సోషలిస్టు సమాజాన్ని స్థాపించగ కదులుదాం

సోషలిస్టు సమాజాన్ని స్థాపించగ కదులుదాం

– రౌతు వాసుదేవరావు

నేల నీరు గాలి వెలుగు ఆకాశలన్నిటిని

మలినం చేసిన పాపం చుట్టుకొనగ మనిషినీ

కరోనా వైరస్సై కమ్ముకొనెను నేడురా

మృత్యుఘోష పెడుతున్నది మానవాళి చూడరా               ॥ నేల ॥

గ్రామ స్వరాజ్యం వదిలి నగరీకరణం చేసిరి

రసాయనాలెదజల్లి విషం కుమ్మరించిరి

కాలుష్యపు కోరల్లో వనరులన్ని విలపించగ

వింత వింత రోగాలతో లోకాన్నె ముంచిరి                          ॥ నేల ॥

ప్రపంచమె కుగ్రామం అనే కుటిల బాటలో

బహుళజాతి కంపెనీల లాభాల వేటలో

ప్రజల నోట మట్టి కొట్టి కార్పురేటు పరంజేసి

సేవారంగాలనెల్ల గాలికొదిలె పాలకులు                             ॥ నేల ॥

డబ్బుతోనె జబ్బు కూడ గ్లోబలైజు అయిపోయెను

కంటికి కనిపించనెన్నో వైరస్సులు వికటించెను

కార్పురేటు ఆసుపత్రి లాక్‌డౌన్‌ అయ్యెనంట

ప్రజారోగ్యం వ్యవస్థొకటి దిక్కాయెను మనకంట               ॥ నేల ॥

పుట్టెడు కష్టాల తోడ బ్రతుకు బారమయ్యెటోడు

పుట్టిన ఊరును వదిలి వలస బాట పట్టినోడు

ఎంత గుండె గాయమయినో సొంతూరికి పయనమయ్యి

ఏలికలను వెక్కిరిస్తు వేల మైళ్లు నడిచినాడు                 ॥ నేల ॥

మార్కెట్టు మాయలో పడి విలవిలలాడిన రైతు

కార్మిక సోదరుని పాలి వికటించిన చట్టాలు

కొనుగోలు శక్తిలేక చిరుద్యోగి నిరుద్యోగి

ఉద్దీపన పేకేజ్‌ ఉసురున బడుచున్నారు                      ॥ వేల ॥

ప్రాణాలను ఒడ్డి సేవలందించే వారలు

వైద్యులు, నర్సులు, సఫాయీలు, పోలీసులు

రక్షణ సామగ్రి లేని నిర్లక్ష్యపు విధానాలు

చప్పట్లు, దీపాలు పూలతో సరిపెట్టినారు                      ॥ నేల ॥

పాదయాత్ర బృందాలను ఆదుకునే హృదయాలు

తమ చెంతన పేదలకు చేయూత నిచ్చువారు

లోకములో మానవత మిగిలుందని చాటినారు

పాలకుల దృష్టి కొంత మారినట్లు చేసినారు                   ॥ నేల ॥

సంపద సృష్టించే మాకు ఈతి బాధ లెందుకని

ఆకర్షక పథకాలతో మా బతుకులు మారవని

సకల రుగ్మతలు తోడ, వైరస్సుల నధిగమించె

సోషలిస్టు సమాజాన్ని స్థాపించగ కదులుదాం        ॥ నేల ॥

admin

leave a comment

Create Account



Log In Your Account