జెండాలు మారినా, ఎజెండాలు మారని పాలకవర్గాల “జాతీయ విద్యావిధానం”

జెండాలు మారినా, ఎజెండాలు మారని పాలకవర్గాల “జాతీయ విద్యావిధానం”

         ‘‘భవిష్యత్‌ భారతదేశం తరగతి గదిలో నిర్మాణం అవుతుంది’’

          ఈ వాక్యంతో కొఠారీ కమీషన్‌ నివేదిక మొదలవుతుంది.

          తరగతి గది ఒక సాంస్కృతిక కేంద్రం

          ఉపాధ్యాయుడు సాంస్కృతిక సైనికుడు.

          విద్యాబలంతో ఏ లక్ష్యాలు సాధించాలో జాషువా చెబుతారు.

          ప్రజల్ని పీల్చి పిప్పిచేసే దురాచారాల్ని విద్యాబలం అణచివేయాలనీ, విద్య మూఢత్వం అనే పులికి ఇంపైన భోజనం కాకూడదనీ మోసపూరిత కోతలకు రక్షాబంధం కాకూడదనీ, మనిషిని మనిషిగా నిలబెట్టలేని చదువులెందుకనీ నిరసించాడు కవి జాషువా. ప్రజల అభ్యున్నతికి తోడ్పడని చదువులు ఊటసారా లాంటిదనీ, ఆ మత్తు సమాజాన్ని మరింత దిగజారుస్తుందనీ విద్యాసారాన్ని చెప్పాడు.

          ఏడుపదులు దాటిన స్వతంత్ర భారతదేశంలో ఈ విద్యా లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో అంచనా వేయటానికి ప్రభుత్వ మేధావులు సిద్ధంగా లేరు. గతాన్ని సమీక్షించకుండానే కొత్త విద్యా విధానాలను రూపొందించి, దోపిడిశక్తులకు దేశాన్ని ధారపోసే విద్యా సంస్కరణలు ఎప్పటికప్పుడు చేస్తూనే వున్నారు.

          రాజ్యాంగంలో 45వ నిబంధన ప్రకారం 1960 నాటికల్లా 6-14 సం॥ల బాలబాలికలందరికీ నిర్బంధంగా ఉచితంగా ప్రాథమిక విద్య నేర్పాలని నిర్ణయం. ఇప్పుడు జాతీయ విద్యావిధానం-2020లో ఆ లక్ష్యం 2025 నాటికి అందరికీ అక్షరాస్యత అనే నినాదంగా వినిపిస్తున్నారు.

          వాళ్ళ దృష్టిలో అక్షరాస్యత అంటే – అప్పుల పత్రాల మీద – ఒప్పందపు పని విధాన పత్రాల మీద సంతకం చేయగలిగేంత. మార్కెట్‌లో సరుకులపై ఉన్న ఇంగ్లీషు పేర్లను చదవగలిగే వినియోగదారుని అవసరం మేరకు – అంతే. కానీ, నూతన ఆవిష్కరణలకూ, నూతన సమాజాన్ని ఆవిష్కరించడానికీ సొంతంగా ఆలోచించేవాళ్ళు తయారవడానికీ కాదు. అందుకే మాతృభాషలో విద్యని నిషేధిస్తున్నారు. ప్రజలు జ్ఞానవంతులు అయితే చాలు – పాలకవర్గాల పరిధిలో – కానీ చైతన్యవంతులు కాకూడదు.

          మెకాలే ఆంగ్ల విద్యా విధానం ద్వారా తాము (వలస పాలకులు) పాలించే కోట్లాది ప్రజలకూ – తమకూ మధ్యవర్తులుగా ఒక చదువుకున్న వర్గాన్ని తయారుచేయడమే అసలు లక్ష్యం. అదే లక్ష్యం మార్కెట్‌ అవసరాల రీత్యా నేటికీ అమలవుతూ వస్తోంది. నిజానికి వలస పాలకులకు కావాల్సింది మన దేశ అభ్యున్నతి కాదు. ఈ దేశాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థలోకి తీసుకెళ్ళడం వాళ్ళ లక్ష్యం అస్సలు కానేకాదు. ఆ వలస పాలకుల దృష్టిలో భారతదేశం కేవలం ముడిసరుకుల వనరు మాత్రమే. ఆ వనరుల్ని తమకు కట్టబెట్టే – దళారీవర్గాన్ని సృష్టించుకోవడమే ఆంగ్ల విద్య ప్రధాన లక్ష్యం. అదే నేటి 70 ఏళ్ళ పైబడి వలస పాలకులు పరోక్షంగా పొందుతున్నారు. అందుకు ఇక్కడి మత వైరుధ్యాలు, కులాల కుంపట్లు మంచి ఉపాధేయాలు.

          మతతత్త్వ శక్తులకు నిలయమైన ఎన్‌డిఏ – యుపిఏ కూటములు ఇక్కడ పాలకవర్గాల దళారీలు.

          ఇక్కడ నుండి చరిత్రలోకి అవలోకిస్తే – భారతీయ రాజకీయ రంగంలో సంపూర్ణ స్వాతంత్రానికి  ఆలోచనలు చేసిన నేపథ్యంలో జాతీయోద్యమ నాయకులు ‘‘జాతీయ విద్యావిధానం’’ అనే దృక్పథాన్ని ముందుకు తీసుకువచ్చారు. 1906లో కలకత్తా కాంగ్రెస్‌ సభలో జాతీయవిద్య కోసం తీర్మానం చేశారు. ఆ జాతీయ విద్యావిధానం కేవలం గత వైభవాన్ని భవిష్యత్‌ తరాలకు అందివ్వడమే. ముఖ్యంగా భారతీయ అగ్రవర్ణాల సాహిత్యం, చరిత్ర, సంప్రదాయ శాస్త్ర విజ్ఞానం, సంప్రదాయ కళలు, యింకా యుద్ధవిద్య ప్రధానం. వారు ఆంగ్లభాషా పెత్తనాన్ని కూడా తిరస్కరించారు.

          ఈ చారిత్రకదృక్పథంతో చూస్తే – మతతత్త్వశక్తుల కూటమి (ఎన్‌డిఏ)కి ప్రతినిధి అయిన మోడీ ప్రభుత్వం 2020 జాతీయ విద్యావిధానం ఫక్తుగా కొత్త సీసాలో పాత సారాయే.

          ఆనాటి జాతీయోద్యమ నాయకత్వం జాతీయ విద్యావిధానాన్ని సాధించాలంటే – రాజకీయ స్వాతంత్య్రం అవసరమని భావించింది. కానీ, ఆర్ధిక – సాంస్కృతిక పరాధీనత పట్ల నిర్లక్ష్యంగానే వున్నారు అనేకంటే దురాచారాల, మూఢాచారాల మత మౌఢ్య సమాజాన్ని కొనసాగించే పరాధీన ఆలోచనలో వున్నారు అనడం సమంజసం.

          ఈ నేపథ్యంలోంచి దేశం రాజకీయంగా దళారీ బూర్జువాల చేతుల్లోనూ, సామ్రాజ్యవాద బహుళజాతి శక్తుల ఆర్ధిక కబంధహస్తాల్లోనూ 73 ఏళ్ళుగా నలుగుతూనే వుంది.

          ఈ పరిస్థితుల్లో 29-07-2020న కేంద్రమంత్రివర్గం జాతీయ విద్యావిధానాన్ని ఆమోదించింది. 34 సం॥ల తర్జన భర్జనల తరువాత రూపొందించబడిన పరాధీన ‘‘జాతీయ విద్యావిధానం ఇది.

          1986లో రాజీవ్‌గాంధీ నూతన విద్యావిధానం, 1992లో నూతన ఆర్ధిక విధానాలు, జనార్దనరెడ్డి కమిటీ, ఆ తరువాత 2019 జాతీయ విద్యావిధానం ముసాయిదా విజన్‌ 2020 – ఈ వరుసలో రూపొంది నేటి జాతీయ విద్యావిధానం ఎన్‌డిఏ కూటమి సారధ్యంలో – మోడీ పాలనలో విడుదల అయింది.

          భారతదేశంలో పాఠశాలలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం అనే పద్ధతి 1823లో ప్రారంభమైంది. అలాగే విద్యా పరిస్థితుల్ని సర్వే చేయడం. 1822 నుండే ప్రారంభమైంది.

          ఎలాంటి చదువు కావాలి?

          ఏ భాషలో చదువు కావాలి?

          ఎందుకోసం చదువు కావాలి?

          ఈ చర్చ వలస పాలకుల నాయకత్వంలో 1813 నుండి జరుగుతూనే వుంది.

          వేమన చెప్పినట్లు – పెద్దకులంవాడైనా – చిన్న కులంవాడైనా ఏ వంశంలో పుట్టినా, ఎంత ఉన్నతవిద్య నేర్చినా – వీళ్ళంతా ధనవంతునికి బానిస కొడుకులే’’ అన్నట్లు ఈ విద్యావిషయక చర్చలు ఉన్నవాళ్ళ ప్రయోజనాలకే తోడ్పడుతున్నాయి.

          కొఠారీ కమీషన్‌ సూచించిన – మాతృభాషలో విద్య, కామన్‌ స్కూల్‌ విధానం, అందరికీ సమాన అవకాశాలూ, శ్రమకు తగిన ఫలితం, జాతి, కుల, మత, లింగ వివక్షతలు లేని సమాజ నిర్మాణం – మొదలైన లక్ష్యాలు నిర్లక్ష్యానికి గురవుతూనే వున్నాయి. అందువల్ల ఏర్పడిన పరిస్థితుల పర్యవసానాల్ని ప్రజలు అనుభవిస్తూనే వున్నారు. పాలకవర్గాలు తమ సంక్షోభాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నారు.

          యాంత్రిక బోధనాపద్ధతులు ఒకవైపు; జ్ఞాపకశక్తికే ప్రాధాన్యత ఇంకోవైపు; అశాస్త్రీయ పాఠ్యాంశాలు మరోవైపు; ఆన్‌లైన్‌ పాఠాలనే గొప్పలు ఒక వైపు, వాటిని అడ్డుకోలేని పేద విద్యార్థులు మరోవైపు. మొత్తంమీద చదువుకున్న నిరక్షరాస్యుల్నీ, నిరుద్యోగుల్ని తయారు చేయడమే దళారీ పాలకులకు నిత్యకృత్యం. ఉత్పత్తితో సంబంధంలేని, శ్రమని గౌరవించని, సోమరి, బలాదూర్‌ లంపెన్‌వర్గాన్ని తమ రాజకీయ రౌడీ, మాఫియాలకు అనుగుణంగా మలచుకోవడమే ఈ విద్యావిధానం అసలు లక్ష్యం. ఏ స్థాయిలోనైనా చదువు మానేసే అవకాశాన్ని జాతీయ విద్యావిధానం చూపిస్తోంది.

          ఉన్నతవిద్య ఉన్నతవర్గాలకు రిజర్వు చేయడమనే ఆంతర్యం ఈ విద్యావిధానంలో దాగి వుంది. కులవృత్తుల్ని పెంచి పోషించడం ద్వారా చవకగా కూలీలను పెట్టుబడిదారీ వర్గాలకు పంపిణీ చేయడం మరో లక్ష్యం. రాజాజీ ఆనాడు ప్రవేశపెట్టిన ఒంటిపూట బడుల ద్వారా కులవృత్తుల్ని ప్రోత్సహించాలని చూశారు. నేడు మరలా తాజా ప్రయత్నం. ఇప్పుడు మరి ఎంతమంది సింగరాజులు, చెన్నుపాటిలు, మాణిక్యాంబలూ కావాలో!

          ‘‘జాతీయ విద్యావిధానం – 2020’’ అమలుకొచ్చినప్పటి నేటి కరోనా పరిస్థితుల్లో ఈ డొల్లబారిన విద్యావ్యవస్థ మొత్తంగా ఎందుకు కుదేలై, కుప్పకూలిందో సమీక్ష అస్సలు లేదు. ఎందుకంటే విద్యారంగపు బాధ్యత నుండి ప్రభుత్వం పూర్తిగా తప్పుకోవాలన్నదే అసలు ఆంతర్యం. స్వచ్ఛంద సంస్థలకీ, కార్పొరేట్‌ శక్తులకు, సామ్రాజ్యవాద బహుళజాతి శక్తులకు విద్యా విధానాన్ని ధారపోయడమే దాని లక్ష్యం. ‘‘మార్కెట్‌ విద్య’’కు బహిరంగంగా తెర లేపడానికే – ఈ ‘‘జాతీయ విద్యా విధానం – 2020’’!

          ఇంతేకాదు – పాఠ్యపుస్తకాలను ఎన్‌సిఇఆర్‌టి తయారుచేసి రాష్ట్రాలకు పంపించడమంటే ఉమ్మడి  జాబితాలో వున్న విద్యకి తిలోదకాలిచ్చి, కేంద్రీకృతంగా నియంతృత్వ పోకడలతో రాష్ట్రాల హక్కుల్ని దిగమింగి, సమాఖ్య సంస్కృతికి గండికొట్టడమే! విద్యాకాషాయీకరణకి బార్లా తలుపులు తెరవడమే!

          ఆకలి, పేదరికం, అణచివేత, సాంస్కృతిక పతనత్వం, పరాయిభాషా బానిసత్వం, అవిద్య, నిరుద్యోగం ఇన్నిన్ని అణచివేతల మధ్య పీడనను పెంచుకుంటూపోతే – ప్రజలు తెగించి చరిత్రని తామే పునర్నిర్మించు కుంటారు.

          ‘‘పాలు పోసినవాళ్ళు, కూరలు తెచ్చినవాళ్ళు

          చెప్పులు కుట్టినవాళ్ళు, ఇళ్ళు ఊడ్చినవాళ్ళు

          చొక్కాలు కుట్టినవాళ్ళు, కుక్కల్నీ, మొక్కల్ని పెంచినవాళ్ళు’’

          తమకు ఎదురైన పరిస్థితుల తీవ్రతతో బలం పుంజుకొని తెగింపుగా – ఈ ప్రజలే చరిత్రని తిరగరాస్తారు.

          ఆ ప్రజల పాత్రను వేగవంతం చేయడానికే కథ, కవిత, వ్యాసం, నాటకం, రూపకం, పాట, మాట – అదే ప్రజాసాహిత్య, సాంస్కృతిక పోరాట సారాంశం!!

30-09-2020

admin

leave a comment

Create Account



Log In Your Account