రామాయణం, భారతం – చారిత్రక నేపథ్యం

రామాయణం, భారతం – చారిత్రక నేపథ్యం

– రాహుల్

          ఒకవైపు తీవ్ర ఆర్ధిక సంక్షోభం, మరోవైపు కరోనా కరాళనృత్యం మధ్య ఆగస్టు 5, 2020న అయోధ్యలో రాముడి గుడికి భూమిపూజ జరిగింది.

          కాషాయరంగు కండువా, వెండి కిరీటం, పెరిగిన గడ్డంతో భారత ప్రధానమంత్రి ఓ రాజర్షిలా ఈ పవిత్ర మత కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 5 వందల ఏళ్లనాటి మసీదు స్థానంలో ఒక హిందూ దేవాలయానికి పునాది పడింది. అన్ని టి.వి.లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి.  హిందూశక్తులు సంబరాలు జరుపుకున్నాయి.

          రాముడి గుడికి ఇదా సమయం? ఒక సెక్యులర్‌ స్టేట్‌ అధిపతికి ఇది అవసరమా? అని అడిగితే అవుననే జవాబు చెప్పాలి. చిన్నాభిన్నమైన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే మరో దారి కానరావటంలేదు. అప్పులిచ్చే పెద్దన్న పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయాడు. దిక్కులేని జనానికి దేవుడే దిక్కని చెప్పటం తప్ప మరో పాచిక లేదు. అదే విసిరారు. ఆకలి, దారిద్య్రం, కన్నీళ్లకి ఓ దారి జూపారు. రాముడిని, కృష్ణుడిని మరోమారు తెరపైకి తెచ్చారు.

          రాముడి పేరుతో మత ఘర్షణలు జరిగాయి. వివాదం ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగింది. రామాయణం చారిత్రకమా? పురాణకావ్యమా? ఏ కాలం నాటిది? వందల సంఖ్యలో వున్న రామాయణ గాధలలో ఏది వాస్తవం? ఏది కల్పితం? అయోధ్యలోనే, ఆ 2 ఎకరాల 77 సెంట్లలోనే రాముడు జన్మించాడనటానికి ఆధారాలేమిటి? చివరికి రెండే ప్రశ్నలు మిగిలాయి. హేతువాదమా?  విశ్వాసమా?  ఎన్నటికీ కలవని దారులయ్యాయి.

          ఆలయమా? మసీదా? ఆరామమా? ఏది ముందు? ఏది వెనుక? అనే తర్కంలోకి వెళితే ఎన్నో చిక్కు సమస్యలు ఎదురవుతాయి. మతం మత్తుమందు లాంటిదన్నాడు కారల్‌మార్క్స్‌. ఆ మత్తులో ఎన్నో యుద్ధాలు, మనదేశంలోనే కాదు, ప్రపంచమంతటా జరిగాయి. రాజ్యాధికారం, ఆర్ధికవనరుల కోసం జరిగిన ఈ యుద్ధాలలో గుళ్లు, చర్చిలు, మసీదులు, జైన, బౌద్ధ ఆరామాలు లక్ష్యంగా మారాయి. వీటి వెనుక వున్న వందల, వేల ఎకరాల పంటపొలాలు, వెండి బంగారాలు, వజ్ర వైఢూర్యాలు దోచుకోవటమే అసలు ఆంతర్యం. ఇందులో ఏ మతమూ తక్కువ తినలేదు. హిందువులు జైన, బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశారు. మహమ్మదీయులు హిందూ ఆలయాలను కూల్చివేశారు. క్రైస్తవులకి, ముస్లింలకి మధ్య యూరప్‌లో క్రూసేడ్ల పేరుతో యుద్ధాలు జరిగాయి. రక్తపుటేరులు పారాయి. ఇది గత చరిత్ర. ఈ చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. మతాన్ని రాజ్యం నుండి వేరుచేయాలి. వ్యక్తిగత విశ్వాసంగా పరిగణించాలి. కాని అలా జరగటంలేదు. అన్ని కాలాల్లోనూ మతాన్ని స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. అందుకోసం చరిత్రను వక్రీకరించారు. విశ్వాసం పేరుతో మతాన్ని, దేవుళ్ళను అడ్డం పెట్టుకున్నారు.

          చరిత్రను శాస్త్రీయ దృష్టితో చూడాలి. అశోకుడు, అలెగ్జాండర్‌ గురించి చెబుతున్నామంటే అందుకు తగిన ఆధారాలున్నాయి. పురాతత్వ శాఖ త్రవ్వకాలు, శాసనాలు, నాణేలు, ప్రాచీన చరిత్రకారుల గ్రంథాలు మనకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. రామాయణాన్ని, మహాభారతాన్ని ఆ కోణంలోనే చూడాలి.

          చరిత్ర గతానిది. అభిప్రాయం వర్తమానంది. ‘గతానికి, వర్తమానానికి జరిగే నిరంతర సంభాషణే చరిత్ర’ అన్నాడు ఇ.హెచ్‌. కార్‌. చరిత్ర ఊహల అల్లిక కాదు, అది వాస్తవాల పుట్ట. ఆ పుట్టను త్రవ్వి వాస్తవాలను వెలికితీయాలి. వాస్తవం అందరికీ వాస్తవమే. కాని దానిని విప్పి చెప్పటంలోనే విభేదాలొస్తాయి. ఉదా॥కి బుద్ధుడి అహింసా సిద్ధాంతం ఒక వాస్తవం. ఎవరూ కాదనరు. ఆ సిద్ధాంతం ఎలా ఉద్భవించింది? భిన్నాభిప్రాయాలున్నాయి. మహనీయుడైన బుద్ధుడు బోధివృక్షం క్రింద కూర్చొని తపస్సు చేయటం వలన ఆయన మదిలోకి ఆ ఆలోచన వచ్చిందని కొందరంటారు. వేదకాలంనాటి యజ్ఞ యాగాదులలోని జంతుబలులు ఆనాటి వ్యవసాయాభివృద్ధికి అడ్డంకిగా వుండటం వలన దానిని నివారించటానికి బుద్ధుడు  అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించాడని మరికొందరంటారు. చరిత్రను నడిపేది కొందరు వ్యక్తులా?  భౌతిక  పరిస్థితులా? ఇది భావజాలాల మధ్య సంఘర్షణ. ఈ సంఘర్షణే రామాయణం, భారతం నేపథ్యంపై కూడా పై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలకు కారణమైంది.

          ‘‘రామాయణంలో చెప్పబడి, ఇప్పటికీ వున్న చిత్రకోట, అయోధ్య లాంటి ప్రదేశాలను పరిగణనలోకి తీసుకున్నా రామాయణం చరిత్రాత్మకమైన అంశం కాదనేది వాస్తవం. రాముడు అయోధ్యలో వున్నాడని, పాలించాడని చెప్పటానికి పురాతత్త్వశాఖపరంగాగాని, చారిత్రకంగాగాని, ఎలాంటి ఆధారమూ లేదు (సట్టార్‌, ఐ.సి.హెచ్‌.ఆర్‌. మాజీ ఛైర్మన్‌)

          ‘‘వృత్తిరీత్యా చరిత్రకారుడునైన నేను నమ్మకంపై ఆధారపడి చరిత్రను రాయటం జరగదని భావిస్తున్నాను. అలా రాసినా, చెప్పినా కట్టుకధే’’

          ‘‘భారత పురాతత్త్వశాఖ, ఒక హిందూ మతశాఖ ఆలయం పిల్లర్లపై ఆధారపడి వుందని వాదించారు. అయోధ్యలో త్రవ్వకాల్ని మొదట ప్రారంభించిన భారత పురాతత్త్వశాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ బి.బి.లాల్‌ వైఖరిలోని కొన్ని అంశాలపై స్పష్టతనివ్వాలి. ఆయన తన మొదటి రిపోర్టులో పిల్లర్లను గురించి అసలు  ప్రస్తావించలేదు. 1988లో ఐసిహెచ్‌ఆర్‌ సెమినార్‌లో ప్రవేశపెట్టిన పేపరులో ఆయన పిల్లర్లు గురించి పూర్తిగా మౌనం వహించారు. రామాయణం చారిత్రకతపై ఇచ్చిన ఒక ఉపన్యాసంలో పిల్లర్ల ప్రస్తావన తేలేదు. కాని 1989 నవంబరులో శిలాన్యాలు జరిగిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. 1990 నవంబరులో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచురించే ఒక పత్రికలో మసీదు సమీపంలో వున్న పిల్లర్ల నిర్మాణం గురించి అయోధ్యలో త్రవ్వకాలు జరిగిన 15 ఏళ్ళ తర్వాత చెప్పాడు’’ (‘ది వైర్‌’లో ఇంటర్వ్యూ డి.ఎన్‌.ఝా ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌, ఐసిహెచ్‌ఆర్‌ మాజీ మెంబరు)

          ఆర్‌.ఎస్‌.ఎస్‌, వి.హెచ్‌.పి, శివసేన లాంటి హిందూ మతసంస్థలు, పార్టీలు అయోధ్య రామజన్మభూమిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విస్తృతంగా విష ప్రచారం చేశాయి. అది ప్రజల సెంటిమెంటుగా, విశ్వాసంగా ప్రకటించి చరిత్ర వాస్తవాలలోకి వెళ్ళటానికి నిరాకరించాయి. దీనిని ఖండిస్తూ 1991 మే లో ఆర్‌.ఎస్‌. శర్మ, అక్తర్‌ ఆలీ, డి.ఎన్‌.ఝా, సూరజ్‌భానులు ‘‘జాతికి చరిత్రకారుల రిపోర్టు పేరుతో ఒక ప్రకటన చేశారు. వి.హెచ్‌.పి విషప్రచారాన్ని ఖండించారు. మశీదు ముఖద్వారం వద్దనున్న 14 నల్లరాతి స్తంభాలు అలంకారప్రాయంగా నిర్మింపబడినవేగాని పిల్లర్లు కాదని తేల్చి చెప్పారు. ఆయ స్థలానికి చెందిన నోట్‌బుక్‌ను యివ్వమని అడిగితే భారత పురాతత్త్వశాఖ నిరాకరించింది.

          సుదీర్ఘ కాలం కొనసాగిన వివాదంపై నవంబరు 9, 2019న సుప్రీంకోర్టు అంతిమ తీర్పునిచ్చింది. చరిత్ర పుటల్లోకి వెళ్లకుండా ప్రభుత్వ పన్ను రికార్డును బట్టి వివాదగ్రస్తమైన ఆ భూమిని ఒక ట్రస్టుకు అప్పజెప్పి ఆలయం నిర్మించుకోవచ్చునని చెప్పింది.

          రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు పర్మిషన్‌ యిచ్చినా, మశీదు కూల్చివేతను సమర్ధించలేదు.  ‘‘కాసేపట్లోనే మొత్తం కట్టడాన్ని నేమట్టం చేశారు. నిజానికిది సిగ్గుపడాల్సిన విషయం. మెజారిటీకి న్యాయం, క్రీడాస్ఫూర్తితో ఆడిన ఆట పేరుతో మైనారిటీ విశ్వాసాన్ని దెబ్బతీశారు.’’ (1994 సుప్రీంకోర్టు తీర్పు)

          భవిష్యత్‌లో ఇలాంటి మత ఘర్షణలు జరగకుండా వుండాలంటే నమ్మకాల్ని ప్రక్కనబెట్టి చరిత్ర పట్ల శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలి.

          ప్రాచీనకాలం గ్రంధాలలో మత విషయాలు ప్రధానంగా వుంటాయి. అతిశయోక్తులతో కూడుకొని వుంటాయి. పురాణ పురుషులు దేవుళ్లను ప్రసన్నం చేసుకొని మానవాతీత శక్తులను పొందుతారు. ఇలాంటి పాత్రలు మన రామాయణ, భారతాలలోనే కాదు, గ్రీకుల ఇలియడ్‌, ఒడెస్సీ కావ్యాలలోనూ వున్నాయి. ఇరాక్‌, ఈజిప్టు, చైనాల ప్రాచీన సాహిత్యాలలోనూ వున్నాయి. ఈ ప్రాచీన కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలను యధాతధంగా చూడగూడదు. వాటిని గౌరవించాలి. అదే సమయంలో వాటిల్లోని పరస్పర విరుద్ధాంశాలను, చారిత్రక నేపథ్యాన్ని, సామాజిక పరిణామదశల్ని అధ్యయనం చేయాలి. పౌరాణిక సాహిత్యంలో తుక్కు, తాలు ఎక్కువ. ఎంత చెరిగినా దొరికే గింజలు తక్కువ. వాటిని ఇతర సాక్ష్యాధారాలతో సరిపోల్చి చరిత్రను కట్టుకథలా గాక ఒక సైన్సుగా అభివృద్ధి చేయాలి. ఉదాహరణకి మహాభారతంలో భీష్ముడు తన మరణ రహస్యాన్ని పాండవులకు చెబుతాడు. మర్నాడు యుద్ధంలో తనకు ఆఖరి రోజని తెలుసు. ఆ రోజురాత్రి తనకి నమ్మకమైన దశులని పిలుస్తాడు. వారికి ధనాన్ని ఇచ్చి రాజ్యానికి చెల్లించి దాస్యవిముక్తి పొందమంటాడు. దీని అర్థం ఏమిటి? ప్రాచీన కాలంలో బానిసత్వం వుంది. అది ఇంటి పనులకు పరిమితం. ధనం ఇచ్చి విముక్తి పొందవచ్చు. హేతుబద్ధంగా ఆలోచించాలి.

          రాముడు పుష్పక విమానంలో విహరించాడంటే, ఆ కాలంలోనే మనకు ఏవియేషన్‌ టెక్నాలజీ వుందనుకోగూడదు. వినాయకుడికి ఏనుగు తలను అతికించారంటే, అప్పుడే మనకు ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసునని అనుకోగూడదు. కౌరవుల నూరుగురు సంతానం కృత్రిమ సంతాన సాఫల్య విజయంగా చెప్పుకోగూడదు. ఇవన్నీ ప్రకృతి శక్తులపై మానవుల విజయాన్ని కాంక్షించేవిగా అర్ధం చేసుకోవాలి.

          చెడుపై మంచి పొందుతుంది. ఇది పురాణాలో సదాసత్యంగా కనపడుతుంది. ఏది మంచి? ఏది చెడు? రాముడు బవంతంగా సీతనెత్తుకుపోయిన రావణాసురుడిని సంహరించాడు. అదే రాముడు వేదాధ్యయనం చేశాడని శంబూకుడిని వధించాడు. వాలి, సుగ్రీవు ఆధిపత్య పోరులో జోక్యం చేసుకొని వాలిని చంపివేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ, కౌరవులో ఏ ఒక్కరూ యుద్ధ నియమాల్ని పాటించలేదు.

          అలాగే పురాణాలలో నీతి, ధర్మం గురించి వుంటుంది. ఏది నీతి? ఏది అవినీతి? ఏది ధర్మం? ఏది అధర్మం? శ్రీరాముడి ఏకపత్నీవ్రతాన్ని కొనియాడుతాం. దశరధుడికి ముగ్గురు భార్యలున్నా, ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నా అభ్యంతరాలుండవు. వర్ణానికి అత్యంత ప్రాధాన్యత వుంటుంది. వీరుడైన కర్ణుడిని  సూతపుత్రుడిగా పాండవులు అవమానిస్తారు. పెళ్లిళ్లకి వర్ణం అడ్డురాలేదు. శంతనుడు మత్స్యకులానికి చెందిన గంగను, భీముడు ఆటవిక స్త్రీ అయిన హిడింబిని, అర్జునుడు యాదవ వంశానికి చెందిన సుభద్రను పెళ్లాడుతారు. శూర్పణఖని మాత్రం ముక్కు, చెవులు కోసి పంపుతారు.

          నీతి, న్యాయం, ధర్మం ఏదీ శాశ్వతం కాదు. అవి కాలానుగుణంగా సామాజిక దశలను బట్టి మారుతూ వుంటాయి. వాటిని నిర్ణయించేది వ్యక్తులుగాదు, భౌతిక పరిస్థితులే. రామాయణ, భారతాలలో పితృస్వామిక, రాజ్యవ్యవస్థలో జ్యేష్టపుత్రుడిదే వారసత్వం. అక్కడనుండే కథ మొదలవుతుంది. మాతృస్వామిక గణతంత్ర వ్యవస్థలో ప్రజలే ‘రాజు’ను ఎన్నుకుంటారు. స్త్రీల పరిస్థితి కూడా అంతే. పెళ్లికి ముందే గర్భవతి అయిన కుంతి, జూదంలో ఆటవస్తువయిన ద్రౌపది దయనీయమైన స్థితి మనకి తెలుసు. మాతృస్వామ్యంలో స్త్రీలకి పురుషులతో సమానంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలున్నాయి. రామాయణ, భారతాలలోని సంఘటనల్ని విడిగాగాక, ఆయా సామాజిక పరిణామ దశలలోని మార్పులుగా అర్ధం జేసుకోవాలి.

          ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌.ఎస్‌. శర్మ ఇలా రాశారు. ‘‘పురాణాలలో కనిపించే సుదీర్ఘమైన వంశవృక్షాల కంటె పురాతత్త్వ సాక్ష్యాధారాలను ఎంతో ముఖ్యమైనవిగా పరిగణించాలి. పురాణ సంప్రదాయాలు ప్రకారం అయోధ్యాయాధిపతి అయిన రాముడు క్రీ.పూ. 2000 సంవత్సర కాలానికి చెందినవాడు. కాని అయోధ్యలో విస్తృతంగా జరిగిన త్రవ్వకాలలో గాని, పరిశీలనల్లో గాని ఆ కాలానికి చెందిన ఒక్క నివాసం బయటపడలేదు. అలాగే మహాభారతంలోని శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర ఎంతో ముఖ్యమైనది. మధురలో జరిపిన త్రవ్వకాలు క్రీ.పూ. 200 – క్రీ.శ. 300 కాలానికి చెందిన శిల్పాలెన్నో బయటపడ్డాయి. అందులో శ్రీకృష్ణుని జాడే లేదు! గతంలో వచ్చిన ప్రాచీన భారతదేశ చరిత్ర గ్రంధాలలో పురాణయుగాన్ని ఒక అధ్యాయంగా పరిగణించేవారు. కాని ఇంతవరకు చర్చించిన కారణాల వల్ల రామాయణ, భారతాల మీద ఆధారపడ్డ పురాణయుగాన్ని తిరస్కరించక తప్పదు. కాని సామాజిక పరిణామానికి సంబంధించిన వివిధ దశల్ని రామాయణ, భారతాలలో గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ గ్రంథాలు సామాజిక పరిణామంలోని ఒకే దశలో రాసినవి కావు…. అనేక సామాజిక దశలలో రాసినవి’’ (ప్రాచీన భారతదేశ చరిత్ర).

          రామాయణ, భారతాలు ఏ కాలంనాటివి? కొందరి జవాబు వింటే విస్తుపోవాల్సిందే. రాముడి జననం క్రీ.పూ. 10-1-5114, 12:05p.m. స్థలం అయోధ్య. జీవితకాలం 10,052 సంవత్సరాలు. మహాభారత యుద్ధకాలం క్రీ.పూ. 13-10-3139 మరికొందరు చరిత్రకు దగ్గరగా జరగాలనే ఉద్దేశ్యంతో రామాయణం క్రీ.పూ. 7000, భారతం క్రీ.పూ. 5000 నాటిదంటారు.

          భారత ఉపఖండంలో కొత్తరాతియుగం క్రీ.పూ. 6000 నుండి ప్రారంభమైంది. ఈ దశలో వ్యవసాయం,  కుండల తయారీ ప్రారంభమైంది. కంచుయుగం హరప్పానగర నాగరికత క్రీ.పూ. 2500-1800 కాలంలోనిది. రాత వుంది కాని విప్పి చెప్పలేకపోతున్నాం. క్రీ.పూ. 1500లో ఆర్యులు సింధునదీ తీరంలోని పంజాబ్‌కి వలస వచ్చారు. ఆర్యులు వచ్చిన తర్వాతే గుర్రాలు, రధాలు, వేదాలు, సోమరసం మనకు తెలుసు. ఆర్యులు పశుపాలక తెగలు. పితృస్వామిక వ్యవస్థలో వున్నారు. సంస్కృతం వారి భాష. లిపి లేదు. ఆర్యులు గురించి తెలుసుకోవాలంటే ప్రధానంగా వేదాలపై ఆధారపడాలి.

          రుగ్వేదకాలం క్రీ.పూ. 1500-1000. ఈ కాలంలో వర్ణాలు లేవు. వర్గాలు లేవు. రాజ్యవ్యవస్థ లేదు. అంతా తెగల వ్యవస్థే. సమస్యలు తలెత్తిందీ, యుద్ధాలు జరిగిందీ తెగల మధ్యనే. వర్ణం, రాజ్యం చుట్టూ తిరిగి రామాయణ, భారతాలకు ఈ కాలంలో చోటు లేదని చెప్పగలం.

          కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’లోని దుష్యంతుడు, శకుంతలకు పుట్టిన భరతుడి పేర ‘భారతదేశం’ అని పిలుస్తారని, ఆ భరతుడి సంతానమే కురువంశమని చెబుతుంటారు. గుప్తుల కాలంలో రాయబడిన ఈ నాటకానికి చారిత్రకత లేదు.

          రుగ్వేదంలోని ‘భరతులు’ పాలక ఆర్య తెగలలో ఒకటి. మన దేశానికి వచ్చిన ఈ భరత తెగ పేరుతోనే ‘భరత వర్షం’ అని పిలువబడుతోంది. సింధునదీ తీరంలో వున్న ఈ తెగతో మరో పది తెగలకీ దాని నదీ జలాలపై యుద్ధం జరిగింది. ఈ పది తెగలలో ఐదు ఆర్య, ఐదు అనార్యతెగలు. రుగ్వేదంలో దీనిని దశరాజ యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో సుదాసు నాయకత్వాన భరత తెగ విజయం పొందుతుంది. ఓడిన తెగలలో ప్రధానమైనది ‘పురు’. కాలక్రమేణా భరత, పురు తెగలు కలిసిపోయి ‘కురు’ తెగగా ఏర్పడుతుంది.

          మలివేదయుగం క్రీ.పూ. 1000-600 నాటిది. యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, బ్రాహ్మణాలు ఈ కాలంలో రచింపబడినాయి. ఈ కాలంలోనే ఆర్యులు సింధునదీ తీరం నుండి గంగానదీ తీరానికి వలస వెళ్ళారు. ఇక్కడ జరిగిన పురాతత్త్వశాఖ త్రవ్వకాలలో 700 జనావాసాలు బయల్పడినాయి. బూడిదరంగు మట్టిపాత్రలు దొరికాయి. ఇనుము ఆయుధాలు వుపయోగించిన దాఖలాలు కనపడినాయి. బార్లీతో పాటు వరి, గోధుమ, పండించసాగారు. వ్యవసాయంతో స్థిర నివాసాలు ఏర్పడినాయి. వాటిని ‘జనపదాలు’ అంటారు. చేతివృత్తులు, శ్రమవిభజనకి దారితీసింది. ఈ విభజన ప్రాతిపదికపై బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏర్పడినాయి.

          బ్రాహ్మణులు బోధకులు – వేదాలు వల్లిస్తారు. యజ్ఞ, యాగాదులు, జంతుబలులు నిర్వహిస్తారు.  అందుకు దానాలు పొందుతారు. క్షత్రియులు తెగల రక్షకులు, పాలకులు – యుద్ధాలు చేస్తారు. తెగ నాయకుడిని ‘రాజు’ అంటారు.  సభ,  సమితి అనే తెగల సంస్థల అజమాయిషీలో అన్ని వ్యవహారాలు జరిగేవి. వైశ్యులు వ్యవసాయం చేస్తారు. చేతి పరిశ్రమలులో పాల్గొంటారు. శూద్రులు పై మూడు వర్ణాలకి సేవలు అందిస్తారు. వైశ్యులు, శూద్రులు శారీరక కష్టం చేస్తారు. సంపదలు సృష్టిస్తారు.

          క్రీ.పూ. 600లో ఇనుప పనిముట్లు గంగా తీరంలోని బీహార్‌ ప్రాంతంలో విరివిగా ఉపయోగంలోకి వచ్చాయి. బీహార్‌లోని ఇనుము గనులు నుండి పెద్దయెత్తున ఈ ఖనిజం లభ్యమైంది. ఇనుప కర్రునాగలి, గొడ్డలితో ఉత్పత్తిశక్తులు గొప్ప ముందడుగు వేశాయి. గంగానదీ తీరంలోని అడవుల్ని నరికి మైదానాలుగా  పంటభూములుగా మార్చివేశారు. చేతివృత్తులు అభివృద్ధి చెందాయి. వైశ్యుల, శూద్రుల శారీరక కష్టంతో సంపదలు సృష్టింపబడినాయి. ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనని బ్రాహ్మణులు, క్షత్రియులకు మిగులు సంపదను జేరవేయాలి. రాజ్యవ్యవస్థ పుట్టింది అదే ‘మహా జనపదం’. ఇలాంటివి 16 వచ్చాయి. కురు, పాంచాల మహాజనపదాలే గాని ఆ తెగలకి పూర్వ వైభవంలేదు. మిగిలినవి కాశి, కోసల, గాంధార, అంగ, చేది, వర్సి, మగధి, అవంతి, మొదలైనవి. ఈ పేర్లన్నీ మహాభారతంలో, రామాయణంలో వున్నాయి. అంగరాజు, కర్ణుడు, గాంధారరాజు, శకుని, చేదిరాజు శిశుపాలుడు, కోసల, అయోధ్య రాముడిది. ఈ రాజ్యాల పేర్లను పురాణాలలో వాడుకున్నారు. ఇక్కడీమాట చెప్పాలి. అయోధ్య రాముడి రాజధాని. క్రీ.పూ. 6వ శతాబ్దంకి పూర్వం అక్కడ జనావాసాలు లేవని పురాతత్త్వ ఆధారాలు చెబుతున్నాయి.

          మహాభారతంలోని ఇతిహాసం అతి ప్రాచీనమైనది. వ్యాసుడిచే రాయబడినదిగా చెబుతున్న భారతం క్రీ.పూ. 1000 నుండి క్రీ.శ. 400 వరకు జరిగిన సామాజిక పరిణామ దశలకు అద్దం పడుతుంది. అందులో వర్ణాలు, గంగా మైదానానికి పయనం, ఇనుము వాడకం, అటవీదహనాలు, వ్యవసాయం, నగరాలు, మహాజనపదాలు, వాటి మధ్య యుద్ధాలు మన కళ్లముందు కదలాడినట్లుంటాయి. ఈ ఇతిహాసం 8800 శ్లోకాలతో ప్రారంభమైంది. ‘జయం’ అని పిలిచేవారు. తర్వాత 24 వేల శ్లోకాలతో భారతం అయింది. చివరికి 1 లక్ష శ్లోకాలతో మహాభారతమైంది.

          వాల్మీకి రాసిన రామాయణం 6000 శ్లోకాలతో వుండేది. అది 12 వేలకి, చివరికి 24 వేలకి పెరిగింది. మహాభారతం తర్వాతనే రామాయణం వచ్చింది. అది క్రీ.పూ. 5వ శతాబ్దంలో ప్రారంభమై దశదశలుగా పెరుగుతూ క్రీ.శ. 12వ శతాబ్దానికి పూర్తయింది.

          మలివేదయుగం నుండి గుప్తులు కాలం వరకు, తెగల వ్యవస్థ నుండి నగర రాజ్య వ్యవస్థ వరకు అనేక దశలను భారత, రామాయణాలలో మనం చూడగలం.

          ఇతిహాసాలన్నీ మన రామాయణం, భారతమైనా, గ్రీకుల ఇలియడ్‌, ఒడెస్సీలైనా జానపద పాటలుగానే ప్రారంభమైనాయి. జానపదాలు ఆనోటా ఆనోటా ఊళ్లన్నీ పాకుతాయి. భరతుల నుండి కురు, పాంచాల వంశాల గాధలు, భారత యుద్ధ నోటిమాటగా, జనంపాటగానే మొదలైంది. తర్వాతి కాలంలో కథాబోధకులు, ఆస్థానకవులు అందుకున్నారు. తరతరాలుగా బహురంజకమైన వాక్యంగా ప్రజాదరణ పొందింది. ఎందరో రాజులు తమ పాత్రలను అందులో జొప్పించాలని ఉబలాట పడ్డారు. బ్రాహ్మణ పండితులు వారి కోరికను తీర్చారు. అలా ఆ కథ ఇంతింతై పెద్ద ఇతిహాసంగా మారింది. పల్లె జనం నుండి ప్రారంభమైన జానపదం బ్రాహ్మణ క్షత్రియుల బందీ అయింది. చిలవలు పలవులుగా చేసి బ్రాహ్మణులు వర్ణాశ్రమ ధర్మాల్ని, స్త్రీ ప్రాతివ్రత్య మహిమలను, పితృస్వామ్యాన్ని, సొంత ఆస్తి పవిత్రతను, రాజ్యవ్యవస్థ రూపురేఖలను సందర్భానుసారంగా రామాయణ, భారతాలలో జేర్చి తమదైన సంస్కృతిని జనం నరనరాన ఎక్కించారు.

          ఒకానొక కాలంలో బహుభర్తృత్వం అంగీకారమే. ద్రౌపదికి ఐదుగురు భర్తలు. గుప్తులు కాలంనాటికి అది అనాచారమేకాదు, అసహ్యం కూడ. ఈ చిక్కుముడిని విప్పటానికి ఒక కొత్త కథ అల్లారు. ధనుర్విద్యలో ప్రవీణుడైన అర్జునుడు మత్స్యాన్ని ఛేదించి ద్రౌపదిని గెలిచి అన్నదమ్ములతో ఇంటికొస్తాడు. తల్లి కుంతితో ఒక పండు పట్టుకొచ్చానని చెబుతాడు. విషయం తెలియని ఆమె ఐదుగురూ సమానంగా పంచుకోండి అంటుంది.  తల్లి మాట జవదాటలేక ద్రౌపదిని పంచ భర్తృకని చేశారు. శివుడ్ని ద్రౌపది 5 గుణాలున్న భర్త కావాలని కోరుకుంటుంది. అవన్నీ ఒకరిలోనే వుండవు గనుక 5గురు భర్తల్ని యిచ్చినాడని శ్రీకృష్ణుడు సమర్ధిస్తాడు. పాతకాలంనాటి ధర్మాలకి కొత్త విలువలను ఆపాదించే ప్రయత్నం ఇది.

          కురుక్షేత్ర యుద్ధానికి దాఖలాలు లేవు. ఆ కాలానికి విలువిద్యే గొప్పది. యుద్ధాలలో పెద్దయెత్తున్న అశ్విక దళాలను వుపయోగించటం, లక్షల సంఖ్యలో సైనికులు పాల్గొనటం మనకు తెలిసినంతవరకు పకార్యుల కాలంలోనే జరిగింది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో సుమారు 50 లక్షల మంది చనిపోయారని రాశారు. ఒక లక్షా ముప్పైవేల రథాలు, అంతే సంఖ్య గల ఏనుగులు, అంతకు మూడింతల ఎక్కువగా యుద్ధ గుర్రాలు పాల్గొన్నాయని చెప్పారు. అంటే మొత్తం సైన్యం ఎంత వుంటుందో ఊహించండి. ఇంతమందితో యుద్ధం జరిగిందంటే అప్పటి జనాభా 20 కోట్ల పైనే వుండి వుండాలని ప్రఖ్యాత చరిత్రకారుడు కొశాంబి అంచనా వేశాడు. బ్రిటిష్‌ రాజ్యానికి ముందు అంత జనాభా మనకు ఖచ్చితంగా లేదు. అతిశయోక్తులకు ఆకాశమే హద్దు.

          పురాణాలు, ఇతిహాసాలలోని సంఘటనలు, న్యాయ, ధర్మాలు, నీతి నియమాలు, కాలానుగుణంగా సామాజిక పరిణామంలో ఎలా రూపుదిద్దుకుంటాయో, మతం, భావజాలం కూడ అదే బాటలో నడుస్తాయి. ఇనుము రాకతో వ్యవసాయం, వ్యాపారం, చేతివృత్తులు అభివృద్ధి చెందాయి. వైదిక ఆచారాలు, సంప్రదాయాలు  ఈ కొత్త ఉత్పత్తిశక్తులు ముందడుగు వేయటానికి ఆటంకంగా వున్నాయి. ఈ అడ్డుగోడలను తొలగించాలి. అందుకు నూతన మతం, భావజాలం రావాలి. జైన, బౌద్ధమతాలు ఉద్భవించాయి. వ్యవసాయంలో, వ్యాపారంలో రాబడి పన్నుల రూపంలో ఖజానాలు నిండటంతో, పాలకులైన క్షత్రియులు ఈ కొత్త మతాల్ని స్వాగతించారు. మగధ, మౌర్య సామ్రాజ్యంలో క్షత్రియులకు అధికారం బలపడింది. యజ్ఞయాగాదులు, బలులు నిషేధించటంతో బ్రాహ్మణుల ఆదాయం, గౌరవం తగ్గాయి. ఇది వారికి కోపకారణమైంది. అశోకుడి తర్వాత శుంగవంశీయులు, శాతవాహనులు, గుప్తులు, దక్షిణాదిన చోళులు, పాండ్యులు రాజ్యమేలారు. ఈ కాలంలో బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని పునఃప్రతిష్టించుకున్నారు.

          బుద్దుడి పునర్జన్మ, కర్మసిద్ధాంతం బ్రాహ్మణులకు కలిసి వచ్చింది. దుఃఖానికి మూలం గత జన్మల పాపఫలితమని, ఈ జన్మలో మంచి కర్మలను చేయటం ద్వారా నిర్వాణం పొందవచ్చని బుద్దుడు అన్నాడు. నిర్వాణం అంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే మోక్షం. ఇది వైదికులకి వజ్రాయుధమైంది. ఆత్మ పరమాత్మలో లీనమవ్వటమే అంతిమ లక్ష్యం. అందుకు కర్మలను ఆచరించాలని అప్పటికే ఉపనిషత్తులు కూడా చెప్పాయి. వైదికమతం పాము కుబుసం విడిచినట్లు కొత్తరూపం దాల్చింది. హిందూమతంగా మారింది.

          కొత్త దేవుళ్లు వచ్చారు. వైదిక యుగంలో ఇంద్రుడు తిరుగులేని దేవుడు. కాని ఆ యుగం యజ్ఞయాగాదులు, జంతుబలులకు పరిమితం. ఇబ్బడిముబ్బడిగా ఆదాయాన్నిచ్చే వ్యవసాయం అభివృద్ధి చెందాలి. అది అందించే అదనపు ఉత్పత్తి పాలకవర్గాలకి జేరాలి. కొత్తమతం అందుకనువైన కొత్త దేవుల్ని సృష్టించింది.

          వైదిక యుగంలో కృష్ణుడెవరో తెలియదు. భారత, భాగవతాలలో వైష్ణవ అవతారం విశ్వరూపం దాల్చింది. క్రీ.పూ. 2వ శతాబ్దంలో విష్ణువును నారాయణుడనే అవైదిక దేవుడితో కలిపేశారు. అతడిని ‘భగవత్‌’ అని, అతని అనుచరులను ‘భాగవతులు’ అని పిలిచారు. పశ్చిమ భారతదేశంలో వుండే ‘వృష్టి’ తెగ నాయకుడైన కృష్ణ – వాసుదేవుడిని విష్ణువులో ఐక్యం చేశారు. (ఆర్‌.ఎస్‌. శర్మ)

          మహాభారతాన్ని కృష్ణుడు ప్రధానంగా తిరగరాశారు.

          కృష్ణుడు పశుపాలకుడు. పశుపాలక తెగల్ని కృష్ణుడి పేరుతో వ్యవసాయంలోకి దింపారు. బలరాముడికి ‘నాగలి’నిచ్చారు. ఇనుప యుగంలో అడవుల్ని నరికి వ్యవసాయ భూములుగా మార్చాలి. ఇందుకు అడవులలో నివసించే గిరిజన తెగలు అడ్డొచ్చాయి. రెండే మార్గాలు. ఒకటి : గ్రీస్‌, మసపొటేమియా, రోమ్‌లలో లాగ సమూలంగా వారిని నిర్మూలించటం. రెండు : వారిని సాంస్కృతికంగా మార్చి తమవైపు త్రిప్పుకొని వ్యవసాయానికి మళ్లించటం. ఇది రక్తం పారించే యుద్ధంగాదు. మానసికంగా బానిసలను చేసే సాంస్కృతిక దాడి.

          కృష్ణుడికి మరిన్ని రూపాలనిచ్చారు. ఆటవిక తెగలకి కూడ దేవుడ్ని చేశారు. అగ్రవర్ణాల దేవుళ్లకి గిరిజన దేవతనిచ్చి పెళ్లిళ్లు చేశారు. కృష్ణుడికి వేలాది భార్యలను కట్టబెట్టారు. మన నర్శింహస్వామికి చెంచులక్ష్మి, భీముడికి హిడింబను యిచ్చారు. రామాయణంలో వాలి, సుగ్రీవులు, హనుమంతుడు, భారతంలోని ఘటోత్కజుడు ఆటవిక తెగలకి చెందినవారే. వారిని తమ బంట్లుగా త్రిప్పుకున్నారు. శబరి కథ వాల్మీకి రామాయణంలో లేదు. తర్వాత చేర్చబడిన ఒక ఉపకథ. ఆటవిక తెగలన్నిటికి నాగుపాము దేవుడు. వారిని ‘నాగులు’ అని కూడ అంటారు. ఆ నాగుపాము విష్ణువుకి పాన్పు అయింది. శివుడి మెడలో హారమైంది.

          గుప్తుల కాలంలో బ్రాహ్మణుల నూతన మత భావజాలం సేవలకి పరవశులైన గుప్తులు భూదానాలు చేశారు. అవి ఎక్కువగా అటవీ భూములు, బంజర్లు. ఆ భూములను సాగుచేయటానికి ఆటవికులను వ్యవసాయంలోకి దింపారు. వారికి బ్రాహ్మణులు పంచాంగం చెప్పారు. ఋతువుల ప్రాముఖ్యతను బోధించారు.  తిధి, నక్షత్రాలు చూసి భూములను దున్నించారు. పంటలను తమ ఇళ్లకు తోలించారు. గిరిజన పండుగలను వ్యవసాయ పండుగలుగా మార్చి శాస్త్రోక్తంగా చేయించారు. దానాలు పొందారు. గిరిజన తెగలను వర్ణవ్యవస్థలోకి తీసుకురావాలి. నాలుగు వర్ణాల వ్యవస్థ ఇందుకు సరిపోదు. వర్ణం కులవ్యవస్థగా మారింది. వేలాది ఆటవిక తెగలు కులాలుగా రూపొందాయి.

          ఈ సమాజం ఇలాగే సజావుగా సాగాలంటే దీనికో తార్కిక ముగింపునివ్వాలి. ఇది అందరి సమాజంగా గుర్తింపు పొందాలి. దీనిలో రాజ్యవ్యవస్థ, వర్ణవ్యవస్థ కీలకం.

          రాజ్యవ్యవస్థ ఎలా వుండాలో కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో చెప్పాడు. వర్ణవ్యవస్థను ఎలా కాపాడుకోవాలో మనువు మనుస్మృతిలో చెప్పాడు. దీనికి ఒక తాత్త్విక ముసుగు వేయాలి. భగవద్గీత పుట్టింది. ఎవరి ధర్మాన్ని వారు ప్రతిఫలాక్ష లేకుండా ఆచరించాలి. ఈ జన్మలో నీవు చేసిన కర్మఫలాన్ని వచ్చే జన్మలో అనుభవిస్తావు. అంటే ఈనాటి కన్నీళ్లు, కష్టాలకు తలొగ్గితే, వచ్చే జన్మలో సుఖాలు దక్కుతాయి. క్షత్రియుడి రక్తసంబంధం కంటె రాజ్యమే ముఖ్యం. అందుకు అవసరమైతే యుద్ధం చేయి. రక్తసంబంధాలకు ఇక్కడ తావులేదు. ఇలా కృష్ణుడు అర్జునుడికి చెప్పి ఒకనాటి తెగ రక్తసంబంధాల్ని చావుదెబ్బ కొట్టాడు. రాజ్యవ్యవస్థను, వర్ణవ్యవస్థను అన్నిటికి మూలం చేశాడు. ఈ సందేశం సాధారణ ప్రజలకి చేరాలి. ఎలా? రామాయణ భారతాలను అందరూ వినవచ్చు. శూద్రులతో సహా. వేదాలకున్న నిషేధం లేదు. పనిలోపనిగా పాతివ్రత్యం మహిమలు తెలుసుకోవాలనేమో, స్త్రీలు కూడా వాటిని పారాయణం చేయవచ్చు అన్నారు. ఇంటింటికీ రామాయణం, భారతం చేరాయి. మతం, కులం, రాజ్యం గీచిన గీత ఈనాటికీ పదిలంగా వున్నాయి.

admin

Related Posts

leave a comment

Create AccountLog In Your Account