సందట్లో సడేమియా

సందట్లో సడేమియా

– శంకరం

          ‘ఇదేం బాగునేదురా సుబ్బారావ్‌!’

          ‘ఏది, కరోనానా? ఎట్టా బాగుంటాదిరా?’

          ‘మాట మార్సీకు…. జనాలంతా ఓనల్లేక గగ్గోలెడతావుంటే గెడ్డలోకి ఇంజనెట్టీసి నీ మళ్ళకి నీల్లు తోడీసుకుంతావా? మోతుబరివి కదా!’

          ‘ఓరెల్లరా…. అక్కడికి నానొక్కన్నే ఇట్టా సేత్తున్నట్టు ఇడ్డూరంగా సెప్తావేందిరా? అయినా ఈ నీరంతా నానేటి సేసుకుంతాను? నా మళ్ళన్నీ తడిసినాక ఊరోల్లకి ఒగ్గీనా?’

          ‘అబ్బా, యేం తెలివిరా నీది, నీ మళ్ళన్నీ తడిసినాక గెడ్డలో నీరు మిగులుద్దా అసలు? ఆ చంగతి నీకూ దెల్సు….’

          ‘‘అవుకాశవొచ్చినప్పుడు వాడీసుకోడవే తెలివైనోడి పని…. అయినా దేశింల పెద్ద పెద్ద మారాజులే టైం జూసుకొని పెజలకి రకరకాల వాతలెట్టెత్తన్నారు…. సడీసప్పుడూ నేకండా సెయ్యాల్సినియన్నీ సేసీసుకుంతన్నారు….. మనవనగా ఎంతరా….?’’

          ‘‘అబ్బా! నీతాన సానా ఇసయవుందరా…. సెప్పరా సీకుష్ణుడు అజ్జునికి సెప్పినట్టు…. నేర్సుకుంతాను…. నానూ తెలివైనోన్ననిపించుకుంతాను…. సెప్పరా….!’’

          ‘‘అయితిను…. పెపంచకవంతా ఇప్పుడ్లకల్లోవైపోతుంది, ఔనా? ఔను, మాయదారి కరోనా దేశదేశాల్ని సుట్టిపారీసింది గదా, ఎప్పుడు ఎవుడ్ని కాటేసిద్దోనని జనం గుండికాయల్ని గుప్పిట్లో ఎట్టుకొని తిరుగుతన్నారు…. ఇంగోపక్క మన్దేశింల కోట్లకొద్దీ పెజలు ఉండనీకి సోటు నేక, సెయ్యనీకి పన్లేక, తిననీకి తిండి లేక రోడ్లట్టుకొని వందల మైళ్ళు నడుసుకోని సొంతూళ్ళకి పోతున్నారు. ఏటి తింటన్నారో, ఎక్కడ తొంగుంటన్నారో ఆ పయ్యోడికే తెలియాలి…..’’

          ‘‘ఓరియ్యన్నీ రోజూ టీబీలో సూత్తన్నం కదేట్రా యేటో సెప్తానని ఇంకేటో సెప్తావేందిరా….’’

          ‘‘నువ్వలగాగు…. ఇదంతా సెప్పనీకి కారనవుంది. గవుర్మెంటు కొలువులు, పెద్ద పెద్ద కంపెనీ కొలువులు సేసీవోల్లకి దప్ప మిగిలిన కోట్లాదిమంది జనాలకి సెయ్యనీకి పనుల్లేకుండా పోనాయ్‌…. వంట్లో బాగునేక ఆస్పత్తిర్లకెల్తే పట్టించుకునే నాధుడు నేడు…. అవునా?’’

          ‘‘అవును బాబూ. అవును. అయితేతంతావు? నానడిగింది సెప్పవేంరా….?’’

          ‘‘దేశింల జనాలు దిక్కు మొక్కూ నేక గగ్గోలెడతావుంటే మన పెద్దోల్లు గుట్టుసప్పుడు నేకుండా మంచి  నాబాలొత్తున్న పెబుత్వ కంపెనీల్ని పైవేట్లోల్లకప్పజెప్పీసినారు. కరెంటు యవ్వారాలన్నీ మావే సూస్కుంతావని మన రాస్టరాల సేతుల్లోంచి గుంజీసుకుంతన్నారు. యవుసాయ మార్కెట్లమీన కూడా అతికారాలు లాగీసుకుంతన్నారు.’’

          ‘మరలగైతే ఇంగ మన్రాస్టరాల్కి సొమ్ములెక్కడ్నుంచొత్తాయిరా?’

          ‘‘అదే గందా నానూ అంతన్నాను, సరే ఇయ్యన్నీ ఓ పక్కనెడదాం. అతికారం కేంద్రం సేతిలోనో,  పైవోటోడి సేతుల్లోనో ఉంటది…. పర్వానేదనుకుందాం. కానీ ఆ మజ్జిని ఇజియి మాల్యా, మిగతావోల్ల పేర్లు మన్నోటికి రావు…. ఇట్టాంటి ధర్మపెబువులు బేంకీలకాడ సేసిన అప్పులు డెబ్బై ఏల కోట్లు మాపీ జేస్సినారు…. ఏది…. ఈ కరోనా గందరగోలంలోనే….’’

          ‘‘అమ్మ దీనమ్మ…. అంత పన్జేసినార్రా…. కడుపు కట్టుకోని నానూ, నువ్వూ, ఆడూ, ఈడూ, సిన్నా, సితల్లందరివీ పైసా పైసా బేంకీల దాస్కుంటే ఈల్లబ్బగారి సొమ్మునాగ కోట్లు కోట్లు అప్పులిచ్చీడవే గాకుండా మాపీ గూడా సేస్సినారన్నమాట…. కోతి గెంతడం, సాయిబు దొబ్బడం అంటే ఇదే మరి!’’

          ‘‘ఇంకా ఇను…. ఇంత సంది కాలంలో మన పెబువులు…. అంటే పెతానమంతిరీ, మిగిలిన మంతుర్లూ, ఆ్ల పియ్యేలూ…. ఈల్లంతా రెక్కలు ముక్కల్సేసుకొని పన్జేత్తన్నారనీ, ఈల్లందరూ విప్పుడున్న పారలమెంటు బిల్డింగు పాతదైపోయిందనీ, ఆల్లు బాగా పన్జెయ్యనీకి కొత్త బిల్డింగులు కట్టుకుంటారట…. బానే వుంది దాని కర్సెంతో దెల్సా? 12,450 కోట్లట…..’’

          ‘‘ఓహోహో! అంటే మన్సొమ్ముల్తో ఇందర బవనాలు కట్టుకోని, ఏసీలెట్టుకోని ఆయిగ రెస్టు దీస్కుంటరన్నమాట…. జనాలేమో రోడ్లట్టి దిక్కులేనోల్నాగా పరిగెడతంటే…. బాగుంద్రా!’’

          ‘‘ఇంకా ఇసిత్రం ఇనుకో…. పిట్రోలు అమ్మీ దేశాల్లో కరోనా వల్ల మడుసులు ఎక్కువగా తిరగడం మానీడంతో దరలు పడిపోనాయ్‌. కానీ మన్దేశింల ఎవ్వురికీ అనుమానం రాకండా సాయిబాబాకీ కొంచెం కొంచెం ఇసవిచ్చి సంపీసినట్టు ఒకరోజు అర్దరూపాయి, ఇంకో రోజు రూపాయి…. ఇట్టా పెంచీసుకుంతా పోతన్రు….’’

          ‘‘అమ్మడియమ్మ…. అందుకేనేట్రా పిట్రోలేయించుకోనీకి ఎప్పుడెల్నా రేటు పెరగతా ఉందే తప్ప దిగింది నేదు…. సేతిల సొమ్ముల్నేక పెజానీకం అలో లచ్మనా అంతుంటే ఈల్లేమో రేట్లు పెంచుకపోతన్రన్నమాట…. మూలిగే నక్క మీన తాటిపండడీసినట్టు….’’

          ‘‘అక్కడేమో అలగుంది…. ఇంగ మనకాడికొత్తే మనం మాత్తరం తక్కువ దిన్నామా అని అయిదరాబాదు నవాబుగోరు అసింబిలీ బిల్డింగు తిరగొట్టీడం మొదలెట్టీసినారు. ఆటిలికింకా టైముందట…. రాస్టరం అప్పులేవోఁ పెరిగిపోతన్నై…. అయినా చరే నా పరిపాలన్లో సూసుకొండ్రా ఎట్టాంటి బిల్డింగులు కట్టీనో అని గొప్పలు సెప్పుకోనీకి ప్రస్తుతానికి ఆరొందల కోట్లట యవ్వారం…. తర్వాత్తర్వాత ఎంతౌతాదో తెల్దుగానీ….’’

          ‘‘మన్లో మన మాట్రా…. ఈ యవ్వారాల్లో సానామందిరి తలకింతని అంకించుకుంటారు గదరా….?’’

          ‘‘యెర్రోడ్లా అడుగుతావేట్రా! గవుర్మెంటు పన్లంటేనే శానామందిరికి పండగ, సిన్నగంటావేటి….? ఎర్లోల్లై కడతన్రా ఏటి….?’’

          ‘‘విప్పుడు మన్రాస్టరం సంగత్చూద్దాం…. ఇక్కడంతా రంగు పడతంది. ఏసుడు…. మార్సుడు, ఏసుడు…. మార్సుడు. మొత్తానికి పెజల సొమ్ముతో హోలీ సేసుకుంతన్నారు. రాజిదాని పని మూడు ముక్కలాటలాగుంది. కమిటీలకీ, గవుర్మెంటు తరుపున వాదించీ లాయర్లికీ సొమ్ములు బాగా ముడతన్నై…. ఇయ్యి కూడా పెజల సొమ్ములే అనుకో. విప్పుడు కొత్తగా ఇజీవాడ గ్రౌండులో అంబేత్కరుగారి ఇగ్రహం 125 అడుగులు కడతారంట. దీనికెంత కర్సవుద్దో తెలవదు. అసలు ఈ ఇగ్రహాలు కట్టడవెందుకో అరదం గాదు.  మన్దేశింల కట్టినన్ని ఇగ్రహాలు పెపంచకంలో ఇంకెక్కడా వుండవేమోన్రా….’’

          ‘‘రాజుల సొమ్ము రాల్ల పాలని ఊరికే అన్నారేట్రా? సొమ్మొకడి…. సోకొకడిదీ!’’

          ‘ఇక్కడో మంచి పన్జేసినార్రోయ్‌!’

          ‘ఏంటో?’

          ‘‘మందు సాపులు తగ్గించీసి, మందు రేటు బాగా పెంచీసినారు గదా…. మా గొప్ప పన్జేసినార్రా…. మూడు నెల్లు తాక్కుండా ఎలాగో నెట్టుకొచ్చినారు జనాలు…. ఇంగో నెలా, రెండు నెల్లు ఇలగే వుంటే సానామట్టుకు తాగుడు బందయ్యీది. తగుదునమ్మా అని మందు సాపులు తెరిసీసినారు…. సీపు సరుకమ్మెత్తన్నారట…. రేటెక్కువైపోడంతో ఎక్కడ పడితే అక్కడ నాటు సారా సేసీసుకుంతన్నారు. అదీ దొరక్కపోతే మొన్న కసింకోటల్లో స్పిరిటు తాగీసి సచ్చినారు సూసేవా…. అదన్నమాట చంగతి!’’

          ‘‘ఆల్ల పని బాగానే వుంది…. మన్సంగతే అద్దానవైపోనాది. ఓ పక్క బళ్ళుమీన ఇసక తోలుకొండి అంతన్నారు…. తోలుకుంటే బళ్ళన్తీసికెల్లి టేసన్లెట్టెత్తన్నారు. గవుర్మెంటు మాత్తరం ఇసకని బోల్డు రేటుకమ్ముకుంటంది. నాయంగా ఇల్లు కట్టీవోల్లకి సుక్కలు కనబడతన్నై!’’

          ‘అదేరా కాకుల్ని కొట్టి గెద్దలకెయ్యడం అంటే!’

          ‘‘మొత్తం మీన సందు సూసుకొని ఎవులి పనాల్లు సక్కబెట్టీసు కుంతన్నారు…. అన్నిదిలా  సెడిపోతంది మనవేరా సామ్మాన్నుల్ని పట్టించుకునీవోడు ఒక్కడూ నేడేంటి?….!!!’’

admin

leave a comment

Create AccountLog In Your Account