ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాధ్యమం చదువుల రద్దు !

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాధ్యమం చదువుల రద్దు !

‘‘తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే, దూడ మేత కోసం’’ అని వెనుకటికొకరు జవాబు చెప్పారట! తెలుగు మాధ్యమం రద్దు దేనికి అంటే ‘‘ప్రభుత్వ బడులలో చదివే బడుగుందర్నీ డాక్టర్లుగా, ఐ.ఎ.ఎస్‌. అధికార్లుగా చేయటానికి’’ – ఇదీ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ జవాబు. ఈ సందర్భంలోని ఒక మోసపూరిత మెలిక ఏమిటంటే, తెలుగు మాధ్యమం రద్దు అనేది వినపడనీయకుండా చదువులన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే అనటం! నిజానికి యిప్పటికే ప్రభుత్వ బడులన్నీ ఆంగ్లం – తెలుగు రెండు మాధ్యమాలలో సాగుతున్నాయి. ఇక నుండి ఆంగ్ల మాధ్యమంలో చదువులు అంటే, అదేమీ కొత్తగా ప్రవేశపెడుతున్నది కాదు. కానీ ఆంగ్ల మాధ్యమంలో మాత్రమేనని ప్రభుత్వం చెప్పేదాని సారాంశమేమిటి? పాత ఆంగ్ల మాధ్యమం కొనసాగుతుంది, కొత్తగా తెలుగు మాధ్యమం ఇక వుండదు అనే కదా! సారాంశంలో ప్రభుత్వ బడులలో సాగుతున్న తెలుగు మాధ్యమాన్ని రద్దుపర్చటమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం! ఈ  ప్రభుత్వానికి నిజాలు మాట్లాడే ‘ఉక్కు సంకల్పం’ మాత్రం లేదు!!

      మాతృభాషా మాధ్యమంలో చదువులు రద్దు అనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం భారత రాజ్యాంగం ప్రకారం చెల్లదు. ఇటీవల కస్తూరి రంగన్‌ కమిటీ సూచించిన, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ‘విద్యాహక్కు చట్టం’ ప్రకారం కనీసం 8వ తరగతిదాకా బాలబాలికలకు మాతృభాషా మాధ్యమాలలోనే బోధించాలి. ఐక్యరాజ్యసమితి (యునెస్కో) గత అనేక దశాబ్దాలుగా ఘోషిస్తున్న ‘తల్లిభాషలలోనే చదువులు’ ప్రకారం దీనికి అంతర్జాతీయ ఆమోదం లభించదు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మాతృభాషా మాధ్యమంలో చదువులు రద్దుపరిచిన సిగ్గులేని పాలకులు ఎవరూ లేరు.  ప్రపంచస్థాయి భాషాశాస్త్రజ్ఞులు,  మనోవైజ్ఞానికులు, విద్యావేత్తలు ఎవ్వరూ దీనిని హర్షించరు. ఎందుకంటే భాషాబోధనా శాస్త్ర ప్రక్రియకే యిది విరుద్ధమయినది కనుక!!

మరి జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఎందుకిలాంటి తల్లకిందుల నిర్ణయానికి పూనుకుంది? నిజంగా తెలుగు మాధ్యమంలో చదువులు రద్దు సాధ్యపడుతుందనేనా? లేక ప్రజలలో ఇప్పటిదాకా గూడుకట్టుకుని వున్న వాస్తవమైన అసంతృప్తులకు అసాధ్యమైన పరిష్కారాలతో బడుగులను ఆకట్టుకునే చౌకబారు ప్రయత్నమా? ఆంగ్ల మాధ్యమంలో చదువులు సాగుతూ వుండగానే, ఆంగ్లమాధ్యమంలో చదువులకు సమ్మతిని తెలుసుకోవలసిన పని యేముంది? రద్దు అవుతున్నది తెలుగు కదా! తెలుగు మాధ్యమంలో చదువుల రద్దుపట్ల అభిప్రాయ సేకరణ జరిపి వుంటే ప్రభుత్వం కొంతలో కొంత నిజాయితీని ప్రదర్శించిందనుకోవచ్చు. దీనిని కప్పిపుచ్చటం ఖచ్చితంగా మోసపూరిత చర్య!!

‘‘వాస్తవ సమస్యలు – తప్పుడు పరిష్కారాలు’’ అన్నది పాలకవర్గ సంస్కృతి. అది జగన్మోహనరెడ్డి, నరేంద్రమోడీల ప్రభుత్వాలే కాదు – ట్రంపుదాకా అదే తంతు! ప్రభుత్వ బడులలో గత 12 సంవత్సరాలుగా అమలు జరుగుతున్న ఆంగ్ల మాధ్యమం చదువుల వల్ల ఎంతమంది ఐ.ఎ.ఎస్‌.లు, డాక్టర్లు అయిపోయారు? నిజంగానే అందరూ డాక్టర్లు, ఐ.ఎ.ఎస్‌.లూ అవుతారని అనుకుందాం. వారిని ఇముడ్చుకోగలిగిన వ్యవస్థ వుందా?

నిరుద్యోగ సమస్యకు వ్యవసాయ, పారిశ్రామికరంగాలు చిక్కుకొని వున్న సంక్షోభం కారణమైతే, దానికీ చదువు మాధ్యమానికీ ముడిపెట్టి మాట్లాడటం పచ్చిమోసం! ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకున్నవారిలో అత్యధికులు రోడ్లవెంట బలాదూరు తిరగాల్సిన దుస్థితి. వారిలో అత్యధికులు ఆంగ్లంలో పట్టుమని పది వాక్యాలు తప్పులు లేకుండా రాయలేరు. దానికి కారణం ప్రైవేటు బడులతో సహా విద్యావిధానంలో నెలకొన్న మార్కుల,  బట్టీయం చదువులు!! రోగమొకటీ, మందు యింకొకటీ అంటే యిదే!!

మళ్ళీ విషయానికి  వస్తే…. రాష్ట్ర ప్రభుత్వపు మాతృభాషా మాధ్యమం రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు చెల్లదని, చట్టవిరుద్ధమని కొట్టివేసింది. ఆశ్చర్యం! ప్రభుత్వం యిసుమంత కూడా సిగ్గుపడలేదు! పొరపాటును దిద్దుకుంటాననకపోగా సుప్రీంకోర్టుదాకా కేసును తీసుకుపోదలచుకుంది!!

ఒక్క మాతృభాషామాధ్యమం రద్దు జి.వో.నే కాదు, పంచాయితీ, ప్రభుత్వ కార్యాలయాలకు తమ పార్టీ రంగులు వేయించటమే కాదు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ను ఏకపక్షంగా ఒక్క కలం పోటుతో తొలగించటమే కాదు మొత్తం 52 వారాల పరిపాలనలో హైకోర్టు ద్వారా 65 అభిశంసనలు పొందిన మహా ఘనత వహించిన మరో ప్రభుత్వమేదీ వుండదేమో!! మన తెలుగును రక్షించుకోవటానికి ఈ క్రింది డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి! రోజురోజుకీ ఆర్థిక – రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న నేటి సామాజిక వ్యవస్థను, దానికి ప్రజాస్వామ్యమని  పేరు పెట్టుకున్నప్పటికీ, నిరంకుశ పద్ధతులలో తప్ప దానిపై అధికారాలను నిలబెట్టుకోలేని పరిస్థితులు దాపురించాయి. మన అర్థవలస – అర్థఫ్యూడల్‌ వ్యవస్థకుండే లక్షణంగా దీన్ని అర్థం చేసుకోవాలి. రాజకీయ వ్యవస్థకు మిగిలిన వ్యవస్థలన్నీ లోబడే విధంగా లొంగదీసుకోగలవారినే అవి నిలదొక్కుకోనిస్తాయి. సర్వసాధారణ అవినీతికర పద్ధతులన్నిటికీ రాజకీయ చతురతగా వాటిని చిత్రిస్తాయి. సాంప్రదాయక బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కూడా చేతగానితనం కిందకు మారుస్తాయి. కాలుష్యంతో సహజీవనానికి అలవాటు చేస్తున్నట్లుగా, అలనాటి బ్రిటీషు పాలకులకు కూడా సాధ్యం కాని మాతృభాషా మాధ్యమం రద్దుకి ప్రజామోదాన్ని కూడా పొందుతాయి! ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థలో నెలకొన్న అస్తవ్యస్తతలను సరిదిద్దటానికి పూనుకోవాలి. ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలి. నిరక్షరాస్యత నిర్మూలించాలి. ప్రజలభాషలో పరిపాలన అమలుచేయాలి. తల్లకిందుల పరాయి మాధ్యమం చదువుల ఆలోచనను విరమించుకోవాలి!! అందరికీ ఒకే విద్య (కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌) ప్రభుత్వమే అందించాలి.

admin

leave a comment

Create Account



Log In Your Account