డా. జశ్వంతరావు
పెట్టుబడిదారీవిధానం, సామ్రాజ్యవాదం కరోనా వంటి అంటువ్యాధులు పుట్టడానికీ, విస్తరించడానికీ మూలకారణం. లాభాపేక్షే ఏకైక లక్ష్యంగా అది సాగిస్తున్న విధ్వంసం – జల, వాయు కాలుష్యం, ప్రకృతిలోని సమతుల్యతను దెబ్బతీయటం, జీవజాలం నశించిపోవటం, కొన్ని విపత్కర పరిస్థితుల్లో జీవం రూపాంతం చెందటం – ఈ ప్రక్రియలో భాగమే కరోనా వైరస్ పుట్టుక.
కరోనా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించడానికి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆటంకంగా వుంది. కరోనా వైరస్‌ను చైనా వైరస్‌గా పేర్కొంటూ అమెరికాకేమీ కాదంటూ ట్రంపు చూపిన నిర్లక్ష్యం వ్యవస్థాగతమైనది. కరోనా వల్ల దెబ్బతినే పరిశ్రమల నుండి వేల కోట్ల డాలర్ల లాభాలను రాబోయే పరిశ్రమల్లోకి తరలించుకునేందుకు వీలుగా ట్రంపు ప్రజలను తప్పుదారి పట్టించాడు. ఇలా పెట్టుబడి తరలింపులో సెనెటు సభ్యులే వున్నారంటే ప్రజారోగ్యంకన్నా లాభాలే ముఖ్యం.
మధ్య ఆసియాలో మొదటిగా, ఆ మాటకొస్తే చైనా బయటి దేశాలలో కరోనా వచ్చిన దేశంగా ఇరాన్ వుంది. ఇరాన్‌పై ఆంక్షలు విధించటంతో కనీస ఔషధాలను దిగుమతి చేసుకోలేక 5 లక్షల మంది పిల్లలు ఇంతకు ముందే మరణించారు. ఈ దుస్థితిలో కరోనా వచ్చి, ఇరాన్‌లో ప్రజలు వైద్యం కూడా అందక చనిపోయారు. అక్కడి నుండి మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలకు కరోనా విస్తరించింది. అమెరికా గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సాగిస్తున్న దురాక్రమణల ఫలితంగా ఈ దేశాలు ప్రజలకు తగినంతగా వైద్య సౌకర్యాలు అందించలేని స్థితిలో వున్నాయి.
సామ్రాజ్యవాద అమెరికాలోని 50 రాష్ట్రాలలో కరోనా వచ్చిన తర్వాత యూరపు దేశాలన్నిటా వ్యాప్తి చెందిన తర్వాత మాత్రమే మొదట ఆసియా నుండీ తర్వాత యూరపు నుండి విమానాల రాకను ట్రంపు నిషేధించాడు. చైనా, ఆసియా దేశాల వ్యతిరేకంగా వదరుబోతుతనం చూపాడు. ఫలితంగా అక్కడ స్థిరపడిన ఆసియా దేశీయులపై ద్వేషం పెరిగింది; దాడులు సాగుతున్నాయి. తన తిరోగమన కాందిశీక విధానానికి అనువుగా పరిస్థితిని వినియోగించుకుంటున్నాడు.
వ్యాధి నిరోధక చర్యగా సోషల్ డిస్టెన్స్ ని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తిని ఆపటానికది అవసరమే. అయితే దానినమలు జరపడానికి పెట్టుబడి వ్యవస్థే ప్రధాన, మొదటి ఆటంకం. అమెరికాలో 78 శాతం మంది వారం, వారం అందే వేతనంతోనే జీవిస్తారు. వారం చివర జీతం అందకపోతే, తినడానికుండదు; ఇంటినుంచి గెంటివేయబడతారు. 404 కోట్ల అమెరికా ప్రజలకు ఆరోగ్యభీమా లేదు. ఈ అంటువ్యాధి ట్రీట్‌మెంట్ ఖర్చు మీరంటే మీరు భరించాలన్న వివాదం ఇంకా అమెరికాలో తెగలేదు. పశ్చిమ యూరపు దేశాలలో ప్రజల పరిస్థితీ యిదే.
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పేద దేశాల పరిస్థితి మరింత దుర్భరంగా వుంది. నయా ఉదారవాద విధానాలతో ఈ దేశాలన్నిటా వైద్య, ఆరోగ్యరంగాలను సామ్రాజ్యవాద ద్రవ్యసంస్థలు ప్రైవేటీకరింపజేశాయి. వైద్య, ఆరోగ్యరంగాలు ఇంకా ప్రభుత్వరంగంలో వున్న దేశాల్లోనే ప్రజలకు తగిన వైద్య సహాయం అందుతున్నది. చైనా, ఉత్తర కొరియా, మధ్య ఆసియా దేశాలు, సామ్రాజ్యవాద దోపిడీ ఆధిపత్య విధానాలే పేద దేశాల ప్రజల మరణాలకు కారణం.
భారతదేశపు పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. అసంఘటిత రంగంలోని 84 శాతం శ్రామికులు ప్రతిరోజూ పనిచేయకపోతే ఆకలితో పడుకోవాల్సిన స్థితి. సోషల్ డిస్టెన్స్ అన్నది గ్రామాలలో అమలు కావచ్చును గానీ, విదేశాల నుండి వ్యాధి దిగుమతికి కేంద్రాలుగా వున్న దాదాపు 10 మహానగరాలలో అమలుజరపడం దాదాపు అసాధ్యం. ఈ నగరాలలో దాదాపు సగం జనాభా మురికివాడలుగా గుర్తించినా, గుర్తించకపోయినా అదే స్థితిలో వున్న బస్తీలలో బ్రతుకు లీడుస్తున్నారు. నాలుగు మహానగరాల్లో 10×10 అడుగుల గదిలో ఒక కుటుంబం నివశించే స్థితిలో సెల్ఫ్ ఐసొలేషన్ అన్నది అసాధ్యం. ఈ స్థితిలో వ్యాధి వ్యాప్తి నిరోధానికి సోషల్ డిస్టెన్స్, సెల్ఫ్ ఐసొలేషన్ వంటి విధానాలను ప్రతిపాదించి అమలుచేయమని పిలుపునివ్వటం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని ప్రజలపై నెపాన్ని మోపే ప్రయత్నమే.
కరోనా వ్యాప్తి నిరోధానికి సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అయినప్పుడు దానికి తగిన చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌కు ప్రధానంగా గురయ్యేది పేదవర్గాలే. వారి రోజువారీ అవసరాలను తీర్చేందుకు తగిన ఏర్పాట్లను చేయాలి. అది లేకుండా సెల్ఫ్ ఐసొలేషన్ పాటించమంటే పస్తులతో గడపమని చెప్పటమే. తాము వాగ్దానం చేసిన ప్రజాకర్షక పథకాలనే సంపూర్ణంగా అమలుచేయలేని పాలకులపై నమ్మకంలేని ప్రజలు తమ ప్రయత్నాలలో తామున్నారు. దీనిని పాలకులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజలు పట్టించుకోవటంలేదు అన్నట్లుగా మీడియా చిత్రిస్తున్నది.
ఈ విపత్కర పరిస్థితినెదుర్కోవటానికి మనకున్న మార్గం ఒక్కటే, ప్రజల సమైక్యశక్తి. దీనిని వెలికితీస్తే ప్రజలు ఆ విపత్కర పరిస్థితిని అధిగమిస్తారు. మానవ చరిత్ర దీనినే నిరూపించింది.
అయితే దోపిడీవ్యవస్థకు, దోపిడీదారులకు, పాలకవర్గాల నేతలకు ప్రజల సంఘటితశక్తంటే వణుకు పుడుతుంది. తామే రక్షకులమన్న తీరులో విధానాలు తయారుచేస్తారు. ప్రజల చొరవకు అవకాశం లేకుండా చేస్తారు.
(మార్చి 2020లో రాసిన వ్యాసం)