ఉదయం చూస్తే మంచు! మధ్యాహ్నం వరకు వడగాడ్పులు! అంతలోనే సాయంత్రం దట్టంగా కమ్ముకున్న మబ్బులు – ఉరుములు – మెరుపులు – బోరున వర్షం!! రాత్రి గడగడలాడించే చలి!!!
ఒక ఏడాది కాలంలో రావాల్సిన మూడు కాలాలూ ఒక్క రోజులోనే – కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే! రుతువుల్ని ధ్వంసం చేస్తుంది ఎవరు? ప్రకృతి నియమాలను చిందరవందర చేసిందెవరు? ఎక్కడెక్కడో వైరస్‌లను తట్టి లేపుతుంది ఎవరు? పర్యావరణ విధ్వంసం ఎవరి ఖాతాలో జమ చేయాలి? ఇది పెట్టుబడిదారీ స్వలాభాపేక్ష సృష్టిస్తున్న కల్లోలం కాదా?
ఒకానొక కాలంలో ప్లేగు, ఆ తరువాత కలరా, ఆపైన స్పానిష్ ఫ్లూ, సార్స్, ఎబోలా ఇలా ఎన్నెన్నో అదుపుచేయలేనివాటిని జయించి మనిషి మనుగడ సాగిస్తున్నాడు. వేల వేల సంవత్సరాల మానవ నాగరికతనీ, సంస్కృతినీ, ప్రజారోగ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న ఆర్థిక రాజకీయ విధానాల్నీ, ఈరోజు కరోనా బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తోంది. మానవ సామాజిక జీవన వ్యవస్థలన్నింటిని దుంప నాశనం చేస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలకు పర్యవసానంగా కరోనా విజృంభిస్తుంది.
ఈ భూగోళాన్ని తొమ్మిదిసార్లు ధ్వంసం చేయగల ఆయుధ సామాగ్రి ప్రపంచ దేశాల వద్ద ఉన్నాయి కానీ, బతికించడానికి ఉపయోగపడే వెంటిలేటర్లు మాత్రం సరిపడా లేవు. పెద్ద పెద్ద ఐరోపా దేశాలే, అమెరికాతో సహా ఈ కరోనాను అదుపు చేయడానికి తగినంత వైద్య సౌకర్యాలు అందించలేక చతికిల పడ్డాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని పెట్టుబడిదారీవర్గాలు తమ లాభాపేక్షకు ఉపయోగించుకుంటూ ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నఫలితమే ఈ రోజు కరోనా ముందు నిస్సహాయులమవటం. ప్రజా వైద్యరంగం పట్ల నిబద్ధత కలిగిన క్యూబా లాంటి సోషలిస్టు దేశాలు మాత్రం ఈ కల్లోల పరిస్థితుల్లో ప్రపంచానికి చుక్కానిగా నిలబడుతున్నాయి.
ముప్పై ఆరు కోట్లుగా ఉన్న అమెరికా జనాభాలో 4.4 కోట్ల అమెరికా ప్రజలకు ఆరోగ్య భీమా లేదు. వైద్య ఆరోగ్యరంగాలు ప్రభుత్వ రంగంలో ఉన్న దేశాల్లోనే ప్రజలకు తగిన వైద్య సహాయం అందుతోంది. క్యూబా, చైనా, ఉత్తర కొరియా ఇంకా మరికొన్ని మధ్య ఆసియా దేశాలు కరోనాను ఎందుకు నిలువరించ కలిగాయో కళ్ళు తెరుచుకునేలా కోవిడ్ 19 చేసింది. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ అనే నినాదాలతో ముందుకు దూసుకుపోతున్న అభివృద్ధి నమూనా మొత్తం కుదేలైంది. సరిదిద్దుకోవడానికి, కనీసం ఆత్మవిమర్శ చేసుకోవడానికి నేటి సంక్షోభ పరిస్థితులు అవకాశం ఇవ్వటం లేదు.
ఇదే సందర్భంలో ఒక విషయం తప్పక గుర్తుకు వస్తుంది. హిరోషిమా, నాగసాకిల మీద అణ్వాయుధాలను, వియత్నాం మీద జీవ రసాయన ఆయుధాలను తొలిసారిగా ప్రయోగించింది అమెరికాయే. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను ‘‘చైనా వైరస్’’ అని ప్రచారం చేస్తూ, ప్రపంచపు అతిపెద్ద పోలీసుగా అమెరికా అధ్యక్షుడు క్రిమిసంహారక మందుల్ని సెలైన్ ద్వారా ఎక్కిస్తే కరోనా వైరస్ చస్తుందని అంటున్నాడు. ఇది అజ్ఞానమా? అహంకారమా? మరోపక్క చైనా ప్రపంచదేశాలను పుట్టి ముంచిందని, అంతర్జాతీయ కోర్టులో ఒక వ్యాజ్యమూ నమోదయింది.
ప్రపంచానికి ఆధ్యాత్మిక మోక్షానికి యోగా ద్వారా దారి చూపిస్తున్నాం అని జబ్బలు చరుచుకున్న భారతదేశ పాలనలో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. భారత్‌లో కరోనా వ్యాప్తి చాప కింద నీరులా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే వుంది. అమెరికా ప్రభుత్వం కరోనాకు కేటాయించిన నిధి లక్ష కోట్ల డాలర్లు. అంటే, 75 లక్షల కోట్ల రూపాయలు. భారతదేశ బడ్జెట్‌కి ఇది రెండు రెట్లు ఎక్కువ. మనదేశంలో ప్రజా వైద్యాన్ని సామ్రాజ్యవాద ద్రవ్య సంస్థల ఆదేశాలతో ఇంచుమించు ప్రైవేటీకరణ చేశారు. ఇప్పుడు ఆ స్టార్ హాస్పిటళ్ళలో కరోనాకు వైద్యం నిషేధం. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పగలనక రాత్రనక తిండి లేక నిద్ర లేక విశ్రాంతి లేక కనీస భద్రత లేని వాస్తవాన్ని ప్రశ్నిస్తే, అరెస్టులు, లాఠీలూ, అవమానాలు…. ఈ దారుణ పరిస్థితుల్లోనే సర్కారీ వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి ముందు వరుసలో ఎదురు నిలబడి శాయశక్తులా కరోనాతో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇక్కడే మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. భారతదేశంలో కరోనా మరణాల రేటును పరిశీలిస్తే, 0.7%తో కేరళ సమర్థవంతంగా పని చేస్తోంది. అదే గుజరాత్ తీసుకుంటే కరోనా మరణాల రేటులో 6.1 శాతంతో కనిపిస్తోంది. కేరళ ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల వలస కూలీల పట్ల అనుసరించిన విధానాలని మిగతా రాష్ట్రాలు అమలుపరచలేదు.
స్వచ్ఛభారత్ అని ప్రతిష్టాత్మకంగా పరిశుభ్రత గురించి దేశవ్యాప్తంగా ఫోటో ప్రచారాలు చేసుకున్న ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి పారిశుద్ధ్య కార్మికులను అవుట్సోర్సింగ్‌గా, ఒప్పంద పద్ధతిపై అరకొర జీతాలతో నోటితో పొగిడి నొసటితో వెక్కిరిస్తున్నారు. అరకొర జీతగాళ్ళయిన పారిశుద్ధ్య కార్మికులు ఈ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రాత్రి పగలు కష్టపడుతున్నారు. వారిని పొగుడుతూ మీడియాలో వారిపై నాలుగు పాటలు అల్లి, కనీస భద్రత కూడా కల్పించకుండా చేతులు దులుపుకుంటున్నారు.
మరోపక్క లాక్ డౌనే అంతిమ పరిష్కారంగా బాల్కనీ ప్రజలకు ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చారు. సామూహిక కరతాళ ధ్వనులు, గంటా వాయిద్యాలు, కరెంటు దీపాలు ఆపేసి చేతి దీపాలు వెలిగించడం, మహాయాగాలు చేయడం, యోగా చేయడం, అప్పటికి వినకపోతే లాఠీలకు పని చెప్పడం అనే గోసాయి చిట్కాలతో, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటమే అంతిమ పరిష్కారంగా చాటిచెబుతున్నారు.
20 లక్షల కోట్ల సహాయం అనే రాజకీయ బూటకం నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు సామాజిక సంపదలను ధారపోస్తున్న నగ్న సత్యాన్ని శ్రామిక ప్రపంచం నెత్తుటి పాదాల సాక్షిగా గమనిస్తున్నాం. పాలకవర్గాలు మాధ్యమాల ద్వారా పనిగట్టుకుని మభ్యపెడుతూ, నంగి నంగి మాటలతో, తప్పుడు లెక్కలతో, తేనె పూసిన కత్తులతో, మధ్య తరగతి సగటు బతుకుల్ని ఎల్లకాలం మోసం చేయలేవు.
దేవాలయాలు, చర్చిలు, మసీదులు మూసుకు పోయాయి. పౌరోహిత్య కార్యక్రమాలు బంద్ అయ్యాయి. ప్రధాన మీడియా కరోనా రోగుల లెక్కలు చెప్పటానికే పరిమితమయింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, దాని మూలాలు ఎక్కడున్నాయో, దీని నుంచి ఎలా బయటపడాలో ఈ కీలక చర్చనంతటినీ పనిగట్టుకుని పాలకులు పక్కతోవ పట్టిస్తున్నారు. చిట్కాలు, ఆరోగ్యసూత్రాలు, కాలక్షేప కార్యకలాపాలు ఎలా నిర్వహించాలో చెప్పటంపై ఎలక్ట్రానిక్ మీడియా తలమునకలై ఉంది.
వలస పక్షులుగా, పని వెతుక్కుంటూ వెళ్ళిన గ్రామీణ బడుగు జీవితాలు పిల్లాపాపలతో వందల మైళ్లు కాళ్లు అరిగేలా నడుచుకుంటూ స్వగ్రామాలకు తిరిగి వెళుతున్నా, ఇవి ఏవీ పట్టని ప్రభుత్వ విధానాలు దేశాన్ని రెండు భారతదేశాలుగా విడగొడుతోంది. పేదవారికో నీతి, ఉన్నవాళ్లకో నీతి. అసలు భౌతిక దూరం’’ అనకుండా ‘‘సామాజిక దూరం’’ అంటూ ప్రజల మధ్య వైరుధ్యాల్ని, వివక్షలను పనిగట్టుకుని పెంచి పోషిస్తున్నాయి.
ఈ సందర్భంలోనే ఎకనామిక్ టైమ్స్ పత్రిక చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకుందాం.
‘‘భారత్‌లో వలస కూలీల శ్రమ చౌక / వలస కూలీల ప్రాణాలు కారుచౌక / అని కరోనా వైరస్ ప్రపంచానికి చాటింది.
ఈ కరోనా కల్లోంలోనే భారతదేశంలోని 59 మంది అత్యంత ధనవంతుల దయనీయమైన కష్టాలు చూడలేక మోడీ ప్రభుత్వం వారి 69 వేల కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేసింది.. అంతటితో ఆగక గుత్త పెట్టుబడిదారులకు 1.45 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలను ఉదారంగా కల్పించారు. అంతే ఉదారంగా విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన సంఘటన సందర్భంలో లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంగించారని గ్యాస్ బాధితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపమని కేసు పెట్టారు పోలీసులు. అది సరైంది కాదని, వ్యక్తిగత పూచీకత్తు మీద స్టేషన్ బెయిలు ఇచ్చి పంపమని హైకోర్టు ఆదేశించింది. ఇదే సందర్భంలోనే వలస కార్మికులను నడవకుండా ఎలా ఆపుతామని, సొంత ఊళ్లకు నడిచి వెళ్లాలి అనుకునేవాళ్ళను ఆపగలమా అని, వాళ్లను పర్యవేక్షించలేం అనీ సుప్రీంకోర్టు పెదవి విరిచింది.
అనుభవించేవాళ్ల ప్రపంచంలో అమర్చి పెట్టేవాళ్ళ జనాభాకి పట్టణాల్లోని పేదల వాడలే ఆలవాలమయ్యాయి. వీరు పని లేక, తిండి లేక, ఉండటానికి నీడ లేక సొంత గ్రామాలకు కాలి బాట పట్టారు. గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో, కాళ్లు పుళ్ళయి, కన్నతల్లి లాంటి సొంత ఊరిని చేరుకునే లోపునే అలసి రాలిపోతున్న అనాధ బాలలకు, ముసలి ముతక జనాలకు, దిక్కుమొక్కులేని మహిళలకు జనతా కర్ఫ్యూ శాపంగా మారింది. నెలరోజులపాటు వలస కార్మికుల పాదయాత్ర సాగుతున్నా పాలకులకు పట్టింపులేదు. కానీ విదేశాలలో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చారు. సామ్రాజ్యవాద దోపిడీ ఆధిపత్య విధానాలే పేద దేశాల ప్రజల మరణాలకు కారణం అని ఈ కరోనా కాలం అర్థం చేయించింది. భారత ప్రజారోగ్య వ్యవస్థ దుస్థితిని కరోనా బట్టబయలు చేసింది.
సాహిత్యం, అందులోనూ ప్రజాసాహిత్యం – ప్రజల నుండి ప్రజలకు అనే శాస్త్రీయ గతితార్కిక దృక్పథంతో కృషిచేయాలి. నెత్తుటి పాదాల ముఖచిత్రంతో శ్రామిక భారత మరో ప్రపంచం మనం కోరుకునే మార్పు దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసమా? లేదా, దోపిడిలో భాగస్వామ్యం కోసమా? తెలుసుకోమని ప్రశ్నిస్తోంది.
30.04.2020