్రపంచ దేశాల్లోని అనేకమంది ప్రజలు పెట్టుబడిదారీవ్యవస్థను అమితంగా కొనియాడుతున్నారు. ఆ పెట్టుబడిదారీవ్యవస్థను ఎన్ని ఆపదలు వచ్చినా కాపాడతానని అధ్యక్షుడు కెన్నడీ ప్రతిజ్ఞ చేశాడు. అప్పటినుండి యిప్పటివరకూ అమెరికా పరిపాలకులందరూ అదే విషయాన్ని ఢంకా బజాయించి మరీ ప్రకటిస్తున్నారు. ఎక్కువమంది అమెరికన్లు పెట్టుబడిదారీవిధానం అన్నదాన్ని ప్రజాస్వామ్యానికి సమానార్ధకంగా భావిస్తారు. వారు పెట్టుబడిదారీ విధానానికి ఆవల (బయట) వున్న పాలక వ్యవస్థల్లో, తాము పోరాడి సంపాదించుకొన్న పౌరహక్కులయిన మతస్వేచ్ఛ, ఆలోచనా ప్రకటనాస్వేచ్ఛ, సమావేశస్వేచ్ఛ, పత్రికాస్వేచ్ఛ, అహేతుకంగా అరెస్టుకాబడకుండా వుండే స్వేచ్ఛలకు భంగం –  ప్రమాదం ఏర్పడుతుందని నమ్ముతారు. స్వేచ్ఛ అంటే అమెరికన్ల ఉద్దేశ్యంలో తాము కోరుకొన్నది తాము చేయవచ్చుననీ, అందులో ఏరకమయిన ప్రభుత్వ జోక్యం లేకుండా వుంటుందనీ వాళ్ళు నమ్ముతారు. నిజమే! యీ స్వేచ్ఛలన్నీ అమూల్యమయినవే. కానీ దీర్ఘకాలంపాటు జరిపిన పోరాటాల ఫలితంగా, యీ స్వేచ్ఛలు పాక్షికంగా సాధింపబడ్డాయి. ఈ స్వేచ్ఛలన్నింటి కోసం, బూర్జువాలూ (పెట్టుబడిదారుల కోసం), ఫ్యూడలిజంకు  వ్యతిరేకంగా పోరాడారు. పెట్టుబడిదారీ విధానం సంస్థాపితమయిన తరువాత యీ స్వేచ్ఛలను కార్మికులకు విస్తరించటాన్ని ప్రతిఘటించారు. అందువలన కార్మికులకు వారి స్వేచ్ఛలు పెట్టుబడిదారీ విధానం వలన రాలేదు. పెట్టుబడిదారీవిధానం వున్నప్పటికీ అవి సాధించబడ్డాయి. వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క ప్రతీ నూతన పరిణామమూ కూడా, పెట్టుబడిదారీ సమాజాలు అదుపులో గల (పెత్తనం క్రింద వున్న) వారికి వ్యతిరేకంగా  సాగిన తీవ్రమయిన వ్యతిరేకత వలన సాధింపబడ్డాయి. నేడు పెట్టుబడిదారీ విధానం యీ రకంగా కష్టపడి ప్రజలు సాధించుకొన్న హక్కులను కాపాడటానికి బదులు, వాటికి ఒక ప్రమాదంగా పరిణమించింది. నేటి జాత్యహంకార సమస్యకు యిది కీలకమయిన తీవ్ర విరుద్దమయిన పరిణామం.

          ఫ్రెంచి విప్లవానికి పదమూడు సంవత్సరాలకు ముందే అమెరికా దేశపు వలసలు తమ వలసవాద బంధనాలను తెంచుకొని, అప్పటివరకూ గల చరిత్రలో ఒక అత్యంత విప్లవకరమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాయి. తిరుగుబాటు హక్కుపై, విప్లవం చేసే హక్కుపై, ప్రజలు న్యాయసమ్మతంగానే అమలులో  వున్న ప్రభుత్వాన్ని రద్దుచేయవచ్చునన్న ప్రాతిపదికపై, అవసరమైతే బలప్రయోగం ద్వారా ఒక క్రొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునన్న ప్రాతిపదికపై మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడ్డ దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అది అవలంబించిన మూలసూత్రాలు యూరోపులోని పాలకవర్గాలను  భయకంపితులు చేశాయి. అవి, మానవులు అందరూ సమానంగా సృష్టించబడ్డారు. ప్రతీ ఒక్కరికీ జీవించేహక్కు వుంది, అందరికీ స్వేచ్ఛా, సంతోషాలు, ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం యీ హక్కులను రక్షించటం. ప్రజలే సార్వభౌములు – ప్రభుత్వం ప్రజల యొక్క సేవకురాలే తప్ప ప్రజల యజమాని కాదు. ఈ సూత్రాలతోపాటు ఇంకా యితర సూత్రాలను కూడా ఆ దేశం ప్రకటించింది. అవి : సంపన్నవర్గస్వామ్యం వద్దు, వ్యవస్థీకృతమైన చర్చి వద్దు. వాక్స్వాతంత్రం, పాలకులను విమర్శించే స్వేచ్ఛ, ప్రతి ఒక్కరికీ విద్య, వర్గ వివక్ష లేని సమాజం. ఇది ఒక సోషలిస్టు సందేశం కాదు కేవలం ఒక బూర్జువా – ప్రజాతంత్ర ఆశయం మాత్రమే!. ఇదీ ఆనాడు అమెరికా స్వాతంత్య్ర ప్రకటన యొక్క సారాంశం. అందువల్లనే నాడు అమెరికా వాగ్దానం చేసిన నూతన ప్రపంచం యూరోపు ప్రజలకు ఒక ఆశగా పరిణమించింది. అయితే యిటువంటి నూతన ప్రపంచాన్ని కలలుగన్న జెఫర్‌సన్‌, థామస్‌ పైన్‌, విట్‌మన్‌, ఎమర్శన్‌లు అప్పటికే అమెరికన్‌ సమాజంలో నెలకొని వున్న వినాశకర, ప్రమాదకరమైన దోషాన్ని గుర్తించలేకపోయారు. అదేమిటంటే : మానవులందరూ సమానమనే సూత్రంపై నిర్మించబడ్డ సమాజంలోనే ఒక బానిస సమాజం కూడా వుండటం. అంతేకాదు వారు అమెరికాలో వున్న స్థానిక రెడ్‌ ఇండియన్‌ ప్రజలపై చేసిన నిర్దాక్షిణ్యమైన ఊచకోతను ఖండించలేకపోయారు. అంతేకాదు వారు ఉత్పత్తి సాధనాలు ప్రవేటు వ్యక్తుల స్వంత ఆస్తిగా వున్నంతకాలం మానవాళిలో సమానత్వం తీసుకురావటం అసాధ్యం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు.

          అమెరికా దేశపు స్వాతంత్య్ర ప్రకటనకు 150 సంవత్సరాలకు ముందే ఆగస్టు 1619లో 5,00,000 మంది బానిసలు ఆఫ్రికా నుండి తీసుకురాబడ్డారు. అప్పటికి అమెరికాలో వున్న జనాభా మొత్తం 30 లక్షలమంది మాత్రమే. ఆ రకంగా యిప్పుడు అమెరికాలో వున్న ప్రతీ ఒక్క నీగ్రో, కొద్దిమందిగా వున్న తెల్లజాతివారికన్నా ఎక్కువ పూర్వ వంశీకతను కలిగినవారుగా వున్నారు. అయితే తరతరాలుగా వారికి బానిసత్వ దాస్యం తప్ప మరో విషయం తెలియదు. బానిసత్వం నుండి నీగ్రోలకు విముక్తి లభించిందని చెప్పినప్పటికీ నేటికీ మెజార్టీ నీగ్రోల జీవిత విధానం దాస్యం మాత్రమే. కాకపోతే బానిసత్వ రూపం మారింది. నేడు న్యూయార్కు నగరంలోని హార్లెమ్‌ ప్రాంతంలోగానీ, చికాగో తదితర నగరాల్లోని మురికివాడల్లో నివసించే  నీగ్రోల జీవితాలు నాడు వర్జీనియాలో పొగాకు తోటల్లో పనిచేసిన నీగ్రో బానిసల జీవితాలకన్నా ఏరకంగానూ మెరుగైనవిగా లేవు.

          అమెరికాలోని జాత్యహంకార, జాతి విద్వేష సమస్యకు మూలాలు ఆ దేశంలోని మూలవాసులైన రెడ్‌ యిండియన్లను పెద్దపెద్ద గుంపులుగా నిర్దాక్షిణ్యంగా నాశనం చేసిన నాటినుండే మొదలయింది. రెడ్‌ ఇండియన్లను సర్వనాశనం చేయటమే అమెరికన్‌ నాగరికతకు చెల్లించబడిన మూల్యమయింది. ఆ రకంగా తెల్లజాత్యహంకారం అన్నది అమెరికా దేశపు ఆవిర్భావం నుండీ వుండి, అది నేటికీ కొనసాగుతోంది.

          నాటి నుండి కూడా నీగ్రోలపై వివక్షను చూపించటమన్నది అమెరికా పాలకవర్గాలు అవలంబించి,  అనుసరించే బుద్ధిపూర్వక, శాశ్వత విధానంగా సాగుతోంది. ఆర్ధిక, రాజకీయ వివక్ష అన్నది ఆ విధానాలకు ప్రాతిపదికగా వుంది.

          మానవతావాది అబ్రహాం లింకన్‌ అధ్యక్షుడైన తర్వాత నీగ్రో బానిస వ్యవస్థ రద్దుపరచబడింది కానీ ఆ బానిసవ్యవస్థ రద్దుకు గల కారణం వారికి తెల్లజాతివారితో సమానహక్కులు యిచ్చి, జాతి వివక్షలేని నిజమైన సమానత్వం గల ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయటం అన్నది ఆయన ఉద్దేశ్యం కాదని అబ్రహాం లింకనే స్వయంగా 1858లో ఛార్లెస్టన్‌లో యిచ్చిన ఒక ఉపన్యాసం ద్వారా స్పష్టమవుతుంది.

          ‘‘నేను శ్వేతజాతులవారి మధ్యా నల్లజాతుల వారి మధ్యా రాజకీయ, సామాజిక సమానత్వం తీసుకురావటానికి అనుకూంగా లేను…. అంతేకాదు నేను నీగ్రోలను ఓటర్లుగానూ, జ్యూరర్లు (న్యాయ నిర్ణయాధికారులు)గా చేయాలనుకోవటంలేదు. లేదా వారిని అధికారాన్ని చలాయించే పదవులు చేపట్టడానికి అర్హులుగా చేయానుకోవటంలేదు. లేదా నీగ్రోలను తెల్లజాతివారితో అంతర్‌ వివాహాలు చేసుకోవాలని అనుకోవటంలేదు….  అధికులు, తక్కువవారు అన్న స్థాయి గల అంతరాలు వుండవల్సిందే. నేను  చాలామంది  కోరుకొన్నట్టుగా, తెల్లజాతివారే ఉన్నత స్థితిలోనూ, ఉన్నత స్థాయిలోనూ వుండాలన్నదానికి అనుకూలంగా వున్నవాడిని’’ (ఈ ఉపన్యాసాన్ని ‘న్యూస్టేట్స్ మన్‌’ అనే పత్రిక మే 2, 1969 సంచికలో ప్రచురించింది.)

          మరయితే నీగ్రోలను బానిసత్వం నుండి ఎందుకు విముక్తి చేసినట్టు? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఉత్తర రాష్ట్రాలలోని పారిశ్రామికవేత్తలకు కారుచౌకగా శ్రమశక్తిని అమ్ముకొనే కార్మికులు కావాలి. అయితే అటువంటి చౌకగా శ్రమశక్తిని యివ్వగలిగే కార్మికులు దక్షిణ రాష్ట్రాలలోని తోటల్లో (ప్రత్తి, పొగాకు మొ॥) కట్టుబడిపోయి వున్నాడు. వారిని ఆ బానిసత్వం నుండి విడుదల చేస్తే స్వేచ్ఛగా,  శ్రమశక్తిని దోపిడీ చేసుకోవటానికి వీలైన పెట్టుబడిదారులకు అవసరమైన లేబర్‌ మార్కెట్లను వారు విస్తృతం చేస్తారు. అందుకనే బానిసత్వాన్ని అంతమొందించాలని పిలుపులో, ఉత్తరాది రాష్ట్రాల పారిశ్రామికవేత్తల యొక్క డిమాండ్లు ప్రతిధ్వనించాయి.

          బానిస, ఫ్యూడల్‌ సమాజంలో అయితే కార్మికులు తమ బానిస యజమాని అదుపులో వుంటారు. అదే పెట్టుబడిదారీదేశాల్లో అయితే కార్మికులకు ఏదో ఒక పారిశ్రామిక యజమాని దగ్గర పనిచేసే స్వేచ్ఛ లేదా తమ ఉద్యోగ నియామక నిబంధనలను గురించి బేరసారాలు ఆడే స్వేచ్ఛ వుంటుంది. కానీ వారికి యితర యజమానుల వద్ద పనిచేసే స్వేచ్ఛ వుండదు. అయినా నేడు అమెరికాలో పనిచేసే ఉద్యోగులందరూ ఏదో ఒక  యజమానికి ధనాన్ని సంపాదించిపెట్టే సేవకులే! ఇదే పెట్టుబడిదారీవిధానంలో వున్న మర్మం. వేతన బానిసలుగా కార్మికులను కుదించటమన్నదే ఆ వ్యవస్థ యొక్క మూలసూత్రం.

          ఆ రకంగా కారుచౌకగా శ్రమశక్తిని అమ్ముకొనే లేబర్‌ మార్కెట్ల సృష్టికి ఈ నీగ్రోలను సమిధలు చేశారు. వీరిని నిరంతరం పేదవారిగానే మిగిల్చే, వివక్షాపూరిత విధానాలను (రాజకీయ, ఆర్ధిక) అమెరికన్‌ పాలకులు  యిన్నాళ్ళుగా  అనుసరించారు. ఈ నిరుపేద నీగ్రో చౌక కార్మికులను, తెల్లజాతి కార్మికులకు పోటీపెట్టి, తెల్లజాతి కార్మికులకూ – నల్లజాతివారికీ మధ్య జాతి విద్వేషం నెలకొనేలా చేశారు. ఈ విద్వేషాన్ని శాశ్వతం చేశారు. ఈ వివక్షా విధానాలు, నీగ్రోలను విడదీసి ఘెట్టోలుగా పిలువబడే పట్టణాలలోని మురికివాడల్లో విడిగా వుంచటం వలన అమెరికా దేశంలో సంభవించిన ఆర్ధిక లాభాలు వారికి దక్కకుండా పోయాయి. ఈ విధానాల (వివక్షాపూరిత) యొక్క విషఫలాలే, నిరుపేద నీగ్రోలు నేరస్థులుగా మారటానికి గల మూలకారణం. కానీ నీగ్రోలను నేరస్తులుగా చిత్రీకరిస్తూ, వారు సమాజ శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారనే పేరిట, వారిని అణచిపెట్టే దుర్మార్గమైన పోలీసు వ్యవస్థను స్థాపించి కొనసాగిస్తోంది అమెరికా పెట్టుబడిదారీవ్యవస్థ. ఆ రకంగా 350 సంవత్సరాలుగా నీగ్రోలపట్ల వివక్ష వ్యవస్థాపరంగానే కొనసాగుతోంది.

          ఎటువంటి ఆస్తిపాస్తులూ లేని కార్మికుల శ్రమశక్తిని దోచుకోవటమే ఏకైక లక్ష్యంగా వున్న  పెట్టుబడిదారీ సమాజం – వ్యవస్థలు గల అమెరికాలో, తమ పరిస్థితులను మెరుగుపర్చాలని డిమాండు చేసిన కార్మికులను, లేదా అణచబడ్డ నీగ్రోలను ‘‘కమ్యూనిస్టు ఆందోళనకారులు’’ అంటూ ముద్రవేయటం 1890 నాటి నుండే ప్రారంభమయింది. ఆ రకంగా తమ పరిస్థితుల మెరుగుకోసం నిరసనలు జరిపే ప్రజానీకాన్ని శాంతిభద్రతల విఘాతకులుగా ముద్రవేసి, వారిని అణచివేయటానికి (అదుపుజేసే పేరిట) అవసరమైన చట్టాలను పెట్టుబడిదారులే నిర్ణయించి అమలుచేయటం కొనసాగుతోంది. ఆరకంగా అమెరికన్‌ పెట్టుబడిదారీ వ్యవస్థే పెద్దఎత్తున హింసాయుత పోలీసు బలగాలను ప్రయోగిస్తూ, నిరసనకారులే హింసకు పాల్పడుతున్నారంటూ  బుకాయిస్తోంది. వాస్తవానికి రాజ్యం నిరసనకారులపై ప్రయోగించే హింస 1000 టన్నుల శక్తిగల బాంబు విస్ఫోటనం లాంటిదైతే, నిరసనకారులు చెదురుమదురుగా పాల్పడిన హింస ఆట తుపాకీ ప్రేలిన చప్పుడు లాంటిది.

          పెట్టుబడిదారీ వ్యవస్థ విధించిన పరిస్థితులే, వివక్షా విధానాలే శాంతిభద్రతల విఘాతానికీ, ప్రజల్లో అశాంతి తలెత్తడానికి కారణాలయినా, అందుకు బాధ్యతను ఆ వ్యవస్థ అశాంతికి రెచ్చగొట్టబడిన ప్రజలపై (నిరసనకారులపై) రుద్దుతోంది.

          అమెరికా యొక్క పెట్టుబడిదారీవ్యవస్థ అవంబించిన వివక్షా విధానాల (నీగ్రోల పట్ల) వలన నేడు నీగ్రోలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్ధికపరంగా అధోస్థితిలోకి నెట్టబడ్డారు. అమెరికా దేశపు ప్రగతిఫలాలు నీగ్రో జాతివారికి దక్కకుండా పోయాయి. నేడు తెల్లజాతి సగటు వార్షిక ఆదాయం 71 వేల డాలర్లయితే, ఆఫ్రికన్‌ అమెరికన్లది 41 వేల డాలర్లు మాత్రమే. ఆఖరికి కోవిడ్‌ మరణాల్లో కూడా నల్లజాతీయుల సంఖ్యే 2.4 రెట్లు ఎక్కువగా వుంది. శ్వేతజాతివారిలో నిరుద్యోగ రేటు 1.9 శాతం కాగా నల్లజాతివారిలో 8 శాతంగా వుంది. శ్వేతజాతీయుల్లో 8.1 శాతం మంది పేదరికంలో మగ్గుతుంటే, నల్లజాతివారిలో 20.8 శాతం నిరుపేదలుగా వున్నారు. నల్లజాతివారికి శ్వేతజాతీయులతో సమానంగా వైద్యసేవలు పొందే అవకాశం లేదు – ఇదీ  ‘ప్రజాస్వామ్య’ అమెరికా దేశపు వాస్తవ ముఖచిత్రం. ఇదీ పెట్టుబడిదారీ వ్యవస్థ సమాజానికి అందిస్తున్న ‘సమానత్వ’, ‘స్వేచ్ఛా’ అవకాశాల బండారం!

          దీన్ని కప్పిపుచ్చుకోవటానికి నిరంతరం, సామ్రాజ్యవాదంగా స్థిరపడ్డ అమెరికాదేశపు పెట్టుబడిదారీ వ్యవస్థ పాలకులు – పాలకవర్గాలు ‘ప్రజాస్వామ్యం’, ‘ప్రజల వ్యక్తిగత హక్కులకు’ గ్యారంటీగా నిలబడిన యోధులుగా ప్రచారం ముమ్మరంగా కావించుకొంటూ తమ బూటకత్వాన్ని కప్పిపెట్టుకొంటున్నారు. సామ్రాజ్యవాదపు నాయకునిగా వ్యవహరిస్తున్న అమెరికా తనను తాను ‘‘ప్రపంచ పోలీసుగా’’ నియమించుకొని, ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, స్థాపించటం కోసం తాము జోక్యం చేసుకొన్నామంటూ దురాక్రమణ యుద్ధాలను సాగిస్తోంది. దేశంలో అంతర్గతంగా వివక్షకు వ్యతిరేకంగా ఎగసిపడిన అనేక నీగ్రో ఆందోళనలను పోరాటాలను నెత్తుటేరుల్లో ముంచి అణచివేసింది. పోలీసు వ్యవస్థను వ్యవస్థాగతం చేసిన పాలకవర్గాలే ప్రభుత్వాల దోపిడీ విధానాలను ప్రశ్నించిన వారిని దారుణ దమనకాండతో అణచివేస్తున్నాయి.

          అమెరికన్‌ పెట్టుబడిదారీ పాలనావ్యవస్థ విధించిన యీ విధానాలే జాత్యహంకార, జాతి వివక్ష సాగటానికి గల అసలు మూలకారణం. ఇవే రాజకీయ, ఆర్ధిక వివక్ష విధానాలను నీగ్రోలకు వ్యతిరేకంగా, నల్లజాతి అధ్యక్షుడు ఒబామాతో సహా అందరూ అమెరికన్‌ అధ్యక్షులూ అమలుజరిపారు. ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్నది కూడా అదే!

          జాత్యహంకారాన్నీ, జాతి వివక్షనూ సృష్టించిన అమెరికాదేశపు పాలకవర్గాలు, దాన్ని అంతమొందించ దలుచుకుంటే సునాయాసంగా అంతం చేయగలరు. అది వారి ప్రయోజనాలను పెంపొందిస్తుందనుకొంటే వాళ్ళు చేస్తారు. ఉదాహరణకు అమెరికా దేశ ఆవిర్భావకాలం నుండీ అమెరికా సైనిక బలగాలలో వున్న లాంఛనప్రాయమైన జాతి వివక్షను ఒక్క కలం పోటుతో, ఎటువంటి ఉపద్రవం జరగకుండానే అంతం చేశాడు అధ్యక్షుడు ట్రూమన్‌.

          తమకున్న అపారమైన ప్రచార నైపుణ్యంతో, తమకు అందుబాటులో గల మొత్తం వనరులతో, తమకు గల బలప్రయోగం చేసే అధికారంతో, అమెరికన్‌ పాలకవర్గాలు ‘‘ఐక్యం చేయబడ్డ’’ అమెరికా అనే ఆదర్శాన్ని మూర్ఖపు పట్టుదల గల శ్వేతజాతి జాత్యహంకారులను ఒప్పించగలరు. కానీ వారు అలా చేయరు. ఎందుకంటే అమెరికాలోని కార్మికులూ, ప్రజలూ నిరంతరం విభజింపబడి వుండాలి. వారెన్నడూ ఐక్యం కాకూడదు. వారందరూ ఐక్యమై ప్రస్తుతం అమలులో వున్న దోపిడీ పెట్టుబడిదారీవ్యవస్థకు వ్యతిరేకంగా దాన్ని సమూలంగా మార్చివేయటం కోసం ఎన్నడూ పోరాటం నిర్వహించకూడదు.

          సరీగ్గా యీ లక్ష్యంతోనే, అమెరికా పెట్టుబడిదారీ పాలకవ్యవస్థ జాత్యహంకారం, జాతి వివక్షలను అమెరికా సమాజంలో శాశ్వతం చేసింది. అందుకనే సమన్యాయం కోసం నిరసన తెలుపుతున్న ఆందోళనను శాంతిభద్రతల సమస్యగా చూపెడుతూ, దానిని క్రూరంగా అణచివేసేందుకు ఆమోదపూర్వకమైన ప్రజాభిప్రాయాన్ని మలచుకొంటోంది. నిరసనోద్యమాన్ని నిర్వహిస్తున్న వివిధ రకాల ప్రజానీకంతోపాటు, అందుకు సంఫీుభావం తెలుపుతున్న వివిధ ప్రజాతంత్ర శక్తులు యీ వాస్తవాలను అర్ధం చేసుకోవాలి! అమెరికాలో కొనసాగుతున్న పెట్టుబడిదారీవ్యవస్థ కూలద్రోయబడకుండా ఈ జాత్యహంకారాలు, జాతి వివక్షలు అంతం కావన్న కఠిన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి!

          పెట్టుబడిదారీవ్యవస్థను రద్దుచేసే మహత్తర లక్ష్యసాధన కోసం ఐక్యమయేందుకు, పోరాడేందుకు, అసమానతలకు,  వివక్షలకు గురయ్యే ప్రజానీకం అందరినీ సమాయత్తం చేసేందుకు నిరంతర కృషి జరగాలి!

admin

leave a comment

Create AccountLog In Your Account