అభ్యుదయ, నాస్తికోద్యమ భావవ్యాప్తిలో ఇంద్రజాల కళను జోడించి మూఢవిశ్వాసాలను పారద్రోలుతూ ప్రజల్ని చైతన్యపర్చటంలో అలుపెరుగని కృషిచేసిన ప్రొ॥ ఎన్. విక్రం కోవిడ్-19 వ్యాధితో హైదరాబాదులో 4-7-2020న మరణించారు. ఆయన 3-9-1947న రంగూన్‌లో జన్మించారు.
హిప్నాటిజం, ఇంద్రజాల కళలపట్ల అత్యంత ఉత్సాహం వున్న విక్రంకు భారత నాస్తిక సమాజంతో అనుబంధం ఏర్పడింది. ఆయన వృత్తి రీత్యా టెక్నికల్ ఉద్యోగి అయినా, సమాజాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు మానసికజాడ్యంగా రూపొందుతున్న విధానాలపైన నిరంతరం పోరాడారు. బాణామతి వంటి మూఢవిశ్వాసాలుతోపాటు బాబాలు, అమ్మలు, స్వాములు, చేసే మహత్యాలన్నీ ఇంద్రజాల విద్యేనని రుజువుచేస్తూ తెలుగు రాష్ట్రాలలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ అనేక ఇంద్రజాల ప్రదర్శనలిచ్చారు. నాస్తిక సమాజం నిర్వహించిన అధ్యయన తరగతుల్లో మేజిక్, హిప్నాటిజంలను నేర్పించేవారు. రోజుకొక్కడుగా పుట్టుకొస్తున్న స్వాములు, బాబాలు చేసే ‘గోతిలో పూడ్చిపెట్టినవారు బ్రతికి లేవటం’ వంటివి, ‘కళ్ళకు గంతలు కట్టుకుని బైక్ నడపటం’, ‘సైకిక్ సర్జరీ’, ‘మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్’ వంటి అభూత భావనల్ని తుత్తునియలు చేస్తూ వాటి నిజనిజాలను బహిర్గతపరచేవారు.
విక్రం తను నమ్మిన భావజాలాన్ని ప్రచారం చేయటంలో రచయితగా కూడా ప్రసిద్ధులు. పారాసైకాలజీ అశాస్త్రీయతను తెలియచేస్తూ అనేక రచనలు చేశారు. విక్రంతోపాటు ఆయన కుటుంబసభ్యులూ భావజాల వ్యాప్తిలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం మానవ వికాస వేదిక కేంద్రకమిటీ ఉపాధ్యక్షులుగానూ, జనవిజ్ఞానవేదిక జాతీయ ఉపాధ్యక్షులుగానూ పనిచేస్తున్న నిబద్ధత గల ఉద్యమకారుడు విక్రంకు జనసాహితి సంతాపం ప్రకటిస్తోంది. ఆ సంస్థలకూ, వారి కుటుంబ సభ్యులకూ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూంది.