కరోనా వైరస్ (కోవిడ్-19)

కరోనా వైరస్ (కోవిడ్-19)

– ఓ.హెచ్. మిత్ర, 8వ తరగతి

          బయట ఎండ మండిపోతుంటే ఇంట్లోకి వచ్చాను. నా 15 ఏళ్ల కూతురు మంచినీళ్ళు ఇస్తూ ‘‘నాన్నా దొరికాయా?’’ అని అడిగింది. ‘‘లేదమ్మా 7 షాపులు వెతికాను. ఎక్కడా లేవు కాని మాస్కులు మాత్రం దొరికాయి.’’ అంటూ నా కూతురికి మాస్కులు ఇచ్చి కుర్చీలో కూలబడ్డాను.

          కొంతసేపటికి మా ఆవిడ వచ్చి ‘‘హేండ్‌వాష్లు దొరకలేదా?…. మాస్కులింకో నాలుగైదు తేలేకపోయారా?. అయినా ఇంతసేపేంటి?’’ జవాబు ఇవ్వటానికి గ్యాపు లేకుండా ప్రశ్నలడిగేస్తూంది.

          ‘‘హేండ్‌ వాష్ల కోసం 7 షాపులు వెతికానే ఎక్కడా లేవు. అయినా మాస్కులేమయినా తక్కువనుకున్నావా ఒక్కోటి 20 రూపాయలు. 7 షాపులు వెతికితే ఇంతసేపవ్వదా మరి’’. ఓపిగ్గా సమాధానాలు చెప్పుకొచ్చాను. ‘‘చల్లబడ్డాక మళ్ళీ వెలతానులే మన సిటీలో షాపులకు కరువా అంటూ’’ అన్నానికి కూర్చున్నాను.

          అన్నం తింటుంటే నా కూతురు ‘‘నాన్నా చికెన్‌ తినకూడదని మనం వాట్సాప్‌లో చూసాం కదా! కానీ ఈవేళ ప్రైవేట్‌ క్లాస్‌లో కొంతమంది డాక్టర్లు వచ్చి ‘చికెన్‌ తినడం వలన ఎలాంటి నష్టంలేదు. ఎలాగూ రేట్లు తగ్గాయి గనుక లాగించేయండి’ అన్నారు. ఇంతకీ చికెన్‌ రేట్లు ఎంత?’’ అని అడిగింది నారాయణలో చదువుతున్న నా బంగారుతల్లి. ‘‘కేజీ 30’’ కల్పించుకుని చెప్పింది నా ఆవిడ. ‘‘మరి అంతకుముందో అడిగింది నా కూతురు’’ ఈసారి నేను త్వరగా చెప్పేసాను. ‘‘120’’ అని. నా కూతురు ఒక్క క్షణం షాక్‌ తిన్నట్లు ముఖం పెట్టి మళ్ళా తినసాగింది. ‘‘అవునూ మాస్కుల రేట్లు పెరిగాయి కదా మరి చికెన్‌ రేట్లు ఎందుకు తగ్గిపోయాయి’’ నా ఆవిడ యధాలాపంగా అడిగింది. ‘‘ఒక్క చికెన్‌ ఏంటి మొత్తం నాన్‌వెజ్‌ రేట్లన్నీ పడిపోయాయి’’ అన్నాను నేను.

          ‘‘కాని పాపం ఆ అమ్ముకునేవారి పరిస్థితి 120 రూపాయల్ని ఇచ్చి 30 రూపాయల్ని తీసుకున్నట్లు ఉంది. కాని ఇంకెంత కాలంలే ఎండలు ముదిరితే మళ్ళీ మామూలు అయిపోతుంది’’ అన్నాను. ‘‘అవున్నాన్న నిన్న పేపర్లో చదివాను. మాస్కులని నిత్యావసర వస్తువుల్లోకి చేర్చారటగా’’. తానన్న మాటకి ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్న మాటలకి సంబంధం లేదనిపించినా తర్వాత అర్ధమైంది.

          అర్ధమైయ్యాక నాకూ ఒకటి గుర్తు వచ్చింది. అప్పుడు నేనన్నాను. ‘‘నేనూ వాట్సాప్‌లో చూసాను. విదేశాల్లో కూడా మనకిచ్చినట్లే సెలవులు ఇచ్చారు. కాని ఫ్లయిట్లు లేకపోవడంతో అక్కడ చదువుతున్న మన పిల్లలు చిక్కడిపోయారు. పాపం అక్కడ తిండి తిపారం లేకుండా ఉన్నారట’’ అన్నాను. ఇంతలో మా ఆవిడ ‘‘అంతదూరం పంపి చదివించాల్సిన అవసరం ఏంటంట. ఇక్కడ చదివిస్తే కొంపంటుకుంటాయా?’’ అంటూ అంతెత్తు లేచింది. తన కోపం చూసి నవ్వు వచ్చినా తన మాటల్లో నిజముంది అనిపించింది.

          అన్నీ సర్దేసి కొంచెంసేపు న్యూస్‌ చూద్దామని కూర్చున్నాను. లేకపోతే మా ఆవిడ తన సీరియల్స్‌ కోసం నేను రిమోట్‌ ఇచ్చేయాలి మరి. కానీ ఈ మధ్య ఏ ఛానల్‌ పెట్టినా దాని గురించే వస్తుంది. నేను పెట్టిన ఛానల్లో భారతదేశం పటం చూపించి వ్యాధి సోకినవారి సంఖ్యను రాష్ట్రాల వారీగా చెప్పుతూంది. అన్ని రాష్ట్రాలు అయిపోయాక న్యూస్‌ రిపోర్టర్‌ హాలీవుడ్‌ హర్రర్‌ సినిమాలో దయ్యాన్ని చంపే మంత్రం చదువుతున్నట్టు వార్తలు చెప్పుతున్నాడు. అతను చెప్పేవాటిలో నాకు ఒకటి బాగా నవ్వు తెప్పించింది. అదేమిటంటే ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిలబడి చేతులెలా కడుక్కోవాలో చెబుతున్నారు. తర్వాత నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూలో చప్పట్లెందుకు కొట్టాలో చెప్పుతుంటే నేను తట్టుకోలేకపోయాను. చప్పట్లు కొడితే వచ్చే శబ్దానికి వైరస్‌లు చనిపోతాయని వేదాల్లో రాసారట. ఈ దేశంలో ఉన్నందుకు తలెక్కడ పెట్టుకోవాలో అర్ధంకాలేదు నాకు. ఎన్నికలు ఎగ్జాములు పోష్టుపోను ఔతాయనే అంశంపై చర్చలు అవుతున్నాయని న్యూస్‌ రిపోర్టర్‌ చెప్పడం. మా ఆవిడ రిమోట్‌ లాక్కోవటం ఒకేసారి జరగడంతో అక్కడి నుండి వచ్చేసాను.

          ఇలాంటి సమస్యలు వచ్చినపుడు మనదేశం ఎప్పుడు శాస్త్రీయమైన నిర్ణయాలు తీసుకుంటుందా అని అనుకుంటూ హేండ్‌ వాష్లు కొనడానికి బయటికి వెళ్ళాను.

admin

leave a comment

Create Account



Log In Your Account