మాలకుంట

మాలకుంట

– సింధు

          మండలంలో అదో పెద్ద గ్రామపంచాయతి. ఆరువేలకు పైగా జనాభా ఉంటుంది. అందుకే దాన్ని పేట అంటారు. ఊరుకు తూర్పున ఉత్తర దక్షిణంగా మాలవాడ, మాదిగ వాడలున్నాయి. ఈ వాడలు చెరో గ్రామ పంచాయితిలా వుంటాయి. రెండింటి మధ్యన లోతట్టు. మధ్యన కాపుల, తెనుగుల, రెడ్ల, గౌండ్ల వారి పొలాలకు, చేళ్ళకు దారుంది. దారికి ఇరువైపుల ఇరువాడలకు వెట్టిమడ్లు ఉన్నాయి. ఇవి వివిధ వృత్తులు చేసే మాల, మాదిగలకు ఇచ్చిన ఇనామ్‌1 భూములు. ఒక్కొక్క కుటుంబానికి అయిదు కుంటలకు మించి వుండదు. ఈ చిన్న కమతాలు కూడా ఏటవాలుగా ఉండడంతో నాగలి కూడా తిరగని చిన్న చిన్న మళ్ళుగా  వున్నాయి. ఊరివారి పొలాలకు తూర్పువైపున దామర చెరువు వుంది. ఈ చెరువు శిఖం పై భాగమున దట్టమైన అడవి వుంది. దీనికి కుడి, ఎడమ రెండలుగులున్నాయి. కుడి అలుగు పారితే మాలవాడకు పైన  ఉన్న మాలకుంటకు వస్తాయి. ఎడమ అలుగుపారకంతో మాదిగల పొలాలు పండించుకోవాలి. వర్షాలు బాగా పడితే మూన్నెళ్ళకు పైగా అలుగు పారుతుంది. అందుకే ఆ కాలానికి సరిపడే వరినే నాటుకుంటారు. కాలం పోతే పంటలు ఎండుతాయి.

          మాలకుంట నిండుతే మాలల పొలాలు పండుతాయి. దామర చెరువు మధ్య తూము ఊరి పొలాలకే  గాని, ఈ ఇరు వర్గాల భూములకు ఎక్కవు. అందుకే జలపంటలు2 పండిస్తారు. లేకపోతే బీడుంటాయి. రానురాను ఎవుసం బందు కావడంతో ఉన్నకాస్త భూములు పడీతుగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఇరువర్గాలకు ఆ వెట్టిమడ్లు3 బొందలగడ్డగా మారిపోయాయి. వేసవిలో పశువుల కోసం పొదులు4 వేస్తారు.

          మాలకుంటకు పశ్చిమాన ఊరి శ్మశానం వుంది. శ్మశానం పక్కనుంచే అడవిలోకి దారి వుంది. ఊరికి కావల్సిన కలపను, వంట చెరుకును ఈ దారి గుండానే జనాలు బండ్లపై తెచ్చుకుంటారు. చనిపోయిన వ్యక్తులకు కావల్సిన కట్టెను అడవినుంచే కొట్టుకొస్తారు. ఒకప్పుడు పులులకు నిలయమైన అడవి బయలుగా మారింది. కొండెంగలు, ఎలుగుబండ్లు, అడవి పందులు మాత్రమే ఇప్పుడు మిగిలాయి.

          ఊరుకు ఆనుకోని పశ్చిమాన పెద్ద చెరువుంది. దీని పైభాగన ఉల్లెంగ చెరువు. ఆవలగల అడవిలో మద్దికుంట వుంటాయి. పెద్ద చెరువు కింద సగం పొలాలు దొర నారాయణరావువి కాగా, మిగతావి రెడ్లవి, బ్రాహ్మలవి, కోమట్లవి, అయ్యవార్లవి, సాలెవారివి! ఈ చెరువు నీళ్లే గ్రామ జనం ఇప్పటికీ తాగుతారు. పెళ్ళీలకు, పేరంటాలకు బండ్లపైన టాకీలు పెట్టి ఈ చెరువు నీటినే నింపుకొని పోతారు. దీని అలుగుళ్లో చాకిరేవు, కట్టపైన మడేలయ్య గుడి వుంది. అలుగు లోపల బెస్తవారి గంగమ్మ గుడి వుంది.

          కమ్మరి, కుమ్మరి, వడ్రంగులకు, మంగలి, చాకలివారికి భూముల్లేవు. బలంత5 పైన వారు బతుకుతారు. దక్షిణవైపు నుంచే ఊరిలోకి దారి. ఈ దారిలోనే జంగం వారి సమాధులున్నాయి. ఈ సమాధులు ఓ చిన్న ఇల్లులా వుంటాయి. రోడ్డుకు కుడిపక్కన గౌండ్ల వారి రేణుకాదేవి ఆలయం, దీనికి ఆనుకొనే కల్లు డిపో వుంది. ఇక్కన్నుంచే ఊర్లోని రెండు దుకాణాలకు మాల, మాదిగ వాడలకు కల్లు పంపిణీ  జరుగుతుంది. ఊరి మొదట్లోనే విశాలమైన మైదానంలో ఉన్నత పాఠశాల వుంది.

* * * *

          మాదయ్య ఈ మాలవాడలోనే పురుడు పోసుకున్నాడు. ఇక్కడి ఉన్నత పాఠశాలలోనే ఏడవ తరగతిదాకా చదివాడు. ఎనిమిది నుంచి పదోతరగతిదాకా ఉప్పల్‌వాయి రెసిడెన్షియల్‌ స్కూళ్లో, ఇంటర్‌  భిక్‌నూర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలో, డిగ్రీ నాగార్జునసాగర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలో చదివాడు. దేహదారుఢ్యానికితోడు తెలివితేటుండడంతో ఎస్సై ఉద్యోగం దొరికింది.

          తండ్రి బక్కయ్య. బేగరి6 వృత్తి. తల్లి బక్కవ్వ. వ్యవసాయ కూలి. వారసత్వంగా వచ్చిన బేగరి వృత్తి కింద అయిదు గుంటల భూమి వుంది. మాలవాడలో నాగళ్ళు తెరమరుగు కావడంతో భూములన్నీ పడీతుగా మారాయి. బేగరిపని చేసినందుకు ఊర్లో బలంత దొరుకుతుంది. అదీ దోపసలు7 పండుతే ఫర్వాలేదు. ఖరీప్‌ పంట, రెండో పంట పండకపోతే ఊరి జనం బలంత పెట్టడానికి ఇబ్బంది పడుతారు. ఆబితాబి8 పండుతేనే ఇంట్లో కొంత గాసం వుంటుంది. శవాలు కాలబెట్టుతే వచ్చే పైసలు, బక్కవ్వ కూలి డబ్బులు ఇల్లు  గడవడానికి ఆడికాడికే! మాదయ్య ఊషారుండుట్ల ఖర్చు లేకుండానే చదువు, ఉద్యోగం ప్రాప్తించాయి.

          బేగరి, గాదం వృత్తి శవాల్ని కాల్చడం. ఊరిలో ఏ శవమైనా మాలకుంట పక్కన శ్మశానానికే తెస్తారు. దహన సంస్కారాల తర్వాత పెద్ద చెరువుకెళ్లి స్నానం చేస్తారు. సెలవు రోజుల్లో మాదయ్య శవదహనాలుంటే తండ్రితో కూడా పోయేవాడు. అక్కడ జరిగే తంతు మాదయ్యకు అర్థమయ్యేది కాదు. కాడు చుట్టూ తిప్పడం, నీళ్ళ కుండను రంద్రం చేసి ఎత్తుకోని తిరగడం, కింద పడేయడం, అగ్గిపట్టిన మనిషిపై పడి ఏడ్వడం తమాషాగా అనిపించేది. ‘తనూ అట్లనే చేయాలా?’ అని ఆలోచించేవాడు. కాని వారి వాడలో ఇలా శవాన్ని కాల్చడం ఉండదు. అందరిని పాతిపెట్టడమే! ఊరి జనం మాలకుంటలో ఎందుకు స్నానం చేయరో మాదయ్యకు అర్థమయ్యేది కాదు. ఒసారి తండ్రిని అడిగాడు కూడా!

          ‘ఇది మాలకుంట అంటే మనది. మనం వాడే కుంటలో వాళ్ళు తానం చేస్తే మైల పడిపోతారు. పైగా కాలిన శవాల బూడిద ఈ మాలకుంట్లకే వస్తది. అందుకే వారు తానం చేయరు’ అని బక్కయ్య చెపితే,

          ‘మరి మనమెందుకు పెద్ద చెరువులో స్నానం చేయ్యద్దు…?’ అంటూ ప్రశ్నించాడు మాదయ్య.

          ‘అది పెద్దోళ్ళ చెరువు. మనం దాంట్లో కాలుపెట్టద్దు’ అంటూ సమాధానమిచ్చాడు బక్కయ్య.

          మాదయ్యకు అంతగా అర్థం కాలేదు.

          మాలవాడ జీవనమంతా మాలకుంట పైననే. ఈ మాత్రం సౌకర్యం మాదిగలకు లేదు. దగ్గరలోని మోటబావుల నుంచి, దామరచెరువు పారినప్పుడు కయ్యల్లో నిలిచి నీళ్ళను వాడుకోవాల్సిందే! వాడంతా బండ వుండడంతో బోర్లు పడని స్థితి.

          మాదయ్య పెండ్లైన కొద్ది రోజులకే అతని తండ్రి కాలం చేసాడు. తల్లి వారసత్వపు వృత్తిని కొనసాగించేది. అందుకే మాదయ్య రమ్మన్నా పోయేదికాదు. ఊరిగాని ఊరికి రావడం తనతో కాదని చెప్పేది బక్కవ్వ.  ఉద్యోగందృష్ఠ్యా మాదయ్యకు ఊరికి రాలేని పరిస్థితి. ముందు జిల్లాలలోని కోటగిరిలోనే పోస్టింగు. తర్వాత జిల్లాలు మారుతూ కృష్ణాజిల్లా గూడురుకు బదిలీ అయింది.  ఉద్యోగంలో చేరిన కొత్తలోనే గుంటూరు ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన ఏసురాణితో పెళ్ళి జరిగింది. ఇద్దరు పిల్లలు. పెద్దపాప పదోతరగతి. చిన్నపాప ఐదోతరగతి. ఇద్దరు విజయవాడలోని ఓ ఇంగ్లీష్‌ మీడియం రెసిడెన్షియల్లో చదువుతున్నారు.

          ఉన్నట్టుండి తల్లి పోయిందన్న వార్త. ఉటాఉటిన భార్య పిల్లలతో సుమోలో బయలు దేరాడు మాదయ్య. కామారెడ్డికి చేరుకోగానే చిన్నాన్న కొడుకు బాలీరు వచ్చాడు. బాలీరు ఊర్లో పదోతరగతి కానిచ్చి, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటోను తెలిసిన వ్యక్తి దగ్గర పెట్టి మాదయ్యతో సుమోలో బయలుదేరాడు బాలీరు.

          సూర్యుడు నెత్తి మీది నుంచి పడమటికి వంగుతున్నాడు. అశ్లేషకార్తీ కాబట్టి చలిగా లేదు. వేడిగాలేదు. సుమో అద్దా గుండా పడుతున్న కిరణాలు హాయిగా అనిపిస్తున్నాయి. సుమో చప్పుడు తప్ప అంతా గంభీరంగా వుంది. ఏసురాణికి, పిల్లలకు ఏమి మాట్లాడాలో తోయడం లేదు. బాలీరుకు మాటలు ఎలా కల్పాలో అర్థం కావడంలేదు. కూర్చున్నట్లే గాని అంతా బిడియంగా వుంది.

          సుమో రెగ్యులర్‌ రూట్లో కాకుండా, మరో దారిగుండా పోతుంటే, ‘ఇదే రోడ్డు…?’ అంటూ మౌనాన్ని చేదిస్తూ బాలీరును అడిగాడు మాదయ్య.

          ‘గూడెం నుంచే…’ అంటూ మాదయ్య మాటలు కలిపినందుకు బాలీరు సంతోషంగా సమాధానం చెప్పాడు.

          ‘అట్లనా – మరి రామడిపేట రూట్‌…?’ అంటూ ప్రశ్నించాడు మాదయ్య.

          ‘అట్లగూడా పోవచ్చు. ఇది గూడా డాంబరు అయింది. ఈ రోడ్డు మంచిగుందని ఇట్ల పోతున్నాం’ అని చెప్పాడు బాలీరు.

          మళ్లీ కొంచెంసేపు నిశ్శబ్దం. మాదయ్య మదిలో చిన్ననాటి జ్ఞాపకాలు సుడులు తిరగసాగాయి. తాను చదువుకున్నప్పుడు అన్నల ప్రభావం ఉండేది. గ్రామాలన్నీ వారి ఆధీనమే! ఏ గ్రామంలో ఎన్నికలు జరిగేవికావు. ఊళ్లను శాసించిన పెద్దలు పట్టణ బాటపట్టారు. అన్నల ప్రభావం తగ్గడంతో తిరిగి పాత పరిస్థితులు మొదలయ్యాయి.

          సుమో గూడెం దాటి సింగరాయిపల్లి శివార్లోంచి పోతున్నది. సింగరాయిపల్లి పేట మధ్యన అడవంతా ఖాళీ అయింది. రోడ్డెంబట చెరుకు తోటలు, మొక్కజొన్న చేళ్ళు కనపడ సాగాయి. సుమో ఘనపూర్‌ తండా దాటుతున్నది. ఒకప్పుడు దట్టమైన అడవిలో వుండే తండా మైదానంలా కనపడసాగింది. తండా దాటితే ఊరు. ఊర్లోకి రాగానే సుమోను పాఠశాల తూర్పు వైపు నుంచి పొమ్మని పురమాయించాడు బాలీరు.

          ‘అదేంటి… ఊర్లోకెళ్ళిపోదా…?’ అంటూ ప్రశ్నించాడు మాదయ్య.

          ‘లేదన్నా… మొన్ననే పనికి ఆహార పథకం కింద ఈ రోడ్డేసారు…’ అని బాలీరు చెప్పాడు.

          కొత్తగా వేసిన రోడ్డు మాల మాదిగ వాడలకు ఓ బైపాస్‌లా ఉంది. నిన్నటిదాకా ఈ వర్గాలవారి వాడలకు రాకపోకలు ఊరి మధ్యలోని హన్మాండ్ల గుడి ముందర నుంచే సాగించే వారు. ఊరికి అదే కేంద్ర బిందువు. చిల్లర కిరాణం దుకాణాలు, చిన్నపాటి బట్టల దుకాణం, మెడికల్‌ షాప్‌, ఓ ఇద్దరు ఆర్‌ఎంపీలు ఆ సెంటర్లోనే! ఎస్‌బిహెచ్‌ బ్యాంక్‌ గుడికి ఎదురుగా గల గ్రామపంచాయితి భవనంలో వుంది. ఇప్పుడు పరిస్థితి అంతా మారుతున్నది. సెంటర్లో దుకాణాలు ఊరిబయట స్కూలు దగ్గరికి వచ్చాయి. బస్సుస్టాపు ఉండడంతో చిన్నపాటి హోటళ్ళు వెలిశాయి. దగ్గరలోనే కల్లు దుకాణం. మాల మాదిగల జనాలతో పాటు, చుట్టూ వుండే తండాలు ఊర్లోకి పోవల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడా సెంటర్లో మిగిలింది పాడుబడ్డ దొరగడి,  గ్రామపంచాయితి, అందులో బ్యాంకు, వీటికి కాపలాగా హన్మాండ్ల గుడి. భవిష్యత్తులో బ్యాంకు కూడా తరలిపోవచ్చు!

          మాదయ్య మనస్సులో ఏదో మెదల సాగింది. తాను స్కూలుకు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు సెంటర్‌ దగ్గర దారిలో ఉండే గౌండ్ల జానకీ కొడుకు రవితో రావడం, పోవడం చేసేది. బక్కవ్వ ఎప్పుడైనా చిల్లర పైసలిస్తే గుడ్డి కిష్ఠయ్య దుకాణంలో పిప్పరమెంట్లు కొనుక్కోని రవి తాను తినేవారు. రవివాళ్ళ అమ్మ కల్లు తాగేవారి కోసం శనగల్ని వేయించి, ఉప్పు కారం చల్లి అమ్మేది. అప్పుడప్పుడు వాటిని రవి తెచ్చేవాడు. అలా ఇద్దరు శనగల్ని తింటూ స్కూలుకెళ్ళడం ఓ గమ్మత్తుగా వుండేది. రవి ఇప్పుడు ముస్తేదారుగా9 మారి, ఓ పర్యాయం గ్రామ సర్పంచు అయ్యిండట!

          ‘ఊరు బాగా డెవలప్‌ అయిందన్నా…!’ అంటూ సంతోషంతో బాలీరు అంటే….

          ‘ఏం డెవలప్‌మెంట్‌…?’ మధ్యలోనే ప్రశ్నించాడు మాదయ్య.

          ‘మనకో అంగన్‌వాడి, ప్రైమరీ స్కూలు కట్టిండ్రు. అట్లాగే మాదిగ వాడకు కూడా.. ఇక ముందర ఓ పెద్ద ఆర్చీ కడుతరట! చెందాలు పోగుజేస్తున్నరు…’ అంటూ ఈ మధ్యన జరుగుతున్న విషయాల్ని బాలీరు మాదయ్యకు చెప్పసాగిండు.

          ఇవన్నీ వింటున్న మాదయ్యకు మనసెందుకో కలుక్కుమంది. తాను చదువుకున్నప్పుడు ఊర్లో పిల్లలందరితో కలిసి చదువుకునేవాడు. ఇప్పుడు అందుబాటులో స్కూలు పేరున ఏదో అంతరాల దొంతరలో ఇరుక్కుంటుందేమో ఈ అభివృద్ధి అని అనిపించింది.

          ‘మరి, టీచర్లెవరు…?’ అంటూ ప్రశ్నించాడు.

          ‘మనూరోల్లే. ఓ రెడ్డీల సారు మన స్కూల్లో, ఓ బాపనోళ్ళ మేడమ్‌. హరిజనవాడలో….’ అంటూ బాలీరు చెపుతుండగానే ఇల్లొచ్చింది.

          చనిపోయిన గుర్తుగా ఇంటి ముందర కొర్రాయి కాలుతున్నది. జనం మూగి ఉన్నారు. మాదయ్య రాక జనంలో కదలిక తెచ్చింది. కొందరు ఏడ్పులంగించుకున్నారు. సుమో దిగడంతో మాదయ్య ఇంట్లోకి వెళ్ళాడు. తల్లి నిర్జీవంగా ఉన్న దృశ్యాన్ని చూసి ఏడ్పొచ్చింది. అది ఒకే ఒక గది. పైన పెంకులు. వర్షాకాలం తప్ప వంట వెనుక వైపున చేసుకునేది బక్కవ్వ. కొంత పెరడు. అందులోనే స్నానం చేయడానికి పొరకతో కొంత చాటు వుండేది.

          తల్లి చుట్టూ ఆడవారు కూచోని ఏడుస్తున్నారు. బక్కవ్వతో వరుసలు కలిపి ఏడ్చేవారు కొందరైతే, తమ పెనిమీటీలను యాది చేసుకుంటూ ఏడ్చేవారు మరికొందరు. తలవైపు మాదయ్య మేనత్త కూచుంది. మాదయ్యను చూడగానే…..

          ‘ఒరే మాదయ్య మీ అవ్వపోయింది రా…!’ అంటూ శోకాన్ని లంకించుకుంది.

          మాదయ్యకు దుఃఖము ఆగలేదు. అత్తా, చిన్నాన్న బిడ్డ మీదపడి ఏడ్చారు. బయట నుంచి ఎవరో పిలిస్తే బయటికి వచ్చాడు. కొందరు గుసగుసలాడితే, మరికొందరు గట్టిగా మాట్లాడుతున్నారు.

          ‘అవును! కొడుకంటే గట్లుండాలే…. సూడు ఎంత దూరం నుంచి పెండ్లాన్ని, పోరగాండ్లను తోలుకోని అచ్చిండు…..’ అంటూ కొందరంటే –

          ‘ఆ అచ్చిండు. సచ్చినంక అత్తేంది…… రాకపోతేంది…..  ఉన్నప్పుడు ఒక్కసారీ రాకపాయే.. ముసల్దాన్ని తోలక పోకపాయే…’ అంటూ మరికొందరు దీర్ఘాలు తీసారు.

          ఈ మాటలు మాదయ్య మనసును బాణాల్లా తాకాయి. అవును.. తన తల్లిని తన దగ్గరనే వుంచుకుంటే..’ అనుకోగానే మరింత దుఃఖం వచ్చింది.

          ‘ఆ! ఈ ముసల్ది విన్నదా? పాపం కొడుకు రమ్మంటే ఇది ససేమిరా…. అనే’ అంటూ సమాధానం చెప్పారు మరికొందరు.

          అందరి తల్లుల్లాగనే బక్కవ్వ మాదయ్యను పెంచింది. కొడుక్కు పెట్టినంకనే తినేది. బట్టల్ని సౌడు10 బెట్టి మల్లెపూలోలె పిండేది. హాస్టల్లో వున్నప్పుడు వారం, వారం తెచ్చిన బట్టల్ని ఎంచక్కా ఉతికేదో! బక్కయ్య బట్టల్ని కూడా మల్లెమొగ్గలోలె ఉతికేది. ఈ జ్ఞాపకాల దొంతర మాదయ్యను కన్నీరు పెట్టించింది. తండ్రి కన్నీరు చూసి పెద్దకూతురు, ఈ ఇద్దర్ని చూసి ఏసురాణి కన్నీరు పెట్టుకున్నారు.

          ‘ఇంకేందిరా… మాదయ్య అచ్చిండుగా.. కానిద్దాం..’ అంటు కులపెద్ద పురుమాయించాడు.

          ‘అయినా, ఆయన్ని ఓ మాటడుగుండి సందం11 ఎట్లా చేద్దామంటాడో’.. అంటూ మరో పెద్దమనిషి అన్నాడు.

          ‘ఏందిరా ఆన్ని అడిగేది…. ఇదేమన్నా కొత్తగనా….?’ అంటూ, ‘కానియండి…. కానియండి… సప్పుడు..సప్పుడు..’ అంటూ డప్పుల్ని పురమాయించాడు మరో వ్యక్తి.

          ఈ మాటలన్నీ మాదయ్య చెవున పడుతున్నాయి. కళ్ళు తుడ్చుకుంటూ బయటకు వచ్చాడు.

          ‘మాదయ్య! బట్టలిడిసేయి…. అగ్గి పట్టాలే!….’ అంటూ మేనత్త మొగుడు చెపుతుంటే…

          ‘ఫర్వాలేదు…. ఇట్లనే పట్టుకుంట…. అంటూ, ‘ఇంతకి అవ్వను ఎటు తీసుకెళ్తరు..?’ అంటూ కుల పెద్దల్ని ప్రశ్నించాడు మాదయ్య.

          ‘ఎటు తీసుకెళ్ళడమేందిరా…? మునుపు మనం మన మాలకుంట్లనే ఓ పక్కకు బొంద పెడితిమి. మీ అయ్యను కూడా అట్లేగా పెట్టింది. ఇప్పుడాడ పెడుతలేం. మన ఎట్టిమడ్లు పడీతుండబట్టే! ఇప్పుడండ్లనే బొంద పెడుతున్నం. బొంద గూడా తయారైంది….’ అంటూ జరుగుతున్న విషయాల్ని మాదయ్యకు చెప్పాడు కులపెద్ద.

          ‘వద్దు… మా అవ్వను. ఆడపెట్టద్దు…’ అంటూ అనుకోకుండానే గట్టిగా అన్నాడు మాదయ్య.

          ఈ మాటలకు అందరు ఒక్కసారి నిర్ఘాంతపోయారు. ముఖాన్నీ చిట్లించి, ‘మరి యాడ పెడుతవ్‌….’ అంటూ అందరూ ఒక్కసారిగా అడిగారు.

          ‘ఏం లేదు.. మా అయ్య చనిపోయినప్పుడే ఊరోళ్ళ శ్మశానంలో అందరిలా దహనం చేయాలని ఉండే.. అప్పుడు నాకు ధైర్యం లేక ఏం అనలేదు..’ అంటూ నసుగుతు మాదయ్య అంటుంటే, ‘ఏంది… ఈనికేమన్నా పిచ్చా…?’ అంటూ పెద్దమనిషి కోపంగా అరిచాడు.

          ‘అదేం లేదు కాక…. మనం గూడా ఊరోళ్ళలాగా శవాల్ని దహనం చేద్దామని….’ అంటూ సమాధానపర్చబోయాడు మాదయ్య.

          ‘అది ఊరోళ్ళది. అయినా మనకు కాష్టమెక్కడిది12…? బొందపెట్టుడేనాయే…!’ అంటూ వివరించాడు మాదయ్య చిన్నాన్న.

          ‘అవును మనకు బొందనేనాయే! కొత్త రివాజేంది…?’ మరి కొందరు

          ‘ఈనికి పట్నంగాలి సోకినట్లున్నది..’ అంటూ మరో ముసలావిడ దీర్ఘం తీసింది.

          ‘ఏముంది.. కాలబెట్టద్దనే రూలేమన్నా ఉందా…?’ అంటూ మాదయ్య ప్రశ్నించాడు.

          ‘ఊర్లల్ల రూల్సేముంటయి. అన్నీ రివాజులే! ఎనికటినుంచి ఎట్ల వస్తుందో గట్లనే నడవాలి గాని. కొత్త రివాజ్‌ ఎక్కడిది?’ అంటూ మరో తాత.

          ‘ఊరోళ్ళను కాలేస్తరు. మనని బొంద పెడుతరు. అంతే!’ అంటూ కరాఖండిగా చెప్పాడు కులపెద్ద.

          ‘కానీయండి… కానీయండి. ఉద్దోగం చేసుకునేటోనికి గివన్నీ సమజ్‌గావ్‌…’ అంటూ చేయాల్సిన  పనులను పురమాయించారు. డప్పుల చప్పుడు మొదలైంది. సన్నాయిు చావు రాగాన్ని ఆలపించసాగాయి. పాడె కట్టెవారు కడుతున్నరు. కొత్త కుండలో మాదయ్యతో నీళ్ళు తెప్పించారు. కాలుతున్న కొర్రాయిపై పెట్టారు. కోమటి దుకాణంకెళ్ళి తెచ్చిన మూటలోంచి13 వస్తువులన్నీ తీసారు. జరగాల్సిన తంతు జరుగుతున్నది.

* * * *

          మాదయ్య మనసు పరి పరి విధాల ఆలోచించ సాగింది. తన మనసులోని కోరికను చెప్పగానే కులపోళ్లు ఒప్పుకుంటారనే నమ్మకం లేదు. అయినా చెప్పినా ప్రయోజనం కనపడలేదు. తన ప్రమేయం  లేకుండానే పనులన్నీ జరిగిపోతున్నాయి. కనీసం తనని డబ్బు కూడా అడగడంలేదు. తానులేకుండానే కులపెద్దలు చేస్తున్న పనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పాడు. ఇప్పటికీ గ్రామాల్లో మానవీయకోణం కనపడుతున్నందుకు కళ్ళు మరోమారు చెమ్మగిల్లాయి. పట్టణాలకు, పల్లెలకు ఎంత తేడా అని అనిపించింది. అవ్వ తనతో ఎందుకు రాలేదో అర్థమయింది. బహుశ వచ్చుంటే అవ్వ మరింత ముందుగానే చనిపోయేదని మాదయ్య అనుకున్నాడు. ఏదైనా అవ్వ పోయింది. కడసారి చూపుకైనా వచ్చినందుకు సంతోషం మిగిలింది. అయినా తల్లి శవాన్ని దహనం చేయాలనే కోరిక తగ్గలేదు.

          ‘పోనీ, మన మడికట్లల్లనే అవ్వను దహనం చేద్దాం. కట్టె తెప్పియ్యండి….’ అంటూ జేబులోనుంచి డబ్బు తీయబోయాడు మాదయ్య.

          ‘ఓరే మాదయ్య! కట్టె, గిట్టె కాదు బిడ్డా! మనకు రివాజులేని పనులు చేయద్దు. అరిష్టం14. అయినా  కట్టెక్కడికెళ్లి తెస్తవు? ఊరోళ్ళకు హక్కుంది. అడవికెళ్ళి తెచ్చుకుంటరు. మనకది లేదుగా…?’ అంటూ ఉన్న విషయం చెప్పాడు పెద్దమనిషి.

          ‘అదంతా నేను జూసుకుంట…’ అంటూ మాదయ్య చెప్పపోగా, ‘సూస్తవ్‌, సూస్తవ్‌… ఇయ్యుంటవ్‌… రేపోతవ్‌.. ఎప్పటికి ఈడ ఉండేది మేం. కొత్త పద్దతుద్దు…’ అంటూ మిగతా పనును కానియ్యండంటూ చెప్పాడు కులపెద్ద.

          జరగాల్సిన  తంతు  జరుగుతున్నది. బక్కవ్వను కొంత మంది మగాళ్ళు బయటకు తీసుకరాగ, ఆడవారు గొల్లుమని ఏడుస్తూ బయటకు వచ్చారు. ఓ ప్లాస్టిక్‌ కుర్చీలో కూచోబెట్టి చుట్టూ దుప్పటి పట్టి స్నానం చేయించారు. తెల్లగుడ్డను కట్టి, పూలదండలేసి పాడెపై పెట్టారు.

          డప్పులు జోరందుకున్నాయి. సన్నాయి రాగం పెరిగింది. వాతావరణం గంభీరంగా మారింది. పోలీసు అధికారిగా పోలీసు స్టేషన్లో చేసే హుకూం ఇక్కడ నడవదని తెలిసినా, ఏదో ప్రయత్నం చేయబోయాడు.

          ‘మీ అవ్వ కాళ్ళు మొక్కు, పాడె లేపాలే’ అనగానే పెళ్ళాం పిల్లలతో వచ్చి తల్లి కాళ్లు మొక్కాడు మాదయ్య. పాడె కదిలింది. మాదయ్య ముందు  అచేతనంగానే  నడువసాగాడు. నడుస్తున్నట్లే గాని మనసంతా కకావికలమైంది. కుల మత భేదాలు లేవని పుస్తకాల్లో చదువుకున్నాడు. పోలీసుగా ఉద్యోగం చేస్తున్నా అంతా పేపరు మీదనే అని అనుభవంలో తెలుసుకున్నాడు. అయినా, ఊరోళ్ళకు ఒక పద్ధతి, తనకో పద్ధతిని జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అంబేద్కరు కాదు. కాలేకపోయాడు. ఆ మహానుభావుడు  కొంతలో కొంత చైతన్యం నింపాడు. ఆ చైతన్యంతో చదువుకున్న తనలాంటివారు తన వర్గానికై చేస్తున్నదేంటో అర్థం కాలేదు. సమస్య కాల్చడమా, బొందనా అని కాదు. కాని ఈ వ్యత్యాసాలు మనుషుల్ని భిన్న వర్గాలుగానే ఉంచుతున్నాయి. మరికొన్ని అలవాట్లు మరింత బలోపేతం అవుతున్నాయి. ఒకప్పుడు అందరు కలిసి చదువుకునే స్కూళ్లు కులాలవారిగా వేరైతున్నాయి. పట్టణాల్లో ఓ పరిస్థితి. పల్లెల్లో మరో పరిస్థితి! పరిస్థితి ఏదైనా మనుషుల మధ్యన అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ వ్యవస్థకేనా ‘ప్రజాస్వామ్యం, సమసమాజం..’ అని పేరూ….’ అంటూ మాదయ్య మనస్సులో ప్రశ్నించుకోసాగాడు.

          వెట్టిమడ్లు రానే వచ్చాయి. దింపుడు కళ్ళం దగ్గర దించారు. చేతికున్న వెండి15 గోట్లను, ఉన్న ఒక్క ముక్కు పుడకను తీసి అత్త చేతికిచ్చారు. చివరి రోజుల్లో తల్లికి అత్తనే సేవ చేసింది. తాను డబ్బులు మాత్రం పంపగలిగినా తల్లి రుణం తీర్చుకునే భాగ్యం కల్గనందుకు చదువుకోకున్నా బాగుండేదని అనుకున్నాడు మాదయ్య. తాను చదువుకోని ఉద్యోగం చేసుకుంటూ, పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉన్నందుకు అదృష్టవంతుడో, కనీసంగా తల్లికి సేవ చేయలేని దీనావస్థకు దురదృష్టవంతుడో తెల్చుకోవడానికి మాదయ్య సతమతమయ్యాడు.

          బొంద రానే వచ్చింది.  బొంద చుట్టూ తిరగడం, కుండ నెత్తుకోని తిరగడం ఎత్తేయడం, తన మీద పడి అందరూ ఏడ్వడం చకచకా జరిగిపోయాయి.  బక్కవ్వపై మట్టి పెళ్లలు పడుతుంటే, తన గుండెను తాకినట్లుగా ఫీలయ్యాడు మాదయ్య. బొంద నిండింది.

          పైసల పంపకాలు జరిగాయి. అందరు మాలకుంటలో స్నానానికి వెళ్ళారు. నీరంతా బురదగా ఉంది. పైనంతా బూడిద తేలుతుంది. ఊరి శ్మశానం బూడిద వర్షానికి కొట్టుకచ్చింది. అందులోనే మునిగి తేలారు.  మాదయ్య, పెళ్ళాం పిల్లలతో మునిగాడు.

* * * *

          తల్లిని పండబెట్టిన తలాపుకు దీపం పెట్టారు. దీపం చూసి అందరు మొక్కుకుంటూ ఎవరి దారిన వారు పోయారు. చిన్నమ్మవాళ్ళు వండితే అక్కడే తిన్నాడు. వేడన్నంతో పచ్చిపులుసు తన తల్లిని జ్ఞప్తికి తెచ్చాయి. తనకు పచ్చిపులుసు ఇష్టమంటే వెంటనే చేసేది తల్లి. బహుశ భవిష్యత్తులో పచ్చిపులుసుతో తినే  భాగ్యం తనకు రాకపోవచ్చు….! కళ్ళల్లో కన్నీరు సుడులు తిరుగుతుంటే తల్లే వండిపెట్టినట్లుగా భావిస్తూ తిన్నాడు మాదయ్య.

          అప్పటికే చీకటి పడింది. తిరిగి పెద్దలందరు జమయ్యారు. స్తంభానికి రెండేసిగా ఉన్న కరెంటు దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి. చల్లనిగాలి వీస్తుంటే అందరు అరుగులపైన కూచున్నారు.

          ‘చెప్పయ్యా! మాదయ్య…. దినాలెట్ల16 జేస్తవ్‌….?’ అంటూ కులపెద్ద నిశ్శబ్దాన్ని చీల్చుతూ ప్రశ్నించాడు.

          ‘నాకేం దెలుసు…. మీరెట్లంటే గట్లనే….’ అంటూ ముక్తసరి జవాబు ఇచ్చాడు మాదయ్య. మాదయ్యలో  ఓడిపోయాననే బాధ ఉంది. తానుండి చేసేది కూడా ఏమి లేదు. ఏమి చేసినా తల్లి తిరిగి రాదు. ఇదంతా ఉపశమనానికి జరిగే ఓ తంతు. లేకుంటే బాధను దిగమింగడం కష్టం. అందుకే చర్చ పెట్టకుండా మాట్లాడాడు మాదయ్య.

          ‘సరే! ఖర్సును బట్టి పనుంటది. కులపోల్లకు కుడుపుంటుంది17. కల్లుగిల్లుండనే ఉండే! యాట18 సంగతేంటి? యాటల్ని బట్టి వాడలో చెప్పాలి…’ అంటూ వివరించాడు మరో పెద్ద మనిషి. వివరాలకు పోకుండా.. ‘ఎంతైదదేంటి..?’ అంటూ అడిగాడు మాదయ్య.

          ‘నువ్‌ పెట్టిందాని బట్టి…. ఏడెనిమిది వేలైతే గావాలి. ఇయ్యాటి ఖర్సు మూడువేలు…’ అంటూ చెప్పుకపోయాడు లెక్కల్ని చూసే మరో కుల పెద్ద.

          ‘సరే! ఓ ఇరవై వేలుంచండి…’ అంటూ మాదయ్య కులపెద్దకు ఇచ్చాడు.

          అందరు ఆశ్చర్యపోయినా – ఉద్యోగస్తుడు కాబట్టి ఖర్సు చేస్తున్నడని తీసుకున్నారు.

          తెల్లవారింది. బాలీరును తీసుకొని తల్లి బొంద దగ్గరికి పోయాడు. కాళ్ళదిక్కు మరోసారి మొక్కి పిడికెడు మట్టిని తీసి దస్తీలో కట్టుకున్నాడు. ఉన్నవాళ్ళు ఎముకల్ని గంగలో కలుపుతారు. ఆపనిచేద్దామంటే తల్లి ఎముకలు లేకుండా పోయాయి. కనీసం మట్టినన్నా కలుపుదామనే ఆలోచనతో తిరుగు ప్రయాణమయ్యాడు.

          వస్తూవుంటే మాలకుంట, శ్మశానం, ఊరి మధ్యలో హన్మాండ్ల గుడి చుట్టూ కోమటి దుకాణాలు, కొత్తగా వేసిన రోడ్డు, మనసులో మెదలసాగాయి. తన మనుసులోని కోరిక, ఎప్పటికి నెరవేరదని అర్థమయింది. పుస్తకాల్లో చదువుకున్నదానికి, వాస్తవ స్థితికి ‘ఎంత తేడా?’ అని అనిపించింది. చదువుకునే రోజుల్లో హోటళ్లో రెండు గ్లాసుల పద్ధతి ఉండేది. రెడ్డోళ్ళ రాజయ్య పోరాటంతో ఆ విధానం పోయింది. రాజయ్య తనకన్నా సీనియర్‌. మంచి గాయకుడు. ‘అడవి తల్లకి దండాలో….’ అనే పాట ఎంతో గంభీరంగా పాడేవాడు. ఆయన  గొంతు తీయగా ఉండేది. అందుకే గణపతి పండక్కి ఆయనచే యువకులంతా పాటలు పాడిచ్చేవారు. ఆ రోజుల్లో ఊరి మొత్తంగా హన్మండ్లగుడి పక్కనే ఒకే గణపతి పెట్టేవారు. ఆ తొమ్మిది రోజులు ఊరంతా సందడిగా  ఉండేది. రాజయ్యతో తాను కోరస్‌గా పాడేవాడు. తర్వాత కొద్దిరోజులకు అన్నల ప్రభావం రావడంతో రాజయ్యను పోలీసులు పట్టుకెళ్ళారు. యువకులంతా చందాలు పోగు చేసి ఎస్సైకి లంచమిచ్చి విడిపించుకు వచ్చారు. ఇప్పుడు వాడకో గణపతిని పెడుతున్నారు. చివరికి మాల, మాదిగ వాడలో అంబేడ్కర్‌ సంఘం పేరున గణపతుల్ని పెడుతున్నారని బాలీరు చెపితే ఆశ్చర్యం వేసింది. అంబేద్కర్‌ ఉంటే ఏం చేసేవాడని అనిపించింది. మరి, ‘తానేం చేస్తున్నడనే….?’ మరో ప్రశ్న బుర్రలో తొలియ సాగింది. కనీసం రెడ్డీల రాజయ్య పాత్రను కూడా తాను పోషించనందుకు సిగ్గనిపించింది. తానూ, భార్య, పిల్లలు, ఉద్యోగం! ఈ ఊరి గాలి పీల్చి, నీరు తాగి, గాసం19  తిని పెరిగిన తాను ఉద్యోగం పేరున ఎటో వెళ్ళిపోయాడు. తాను ఏమి చేయకుండా, ఊరిలో మార్పును ఆశించడం తన స్వార్థ చింతనే అనిపించింది.

          జ్ఞాపకాలు సుడులు తిరుగుతుండగా సుమో బైపాస్‌ రోడ్డుగుండా ముందుకు సాగుతున్నది. స్కూలు మలుపు తిరుగుతుంటే మరికొన్ని జ్ఞాపకాలు ఎద నుంచి తన్నుక రాసాగినవి.

          కోపం వస్తే ‘నిన్ను మాలకుంట్ల పెట్ట….’ అనే తిట్టు పదాన్ని ఊరి జనం ఎందుకు వాడుతారో మాదయ్యకు అర్థం అయ్యేదికాదు. తల్లిచావు దానికి అర్థాన్ని చెప్పింది. మాలకుంట్ల పెట్టడం అంటే…. బొంద పెట్టడమని ఊరి జనాలు తిట్టుకున్నప్పుడు మాలోల్లతో పోల్చుతారని అప్పుడు అర్థమయింది.

          తండ్రితో కాడు పేర్చడానికి వెళ్ళిన జ్ఞాపకాలు, పీర్ల పండక్కి తల్లి చంకలో ఎత్తుకోని ఊర్లోకి తీసుకొచ్చినప్పుడు మెడలో వేసిన కుడకపేర్లు, బచ్చీసపేర్లు20 వేసిన జ్ఞాపకాలు, మాలసిందోళ్ళు ఎల్లమ్మ కథ చివరి రోజున ఎల్లమ్మ వేషం వేసిన స్త్రీ ఊరిలోకి ఉరికి వచ్చిన జ్ఞాపకాలు, ఊరడమ్మ పండక్కి బైండ్ల ఇస్తారి పోత లింగయ్య దగ్గర మేకపిల్లను జముడుకంతో జోల పాట పాడిన జ్ఞాపకాలు వెంటాడుతుండగా ఊరు తెరమరుగు కాసాగింది.

మాండలికాల వివరాలు :

          1.        ఇనామ్‌ భూములు        –           కులవృత్తులవారికి ప్రభుత్వం ఇచ్చిన భూములు

          2.       జలపొలాలు      –           నీటి దారలకు పండే వరి

          3.       వెట్టిమడ్లు         –           వెట్టి కులవృత్తుల వారికిచ్చిన భూమి (మడులు)

          4.       పొదులు –           వేసవిలో చేళ్ళల్లో పశువులకై వేసే పందిళ్లు

          5.       బలంత            –        కులవృత్తులు చేసినందుకు పెట్టే ధాన్యం

          6.       బేగరి / గాదం    –           కింది కులాలవారు చేసే శవ సంస్కార వృత్తి

          7.       దోపసల్‌           –           వర్ష / వేసంగి

          8.       ఆబి తాబి         –           రెండు పంటలు

          9.       ముస్తేదార్‌        –           కల్లు కాంట్రాక్టర్‌

          10.      సౌడు              –           సున్నపురాయి గల భూమి

          11.      సందం             –           శవాన్ని పూడ్చే / కాల్చే పని

          12.      కాష్టం              –           శవాన్ని కాల్చడం

          13.      మూట            –           శవానికి కట్టే గుడ్డ / అలంకరణ సామగ్రి

          14.      అరీస్టం            –           చెడు

          15.      గోట్లు              –           మున్జేతి వెండి కడియాలు

          16.      దినాలు            –           తద్దినం

          17.      కుడుపు           –           తద్దినంనాడు పెట్టే విందు

          18.      యాట            –           గొర్రె  / మేక

          19.      గాసం             –           తిండి గింజలు

          20.     బచ్ఛీసపేర్లు       –           మిఠాయితో చేసిన దండ

admin

leave a comment

Create Account



Log In Your Account