సంస్కృతికి సోకిన కరోనా అత్యంత ప్రమాదకరం!

సంస్కృతికి సోకిన కరోనా అత్యంత ప్రమాదకరం!

          ‘‘ఆడదై పుట్టటం కంటే అడవిలో మానై పుట్టటం మేలు’’ అన్న సామెత మధ్య యుగాలనాటిది.

          ‘‘గత కాలమే మేలు వచ్చు కాలము కంటెన్‌’’ అని నమ్మే భాజపా పాలకుల హయాంలో మహిళల బ్రతుకులు ఎలాంటి ఆటవికతకు బలవుతాయో, ఆగమాగమయి పోతాయో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలన మంచి ఉదాహరణ. ఆ రాష్ట్రం హాత్రాస్‌లో వాల్మీకి తెగకు చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై అగ్రకులాల యువకులు నలుగురు అత్యాచారం చేయటమే కాక, తమ పేర్లు బయట పెట్టకుండా చేయటానికి ఆమె నాలుకను తెగ్గోశారు. నిర్దాక్షిణ్యంగా ఆమె మెడ ఎముకనూ, వెన్నుపూసను విరిచేశారు. పశువుల మేత సేకరణ పనిలో తల్లికి కూత వేటు దూరాన పొలంలో వుండగా దుండగులు చున్నీతో నోరు నొక్కి ఈ దురాగతం చేశారు. 15 రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి సెప్టెంబరు 29న ఢిల్లీ సఫ్దర్జంగ్‌ ఆసుపత్రిలో ఆ యువతి కన్ను మూసింది. ప్రభుత్వ, పోలీసు యంత్రాంగపు నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. బాధితురాలిని బ్రతికించటానికి మంచి వైద్య సౌకర్యాలని కల్పించటానికంటే ఆమెపై అత్యాచారం జరగలేదని ప్రకటించటానికి అత్యుత్సాహ పడ్డారు. ఆమెకు జరుగుతున్న చికిత్సను గురించి తెలుసుకోవటానికి ఢిల్లీ ఆసుపత్రికెళ్లిన ‘ఆం – ఆద్మీ’ పార్టీ ఎం.ఎల్‌.ఏ.ను పోలీసులు కొట్టి బెదిరించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల అనుమతి లేకుండా, వారి సాంప్రదాయాలను ఏ మాత్రం గౌరవించకుండా, వత్తిడిచేసి, దౌర్జన్యంగా తెల్లవారుజామున (తెల్లవారితే 30వ తేదీ అనగా) ఆమె శవాన్ని గ్రామంలో దహనం చేసేశారు. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపుతున్నారు. యు.పి. పోలీసు యంత్రాంగం ఆరెస్సెస్‌ కార్యకర్తలు లాగా ప్రవర్తిస్తున్నారు.

          నేటి కరోనా.. మనుషుల కదలికలను, ప్రజా సమీకరణలను కట్టడి చేస్తే, ఆదిత్యనాథ్‌ పోలీసులు శాంతి భద్రతలను చీకటి మాటున కాపాడుతున్నారు. డా॥ కఫిల్‌ ఖాన్‌ లాంటి సేవాతత్పరత గల వైద్యునిపై తప్పుడు కేసులు బనాయించి ‘బెయిలు’ కూడా లభించకుండా జైళ్ళలో మగ్గేట్లు చేయగల ఫాసిస్టు కళలో యు.పి. పోలీసులు ఆరితేరారు. 2017లో ఉన్నావో గ్రామంలో ఉద్యోగార్ధం వచ్చిన ఒక మహిళపై భాజపా ఏం.ఎల్‌.ఏ. అత్యాచారం కావించిన కేసుపై ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరు లోక విదితమే! చట్టబద్ధ పరిపాలనలో నేరస్తులను శిక్షించవలసినది న్యాయస్థానాలు కాగా, తాము నేరస్తులనుకున్నవారిని ఎన్‌కౌంటర్లలో హతమార్చి, చట్టం కళ్ళకు తూటాల మాలను చుట్టబెట్టారు. కేవలం నిర్భయ లాంటి చట్టాలతో  మహిళలపై అత్యాచారాలు ఆగిపోతాయని భ్రమపెట్టినట్లే, తమ ప్రత్యర్ధి ముఠాలలోని కొందరిని తుడిచి పెట్టేసి నేరాలను అదుపు చేస్తున్నట్లు సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రగల్భాలు పోతున్నాడు. అవన్నీ కేవలం డాంబికాలేనని హత్రాస్‌ యువతిని దహనం చేసిన రోజే వెలువడిన ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో’ (జాతీయ నేరచిట్టా నమోదు కేంద్రం) ప్రకటించిన నేరాల వివరాలు చెపుతున్నాయి.

          గత సంవత్సర నేరాల చిట్టా ప్రకారం అత్యధికంగా ఎస్‌.సి., ఎస్‌.టి.లపై దాడులు జరుగుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశే! 2018వ సంవత్సరంలో ఎస్సీలపై 42,793 దాడులు దేశవ్యాపితంగా జరుగగా, 2019లో 45,935 జరిగాయని రిపోర్టు చెప్పింది. ఇది ఒక్క ఏడాదిలోనే 7.3% పెరిగినట్లుగా చూపిన నివేదిక, ఒక్క ఉత్తరప్రదేశంలోనే 11,793 (సుమారు 25%) దాడులతో మొదటి స్థానంలో వుందని చెప్పారు. (తర్వాత స్థానాలు రాజస్థాన్‌, బీహార్లవి.)

          2019వ  సంవత్సరంలో 554 మంది ఎస్సీ మహిళలపై రాజస్థాన్‌లో అత్యాచారాలు జరుగగా, ఉత్తరప్రదేశ్‌లో 537 మందిపై జరిగాయి. ఎస్టీలపై దాడులు గత సంవత్సరం 26.5% పెరిగాయి. (2018లో 6,528 నేరపూరిత జరుగగా 2019లో అవి 8,257కు పెరిగిపోయాయి.)

          ప్రధాని మోడీ ఇచ్చిన ‘‘బేటీ పఢావో- బేటీ బచావో’’ నినాదం యొక్క సోకు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ఎలా వుందో కూడా తెలుసుకుందాం. 2015వ సంవత్సరంలో దేశ వ్యాపితంగా ఎస్సీలపై జరిగిన నేరపూరిత దాడులు 38,670 కాగా, 2019లో 45,935. 2016లో ఎస్టీలపై జరిగినవి 6,568 అయితే 2019కి 8,257కి పెరిగాయి. మొత్తంగా మహిళలపై నేరపూరిత దాడులు 2018లో 3 లక్షల, 78 వేల, 236 జరిగాయనీ, అవి 2019కి 4 లక్షల, ఐదు వేల, 861కి పెరిగిపోయాయనీ ప్రకటించింది. (సరాసరిన నెలకు రెండు వేల దాడులు పెరిగినట్టు) ఇవన్నీ ప్రభుత్వం బయట పెట్టినవేనని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటికి మూలకారణంగా ధన మదమూ, అగ్రకుల ఆధిపత్యమూ, పితృస్వామిక దురహంకారమూ పనిచేస్తున్నాయనేది స్పష్టమే! ఇవన్నీ ఏ నాటినుండో సంక్షోభంలో కొట్టు మిట్టాడుతూ, గిడసబారి పోయిన, అభివృద్ధి నిరోధక భారత అర్థవలస – అర్థఫ్యూడల్‌ సమాజపు సాంస్కృతిక వ్యక్తీకరణలు. గత వ్యవస్థతో ఒక విప్లవాత్మక తెగదెంపులు లేనందువల్ల ఇంకా కొనసాగుతున్న, కరోనా కంటే ప్రమాదకరమయిన, మొండి వ్యాధులివి. వీటికి తోడుగా జతయినదే మతోన్మాద సంస్కృతి. బాబ్రీ మసీదును ఉన్మాద పూరితంగా వివాదగ్రస్తం చేసి దాని శిధిలాలపై నడుచుకుంటూ నేడు అధికారంలో పీఠమేసిన భాజపాలకుల ముఖ్యులెవ్వరూ మసీదు విధ్వంసంలో లేరని, నిర్దోషులని నిన్ననే (హత్రాస్‌ యువతిని దహనం చేసిన రోజు, నేరాల గణాంకాలు విడుదలయిన రోజు) సీబీఐ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇలాంటి తీర్పులు ఇవ్వటం మన న్యాయస్థానాలకు కొత్తకాదు. హంతకులు లేని హత్యాకాండగా చుండూరును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఒకనాడు ప్రకటించినట్లే, ఇపుడు ధ్వంసకులు లేని విధ్వంసకాండగా బాబ్రీని పరిగణించాలన్నమాట! సత్యమే  గెలిచిందని చిందులు తొక్కుతున్నవాళ్ళకు, సత్యాన్ని హత్య చేసిన రోజుగా సెప్టెంబరు 30ని ప్రపంచం గుర్తు పెట్టుకుంటుందని తెలియకపోవటం ఆశ్చర్యం! బాబ్రీ మసీదు విధ్వంసకాండ రహస్యంగా, అర్థరాత్రి జరగలేదు. నిండు కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరిగినట్లు, పట్టపగలు టీవీల ద్వారా ప్రపంచమంతా చూస్తుండగానే కూల్చివేత జరిగింది. దాన్నిపుడు తెలియని దుండగులెవరో ధ్వంసించినట్లుగా పరిగణించిన సీబీఐ కోర్టు, జరిగిన అన్యాయ పర్యవసానాలను, నష్టాన్ని సరిదిద్దాలి కదా! అంటే కూల్చి వేయబడిన చోటనే తిరిగి మసీదుని నిర్మించి ఇవ్వమని తీర్పు చెప్పి వుండాలి. దానికి బదులు సరియైన సాక్ష్యాధారాలను సమర్పించని పోలీసు నిర్లక్ష్యాన్ని అడ్డం పెట్టుకుని సీబీఐ కోర్టు అడ్డగోలు తీర్పునిచ్చేసింది.

          యాంటీ టెర్రరిస్టు దళం అధికారి హేమంత్‌ కర్కారేకి చావు శాపం పెట్టింది తానేనని బహిరంగంగా ప్రకటించిన భోపాల్‌ పార్లమెంటు సభ్యురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌, బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నందుకు తాను గర్విస్తున్నానని బహిరంగంగా చెప్పిన విషయం లోకమెరిగిన సత్యమే కదా! బాబ్రీ కూల్చివేత దుండగుల పనయితే ప్రజ్ఞాసింగ్‌ శిక్షార్హురాలే కదా! ఎలుకతో చెలగాటమాడుతూ, ‘‘అబ్బే! ఏంలేదు, ఆడుకుంటున్నానంతే!!’’ అని పిల్లి అన్నట్లుగా, గండు పిల్లుల్లాంటి నిర్దోషులందరూ, నోటికంటిన రక్తాన్ని తుడుచుకుంటూ సత్యమే గెలిచిందనటం లోకం కళ్ళు కప్పాలనుకోవటమే!

          బ్రిటీషు వలస పాలకులు పెంచి పోషించుకుంటూ వచ్చినదీ మతోన్మాదం. ఇది సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కాలానికి పాలకవర్గాల అత్యవసరంగా, కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా రంగం మీదకు తేబడింది. ప్రపంచీకరణ రిహార్సల్‌ దశలో వున్నపుడు ఇది బాబ్రీ మసీదు సమస్యను ఆలంబన చేసుకుని భారత సమాజంలో మత ఉన్మాద కాలుష్య వ్యాప్తికి పూనుకుంది. 1991లో ప్రపంచీకరణ వాస్తవ రూపం ధరించే కాలానికి శిలాన్యాసాలు, కరసేవలూ, రధయాత్రలతో మతకలహాల వ్యాప్తితో, చివరకు బాబ్రీ మసీదు కూల్చివేతతో దాని శిధిలాలపై నడుచుకుంటూ ఢిల్లీ పీఠానికి ఎగబాకింది. ఈ 25 ఏళ్ల కాలంలో అమెరికా సామ్రాజ్యవాద ప్రపంచ టెర్రరిస్టు వ్యూహంలో భాగంగా భారత్‌ని మరో పాకిస్తాన్‌లా ఎదిగించి తిరుగులేని అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది. ప్రపంచీకరణ విధానాల దుష్ఫలితాలకు అడ్డుపడే సమస్త ప్రజా నిరసనలనూ, ఆందోళనలనూ, ఉద్యమాలనూ నిర్దాక్షిణ్యంగా అణచివేయగల సత్తా కలిగిన శక్తి తానేనని భాజాయిస్తోంది.

          ప్రజా ఉద్యమాల వెన్నుని విరిచేసే సామ్రాజ్యవాద వ్యూహం, మతోన్మాద శక్తులకు అడ్డంకులు లేని రాజకీయ రహదారిని నిర్మించింది. దేశ వనరులను ప్రపంచ, దేశీయ కార్పొరేట్‌ వర్గాలకు ధారాదత్తం చేయటంలో నీతినీ, నియమాల్నీ వారు పట్టించుకో దలచటం లేదు. కరోనాను అడ్డం పెట్టుకుని భారత వ్యవసాయ రంగాన్ని శకుని పాచికలు లాంటి అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్‌ జూదం క్రిందకు మార్చేశారు. డా॥ స్వామినాధన్‌ కమిటీ సూచనలను పాటిస్తానని పైపై వాగ్దానాలు చేసి రైతుల పంటలకు న్యాయమైన మద్దతు ధరను ఇవ్వటం, అందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నిర్వహించటానికి బదులు ‘అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు’ పెడుతున్నారు. పూర్వం వలస కాలంలో మన రైతులపై బ్రిటీషు పాలకులు నీలి పంటను రుద్దినట్లు, మన వ్యవసాయరంగాన్నంతా కార్పొరేట్ల లాభసాటి వ్యాపారం క్రిందకు మార్చేసుకుంటున్నారు. పార్లమెంటరీ చట్టబద్ధ నిబంధనలను ఎడమ కాలితో తన్నేసి వ్యవసాయ బిల్లులను, కార్మిక చట్టాలను తమ చిత్తం వచ్చినట్లు మార్చేశారు. రాష్ట్రాల అధికారాలను హరించి బిచ్చపు జోలెలతో ఢిల్లీ చుట్టూ తిరిపెమెత్తాల్సిన దుస్థితికి వాటిని దిగజార్చారు. ‘‘ఏ రూపంలో వున్నా ప్రజల ఆస్తులనన్నిటినీ ప్రైవేటు వ్యక్తుల పరం కావించటం, వ్యక్తిగత విశ్వాస స్థాయిలో వుండాల్సిన మతాన్ని ఉన్మాద స్థాయికి పెంచి రాజకీయ అధికార పనిముట్టుగా వాడుకోవటం, కార్పొరేట్ల సేవకులుగా, కేంద్రీకృత అధికారాలతో దేశంపై తిరుగులేని ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవటం’’ – ఇదే వారి విధానం. చారిత్రక దృష్టితో ఆలోచిస్తే వారిదొక పగటికల! (1939లో వచ్చిన) ‘గ్రేట్‌ డిక్టేటర్‌’ సినిమాలో హిట్లరు బెలూను పేలిపోయినట్లే ఈ కల పగులుతుంది. కానీ వర్తమానంలో అది దేశం మెడమీద కత్తి. దాని పరాధీన దళారీ స్వభావం కారణంగా సామ్రాజ్యవాదుల ముందు వారు ఇంకా ఇంకా సాగిలపడక తప్పదు. దేశాన్ని అసమానతలతో, అవమానాలతో ముంచక తప్పదు. నేటి ఆర్థిక – రాజకీయ సంక్షోభాన్నుండి ప్రజను పక్కదారి పట్టించటానికి, కరోనా కంటే ఘోరాతి ఘోరమయిన నీచ సాంస్కృతిక విధానాలను అమలు పరచక మరో దారి ఈ పాలకులకు లేదు.

          సామ్రాజ్యవాదుల సేవలో వున్న ఫ్యూడల్‌ కులోన్మాద – హిందూత్వ మతోన్మాద శక్తులను, సమస్త జీవనరంగాలతో సహా భావజాలరంగంలో కూడా ఎదుర్కోవటానికి, ప్రజలముందు వారి దళారీ స్వభావాన్ని బహిర్గత పరిచేందుకు రచయితలూ, మేధావులూ సంసిద్ధులమవాలి. అందుకు నిజాయతీగా కలిసి వచ్చే సాహితీ సాంస్కృతిక శక్తులనూ ఐక్యం చేసి సంఘటితపర్చాలి.

1-10-2020                                                                                           – దివికుమార్‌

admin

leave a comment

Create AccountLog In Your Account