గౌతం విద్యాసంస్థల అధినేత, విద్యావేత్త ఎన్. చౌదరిబాబు మూత్రపిండాల వ్యాధితో 5 ఆగస్టు 2020న విజయవాడలో మరణించారు. ఆయన గుంటూరుజిల్లా పాలపర్రులో 11 నవంబరు 1949న జన్మించారు.
చౌదరిబాబు విద్యార్థి దశ నుండీ మార్క్సిజాన్ని నమ్మారు. అసమాన సమాజం పోయినపుడే విద్యావ్యవస్థలోనూ మార్పులు వస్తాయని నమ్ముతూనే ఈ కార్పొరేట్ పోటీ ప్రపంచంలో నిలబడి తనదైన రీతిలో నర్సరీ నుండి పి.జి. వరకూ విద్యాసంస్థలను నెలకొల్పి నిర్వహించారు. తన స్వగ్రామమైన పాలపర్రులో హైస్కూలును దత్తత తీసుకున్నారు. పాలపర్రు గ్రామ చరిత్రను – అక్కడ జరిగిన రాజకీయ ఉద్యమాల చరిత్రను తెలియచేస్తూ గ్రంథాన్ని రచించారు. Students, Teacher, Educator, Parent (STEP) సంస్థను నెలకొల్పారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘానికి బాధ్యులుగా వుండేవారు. ‘ప్రజాసాహితి’కి ఆప్తులు. ప్రజాసంఘాలతో సన్నిహిత సంబంధాలుతో వుండేవారు. వితరణశీలి. చౌదరిబాబు మరణానికి ‘ప్రజాసాహితి’ సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తుంది.