ఉద్యమశీలి బి. పాండురంగారెడ్డికి జోహార్లు

ఉద్యమశీలి బి. పాండురంగారెడ్డికి జోహార్లు

          ఏ.పి.టి.ఎఫ్‌.లోను, జనసాహితిలోనూ, రాయలసీమ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పనిచేసిన ఉపాధ్యాయుడు, రచయిత, ఉద్యమ కార్యకర్త బి. పాండురంగారెడ్డి తన 74వ ఏట ఆగస్టు 3, 2020న కరోనా వ్యాధితో మరణించారు. ఆయన నంద్యాల సమీపంలోని గోవిందపల్లెలో 1946లో జన్మించారు.

          పాండురంగారెడ్డి తిరుపతిలో విద్వాన్‌ చదివి 1968లో మొలగపల్లి గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. అప్పటి నుండి ఎ.పి.టి.ఎఫ్‌లో చురుకైన పాత్ర పోషించారు. ఏపిటిఎఫ్‌ బాధ్యతలతో పాటుగా 1992-2006 నడుమ ఉపాధ్యాయ పత్రిక సంపాదకవర్గ బాధ్యతలు నిర్వహించారు.

          ఆయన 1970లో విరసం సభ్యులుగా చేరారు. ‘సంకెళ్ళను తెంచుదాం’ అనే కవితా సంపుటిని ప్రచురించారు. 1975లో అనంతపురంలో జరిగిన విరసం 5వ రాష్ట్ర సభలలో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, కొత్తపల్లి రవిబాబు, చెరుకూరి సత్యంతో పాటు పాండురంగారెడ్డి కూడా విరసంకు రాజీనామా చేశారు. 1975లో ఏర్పడిన రాష్ట్ర జనసాహితి నిర్మాణ వర్గ సభ్యునిగానూ 1978 నుండి రాష్ట్రకమిటీ సభ్యునిగానూ వున్నారు. రాయలసీమ ఉద్యమ సంయుక్త కార్యాచరణ సమితిని రాచంరెడ్డి వెంకట్రాముడు నాయకత్వాన ఏర్పరచి, దానికి తాను కన్వీనర్‌గా వ్యవహరించారు. ‘సీమ సాహితి’ పత్రికకు సంపాదకునిగా ఉన్నారు. కొంతకాలం ఓ.పి.డి.ఆర్‌.లోనూ కొనసాగారు. సాయుధ ముఠాల వ్యతిరేక పోరాట కమిటీలో క్రియాశీలకంగా పనిచేశారు.

          కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పటికీ జనసాహితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరై చర్చలలో చురుకుగా పాల్గొని తన అభిప్రాయాలను సూటిగా సరళంగా చెప్పేవారు. ‘ప్రజాసాహితి’ పత్రిక అభివృద్ధి కోసం కృషిచేశారు.

          పాండురంగారెడ్డి అకాల మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేస్తూంది.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account