వలస కార్మికుల గ్రామీణ అనుబంధాల సజీవత్వాన్ని, బలాన్ని రుజువు పరిచిన కరోనా!!

వలస కార్మికుల గ్రామీణ అనుబంధాల సజీవత్వాన్ని, బలాన్ని రుజువు పరిచిన కరోనా!!

మూడు నెలలుగా కరోనా మహమ్మారి మానవ ప్రపంచాన్ని గిజగిజలాడిస్తోంది. మానవ సమాజంలో వర్గ వైరుధ్యాలు తలెత్తిన నాటి నుండీ సామాజిక వైరుధ్యాలే ప్రధానంగా సాగుతూండిన చరిత్ర ఆకస్మికంగా మానవ సమాజమంతా ప్రకృతి విలయమైన కరోనాపైకి ఎక్కుపెట్టాల్సిన స్థితి ఏర్పడిందా అన్నట్లు పరిస్థితులు కదలాడసాగాయి. అయితే ప్రపంచాధిపత్యశక్తులు ఈ పాప పంకిలాన్ని ఏ దేశం నెత్తిన రుద్దాలా అనే పోటీలో వున్నాయి. ప్రకృతి విధ్వంసమూ, పర్యావరణ సమస్యలు కలగలిసి ఈ మహావిపత్తుకి కారణమయినట్లు ఒక సాధారణ భావన వ్యక్తమయింది. కానీ, లాభాల వేటకై శారీరక బౌద్ధిక శ్రమశక్తిని కొల్లగొట్టటమే కాక, ప్రకృతి సహజమయిన అనేక వనరులను విధ్వంసం స్థాయిలో దోపిడీ చేస్తున్న సామ్రాజ్యవాద కార్పొరేట్‌వర్గాల అంతులేని స్వార్ధపరత్వం ఈ దుస్థితికి కారణమయిందని కొద్దిమంది మాత్రమే గుర్తించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రమదోపిడీతో సంతృప్తిపడలేక, ప్రకృతి శక్తులను వైజ్ఞానిక జీవజన్యు పరిశోధనలను కూడా విచ్చలవిడి దోపిడీ చేసే అమానుష ప్రక్రియకు పుట్టుకొస్తున్నవే కరోనా లాంటి ప్రాణాంతక వైరస్సులు.

            మానవాళికి సంభవించే మహావిపత్తులను ఆ విపత్తులలో చిక్కుకుని వున్న కాలాలను తమ వర్గ ప్రయోజనాలకు వినియోగించుకునే రాజకీయ కళలో ఆధిపత్య పాలకవర్గాలు ఆరితేరి వున్నారని మన స్థానిక, దేశీయ ప్రపంచ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

రక్షణ కరువైన వలస కార్మికులు!

హక్కుల భక్షణలో కేంద్ర పాలకులు!!

            అబద్ధాల ఫ్యాక్టరీతో నిజాల్ని అడ్డగోలుగా తల్లకిందులు చేయగలిగిన యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకున్న మోడీ ప్రభుత్వం, కరోనా లాక్‌డౌన్‌ ఫలితంగా బజారున పడిన కోట్లాది వలస కార్మికుల మహా విషాద, అత్యంత గంభీర మహాయాత్రను కప్పిపుచ్చలేకపోయింది. ప్రపంచ వ్యాపితంగా 200 దేశాలకు వ్యాపించిన కరోనా మహమ్మారి మరేదేశం ఎరగని రీతిలో కోట్లాది వలస కార్మికులను రోడ్లపాలు, ఎండలపాలు, ఆకలిపాలు, రక్తంవోడే గాయాలపాలు, నడిమధ్యనే ఆకలిచావులపాలు,  చెట్ల నీడల్లో ప్రసవాలపాలు, గుక్కెడు నీళ్ళకై గుటకలపాలు ఒక్కమాటలో నరకయాతనలపాలు పడేట్లు చేసింది. ప్రపంచస్థాయిలో దేశ పరువు, ప్రతిష్ఠలను అత్యంత అవమానంపాలు చేసింది.

            మనదేశంలో మొదటి కరోనా కేసు జనవరి నెలలోనే కనిపించినా, ఫిబ్రవరి మొదటి భాగంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినా ట్రంపుతో ఆలింగనల కార్యక్రమాన్ని ఆర్భాటంగా మోడీ నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రేసు ప్రభుత్వాన్ని కూలగొట్టి తమ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పటానికి పాలకులకు కరోనా అడ్డురాలేదు. కేంద్ర ప్రభుత్వం  కరోనాను ఎదుర్కోవటంలో ఎంత ఆలస్యమూ, నిర్లక్ష్యమూ వహించిందో, ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ సమావేశానికి వెళ్ళిన ముస్లిం యాత్రికులే కరోనా వ్యాప్తికి కారణమని ప్రచారం చేయటంలో అంత  చురుకుగా వ్యవహరించింది. విదేశాలలో వుంటున్న భారతీయులను ప్రత్యేక విమానాలలో తీసుకువచ్చే ‘వందే భారత్‌’ కార్యక్రమం చేపట్టిన కేంద్ర పాలకులు, 14 కోట్ల వలస కార్మికుల జీవితాలను గాలిలోకి వదిలేశారు. ఈ వలస కార్మికులలో అత్యధికులు ఆదివాసీలు, దళితులు, గ్రామాలలో బతుకులు కోల్పోయిన రైతు-కూలీలు! తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవటానికి అరక్షణం ఆలస్యం చేయకుండా చైనా సాకుని పదేపదే ప్రచారం  చేస్తున్న కేంద్ర పాలకులు సందట్లో సడేమియాలాగా వందేళ్ళుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలను హరించి వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో 8 గంటల పనిదినాల చట్టాలను 12 గంటలకు మార్పించారు. భాజపా – కాంగ్రెసులు రెండూ దొందూ దొందే నన్నట్లు ఆచరణలో రుజువు పరుచుకున్నాయి. రాజుగారి దేవతావస్త్రాలు లాంటి 20 లక్షల కోట్ల రూ. ప్యాకేజీ చాటున అనేక ప్రభుత్వరంగ సంస్థలను సంపన్న కార్పొరేట్‌వర్గాలకు ధారాదత్తం కావించే పలు చర్యలు చేపట్టారు. ప్రజలు బజారులోకొచ్చి సంఘటితంగా పోరాడే అవకాశాలు లేని స్థితిని తమ సామ్రాజ్యవాద యజమానుల సేవలకు, ఆదేశాల అమలుకు పూనుకున్నారు. తమ వ్యవస్థ సజావు నడవటానికి ఏర్పాటుచేసుకున్న కొన్ని సంస్థల స్వతంత్రతలను తమ నిరంకుశాధికారాలకు లోబర్చుకుంటూ వున్నారు. రాష్ట్రాలను ఉపగ్రహాలుగా, కేంద్రం గుమ్మం ముందు చిప్ప పట్టుకొని నిలబడే స్థితికి దిగజారుస్తున్నారు.

            ప్రజలను బిచ్చగాళ్ళ కింద వెట్టిచాకిరీ కూలీలుగా దిగజార్చటానికి మొత్తంగా భారత పాలకవర్గాలు తమ మోసపూరిత కళలనన్నిటినీ ప్రదర్శించటంలో ఆరితేరి వున్నారు.

            ఈ సందర్భంగా భారత వలస కార్మికుల దీక్ష పట్టుదల, కష్టనష్టాలను సహించి భరించి నిలువగలిగిన స్థైర్యమూ – ప్రజలు ఎంతటి త్యాగాలకయినా, నడిపిస్తే పోరాటాలకయినా తెగించగలరని, సాహసం ప్రదర్శించగలరని స్పష్టమైంది. వలస కార్మికుల గ్రామీణ అనుబంధం ఎంత గాఢమైనదో అర్ధమైంది. కార్మిక – కర్షక శ్రామిక సంబంధాల సజీవత్వాన్ని, బలాన్ని కరోనా రుజువుపర్చింది.

            శ్రామిక ఉద్యమశక్తుల చైతన్యవంతమైన సంఘటిత కృషి మాత్రమే పట్టణ, నగర జీవన బంధాల సాంఘిక, సాంస్కృతిక స్థాయిని ఉన్నతీకరించగలదు. గ్రామాల్లో బతుకులేని, పట్టణాల్లో చావలేని పరిస్థితులకు మూలమయిన అర్ధవలస – అర్ధఫ్యూడల్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు రానంతకాలమూ, శ్రమజీవులకు కాలు నిలదొక్కుకోలేని పరిస్థితులే మిగులుతాయి.

            నేటికీ మిగిలి ఉన్న గత సంబంధాల సజీవతను కార్మిక – కర్షక ఉద్యమ బంధాలుగా పెంపొందించి బలోపేతం చేయటం విప్లవ నిర్మాణ శక్తుల కర్తవ్యం.

            వలస కార్మిక ప్రజానీకంపట్ల పాలకవర్గాలు ప్రదర్శించిన నిర్లక్ష్యం అత్యంత హేయమైనది. ప్రపంచంలో మరే దేశంలో యింత అధమాధమ నిర్వహణను ఎవరూ ప్రదర్శించలేదు. అదే సమయంలో మనదేశంలో సాటి మానవులపట్ల చేయూతనందించే ఉత్తమ సంస్కారవంతులు కూడా తగినంతమంది వున్నారని తెలియవచ్చింది.

            ప్రభుత్వరంగ వైద్యసేవలను నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేటు వ్యాపార వైద్యానికి చేయూతనిస్తున్న పాలకుల  ప్రజావ్యతిరేక స్వభావం తేటతెల్లమయింది. అంతేకాకుండా బడా కార్పొరేట్ల దోపిడీ నిలయాలుగా వైద్యరంగాన్ని తయారుచేసిన పెట్టుబడిదారీ ప్రపంచ మార్కెట్టుశక్తుల ప్రజావ్యతిరేక తత్త్వాన్ని కరోనా బహిర్గతపరిచింది. సామ్యవాదమే ప్రత్యామ్నాయమని రుజువు పరిచింది.

            పాలకుల సమస్త ప్రజావ్యతిరేక విధానాలు, చర్యలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజలను చైతన్యపరచటం సాహిత్యకారుల కర్తవ్యం కావాలి.

ముసుగు లేని అగ్రరాజ్య ప్రతినిధి ట్రంపు!!

            ట్రంపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇప్పటికి దాదాపు 19 లక్షలమంది అమెరికనులు కరోనా వ్యాధిగ్రస్తులై, ఒక లక్షమందికిపైగా ప్రాణాలు కోల్పోయి ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ప్రజలకు జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి ట్రంపు అదే పనిగా చైనాను ఆడిపోసుకుంటున్నాడు. చైనాను ఏకాకిని చేసే వ్యూహంలో భాగంగా భారత్‌ను ‘జి-7 దేశాల సమావేశానికి ఆహ్వానించటం అందులో భాగమే’. సామ్రాజ్యవాద ప్రపంచీకరణను (గ్లోబలైజేషన్‌) ప్రపంచంపై రుద్దిన అమెరికా సామ్రాజ్యవాదం, దాని పోటీలో తట్టుకోలేక తామొకనాడు నిర్దేశించిన ‘వాణిజ్య – పెట్టుబడుల’ స్వేచ్ఛా వ్యాపారానికి తానే గేట్లు మూసుకుంటోంది. కరోనా వ్యాప్తితో దాని సామాజిక ఫలాలను, తను తిరిగి ఎన్నిక కావటానికి (మరొక 5 నెలల్లో ఎన్నికలున్నాయి) వినియోగించుకోవటమెలా అని ట్రంపు మధనపడిపోతున్నాడు. అమెరికాలోని కరోనా పీడితులలో నల్లజాతివారు ఎక్కువ. ఇంతలో జార్జి ఫ్లాయిడ్‌ను శ్వేతజాత్యహంకార పోలీసు క్రూరంగా హతమార్చటంతో అమెరికా దేశమంతా భగ్గుమన్నది. 140 నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. 40 నగరాలలో కర్ఫ్యూ విధించినా శ్వేతసౌధంపై దాడిదాకా నిరసన విస్తృతమయింది. కొనసాగుతున్న వర్ణ వివక్ష తీవ్రత పట్ల నల్లజాతుల ప్రజలు ఎంత ఆగ్రహంతో రగిలిపోతున్నారో ఈ సంఘటన బహిర్గతపరిచింది. అమెరికా ప్రజాస్వామ్యపు డొల్లతనాన్ని ఈ సంఘటన కళ్ళకు కట్టించింది. తిరిగి ఈ సంఘటనను, శ్వేత జాత్యహంకారానికి వాడుకుని తన ఎన్నికల గెలుపు పథకానికి మెట్లు వేసుకుంటున్న ట్రంపు ముసుగులేని అగ్రరాజ్య ప్రతినిధిగా రుజువు పరుచుకుంటున్నాడు. దోపిడీ, పీడనా, అణచివేతా, వివక్షా కొనసాగుతున్నంతకాలం వాటికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తారని తేలిపోయింది. అమెరికాలోని నల్లజాతీయులు, వారితో కలిసి సాగిన అన్ని వర్గాల శ్రామిక, ప్రజాస్వామిక శక్తులూ ప్రపంచస్థాయి సంఫీుభావం ప్రదర్శించి మరొకసారి చరిత్రను తిరగరాశారు.

            కరోనా అనంతర ప్రపంచంపై ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న దురహంకారపూరిత ప్రయత్నాలు ప్రపంచ ప్రజానీకానికి మరో విపత్తుని కొనితేనున్నాయి.

            ప్రపంచ పోలీసుగా అగ్రరాజ్యాధిపత్యాన్ని చెలాయిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం కరోనా సంక్షోభాన్నీ, తన ఆంతరంగిక జాత్యహంకార తత్వానికి వ్యతిరేకమైన ప్రతిఘటననూ చవిచూసి మరొకసారి తన నైతిక బలాన్ని కోల్పోయింది. అలాంటి అమెరికా సామ్రాజ్యవాదంతో భారత పాలకులు అంటకాగటం సిగ్గుచేటు!!

చివరాఖరు :

            భారత పాకిస్తాను పాలకులు ఆయుధాల పోటీలో పడి, తమ ప్రజలకు వైద్య సౌకర్యాలను కల్పించటంలో విఫలమవుతున్నారు. కనుక ఉపఖండంలో ఆయుధ పోటీకి వ్యతిరేకంగా ప్రజానీకం ఉమ్మడిగా ఉద్యమించాలి. అలాగే ప్రపంచ అగ్రరాజ్యాలు తమ మిలిటరీ బడ్జెట్లకూ, యుద్ధోన్మాద ప్రయత్నాలకూ దేశ సంపదలను వినియోగించటానికి వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికై ప్రజలు గొంతెత్తాలి. వైద్య, విద్యా, ఉపాధిరంగాలకు బడ్జెట్ల కేటాయింపులు బాగా పెంచాలని డిమాండు చేయాలి.

2-6-2020                                                                           – దివికుమార్‌

admin

leave a comment

Create Account



Log In Your Account