జనసాహితి తూర్పుగోదావరి జిల్లా శాఖ కన్వీనర్ సయ్యద్ అహ్మద్ కరీం (65 సంవత్సరాలు) ఒక సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ 11 జూలై 2020న కాకినాడలో మరణించారు.
కాకినాడలో పుట్టి పెరిగిన ఆయనపై అప్పటికే ఆ పరిసర ప్రాంతాలలో ప్రసరించివున్న ఇస్లాంలోని సూఫీ అభ్యుదయ ప్రభావం వుండేది. విద్యార్థి దశ నుండే 1974-75 మధ్యకాలంలో డాక్టర్ పి.జస్వంత్‌రావు, కోమలి సూర్యారావు, డాక్టర్ పట్టాభిరామయ్య, వై.ఎన్.వి.వి. సత్యనారాయణ (కొండ), కుదరవల్లి రఘురామయ్య తదితరులతో కలసి కాకినాడలో యువ సాహిత్య సాంస్కృతిక సంస్థ (Y.L.C.O.) కార్యకలాపాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ పురోగామి, ప్రజాతంత్ర భావాలవైపుగా కృషి మొదలుపెట్టారు. ఆనాటి ‘జీవనాడి’ పత్రికను యువజనులకు అందేలా చేసేవారు. ‘కరువు కథ’ నాటక ప్రదర్శనలో చురుకుగా వుండేవారు. కోమలి సూర్యారావుతో కలిసి ఆత్రేయ రచించిన ‘పరివర్తన’ నాటకంలో ‘దాసు’ పాత్రలో బాగా రాణించారు. అత్యవసర పరిస్థితి కాలంలో విప్లవ కార్యకలాపాలకు సహకరించారు.
ఎమర్జెన్సీ అనంతర కాలంలో భారతీయ రైల్వే శాఖలో ఉద్యోగం పొంది తొలి కాలంలో గుంటూరులో పని చేశారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే కళాకారుడుగా, రంగస్థల నటుడిగా విస్తృతమైన కృషి సాగించారు. అనేక ప్రసిద్ధ పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలూ నాటికలలో వివిధ పాత్రలలో నటించారు. కళలకు కాణాచి అయిన కాకినాడలో కళారంగంలో కరీమ్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జనసాహితి – అరుణోదయలు రూపొందించిన ‘అప్పుల భారతం’ వీధి భాగవతంలో సామ్రాజ్యవాది ‘బుష్’ పాత్రను నటిస్తూ కొన్ని ప్రదర్శనలలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని చిందువాడ జిల్లా ‘గుడి- అంబాడా’ ప్రాంతంలోని బొగ్గు గని కార్మికుల నడుమ ‘అప్పుల భారతం’ వీధిభాగవతం (హిందీ) ప్రదర్శనలో నటించారు.
గోర్కీ అమ్మ నవలను నాటకంగా మలచిన సౌవిక్ సాంస్కృతిక చక్ర, కలకత్తా వారిచే జనసాహితి ఆధ్వర్యంలో విజయవాడ, విశాఖపట్నంలో జరిగిన ప్రదర్శనలలో (2017-18) ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా కాకినాడలో ఉండే కవులు, కళాకారులు, ప్రగతిశీలురందర్నీ ఆ సభలకు ఆహ్వానించారు. తన మిత్రులు అనేక మందితో ప్రజాసాహితి పత్రిక చందాలు కట్టించేవారు. కాకినాడ సెజ్జుకు వ్యతిరేకంగానూ (2011), కొండమొదలు ఆదివాసీల పునరావాస ఉద్యమంలోనూ రైతు-కూలీ సంఘానికి సహకార సంఫీుభావాలు అందించారు.
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూనే, యన్.ఆర్.సి. – సి.ఏ.ఏ. వ్యతిరేక ఆందోళనలలో కాకినాడ బాలాజీ చెరువు కూడలిలో షహీన్ బాగ్ తరహాలో సాగిన ఆందోళనోద్యమంలో కరీం పాల్గొనేవారు.
ప్రజాకళాకారుడు కరీంకు జనసాహితి జోహార్లు చెబుతూంది. వారి కుటుంబసభ్యుల బాధలో పాలుపంచుకుంటుంది.