స్వామి అగ్నివేశ్ ఆర్యసమాజం ఆశయాలను కొనసాగిస్తూ ‘ఆర్యసభ’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేశారు. హర్యానా రాష్ట్రం నుండి కాబినెట్ మినిష్టర్‌గా ఎన్నికయ్యారు. విద్యాశాఖమంత్రిగా పనిచేశారు. ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం కృషిచేసిన ఆయన 11-9-2020న ఢిల్లీలో కాలేయ వ్యాధితో మరణించారు. అగ్నివేశ్ 21-9-1939న శ్రీకాకుళంలో జన్మించారు.
హిందూమతంలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ ఆర్యసమాజంలో చేరారు. ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమిస్తున్న అగ్నివేశ్‌ను 2008లో ఆర్యసమాజం బహిష్కరించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలలోని గనుల్లో సాగుతున్న వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించినవారిపై పోలీసులు కాల్పులు జరుపగా – పోలీసులపై హర్యానా ప్రభుత్వం చర్య తీసుకోనందున వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమకారులకు అండగా నిలబడుతూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. హర్యానా ప్రభుత్వం ఆయనను సంవత్సరకాలం పైగా జైలులో పెట్టింది. రాజస్థాన్ రాష్ట్రంలో సాగుతున్న దురాచారం ‘సతీ సహగమనం’ రూపుమాపటానికి కృషిచేశారు. 1987లో ‘సతి’ చట్టం రూపొందింది. అలాగే భ్రూణ హత్యలకు వ్యతిరేకంగానూ, వలస చట్టాలను మార్చాలని, బంధువా ముక్తి మోర్చా ఉద్యమాన్నీ, బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా, నర్మదా బచావో ఆందోళనలోనూ, అవినీతిపై అన్నా హజారే నిర్వహించిన ఆందోళనలోనూ, మావోయిస్టులతో చర్చల కార్యక్రమంలోనూ, ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజధాని పేరుతో భూసేకరణకు వ్యతిరేకంగానూ అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు, నిర్వహించారు. దళితులు, ఆదివాసీలు, మహిళలు – పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడారు. హిందూ మతాచారాలను ప్రశ్నించినందుకు, మతతత్త్వాన్ని దుయ్యబట్టినందుకు హిందూ మతోన్మాదులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన వైద్య సహాయం తీసుకుంటూ మరణించారు.
స్వామి అగ్నివేశ్ మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తూంది.