మందిరమూ – మసీదూ

మందిరమూ – మసీదూ

హిందీమూలం : ప్రేమ్ చంద్ (1925)         తెలుగు స్వేచ్ఛానువాదం : బాలాజీ(కోల్ కతా)

          చౌదరీ ఇత్రత్‌ అలీ ‘కడే’ ప్రాంతానికి పెద్ద జాగీర్దారు. అతని పూర్వీకులు రాచరిక యుగంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి గొప్పగొప్ప సేవలందించారు. దాని ఫలితంగా వారికీ జాగీరు దొరికింది. అతడు తన నిర్వహణా దక్షతతో, తన యాజమాన్యాన్ని మరింత పెంచుకున్నాడు. ఇప్పుడా ప్రాంతంలో అతడ్ని మించిన పేరైన ధనవంతుడు లేడు. బ్రిటిష్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు, ఖచ్చితంగా చౌదరీ సాహెబ్‌ బాగోగులు తెలుసుకోడానికి వస్తుంటారు. కానీ చౌదరీ సాహెబ్‌ మాత్రం కమీషనర్‌ హోదాలోని పాలకుడికి  కూడా సలాము చేయడానికి వెళ్ళేవాడు కాదు. కోర్టులకు వెళ్లనే కూడదని శపథం చేసుకున్నాడు. ముస్లిం మత కోర్టులకూ వెళ్ళేవాడు కాదు. పాలకుడి ముందు చేతులుకట్టి నిల్చోవడం, అతని ప్రతి మాటకీ ‘అవునండయ్యా’ అని వంతపాడడం తన గౌరవానికి తగదని తలచేవాడు. నష్టమొచ్చినా భరించేవాడు గానీ,  సాధ్యమైనంతవరకు ఏ కేసులకూ – దావాలకూ పోయేవాడు కాదు. అలాంటి పనులు చూట్టానికి ముఖ్తార్లు (ప్రతినిధులు) వుండేవారు. నీట ముంచినా పాల ముంచినా వారిదే భారమని వదిలేశాడు. పెర్షియన్‌, అరబిక్‌ భాషల్లో నిష్ణాతుడు, ముస్లిం మత నియమాలు గట్టిగా ఆచరిస్తూ, వడ్డీ వ్యాపారాన్ని పాపంగా భావించేవాడు. ఐదుసార్లు నమాజులు చేస్తూ, ముప్పై రోజులు ఉపవాసముంటూ, క్రమం తప్పకుండా ఖురాన్‌ పారాయణం  చేసేవాడు. కానీ అతడిలో మతపరమైన సంకీర్ణత ఏ కోశానా వుండేది కాదు. ప్రాతఃకాలం గంగా స్నానం చేయడం అతని నిత్యకృత్యమైంది. వర్షం పడినా, మంచు కురిసినా, ఐదు గంటలకే లేచి, కోసెడు దూరం నడిచి  గంగ ఒడ్డుకు చేరుకుంటాడు. తిరిగి వచ్చేటప్పుడు తన వెండి కూజా నిండా గంగ నీరు తెస్తాడు. ఎల్లప్పుడూ గంగ నీరే తాగుతాడు. ‘గంగాజీ’ తప్ప మరో నీరు తాగడు. బహుశా రుషులూ, మునులు కూడా గంగ పట్ల ఇంత గౌరవం కనపరచరేమో! వారానికోసారి లోపలా బయటా ఇల్లు మొత్తం ఆవు పేడతో అలికించేవాడు.  అంతే కాదు,  తన తోటలో ఒక పూజారి ఏడాది మొత్తం దుర్గాదేవి కథా పఠనం చేసేవాడు. సాధువులు, సన్యాసుల ఆదరణా, సత్కారాలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసేవాడు. అది చూసి రాజులు కూడా ఆశ్చర్య పడేవారు. నిత్యవ్రతాలు నడిచేవి. ఇదిలా వుంటే ముస్లిం ఫకీర్ల కోసమూ వేరే పాకశాలలో భోజనం తయారయ్యేది. ప్రతిరోజూ వందలాది ప్రజలు అతడి భోజనశాలలో తినేవారు. ఇన్ని దానధర్మాలు చేసినా ఏ షావుకారుకీ పైసా అప్పు పడేవాడు కాదు. విధి విచిత్రమేమిటంటే రోజురోజుకూ అతడి పరపతి పెరుగుతూనే వుంది. శవదహనం  కోసమైనా, యజ్ఞ యాగాదులకైనా, వివాహాది విందు భోజనాల కోసమైనా,  కావలసినన్ని కట్టెల్ని అతడి అధీనంలోని అడవిలోంచి కొట్టుకోవచ్చు. దానికతడి అనుమతి కూడా అవసరం లేదనే అప్రకటిత ప్రకటన లాంటిదుండేది. హిందువుల పెళ్లి వూరేగింపులకు అతడి తరుపు మనిషి వెళ్లి ఆహ్వానపు చదివింపులు పెళ్లి కుమార్తె కన్యాదానం డబ్బులు తప్పకుండా ఇచ్చేవాడు. పెళ్లికి కావలసిన ఏనుగులూ, గుర్రాలూ, గుడారాలూ,  షామియానాలూ, పల్లకీలూ, తివాచీలూ, విసనకర్రలూ, వెండి అద్దిన అలంకార సామగ్రీ వారడిగిందే తడవుగా అందించేవారు. ఇటువంటి దయార్ద్ర, సుప్రసిద్ధ వ్యక్తి కోసం చావడానికైనా సిద్ధంగా ఉండేవారు అక్కడి ప్రజలు.

2

          చౌదరీ సాహెబ్‌ వద్ద భజన్‌ సింగ్‌ అనే రాజపుత్ర సేవకుడుండేవాడు. ఆరడుగుల జవాను, వెడల్పాటి ఛాతీ, చేతిలో బరువైన లాఠీతో వంద మంది మధ్యలోంచి పోరాడి బయటికి రాగల సమర్థుడు. భయమన్నది అతడి దరి చేరదు. చౌదరీ సాహెబ్‌కు అతనిపై అపారమైన నమ్మకం. ఎంతగా అంటే అతను హజ్‌ యాత్రకు వెళ్ళినప్పుడు కూడా ఇతన్నే వెంట తీసుకెళ్లాడు. చౌదరీకి శత్రువుల కొరతేం లేదు, చుట్టు ప్రక్కల జమీందారులంతా అతడి శక్తినీ, కీర్తినీ చూసి ఈర్ష్య పడేవారు. చౌదరీ సాహెబ్‌ సదా బలహీనుల పక్షానే ఉంటాడు కనుక ఆ భయం వల్ల ఇతర జమిందార్లు తమ ప్రజలపై అత్యాచారం చేసేవారు కాదు. భజన్‌ సింగ్‌  తోడుంటే శత్రువు గడపలో పడుకున్నా భయం లేదనుకునేవాడు చౌదరీ. చౌదరీని శత్రువులు చాలా సార్లు చుట్టుముట్టినా అతడిపై ఒక్క దెబ్బైనా పడనీయకుండా క్షేమంగా తీసుకొచ్చేవాడు భజన్‌ సింగ్‌. అవసరమైతే అగ్గిలోకి దూకే ఇటువంటి వ్యక్తిని ఎవరూ చూసుండరు. అతడు బయటికెళితే చాలు, ‘ఎవరితోనన్నా పోట్లాటకు దిగడుకదా’ అన్న అనుమానంతో, అతడు క్షేమంగా తిరిగొచ్చేదాకా గాబరా పడేవాడు చౌదరీ. కట్లు విప్పిన తోడనే తగాదాకి పోయే పెంపుడు గొర్రెలా వుండేది అతడి వ్యవహారం. ముల్లోకాలలో, చౌదరీ సాహెబ్‌ తప్ప, అతని దృష్టిలో మరెవరూ లేరు. అతడికి రాజావారన్నా, యజమాని అన్నా, దేవుడన్నా అన్నీ చౌదరి సాహెబే. ముస్లింలకు చౌదరీ సాహెబ్‌ అంటే ఒకటే మంట. అతను తన మత వొరవడి నుండి దారి తప్పాడని వారి అనుమానం. ఇంత విచిత్రమైన జీవనవిధానం ఎవరికర్థమౌతుందీ? నిజమైన ముస్లిం అన్నవాడు గంగాజలం తాగుతాడా? సాధుసన్యాసులకు ఆతిథ్యమిస్తాడా? దుర్గాదేవి కథా పఠనం చేయిస్తాడా? ముల్లాలు అతడికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవారు,  హిందువులను దెబ్బతీయడానికి సన్నాహాలు చేసేవారు. చివరికి జన్మాష్టమి రోజున దాడి చేయాలని నిర్ణయించారు. గట్టి దెబ్బతీసి హిందువులు తలదించుకునేలా చేయాలనీ, చౌదరీ సాహెబ్‌ మద్దతుతో ఆటలు సాగవని వారికి తెలిసేలా చేయాలనీ వారి ఆలోచన. అలా చేస్తే చౌదరీ ఏం చేస్తాడో అదీ చూడొచ్చు. అతను గనుక హిందువుల కాపు కాయడానికొస్తే అతడి సంగతీ చూడొచ్చు. హిందూ ప్రేమ దెబ్బకు దిగిపోతుంది.

3

          అది చీకటి రాత్రి. కడే ప్రాంతపు పెద్ద మందిరంలో కృష్ణ జన్మోత్సవం సాగుతోంది. ఓ వృద్ధ భక్తుడు తంబురా మీటుతూ బోసి నోటితో దృపదాలాపన చేస్తున్నాడు. ఢోలు, కంజీరలతో మరికొందరు భక్తజనులు కీర్తనలు పాడటానికి తమవంతు ఎప్పుడొస్తుందా, అని ఎదురు చూస్తున్నారు. ఓ షావుకారు ప్రసాదం కలుపుతున్నాడు. ఆ కోలాహలం తిలకించడానికి వందలాది మంది గుమిగూడారు.

          హఠత్తుగా, చేతిలో కర్రలతో వచ్చిన ముస్లింల ముఠా ఒకటి మందిరంపై రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. ‘రాళ్ళెక్కడ నుంచొస్తున్నాయ్‌? ఎవరు విసురుతున్నారు?’ – గొడవ మొదలైంది. కొంతమంది మందిరం బయటికొచ్చి చూడబోయారు. కాసుక్కూర్చున్న ముస్లింలు వారిపై కర్రలతో దాడి చేశారు. ఆ సమయంలో హిందువుల చేతిలో ఢోలు, కంజీరలు తప్ప ఇంకేమున్నాయ్‌? అంచేత మందిరంలో కొందరు దాక్కోగా, ఇంకొందరు అటూ ఇటూ పరుగెత్తారు. నలువైపులా హాహాకారం!

          చౌదరీ సాహెబ్‌కు సంగతి తెలిసింది. భజన్‌ సింగ్‌ను పిల్చి, ‘‘ఠాకూర్‌! అటు చూడు, ఏదో గొడవ జరిగినట్టుంది. వెళ్లి దుండగులకు హెచ్చరించు, వినకపోతే నాలుగు తగిలించు, కానీ రక్తపాతం కాకుండా చూసుకో’’ అని చెప్పి పంపాడు.

          ఠాకూర్‌ ఇప్పటికే దూరాన శబ్దాలు వింటూ పళ్ళు నూరుతున్నాడు. తగిన ఆదేశం దొరక్క గుండె మీద రాయి పెట్టుకుని కూర్చునున్నాడు. ఈ ఆదేశంతో అతడి కోరిక పండింది. శత్రునాశక లాఠీని భుజాన వేసుకుని ఒక్క ఉరుకులో మందిరానికి చేరుకున్నారు. చూడబోతే అక్కడ ముస్లింలు భారీ కలకలం సృష్టించేశారు. కొందరైతే పారిపోతున్న వార్ని వెంబడిస్తూ మందిరంలోకి ప్రవేశించి, అక్కడి గాజు వస్తువులు పగలగొడుతున్నారు.

          ఠాకూర్‌ కళ్ళు రక్తంతో ఎరుపెక్కాయి, కోపం కట్టలు తెంచుకుంది. అరుస్తూ ఆలయంలోకి ప్రవేశించి  దుండగులను బాదనారంభించాడు. ఒంటరిగా అతడొకవైపు వుంటే, మరోవైపు యాభై మంది ఉన్నారు! కానీ  సింహం సింహమే! ఒక్కడే అందర్నీ ఎదుర్కొంటూ కొందరిని మట్టికరిపించాడు. కోపంతో అతడికేం కానడం లేదు. ఎవడు బ్రతికున్నాడా చచ్చాడా అన్నదీ పట్టించుకోవడంలేదు. ఇంత శక్తి ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియడంలేదు. ఏదో దైవ శక్తి తనకు సహాయపడుతోందని అతనికన్పించింది. ఆ శ్రీకృష్ణుడే తన వెన్నంటి వున్నట్లనిపించింది. మతయుద్ధంలో మానవులు మానవాతీత కార్యాలు సాధిస్తారేమో!

          అటు ఠాకూర్‌ బయల్దేరిన తర్వాత, అతడెవర్నైనా చంపేయడు కదా అన్న భయంతో అతడి వెనకాలే చౌదరీ సాహెబ్‌ కూడా మందిరానికి వచ్చాడు. చూడబోతే ఉపద్రవం ముంచుకొచ్చింది. దుండగులు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతున్నారు. కొందరు కిందపడి మూలుగుతున్నారు, ఇంకొందరు ‘అమ్మో, అయ్యో’ అని అరుస్తున్నారు. ఠాకూర్‌కు కేకవేయాలని అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అతని ముందు నేలకూలాడు. చౌదరీ సాహెబ్‌ అతన్ని గుర్తించినంతనే అతని కళ్లు బైర్లుకమ్మాయి. అతడెవరో కాదు – తన అల్లుడు, ఒక్కగానొక్క కుమార్తె భర్త, తన ఆస్తికి వారసుడు షాహిద్‌ హుస్సేనే!

          చౌదరి పరుగున వెళ్లి, షాహిద్‌ను చేతిలోకి తీసుకొని బిగ్గరగా అరుస్తూ  – ‘‘ఠాకూర్‌, ఇటురా, ఇటురా – లాంతరు! …. లాంతరు తీసుకురా! అయ్యో, నా షాహిద్‌!’’ అని వగరుస్తున్నాడు.

          ఠాకూర్‌ కాళ్ళూ, చేతులూ చల్లబడ్డాయి. లాంతరు తీసుకుని మందిరం బయటకు వచ్చాడు. అవును,  అక్కడున్నది షాహిద్‌ హుస్సేనే. అతని తల చీలిపోయి రక్తం ఉబుకుతోంది.

          చౌదరీ తల బాదుకుంటూ అన్నాడు – ‘‘ఠాకూర్‌, నువ్వు నా వంశదీపం ఆర్పేశావు.’’

          ‘‘అయ్యా, దొమ్మీలో నేనతడ్ని గుర్తించలేదని ఆ దేవుడికి తెలుసయ్యా’’ – ఠాకూర్‌ వణుకుతూ అన్నాడు.

          చౌదరీ – ‘‘లేదు, నేను నిన్ను నిందించడంలేదు. దేవుడి మందిరంలోకి ఎవరికీ ప్రవేశించే అధికారం లేదు. కాకపోతే నా వంశదీపం ఆరిపోయింది, అదీనూ నీ చేతుల్లో అన్న బాధ మాత్రమే. నువ్వు నా కోసం నీ ప్రాణాలు అడ్డేసేవాడివి, అటువంటిది ఆ దేవుడు నీ చేతుల్తోనే నా సర్వనాశనం చేయించాడు.’’

          చౌదరీ సాహిబ్‌ రోధిస్తూ ఈ మాటలంటున్నాడు. ఠాకూర్‌ అపరాధ భావంతో, పశ్చాత్తాపంతో  కుమిలిపోతున్నాడు. తన సొంత కొడుకు చనిపోయినా ఇంత బాధ కలిగేది కాదేమో! అయ్యో! నా స్వహస్తాలతో నా యజమానిని సర్వనాశనం చేశాను కదా! అతడి ఒక్క చెమట చుక్కకు ప్రతీకారంగా రక్తపుటేర్లు పారించడానికి సిద్ధపడేవాడినే! నా అయ్యగారు, నా దేవుడు ఒక్క ఆజ్ఞ ఇస్తే అగ్నిలో దూకడానికైనా వెనకాడను కదా! అటువంటిది నేనే అతడి వంశవృక్షాన్ని తుంచేశాను, అయ్యో, నన్ను నమ్మకద్రోహి అనరా?  ‘‘అయ్యా, నాలాంటి అభాగ్యుడు ఇంకొకడుండడు, నేను కళంకితుడనయ్యాను’’ అని రోధించాడు.

          ఆ మాట అంటూనే ఠాకూర్‌ తన నడుముకు వున్న ఒరలోని కత్తిని తీశాడు. దాన్ని తన గుండెలోకి దింపుకుని తన కళంకాన్ని రక్తంతో కడిగేసుకోవాలని అనుకుంటుండగా, చౌదరీ సాహెబ్‌ చప్పున అతడి చేతిలోని కత్తిని లాక్కొని – ‘‘ఏం చేస్తున్నావ్‌?  స్పృహలోనే ఉన్నావా? ఇది విధి విచిత్రం, నీ తప్పేమీ లేదు, దేవుడు అనుకున్నట్టే జరిగింది. నేనే గనుక సాతాను ప్రభావానికి లోబడి, మందిరంలోకి ప్రవేశించి, దేవుడ్ని  అవమానించినట్లయితే, నీవు నన్ను గుర్తించి కూడా చంపేసినా, నేను నిన్ను క్షమించేవాణ్ణి. ఎదుటి వారి మతాన్ని అవమానపర్చడానికి మించిన పాపం మరొకటి లేదు. ఈ క్షణం నా గుండె పలిగిపోతోంది, ఈ బాధ నా చావుకి దారితీసినా తీయొచ్చు కానీ దేవుని సాక్షిగా నీ మీద నాకే కోపం లేదు. నీ స్థానంలో నేనున్నా, నా యజమాని కొడుకున్నా నేనదే చేసేవాడిని. నా కుటుంబ సభ్యులు నన్ను శూలాలతో పొడుస్తారు, మా అమ్మాయి రోధిస్తూ రక్త ప్రతీకారం కోరుతుంది, ముస్లింలంతా రక్తపిపాసులౌతారు, అందరూ నన్ను మతద్రోహి, మతభ్రష్టుడంటారు, ఎవడో గట్టి మతనమ్మకమున్న యువకుడు నన్ను చంపడానికి కూడా సిద్ధపడతాడు, కానీ నేను న్యాయానికి వెన్ను చూపను. ఇది చీకటి రాత్రి, ఇప్పుడే ఇక్కడ్నుంచి తప్పించుకుపో, మా ప్రాంతానికి పోయి ఏదో శిబిరంలో దాక్కో. అదిగో, చాలా మంది ముస్లింలు వస్తున్నారు – నా కుటుంబ సభ్యులు కూడా – పారిపో, పారిపో!’’

4

          ఏడాదిపాటు భజన్‌సింగ్‌ చౌదరీ సాహెబ్‌ ఉంటున్న ప్రాంతంలో దాక్కున్నాడు. ఒక వైపు ముస్లింలూ, మరోవైపు పోలీసులూ అతడిపై నిఘాపెట్టి వున్నారు. కానీ చౌదరీ సదా అతన్ని గోప్యంగా వుంచేవాడు. తన మతంవారి పోరును సహించాడు, కుటుంబం తిరస్కారాన్ని దిగమింగాడు, పోలీసుల వేధింపులు భరించాడు, మతాధికారుల బెదిరింపులు ఎదుర్కున్నాడు కానీ, భజన్‌ సింగ్‌ ఆచూకీ మాత్రం మూడో కంటికి తెలీకుండా  జాగ్రత్తపడ్డాడు. తన ప్రాణముండగా ఒక నమ్మకమైన సేవకుణ్ణి దయలేని చట్టాల కబంధహస్తాలకు అప్పజెప్ప దలుచుకోలేదు.

          అతని ప్రాంతపు శిబిరాల్లో చాలామార్లు తనిఖీలు జరిగాయి. మతాధికారులు ఇంటి నౌకర్లను, తమ బంధువులను, ఆడవాళ్లను కూడా నిఘాలో పెట్టారు కాని చౌదరీ తన విశ్వాసపాత్రుడు ఠాకూర్‌ జాడ ఎవరికీ తెలీనివ్వలేదు.

          తన ప్రాణాలను కాపాడటానికి, చౌదరీ సాహెబ్‌ ఇబ్బందులుపడడం ఠాకూర్‌కు చాలా బాధ కలిగించేది.  ‘నన్ను పోలీసులకు అప్పజెప్పేయండి’ అని యజమానికి చెప్పాలని పదే పదే కూడబలుక్కునేవాడు కానీ ప్రతిసారీ చౌదరీ సాహెబ్‌ అతన్ని దాక్కోమని మాత్రమే ఆదేశించేవాడు.

          ఓ చలికాలం చౌదరి సాహెబ్‌ తన జాగిర్దారీలోని ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడు. ఈ మధ్య అతను  ఇంట్లో చాలా తక్కువగా వుంటున్నాడు. కుటుంబం వారి మాటల బాణాల నుండి తప్పుకోడానికి ఇదే మార్గమని తలిచాడేమో! భోంచేసి నిద్రపోతుండగా అతని ఎదుట భజన్‌ సింగ్‌ ప్రత్యక్షమయ్యాడు. అతడి రూపం చాలా మారిపోయింది, చౌదరీ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘అయ్యా బాగున్నారా?’’ – అనడిగాడు ఠాకూర్‌.

          చౌదరీ – ‘ఏదో దేవుడి దయ. నువ్వేంటి ఇలా వున్నావ్‌? ఇప్పుడెక్కడ్నుండి వస్తున్నావ్‌?’

          ఠాకూర్‌ – ‘అయ్యా, మరి దాక్కోలేను. మీరాదేశిస్తే, వెళ్లి కోర్టులో హాజరౌతాను. ఎలా రాసిపెట్టి వుంటే అలానే జరుగుతుంది, నా వల్ల మీరు చాలా ఇబ్బందుల పాలవ్వడం నేనింక చూడలేను.’

          చౌదరీ – ‘లేదు ఠాకూర్‌, నేను జీవించి వుండగా అలా జరగనివ్వను. ఉద్దేశపూర్వకంగా నిన్ను నరకకూపంలో పడెయ్యలేను. పోలీసులు వారి ఇష్టానుసారం నిన్ను బలిగొంటారు. నువ్వు ప్రాణాలు కోల్పోతావు. నువ్వు నా కోసం చాలా ప్రమాదాలు ఎదుర్కున్నావు. నేను నీ కోసం ఈ మాత్రం చేయకపోతే,  ఏం ప్రయోజనం? ఇంకేం మాట్లాడొద్దు.’

          ఠాకూర్‌ – ‘అయ్యా! ఎవరైనా మిమ్మల్ని….’

          చౌదరీ – ‘అస్సలు చింతించొద్ద్దు. దేవుడు తలంచకపోతే, నన్నెవరూ ఏం చెయ్యలేరు. ఇప్పుడే ఇక్కడ్నుంచి వెళ్ళు, ఇక్కడ ఉండటం ప్రమాదకరం.

          ఠాకూర్‌ – ‘మీతో అయినవారెవరూ మాట్లాడ్డం లేదని విన్నాను.’

          చౌదరీ – ‘శత్రువులు దూరంగా ఉండడమే మంచిది.’

          కానీ ఠాకూర్‌ మనసులో గూడుకట్టుకున్న భావం తొలగిపోలేదు. అతడి ఆలోచన మరింత ధృఢమైపోయింది. తన వల్ల తన యజమాని అక్కడా ఇక్కడా తిరుగుతున్నాడు. ఇక్కడ ఈయనకి సొంతవాళ్లెవరూ లేరు. ఎవరైనా వచ్చి దాడి చేయవచ్చు. అలా జరిగితేనో! ఛీ, నా జీవితమే దండగ!

          ఉదయాన్నే ఠాకూర్‌ జిల్లా అధికారి బంగ్లాకు చేరుకున్నాడు. ‘చౌదరీ మాట మీదే ఇన్నాళ్లూ దాక్కున్నావా?’ – జిల్లా అధికారి అడిగాడు.

          ఠాకూర్‌ – ‘కాదయ్య గారూ, నా ప్రాణ భయంతోనే దాక్కున్నాను.’

5

          ఈ వార్త విన్న చౌదరీ సాహెబ్‌ నిశ్చేష్టుడయ్యాడు. ఇప్పుడేం చెయ్యాలి? కేసు విషయంలో పైరవీలు చేయకపోతే ఠాకూర్‌ను కాపాడటం కష్టం. కేసు కోసం కష్టపడితే ముస్లిం సమాజంలో కలకలం లేస్తుంది. నలువైపుల నుండీ ఫత్వాలు రావడం ఖాయం! ముస్లింలంతా ఠాకూర్‌ను ఉరితీయించాలని కంకణం కట్టుకున్నారు. దానికోసం విరాళాలు వేసుకున్నారు. ముల్లాలు మసీద్‌లో విరాళాల కోసం విజ్ఞప్తులు జారీ చేసి ఇంటింటికి వెళ్లి చందాలు సేకరించారు. ఈ కేసుకు మతం రంగు పులిమారు. ముస్లిం న్యాయవాదులకు మంచి పేరు తెచ్చుకునే అవకాశం వచ్చింది. ఈ జిహాద్‌లో పాల్గొనడానికి ప్రక్క జిల్లాల వారు కూడా వచ్చి చేరారు.

          ఎన్ని ఇబ్బందులొచ్చినా ఈ కేసు కోసం పైరవీలు చెయ్యాలని చౌదరీ సాహెబ్‌ కూడా నిశ్చయించుకున్నాడు. న్యాయంగా చూస్తే, ఠాకూర్‌ నిర్దోషి కనుక నిర్దోషిని రక్షించటానికి ఎవరికీ భయపడనవసరం లేదని భావించాడు. ఇంటి నుండి వచ్చేసి, నగరంలో తిష్టవేశాడు.

          ఆరు నెలల పాటు, చౌదరీ సాహెబ్‌ తన ప్రాణాలకు తెగించి కేసు కోసం పోరాడాడు. నీటిలా డబ్బు ఖర్చుపెట్టాడు. తుఫానులా పరుగులు పెట్టాడు. జీవితంలో గతంలోనూ, భవిష్యత్తులోనూ ఎన్నడూ చేయని  పనులు చేశాడు. ప్రభుత్వోద్యోగులను మెప్పించాడు, న్యాయవాదులకు ముడుపులు కట్టాడు, పై అధికారులకు పారతోషికాలందించాడు, అన్నీ చేసి ఠాకూర్‌ను విడిపించుకున్నాడు. ఆ ప్రాంతం మొత్తం ఖంగైపోయింది. విన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఉదాత్తత అంటే ఇదే! సేవకుడ్ని ఉరిశిక్ష నుంచి తప్పించేశాడు. కానీ మత విద్వేషాలు ఈ మహత్కార్యానికి మరోలా స్పందించాయి. ముస్లింలు మండిపడ్డారు, హిందువులు చంకలు గుద్దారు. తమకున్న ఆ మాత్రం మతగౌరవం కూడా మంటగలిసిందని ముస్లింలు భావించారు. ముస్లింలను శుద్ధిచేసి, పాత లెక్కలు సరిచేసే అవకాశం వచ్చిందని హిందువులు భావించారు. ముల్లాలు ఒకవైపు గట్టిగా సమైక్యం కాగా, హిందువులు కూడా ఐక్యతా సంస్థల జెండాలు ఎత్తిపట్టారు. ముస్లింల ముస్లిమత్వం, హిందువుల హిందుత్వం ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఠాకూర్‌ అడుగులు కూడా ఈ వేలంవెర్రిలో తడబడ్డాయి. దుందుడుకుతనం మొదట్నించీ వున్నదే. ఇప్పుడతడు హిందువులకు నాయకుడయ్యాడు. జీవితంలో ఎన్నడూ శివుడిపై చెంబుడు గంగాజలం వేయనివాడు దేవుళ్లూ దేవతల పేర లాఠీ తిప్పడానికి సమాయత్తుడయ్యాడు. శుద్ధీకరణ కోసం ముస్లింలు దొరక్కపోతే ఒకరిద్దరు చెప్పులు కుట్టే చమార్లను శుద్ధి చేశాడు. చౌదరీ సాహెబ్‌ ఇతర సేవకులు కూడా ప్రభావితమయ్యారు. ఎన్నడూ మసీదు ముందు నిలబడని ముస్లింలు, ఐదుసార్లు నమాజులు చేయడం ప్రారంభించారు, ఎన్నడూ మందిరం వైపు తొంగిచూడని వాళ్లు రెండు పూటలా హారతి పట్టడం ప్రారంభించారు.

          వాడల్లో హిందువులు అధికంగా ఉంటారు. ఠాకూర్‌ భజన్‌ సింగ్‌ వారికి పెద్ద దిక్కయ్యాడు. అతడి లాఠీ బలానికి అందరూ సలాము చెప్పారు. ముస్లింలు సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ, మొదట్లో వారు పై చేయిగా వుండేవారు. ఇప్పుడు హిందువులు సంఘటితమయ్యారు. ఇంకేం? పిడికెడుమంది ముస్లింలు వారి ముందేపాటి?

          సంవత్సరం గడిచింది. జన్మాష్టమి వేడుక మళ్లీ వచ్చింది. హిందువులు తమ గతకాలపు ఓటమిని ఇంకా మరచిపోలేదు. రహస్యంగా ప్రతీకార సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం నుండే భక్తులు ఆలయంలో గుమిగూడడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరి చేతిలో లాఠీలు ఉన్నాయి, చాలామంది పురుషులు నడుము భాగంలో కత్తులు దాచుకున్నారు. అవతలివారిని రెచ్చగొట్టి మరీ గొడవ చేయాలన్నది వారి  నిర్ణయం. ముందెన్నడూ ఈ పండుగ సమయంలో ఊరేగింపు చేయలేదు. ఈ సారి బ్రహ్మాండమైన ఊరేగింపు తీశారు.

          సంధ్యా దీపాలు వెలిగాయి. మసీదులలో సాయంత్రపు నమాజులు ప్రారంభమయ్యాయి. ఊరేగింపు బయలుదేరింది. ఏనుగులూ, గుర్రాలూ, జెండాలూ, బాజాభజంత్రీలూ అన్నీ వున్నాయి. భజన్‌ సింగ్‌ తన శిష్యబృందాన్ని తోడుపెట్టుకుని ముందు వరుసలో ఠీవిగా నడుస్తున్నాడు.

          జామా మసీదు ఎదురుగా కనిపిస్తోంది. శిష్యు తమ తమ లాఠీల్ని అవిసి పట్టుకున్నారు. అందరూ  అప్రమత్తమయ్యారు. అక్కడక్కడా చెల్లాచెదురుగా వున్నవాళ్లు ఒకచోటికి వచ్చారు. ఒకర్నొకరు చెవి కొరుక్కున్నారు. అంతే, వాయిద్యాలు మరింత బిగ్గరగా మోగాయి. జయజయ ధ్వానాలు మరింత బిగ్గరగా చేశారు. ఊరేగింపు మసీదు ముందుకు వచ్చింది.

          అకస్మాత్తుగా ఒక ముసల్మాను మసీదు బయటకు వచ్చి – ‘ఇది మాకు నమాజు సమయం కనుక  వాయిద్యాలు ఆపండ’ని చెప్పాడు.

          భజన్‌ సింగ్‌ – ‘వాయిద్యాలు ఆగవు.’

          ముస్లింలు – ‘ఆపాల్సి ఉంటుంది.’

          భజన్‌ సింగ్‌ – ‘మీ నమాజ్‌ను ఎందుకాపకూడదు?’

          ముస్లింలు – ‘చౌదరీ అండ చూసుకుని చెలరేగకు. ఈసారి నీ మతిపోగొడతాం.’

          భజన్‌ సింగ్‌ – ‘చౌదరీ సాహిబ్‌ బలం మీద మీరున్నారు, ఇది మత వ్యవహారం, మా స్వంత బలం మాకుంది.’

          ఇంతలో ఇంకొంత మంది ముస్లింలు బయటికొచ్చి వాయిద్యాలు ఆపమని అభ్యర్థించారు. కానీ వాయిద్యాలు మరింత జోరందుకున్నాయి. మాటకు మాట పెరిగింది. ఒక మౌల్వీ భజన్‌ సింగ్‌ను మతభ్రష్టుడన్నాడు. ఠాకూర్‌ అతడి గడ్డం పట్టుకున్నాడు. ఇంకేముంది? అవతలి వీరులు బయటికొచ్చారు. కొట్లాట ప్రారంభమైంది. ఠాకూర్‌ గోల చేస్తూ మసీదులోకి వెళ్లి లాఠీతో కొట్టడం ప్రారంభించాడు. ఎవరిది పైచేయిగా సాగిందో చెప్పడం కష్టం. మేము ముస్లింలను వెంటాడి వెంటాడి కొట్టామని హిందువులన్నారు. మేం హిందువులను ఎంతలా కొట్టామంటే వారు మరోమారు మా ముందుకు రారని ముస్లింలన్నారు. కానీ ఈ వివాదాల మధ్యా, ఒక విషయం మాత్రం వాస్తవం – అదే ఠాకూర్‌ భజన్‌ సింగ్‌ అతీంద్రియ శౌర్యం సంగతి! ఠాకూర్‌ అక్కడ లేకుంటే మేము ఎవరినీ సజీవంగా వదిలిపెట్టేవాళ్లం కాదు అని ముస్లింన్నారు. ఠాకూర్‌ సాక్షాత్తూ ఆంజనేయుడి అవతారమే, అతడి లాఠీ అందరినీ మట్టికరిపించిందని హిందువులన్నారు.

          వేడుక ముగిసింది. చౌదరీ సాహెబ్‌ దివాణంలో కూర్చుని హుక్కా తాగుతున్నాడు. అతని ముఖం ఎర్రగా మారివుంది, కోపోద్రిక్తుడై వున్నాడు, కళ్ళ నుండి నిప్పుకణాలు ఎగిసి పడుతున్నాయి. ‘ఖుదా (దేవుడి) ఇల్లు’ కలుషితమైందన్న ఆలోచన అతని హృదయాన్ని వెంటాడుతోంది.

          దేవుని ఇల్లు నాశనమైంది! ఈ దుండగులకు పోట్లాడుకోడానికి వేరే మైదానమే దొరకలేదా? పవిత్రమైన ప్రభువు ఇంట రక్తపాతమా! మసీదును ఇంత కళంకితం చేస్తారా? మందిరమూ దేవుని నివాసమే, మసీదు కూడా! మందిరాన్ని అపవిత్రం చేసినందుకు ముస్లింలు శిక్షకు అర్హులైతే, మసీదును అపవిత్రం చేసిన హిందువులు అదే శిక్షకు అర్హులు కారా?  పైపెచ్చు ఈ పని ఠాకూర్‌ చేశాడు! ఇలాంటి పనే చేసినందుకు అతను నా అల్లుడిని చంపాడు. అతడిలాంటి పని చేస్తాడని నాకు ముందే తెలిసుంటే అతడ్ని ఉరికంబం ఎక్కనిచ్చేవాణ్ణి. ఇలాంటి వాడి కోసం తనెందుకంత కష్టపడ్డాడు? ఎందుకంత అపఖ్యాతి పాలయ్యాడు? ఎందుకంత డబ్బు ధారపోశాడు? ఠాకూర్‌ నా నమ్మకమైన సేవకుడు. అతను నా ప్రాణాన్ని సదా రక్షించాడు. నా చెమట బిందువుకు ప్రతీకారంగా, రక్తపాతం సృష్టించడానికైనా సిద్ధపడేవాడు. కానీ నేడతడు దేవుని  ఇంటిని కలుషితం చేశాడు. దీనికి ఏమిటి శిక్ష? నరకమే! నరకాగ్ని తప్ప వేరే శిక్ష లేదు. దేవుని ఇంటిని కలుషితం చేశాడు. దేవుని ఇంటిని అపవిత్రం చేశాడు. దేవుణ్ణే అపవిత్రం చేశాడు.

          హఠాత్తుగా ఠాకూర్‌ భజన్‌ సింగ్‌ అక్కడికొచ్చి నిలబడ్డాడు.

          ‘నువ్వు మసీదులోకి వెళ్లావా?’ – నిప్పుల కళ్ళతో ఠాకూర్‌ని చూస్తూ చౌదరీ సాహెబ్‌ ప్రశ్నించాడు.

          భజన్‌ సింగ్‌ – ‘అయ్యా, మౌల్వీలు మాపై విరుచుకుపడ్డారు.

          చౌదరీ – ‘నా మాటకు సమాధానమివ్వు. మసీదులోకి వెళ్లావా?

          భజన్‌ సింగ్‌ – ‘అక్కడి వాళ్లు మసీదు లోపల నుండి మాపై రాళ్ళు రువ్వడం ప్రారంభించినప్పుడు, వారిని పట్టుకోవడానికి మేము మసీదులోకి ప్రవేశించాము.’

          చౌదరీ – ‘మసీదు దేవుని నివాసం అని నీకు తెలుసా?’

          భజన్‌ సింగ్‌ – ‘అవునయ్యా తెలుసు, ఆ మాత్రం తెలియదా?’

          చౌదరీ – మందిరంలానే మసీదు కూడా పవిత్రమైన దేవుడి ఇల్లు కాదా?

          భజన్‌ సింగ్‌ దీనికి సమాధానమివ్వలేదు.

          చౌదరీ – ఒక ముస్లిం మందిరాన్ని అపవిత్రం చేసినందుకు చంపడం అవసరమైనప్పుడు, ఒక హిందువు మసీదును అపవిత్రం చేసినందుకు అతడ్నీ చంపాలి కదా?

          భజన్‌ సింగ్‌ దీనికీ సమాధానం చెప్పలేకపోయాడు. చౌదరీ సాహెబ్‌ను ఇంత కోపంగా అతడెన్నడూ చూడలేదు.

          చౌదరీ – ‘నువ్వు నా అల్లుడిని చంపావు, అయినా నేను నిన్ను సమర్థించాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్విచ్చిన శిక్షకు నా అల్లుడు అర్హుడని నేను అనుకున్నాను కనుక. ఒకవేళ నువ్వు నా కొడుకును, ఆమాటికొస్తే నన్ను కూడా అలాంటి తప్పు చేసినందుకు చంపినట్లయితే, నేను ప్రతీకారం కోరేవాణ్ణి కాదు. ఈ రోజు నువ్వదే తప్పు చేశావు. ఏవరో ముస్లిం నిన్ను మసీదులోంచి నేరుగా నరకానికి పంపివుంటే నేను సంతోషించేవాణ్ణి. కానీ నువ్వు మూర్ఖుడిలా అక్కడ్నుంచి తప్పించుకున్నావు. దేవుడు ఈ నేరానికి శిక్ష వేయడనుకుంటున్నావా? తనను అగౌరవపరిచినవాడి తల నరికేయాలన్నది దేవుని ఆదేశం. ఆ ఆదేశపాలన ప్రతి ముస్లిం విధి. దొంగకు శిక్ష పడనంతమాత్రాన, అతడు దొంగ కాడా? దేవుణ్ణి అవమానించానని నువ్వు నమ్ముతున్నావా లేదా?’

          ఠాకూర్‌ ఈ నేరాన్ని కాదనలేకపోయాడు. చౌదరీ సాహెబ్‌ సత్సాంగత్యం అతడి మొండితనాన్ని కుదిపింది. ‘అవునయ్యా, నా వల్ల తప్పు జరిగిపోయింది.’

          చౌదరీ – ‘ఇలాంటి నేరానికై నువ్వే గతంలో శిక్ష వేశావో, అదే శిక్షను అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?’

          ఠాకూర్‌ – ‘నేను ఉద్దేశపూర్వకంగా అల్లుడుగారిని చంపలేదయ్యా.’

          చౌదరీ – నువ్వు చంపకపోయుంటే, నేను నా చేతులతో చంపేవాణ్ణి, అర్థమైందా? దేవుడ్ని అగౌరవపరిచినందుకు నేను నీపై ప్రతీకారం తీర్చుకుంటాను. చెప్పు నా చేతుల్లో శిక్ష పొందుతావా లేదా కోర్టు ద్వారానా? కోర్టు కొన్ని రోజుల శిక్షే వేస్తుంది. నేను నీ ప్రాణాలు తీస్తాను. ఎంత ఆప్తుడివైనా నీపై పిసరంతైనా జాలి కలగదు. నా హృదయం ఎంత క్షోభిస్తోందో ఆ దేవుడికే తెలియాలి. నేను నిన్ను చంపాలి. ఇదే నా మతాదేశం.

          అలా అంటూ చౌదరీ సాహెబ్‌ ఖడ్గంతో ఠాకూర్‌ ఎదుట నిలబడ్డాడు. అదో వింతైన దృశ్యం. పండిన తలతో, వంగిన నడుముతో, ఒక దేవుడిలా ఒక వృద్ధుడు కత్తి పట్టి నిల్చుని వున్నాడు. ఆ వృద్ధుణ్ణి ఒక్క లాఠీ  దెబ్బతో అంతమొందించగల బలశాలి అయిన ఠాకూర్‌ తల వంచుకుని కూర్చుని వున్నాడు. అతడి నరనరాల్లో యజమాని పట్ల గౌరవమే ఉంది. చౌదరీ సాహెబ్‌కు తన మతం పట్ల కూడా అంతే శ్రద్ధ వుందన్న సంగతి అతడు వూహించనే లేకపోయాడు. హృదయగతంగా అతను హిందువు అన్న తప్పుడు అభిప్రాయంలోనే ఇంతవరకూ వున్నాడు. అది తప్పని ఇప్పుడు తెలిసింది. కాకపోతే, తనను ఉరి నుండి తప్పించిన వ్యక్తిని తనే చంపుతానని వూరకనే అంటాడా? చౌదరీలోని పరాక్రమమూ, దయా హృదయమూ ఘర్షణ పడుతున్నాయి. క్రోదమూ, క్షమాగుణమూ – రెంటి మధ్యా ఏదో ఒకదాన్ని తేల్చుకోలేకపోతున్నాడు.  ‘చంపేయ్‌’ అని మతం పోరుతోంది. ‘వదిలేయ్‌’ అని సద్గుణం చెబుతోంది.

          ఠాకూర్‌కు చౌదరీలోని ఈ సంకటావస్థ అర్ధమైంది. గద్గద స్వరంతో ఇలా అన్నాడు – ‘ఆయ్యా, మీ దయార్ద్ర హృదయం నాపై చేయి ఎత్తనివ్వదు. మీరు పెంచి పెద్ద చేసిన ఈ సేవకుణ్ణి మీరు చంపలేరు. కానీ ఈ తల మీదే, మీరే దీన్ని కాపాడారు, మీరే దీనికి హక్కుదారులు. ఇది నా దగ్గరున్న మీ సొత్తు మాత్రమే. మీ సొత్తు మీకు దొరికిపోతుంది. రేపుదయం ఎవర్నైనా మా ఇంటికి పంపి రప్పించుకోండి. నేను ఇక్కడే మీ సొత్తు మీకిస్తే, ఉపద్రవం ముంచుకొస్తుంది. ఇంటి వద్ద ఎవరు చంపారో ఎవరికి తెలుస్తుంది? జరిగిన పొరపాట్లను క్షమించేయండి’ అని చెప్పి ఠాకూర్‌ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

(‘మాధురి’, ఏప్రిల్‌, 1925 సంచికలో ప్రచురితం)

          (నిత్య నమాజులు సాగుతున్న ఒక బహు పురాతన మసీదులో ఓ రాత్రి దొంగతనంగా ‘రామ్‌లల్లా’ విగ్రహాలు ప్రతిష్టించిన తర్వాత, రథయాత్ర రక్తపాతం సాక్షిగా ఆ మసీదును కూల్చివేసిన తర్వాత, అన్యాయపు కోర్టు నిర్ణయం తర్వాత జన్మస్థలమంటూ ఎంతటి దివ్య భవ్య మందిరం కడితే మాత్రం, అది పవిత్ర స్థలం అనిపించుకుంటుందా? దేవుడి ఇల్లు అనిపించుకుంటుందా? ప్రేమ్‌చంద్‌ కథ ఈ ప్రశ్నలకు దాదాపు వందేళ్ల క్రితమే సమాధానం చెప్పింది. కానీ, యాదృచ్ఛికంగా ఆయన కథ ప్రచురితమైన 1925లోనే ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంస్థను ప్రారంభించారు. అనువాదకుడు)

admin

leave a comment

Create Account



Log In Your Account