ఇలీనాసేన్, చత్తీస్‌ఘడ్‌లో కార్మిక ఉద్యమాలలోను, ఆదివాసీల సమస్యలపైనా తన భర్త డా॥ వినాయక్‌సేన్‌తో పాటు పనిచేసిన సంఘసేవిక. తన 69వ ఏట 2020 ఆగస్టు 9న మరణించారు. పిల్లల వైద్యుడు, మానవహక్కుల కార్యకర్త ఐన డా॥ వినాయక్‌సేన్‌పై రాజ్యం మావోయిస్టులకు సహకరిస్తున్నాడన్న ఆరోపణపై అరెస్టు చేసిన సందర్భంగా, ఇలీనాసేన్ రాజ్యం చేసే అకృత్యాలను ఖండిస్తూ ఉద్యమం నడిపారు. ట్రయల్ కోర్టు వినాయక్‌సేన్‌కు 2010లో జీవిత ఖైదు విధించగా, 2011లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఇలీనాసేన్ 1979 చివర్లో, 1980 ప్రారంభంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాయంలో సాగిన వరకట్న హత్యలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలోను, మధుర అనే యువతిపై జరిగిన లైంగిక దాడిని ఖండిస్తూ సాగిన ఉద్యమంలోనూ క్రియాశీలంగా పాల్గొన్నారు. డాలీరాజహరిలో శంకర గుహానియోగి ప్రారంభించిన చత్తీస్‌ఘడ్ గనుల శ్రామిక సంఘటన (సిఎంఎస్‌ఎస్)కు చెందిన షహీద్ హాస్పిటల్ తరఫున భర్తతోపాటు ఆదివాసీ గ్రామాల్లో పనిచేశారు. జండర్ సమస్యలపైనా, వ్యవసాయ జీవ వైవిధ్యంపైనా కృషిచేసే ‘రూపాంతర్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు.
ఆమె కొంతకాలం వార్ధాలో మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాయంలోనూ, బొంబాయిలోని టాటా సామాజికశాస్త్రాల సంస్థలోని మహిళా సమస్యల అధ్యయన కేంద్రంలోనూ పనిచేశారు. ఆదివాసీలతో పనిచేసినప్పటి తన అనుభవాలను రెండు పుస్తకాలుగా ప్రచురించారు.