దగ్ధ గీతం

దగ్ధ గీతం

– డా. జి.వి. కృష్ణయ్య

మనీషా… మన్నించమ్మా…

నీ దేహం చితిపై కాలిపోతున్నా

మా గుండెల్లో మంటలు చెలరేగుతున్నా

తనివితీరా ఏడ్వలేని పిరికితనం

కడసారి చూపులకీ నోచుకోలేని

కడుబీద దళితబిడ్డా..నీకు కన్నీటి వీడ్కోలు!

నీ మానప్రాణాలకు రక్షణలేదు కానీ…

నీ చితిమంటలచుట్టూ లాఠీల పహారా

రాజ్యంగీచిన లక్ష్మణరేఖకవతల

భద్రతావలయంలో దిక్కుమాలిన దీనాలాపన!

కామాంధుల కర్కశత్వానికీ

ధనమధాందుల రాక్షసత్వానికీ

చిత్తకార్తె కుక్కల పైశాచికత్వానికీ

మూకుమ్మడి దాష్టీకానికి

దేహం చిద్రమై హృదయం బద్దలై

నాలుక తెగిన మాటలమౌనం

వినిపించని శోకసంద్రమై

ఆసుపత్రి నాలుగు గోడల మధ్య

మూగవేదనతో రోదనతో

ప్రాణవాయువుతో మృత్యుగవాక్షంలో

పెనుగులాడి పెనుగులాడి అలసిపోయి

నిస్సహాయంగా నిశ్శబ్ధంగా ప్రశ్నిస్తూ…

ప్రాణం వదిలావా మనీషా!

చిదిమేసిన పువ్వుని వదిలేసి నా కొడుకులు

బరితెగించిన ఆంబోతుల్లా తిరుగుతున్నారు!

ఆడమనిషి కంటపడితే చాలు

తల్లిలేదు చెల్లిలేదు సాటిమనిషన్న జాలిలేదు

ఆఫీసు రూముల్లో, కార్ఖానా షెడ్డుల్లో

నడిరోడ్లో బస్‌రూట్లో రైలుబోగీల్లో

పశువుల కాసేకాడ పంటలు కోసేకాడ

విషపుచూపులు ఎంగిలికూతలు

భయం గుప్పిట్లో బతుకు చీకట్లో

అనునిత్యం వేధింపులు సాధింపులు

ఎక్కడమ్మా నీకు రక్షణ?

రాకాసి మూకలు రాజ్యమేలేచోట

ముక్కు చెవులు కోసి మురిసిపోయే నీతి

ఆధిపత్యపు మధపుటేనుగులు

అధికార పీఠాలపైకెక్కి హూంకరిస్తున్నారు

బలుపెక్కిన ధనస్వామ్యం, పేదరికాన్ని ఎక్కిరిస్తోందీ

ప్రాణ భయంతో పరుగులు పెట్టిస్తోంది!

స్త్రీలను పూజించే దేశంలో స్త్రీజాతికి రక్షణ లేదు

కడజాతిపై కనికరం లేదు

అవమానాలూ అణచివేతలూ అతి సాధారణం

యోగిపుంగవుల ప్రవచనాలకు కొదువేలేదు

దేశభక్తి ముసుగులో జాగీరుపాలన ఫాసిస్టుపోకడ

హింసోన్మాదం విచ్చలవిడిగా కొనసాగుతోంది!

కళ్ళుతెరిచి చూడాలి కసితో రగలాలి

కాలానికి ఎదురీదాలి సంకెళ్ళని తెంచాలి

వ్యూహానికి ప్రతివ్యూహం కావాలి

గుండెల్లో ఆవేశం రావాలి

చరిత్రగతిని మలుపులు తిప్పి

సమష్టి నారీశక్తిగ ఎదగాలి

వేగుచుక్కలై వెలుగుదివ్వెలై కదలాలి!!

 (ఉత్తరప్రదేశ్‌లో దళితయువతి మనీషా వాల్మీకి వెన్ను విరిచి, నాలుక కోసి అమానుషంగా మూకుమ్మడి అత్యాచారంచేశారు. హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి మరణించింది. ఆమె శవాన్ని కుటుంబసభ్యులకు కూడా అప్పగించకుండా అర్థరాత్రి పోలీసులే దహనం చేశారు.)

admin

leave a comment

Create Account



Log In Your Account