సంపన్నులైన విజేతలే సమస్తం హస్తగతం చేసుకుంటారు

సంపన్నులైన విజేతలే సమస్తం హస్తగతం చేసుకుంటారు

ప్రపంచాన్ని మార్చుతామంటున్న శ్లిష్టవర్గపు కపటత్వం

ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ ఆంగ్లంలో రాసిన ”Winners Take All” పుస్తక పరిచయం

పరిచయకర్త : జి.వి. భద్రం

                ప్రపంచమంతటిలోనూ అత్యంత సంపన్నులుగా వున్న పిడికెడుమంది వ్యక్తులు తమ దాతృత్వం ద్వారా ప్రపంచాన్ని మార్చివేసే కృషిని కొనసాగిస్తున్నారు. వివిధ ఫౌండేషన్లను, ట్రస్టులను, ఆలోచనాపరుల – మేధావుల ఆలోచనా సమ్మేళనాలను, వేదికలను ఏర్పాటు చేసి వాటి ద్వారా తాము ప్రపంచాన్ని మార్చివేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాము చేబడుతున్న కార్యకలాపాల ద్వారా ప్రపంచమంతటా మిలియన్ల మంది ప్రజలు మేలు పొందుతున్నారనీ, ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఉన్నతస్థాయికి చేరుకొంటున్నారనీ నొక్కి చెబుతున్నారు. తమ దాతృత్వ కార్యకలాపాల ద్వారా ప్రపంచంలోని ప్రజలందరికీ సుఖసంతోషాలని అందించగలమని పదేపదే ప్రచారం చేస్తున్నారు.

                ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా వున్న వీరు, తమ దాతృత్వం ద్వారా, దాతృత్వ కార్యకలాపాల ద్వారా తీసుకువచ్చే మార్పు యొక్క స్వభావ, స్వరూపాలు ఏమిటి? వీరు ప్రచారం చేసే భావాలు, అభిప్రాయాల యొక్క లోతైన అర్దం ఏమిటి? వీరు తమ కార్యకలాపాల ద్వారా, ప్రచారం ద్వారా కోరుకొంటున్న – తీసుకువస్తున్న ‘ప్రాపంచిక మార్పు’ యొక్క మర్మం, అంతరార్థం ఏమిటి అన్న విషయాలను, వివరంగా, సోదాహరణంగా ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ తన పుస్తకం ‘‘విజేతలే సమస్తం హస్తగతం చేసుకుంటారు’’ (Winners Take All) లో కళ్ళకు కట్టేటట్లు వివరించారు.

                ఆనంద్‌ గిరిధరదాస్‌ గతంలో ‘‘నిజమైన అమెరికన్‌’’ – ‘‘భారతదేశం పిలుస్తోంది’’ (”The True American” and ”India Calling”) అనే పుస్తకాలను రచించారు. వీరు ‘ది న్యూయార్కు టైమ్స్‌’ పత్రికకు విదేశీ విలేఖరిగానూ, కాలమిష్టుగాను 2015 నుండి 2016 దాకా పని చేసి ఇటలీ, ఇండియా, చైనా, దుబాయి, నార్వే, జపాన్‌, హైతి, బ్రెజిల్‌, కొలంబియా, నైజీరియా, ఉరుగ్వే, అమెరికాదేశాల నుండి ఆ పత్రికకు రిపోర్టులు పంపించారు. ఆయన ‘అట్లాంటిక్‌’ ‘ది న్యూయార్కు’ ‘ది న్యూ రిపబ్లిక్‌’ పత్రికలకు కూడా వ్రాశారు. ఆయన న్యూయార్కు యూనివర్శిటిలో విజిటింగ్‌ స్కాలర్‌. ఎమ్‌.ఎస్‌.ఎన్‌. బి.సి. సంస్థ ప్రసారాలకు రాజకీయ విశ్లేషకులు. ఆయన రచనలను సొసైటీ ఆఫ్‌ పబ్లిషర్స్‌ ఇన్‌ ఆసియా అనే సంస్థ గౌరవించింది. యేల్‌ యూనివర్శిటీ ఆయనకు ఫెలోషిప్‌ యిచ్చింది. ఆయన న్యూయార్కు పబ్లిక్‌ లైబ్రరీ యిచ్చే హెలెన్‌ బెర్నస్టీన్‌ అవార్డు గ్రహీత.

                ఆయన కొంతకాలం పాటు మెక్కిన్సే సంస్థలో విశ్లేషకుడిగా పని చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాకరమైన టెడ్‌ (TED) అనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల ప్రధాన ఉపన్యాస వేదికలో రెండుసార్లు ఉపన్యసించారు. వీరు ‘ప్రపంచాన్ని మార్చాలి’ అని జరిపిన పలు సమాలోచనాసదస్సుల్లో పాల్గొని, ఉపన్యాసాలు యివ్వటం ద్వారా ఎంతో పేరు పొందారు. ఆ క్రమంలో ఆయన యీ ‘‘అత్యంత సంపన్నులు ప్రపంచాన్ని మార్చటం’’ అన్నదాన్ని ఒక కపటనటనగా అర్థం చేసుకున్నారు. తాను కూడా భాగస్తునిగా వున్న, తన మిత్రులెందరితోనో కూడిన అత్యంత సంపన్నుల బృందం యొక్క నమ్మకాలను, ఆచరణలను, వ్యవస్థను, విమర్శనాయుతంగా పరిశీలించి విశ్లేషణాపూర్వకంగా వ్రాసినదే యీ ‘విజేతలే సమస్తం హస్తగతం చేసుకుంటారు !’ అన్న పుస్తకం.

                ‘ప్రపంచాన్ని మార్చటం’ అన్నదాన్ని అత్యధిక సంపన్నులు తమ బాధ్యతగా తమకుతామే నిర్ణయించుకున్నారు. అయితే యిది ప్రజలకు సంబంధించిన విషయం కనుక ప్రజలుగా మేమే యీ బాధ్యతను చేపడ్తాం అంటూ ప్రపంచ ప్రజానీకం అందుకు ఉద్యుక్తులు కావాలనే ఉద్దేశ్యంతో తాను యీ పుస్తకాన్ని రాసానని ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ తెలియజేశాడు.

                ఈ రోజున అమెరికా అంతటా ఒక రకమైన ‘నూతనత్వం’ ఆవహించి కంపెనీలలో, ఆర్థికవ్యవస్థలో వివిధ ప్రాంతాలలో, పాఠశాలల్లో, సాంకేతికతల్లో, సామాజిక నిర్మాణాల్లో – జేగంటలు మోగిస్తోంది. కానీ యీ నూతనత్వం అన్నది అమెరికన్‌ సమాజంలోకి అభివృద్ధిని తీసుకురాలేకపోయింది. మొత్తం అమెరికన్‌ నాగరికతలో మెరుగుదల తీసుకురావటంలో విఫలమయింది. అమెరికన్‌ శాస్త్రజ్ఞులు వైద్యరంగంలో ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు చేస్తూవుంటారు. కానీ సగటు అమెరికన్‌ యొక్క ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తూనే వుంటుంది. ఇతర సంపన్న దేశాలలోని ప్రజల ఆరోగ్యస్థాయి కన్నా ఇతడి ఆరోగ్యస్థాయి తక్కువగానే వుంటుంది. అలాగే అమెరికాలో శక్తిమంతమైన వీడియోలు, ఇంటర్‌నెట్ల ద్వారా ఉచిత బోధనాపద్ధతులు గణనీయంగా పెరిగినా, 12వ తరగతి చదివే విద్యార్థుల, విద్యాస్థాయి 1992 నాటికన్నా తక్కువ స్థాయిలోనే వుంది. అమెరికాదేశంలో ‘పాకశాస్త్రకళ’ పునరుజ్జీవనం పొందిందని చెబుతున్నా, రైతుల మార్కెట్లూ, సంపూర్ణ ఆహారాలు లభ్యమవుతున్నాయని చెబుతున్నా – ప్రజలకు పౌష్టికాహారం అందని పరిస్థితి వుంది. ఊబకాయం, అందుకు సంబందించిన వ్యాధులవాత పడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గతంలో కన్నా యిప్పుడు ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావటానికి వీలైన సాధనాలు విపరీతంగా అందుబాటులోకి వచ్చినాకూడా, ఆన్‌లైన్‌ ద్వారా కోడింగ్ నేర్చుకోడానికి లేదా ఉబర్‌ డ్రైవరుగా మారే అవకాశాలు విద్యార్థుల ముందు కోకొల్లలుగా వున్నాకూడా, అమెరికాలో స్వంత వ్యాపారాలు కలిగివున్న యువజనుల సంఖ్య 1980 నాటి సంఖ్యలో మూడింట రెండొంతుల స్థాయికి పడిపోయింది. ప్రపంచమంతటా విజయవంతమైన, అమెజాన్‌ ఆన్‌లైన్‌ బడా పుస్తక విక్రయ సంస్థ అమెరికాలోనే పుట్టినా, ప్రజల వినియోగార్ధం గూగుల్‌ సంస్థ 25 మిలియన్ల పుస్తకాలను స్కాన్‌ చేసినా, అమెరికాలో నిరక్షరాస్యత గతంలో మాదిరిగానే మిగిలిపోయింది. సంవత్సరానికి ఒకసారైనా ఒక సాహిత్యగ్రంధాన్ని చదివే అమెరికన్‌ పాఠకుల సంఖ్య, యిటీవలి దశాబ్దాలలో నాలుగవవంతుకు పడిపోయింది. అమెరికా సమాజంలోనే పైనున్న 10 శాతం మంది ప్రజలకు పన్నులు చెల్లించటానికి ముందు వుండే సంపద 1980 నుండి సగటున రెట్టింపయింది. పైనున్న 0.001 శాతం మంది సంపద ఏడురెట్లకు మించి పెరిగింది. కానీ సగటు అమెరికన్‌ యొక్క ఆదాయం 1980 నుండీ ఎటువంటి ఎదుగుదల లేకుండా అదే స్థాయిలో వుంది. అంటే యీ నాల్గు దశాబ్దాలు పాటుగా బ్రహ్మాండమయిన ఆర్థిక అభివృద్ధి జరిగినా ఆ అభివృద్ధి అనేది 117 మిలియన్లమంది అమెరికన్ల యొక్క ఆదాయం పెరగటంలో కనీస మాత్రమైన ప్రభావాన్ని కూడా కుగజేయలేకపోయింది. వివిధ ఆవిష్కరణల ద్వారా, పోటీ యొక్క లాభాలను పీల్చుకోవటానికి వీలుగా ప్రపంచంలోనే బిలియనీర్లు మరింతగా సంపదను కూడబెట్టుకోవటానికి వీలుగా, ఆర్థికవ్యవస్థ రూపొందింపబడింది. ప్రపంచ జనాభాలో పైస్థాయిలోవున్న 10 శాతం మంది, మొత్తం భూగోళంలోగల సంపదలో 90 శాతం సంపదకు స్వంతదారులయ్యారు.

                ఈ రకంగా అమెరికాలోని సంపన్నులు కేవలం డబ్బు మీద, అభివృద్ధి మీద మాత్రమే గుత్తాధిపత్యాన్ని సాధించలేదు. వీరు ప్రపంచంలోని సగటు మానవుని ఆయుఃప్రమాణం కన్నా, 15 సంవత్సరాల అధిక ఆయుఃప్రమాణాన్ని కూడా పొందారు.

                ఈ పరిస్థితులు సాధారణ అమెరికన్‌ ప్రజలు తాము మోసానికి గురయ్యినట్లు అభిప్రాయపడటానికి దారితీసాయి. ఇటీవలి సంవత్సరాలలో అమెరికన్‌ ఓటర్లు తమ వ్యవస్థ పట్ల అనుమాన పడేటట్లుగానూ, నిరసన తెలిపేటట్లుగానూ చేయడానికి యీ పరిస్థితులు కారకమయ్యాయి. తమ సామాజిక, ఆర్థిక, రాజకీయ పాలనావ్యవస్థ ఛిద్రమై పగిలిపోయినట్లుగాను, దాన్ని పునర్నిర్మించాల్సిన అవసరమున్నట్లుగానూ ప్రజల్లో గుర్తింపు పెరుగుతోంది. ప్రజలు పదేపదే వ్యవస్థను గర్హించటం, ఖండించటం, నిరసించటం అన్నది జరుగుతోంది.

                పెరుగుతున్న ప్రజల ఆగ్రహం నుండి తమను తాము కాపాడుకోవటానికి తమ ఎస్టేట్లలో, భవంతుల్లో దాక్కొని వుంటూనే ఈ ‘మూకలకు’ వ్యతిరేకంగా, మరింత రాజకీయ అధికారం కోసం కొంతమంది సంపన్నులు బయటికి వస్తున్నారు. మరోవైపు అనుమానంతోనూ, నిరసనతోనూ కుతకుత లాడుతున్న అమెరికన్‌ ఓటర్లు, జనాకర్షక ఉద్యమాలపట్ల ఆకర్షితులవుతూ, రాజకీయ జీవితంలోకి సోషలిజాన్నీ, జాతీయవాదాన్నీ కేంద్రస్థానంలోకి తీసుకువస్తున్నా అన్నిరకాల కుట్రపూరితమైన సిద్ధాంతాలకు, తప్పుడు వార్తలకు బలయిపోతున్నారు.

                కానీ యిటీవలి సంవత్సరాలలో చాల మంది సంపన్నులు తమ ప్రయోజనాలను పెంపొందించుకునే మరోరకమైన ప్రయత్నానికి పూనుకున్నారు. వాళ్ళు యీ సమస్యను, తమ చేతిలోకి తీసుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నాంటూ కొన్ని కార్యక్రమాలు ప్రారంభించారు. అత్యంతదారుణమైన, అక్రమమైన అసమానవ్యవస్థలో అత్యుత్తమ సంపన్నులస్థాయిలోవున్న విజేతలైన వీరు తాము మార్పునుకోరేపక్షాలవారి సమర్ధకులన్నట్లుగా ప్రకటించుకుంటున్నారు. తమకు సమస్య ఏవిటో తెలుసు కాబట్టి తాము ఈ సమస్యను పరిష్కరించటంలో భాగస్తులుగా వుండాలని కోరుకొంటున్నారు. వాస్తవానికి యీ సమస్య పరిష్కారం కనుగొనటం కోసం జరిగే వెతుకులాటకు వారు నాయకత్వం వహించాలనుకుంటున్నారు. తాము చూపించే పరిష్కారాలకు, సామాజిక మార్పుకు తామే ముందు భాగాన వుండాలని వారు నమ్ముతున్నారు. ఈ అత్యంత సంపన్నులు తమకు తాము స్వంతంగానే చొరవతో ఈ ప్రయత్నాలు చేబట్టారు. సామాజికమార్పు అన్నది మరొకరకమైన స్టాకులు (షేర్లు) యజమాన్యమో, లేదా కార్పోరేట్‌ కంపెనీల పునర్నిర్మాణమో అన్నట్లుగా వారు యీ సామాజిక మార్పుకై ప్రయత్నం చేస్తున్నారు.

                వీరు చొరవగా చేబట్టే ప్రయత్నాలలో ఎక్కువ భాగం అప్రజాస్వామికమైనట్టివి. ఆ ప్రయత్నాలు సమస్యను పరిష్కరించవు లేదా సార్వత్రికమైన పరిష్కారాలను చూపవు. అందుకు బదులు సమస్యను మార్కెట్టు నిర్వహణావిధాన పద్దతుల్లో ఆలోచించి, సమస్యను పరిష్కరించటం కోసం ప్రైవేటురంగాన్ని ఉపయోగించాలనీ, ప్రైవేటురంగం కొల్లగొట్టిన సంపదలోనుంచి ఎంగిలి మెతుకులను ముష్టివేసే దాతృత్వం ద్వారా పరిష్కరించాలనీ, ప్రభుత్వం అన్నదానితో నిమిత్తం లేకుండా పరిష్కరించాలనీ వారు కోరుకొంటారు. అన్యాయాలను, అసమానతలను పరిష్కరించగల రహస్యం తెలిసినవారు, అత్యంత సంపద్వంతపు స్థాయిని పొందిన తమ వర్గానికి చెందిన విజేతలేనన్న భావాన్ని ప్రభావవంతంగా ప్రచారం చేస్తారు. తమను విజేతలుగా చేసిన సాధనాలే, దృక్పధాలే, వైఖరులే యీ సమస్యకు కూడా పరిష్కారాలని వారు భావిస్తారు.

                ఆ రకంగా ప్రజలచేత తీవ్రంగా నిరసించబడే ప్రమాదమున్నవారే మనను అసమానత్వయుగం నుండి రక్షించే రక్షకులుగా తమను తాము తిరిగి తీర్చిదిద్దుకొంటున్నారు. గోల్డ్మన్‌ సాక్స్‌ కంపెనీలో (దీనిని 1869 మార్కస్‌ గోల్డ్మన్‌, అతని అల్లుడు సామ్యూల్‌ సాక్స్‌ స్థాపించారు. ఇది అమెరికాకు చెందిన బహుళజాతి మదుపు బ్యాంకుగా, ఆర్థిక సేవలు అందించే సంస్థ. దీనిలో 38,300 ఉద్యోగులున్నారు. 2008 నుండీ 1.6 బిలియన్ల డాలర్లు దానధర్మాలకు వెచ్చించింది.) సామాజిక ఆలోచన గల ఫైనాన్సియర్లు తమ ప్రయత్నాన్ని ‘‘కొంత మీరు లాభపడే – కొంత మేము లాభపడే’’ (Win-Win) పద్దతిలోవున్న ‘గ్రీన్‌బాండ్ల’కు మరియు ‘ప్రభావపూరిత పెట్టుబడి’ ద్వారా చేబట్టారు. సాంకేతిక కంపెనీలైన ఉబర్‌, ఎయిర్‌బర్డ్‌ లాంటి కంపెనీలు, పేద ప్రయాణీకులను బాడుగకు కార్లలో త్రిప్పే డ్రైవర్లుగా అనుమతించే రూపంలోనూ, లేదా తమ యిళ్ళలో గల విడి గదులను యితరులకు అద్దెకు యివ్వడానికి అనుమతించిన రూపంలో, ఆ పేదలకు సాధికారితను కల్పిస్తున్నవారిగా రూపుదిద్దుకొన్నారు. తాము బోర్డు సభ్యుల స్థానాలను చేపట్టడం ద్వారా నాయకత్వ స్థానాలను చేపట్టడం ద్వారా మరింత ఎక్కువ సమానత్వాన్ని సాధించే పనిని నిర్దేశించే పాత్రను తాము విధిగా  చేపట్టనీయాలని సామాజికరంగాన్ని ఒప్పించేందుకు మేనేజిమెంట్‌ కన్సల్టెంట్లూ, వాల్‌స్ట్రీట్‌ మేధావులూ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. సంపన్న వర్గాధిపతులు సదస్సులను, పధకాలను చేపట్టి కొత్త ఐడియాలను యిచ్చే ఫెస్టివల్స్ (ఉత్సవాలను)ను తమ సంస్థల ప్రాయోజకత్వాన నిర్వహిస్తున్నారు. ప్రస్థుతం అమలులోవున్న భ్రష్టమైన వ్యవస్థలోని తప్పులను, దోషాలను సవరించటానికి బదులుగా, ఆ తప్పుడు వ్యవస్థ పరిధికే కట్టుబడి, ప్రజల జీవితాలను మెరుగుపరచటం కోసం ఆలోచించటం కోసం, అంగీకరించే ‘‘ఆలోచనాపరులైన నాయకుల’’ (thought – leaders) ను పెంపొందించటం కోసం, బడా వాణిజ్య వ్యాపారవర్గాలవారు ‘‘అన్యాయం’’ పై ఆలోచనాపరులైన నాయకుల పేనల్సుకు (వ్యక్తుల సమూహాలకు) ఆతిధ్యాన్నిస్తున్నాయి. లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలు ప్రశ్నార్ధకమయిన ‘కార్పోరేటు సామాజిక బాధ్యత’ కార్యక్రమాలను, నిర్లక్ష్యాపూరితమైన పద్ధతుల ద్వారా చేబడుతున్నాయి. తీవ్రమయిన సామాజిక సమస్యలకు కారకులై, తమ సంపద సామ్రాజ్యాలను నిర్మించుకొన్న కొందరు సంపన్నులు, తమ సంపదను ‘‘వెనక్కి యిచ్చేస్తున్నామంటూ’’ గందరగోళం సృష్టిస్తున్నారు. ఏస్టెన్‌ ఇనిస్టిట్యూట్‌, క్లింటన్‌ ఇన్షియేటివ్‌ లాంటి అత్యంత సంపన్నుల నెట్‌వర్కు వేదికలు, సమస్యలు సృష్టింపబడటానికి ఏ సంపన్నులు కారకులో, ఆ సమస్యలను వారే తమ చేతుల్లోకి తీసుకొని, వాటిని పరిష్కరించటానికి తామే స్వయంనియమిత నాయకత్వాలుగా వుండేందుకు వీలుగా శిక్షణ యిస్తున్నాయి. సమాజం గురించి పట్టించుకొనే ఆలోచన గల ఒక క్రొత్త రకం జాతి కంపెనీలు, ‘‘బి.కార్పోరేషన్లు’’ అనేవి జన్మించాయి. ఇవి కార్పోరేట్ల యొక్క మరింత స్వప్రయోజనాల కోసం పుట్టుకొచ్చినవి. కార్పోరేషన్లను ప్రభుత్వాల ద్వారా నియంత్రించటం కన్నా వాటిని ఎటువంటి నియంత్రణలు లేకుండా వ్యాపారం చేయనీయాలనేది వీటి డిమాండు. కార్పోరేషన్ల ప్రయోజనాలే ప్రజల సంక్షేమానికి నిశ్చయమైన గ్యారంటీ అని యీ బి.కార్పోరేషన్లు విశ్వసిస్తున్నాయి. సిలికాన్‌ వ్యాలీలో గల యిద్దరు బిలియనీర్లు డెమాక్రిటిక్‌ పార్టీకి తమ ఫండు యిన్షియేటివ్‌ ద్వారా నిధులు సమకూర్చారు. వారిలో ఒకరు తాము నిధులివ్వడం వలన అధికారం లేని ప్రజల గళం మరింతగా విస్తరించబడుతుందనీ, తమలాంటి సంపన్నుల రాజకీయ పలుకుబడి తరిగిపోతుందనీ కూడా ప్రకటించవచ్చు.

                ఈ అత్యంత సంపన్నులవర్గం ‘‘ప్రపంచాన్ని మార్చటం’’, ‘‘ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చటం’’ వంటి క్రొత్త భాషను మాట్లాడుతున్నారు. వారు చేపడుతున్న దాతృత్వ కార్యకలాపాల ద్వారా సహాయపడుతున్నప్పటికి వారు మరింతగా సంపదను కూడబెట్టుకొని దాచుకుంటున్నారన్నదే యథార్ధం. వీరి కార్యకలాపాల వలన సగటు అమెరికన్‌ యొక్క జీవితం నామమాత్రంగా కూడా మెరుగుపడలేదన్నదే వాస్తవం.

                ఈ అత్యంత సంపన్నవర్గం అభివృద్ధిపై తమకే గుత్తాధిపత్యం వుండే విధంగా సామాజిక పొందిక వుండాలన్న అభిప్రాయాన్ని గట్టిగా పట్టుకువ్రేళ్ళాడుతోంది. అలా గుత్తాధిపత్యంగల తన వర్గం తాను కొల్లగొట్టిన దాంట్లోనుంచి కొంతభాగాన్ని దగా చేయబడ్డ జనాలకు విసిరేయాలనుకొంటోంది. ఈ అత్యంత సంపన్నవర్గం వారికి సమాజంపట్ల గల శ్రద్ధ మరియు వారి దోపిడీలకు మధ్యగల సంబంధాన్నీ, ఈ వర్గంవారు చేస్తున్న అసాధారణ సహాయానికీ – అసాధారణ సంపద దాపరికానికీ మధ్యగల సంబంధాన్నీ, ఈ వర్గం అక్రమ, అసమాన స్థాయి (సామాజిక అర్థిక-రాజకీయ అంతస్తు) కి చేరిన విషయాన్నీ, యీ అత్యంత సంపన్న వర్గం తామే చెడగొట్టిన సామాజిక వ్యవస్థలో చిన్నపాటి మార్పుకోసం చేసే ప్రయత్నాలను, లోతుగా అర్ధం చేసుకోవటం కోసమే తాను యీ పుస్తకాన్ని రాసినట్లు ఆనంద్‌ గిరిధర్‌దాస్‌ ప్రకటించారు.

అత్యంత సంపన్నులు చేపడుతున్న ‘ప్రపంచాన్ని మార్చివేసే’ యీ దాతృత్వ చొరవల ద్వారా వారు చేయగల్గినంత మేరకు మంచి చేస్తున్నారనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచం యధాతధంగానే, ఎప్పటిలాగే వుందనీ, కాలం యొక్క శక్తులు, ఎవ్వరిచేతా ప్రతిఘటింప వీలులేని బలమైనవనీ, అందువల్లనే అత్యంత అదృష్టవంతులు పేదలకు సహాయం చేస్తున్నారన్నది యీ భావన యొక్క సారం. ఈ సహాయం సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిదే అయినప్పటికీ యిదికూడా ఎంతో కొంత సహాయమేనన్నది ఈ భావన యొక్క అవగాహన.

                అత్యంత సంపన్నుల నాయకత్వాన జరుగుతున్న మార్పు సద్భుద్దితో సాగుతున్నదే కాని ఇది తగినంతగా లేదు అన్నది విమర్శనాయుతమైన మరొక అభిప్రాయంగా వుంది. సంపన్నులు చేబట్టిన యీ ప్రపంచాన్ని మార్చే కృషి కేవలం రోగ లక్షణాలకే చికిత్స చేస్తుంది తప్ప మూలకారణాలకు చికిత్సచేయదు. మనను బాధపెట్టే మౌలిక విషయాలకు యిది చికిత్స చేయదు అన్నది దీని అర్ధం. మరింత అర్ధవంతమయిన సంస్కరణలను చేబట్టే కర్తవ్యం నుంచి యీ అత్యంత సంపన్నవర్గం మరింత కుంచించుకుపోతోందన్నది యీ అభిప్రాయం యొక్క సారాంశం :

                అయితే అత్యంత సంపన్నవర్గాలు చేపట్టిన ప్రపంచాన్ని మార్చివేసే యీ చర్యలను గురించి మరో విమర్శనాత్మక అభిప్రాయం కూడా వుంది. దీని ప్రకారం అత్యంత సంపన్నులు సామాజిక మార్పుకు అగ్రగామిపాత్ర వహిస్తే మెరుగైన సామాజిక మార్పు జరగటంలో వైఫల్యం జరగటం మాత్రమే కాకుండా అది సమాజాన్ని యిప్పుడున్న స్థానంలోనే యథాతధంగా వుంచివేస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి నుండి మినహాయింపబడ్డ (తొలగింపబడ్డ) ప్రజల ఆగ్రహాన్ని మొద్దుబార్చుతుంది. అందువలన అత్యంత సంపన్నవర్గాల చర్యలు, సహాయాలు ఎంతమాత్రమూ సమస్యకు పరిష్కారం కావు. అవి సమస్యను మరింత తీవ్రతరం చేసేవిగా వుంటాయి.

                జరుగుతున్న మార్పు ద్వారా వచ్చే లాభాల పంటను కోసుకోవటం ద్వారా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరింపబడిన సంపద, అధికారాలే, నేటి యుగంలో జరిగిన గొప్ప హాని. ఇప్పుడు అత్యంత సంపన్నులు చేపట్టిన ఈ దాతృత్వ చర్యలు, కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరింపబడిన సంపద, అధికారాల అంచులనైనా తాకవు. వాస్తవంగా అవి సంపద కేంద్రీకరణకు మరింత మద్దతును యిస్తాయి.

                ఇటువంటి ధోరణులే అమెరికాలో డోనాల్డు ట్రంపును అధ్యక్షుడిగా ఎన్నికచేసుకొనే చరమస్థాయికి తీసుకొచ్చాయి. డోనాల్డు ట్రంపు ఒక వైపు దోపిడీదారుడు, మరోవైపు సమస్యలను బహిరంగపరిచే వ్యక్తి. ఇతడు అత్యంత సంపన్నవర్గాల నాయకత్వంలో సామాజిక మార్పు సాగాలన్న గాఢ విశ్వాసానికి, ఆచరణకు చెందిన వ్యక్తి ! ఇతడు అత్యంత సంపన్నవర్గానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని తీవ్రమైన రీతిలో రెచ్చగొట్టి, దానిని అత్యంత సంపన్నవర్గం వైపు మరల్చకుండా, అమెరికాలో అట్టడుగుస్థాయిలో వుండి, దుర్బలులై దాడికి గురవటానికి అనుగుణంగా వుండే ప్రజలవైపుకు చాకచక్యంగా మరల్చి అమెరికన్‌ ప్రజల ఆకాంక్షలను దోపిడీ చేసిన ప్రబుద్ధుడు. వాస్తవానికి ఏ మోసానికీ, దగాకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టాడో ఆ మోసానికి, దగాకు, దుర్మార్గానికి మూర్తీభవించిన అవతారమే డోనాల్డు ట్రంప్‌. విద్యావంతుడు, సంపన్నవంతుడూ అయిన ట్రంప్‌ నేడు తనను తాను పేదల, అవిద్యావంతుల సంరక్షకునిగా చెప్పుకొంటున్నాడు. సంపన్నులను మరింత సంపన్నులుగా చేసి, యితరులను మట్టి కరిపించే సంపన్నులకు, వారిచేత అలా మట్టికరిపించబడ్డ వారిని ఆదుకొని, సంస్కరణలను చేబట్టే కర్తవ్యాన్ని యిచ్చిన వ్యవస్థ యొక్క విషఫలమే ట్రంప్‌.

                ఈ పుస్తకంలో అత్యంత సంపన్నులతో నిర్వహింపబడే మార్కెట్టుకు అనుకూలంగా వుండే సామాజిక మార్పు గురించి గాఢంగా విశ్వసించే పలువురు వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రచయిత వివరాలు యిచ్చారు. ఈ వ్యక్తులందరు బలమైన కట్టుకథల భావాలలో మునిగి తేలుతున్నారు. ఈ కట్టుకథల భావాలే అసాధారణ అధికార కేంద్రీకరణకు చెందిన ఒక యుగాన్ని పెంచి పోషించాయి. అత్యంత సంపన్నవర్గాలు చేపట్టిన తమ పక్షపాత పూరితమైన స్వీయ రక్షణ చర్యలను వాస్తవమైన మార్పుగా చలామణీ చేయటానికి ఈ కట్టుకధలు పనికి వచ్చాయి. ఈ కట్టుకధల మోసాన్ని బట్టబయలు చేయడం కోసం రాసినదే యీ పుస్తకం.

                ‘‘సంపన్నులే ‘ప్రపంచాన్ని మార్చటానికీ’ ‘సామాజిక మార్పు’ తీసుకురావటానికీ నాయకత్వం వహించాలి, వారే నిజమైన మార్పును తీసుకురాగల్గుతారు’’, అన్న వాదనను బలంగా నొక్కి చెబుతున్న అత్యంత సంపన్నవర్గానికి చెందిన కొందరు వ్యక్తులూ, మేధావులూ, ఆలోచనాపరులైన నాయకులూ, సంస్థలూ చేబడుతున్న కొన్ని కార్యకలాపాలను, వారి ఉద్దేశ్యాలను రచయిత యీ పుస్తకంలో మన ముందుంచారు. వీటన్నిటినీ సక్రమంగా అర్ధం చేసుకోగలిగితే సామ్రాజ్యవాదంగావున్న అత్యున్నతదశకు చేరిన ప్రపంచ పెట్టుబడిదారీవిధానం, రెండవ ప్రపంచ యుద్ధానంతరకాలంలో ఆ సామ్రాజ్యవాద దశ మరింత ఉధృతమైన రూపంలోకి ఏ విధంగా పరిణామం చెందిందో, సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహిస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదమూ దానిని పెంచి పోషిస్తున్న ప్రపంచంలోని అత్యంత సంపన్నవర్గంగావున్న పెట్టుబడిదారులూ యీ ప్రపంచమంతటా ప్రస్ధుతపు దోపిడీవ్యవస్థనే కొనసాగిస్తూ ఈ వ్యవస్థను కూలద్రోసి మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మించనవసరం లేకుండా, ప్రపంచంలో సామాజిక మార్పు తీసుకురావటానికి అంటూ చేపడుతున్న ‘చొరవల’ కపటత్వాన్నీ, బూటకత్వాన్నీ మనం మరింత స్పష్టంగా అర్ధం చేసుకోవటానికీ, నిజమైన పరివర్తనతో ప్రపంచ ప్రజలందరికీ సమానత్వం అందించే వ్యవస్థ నిర్మించటం కోసం చేబట్టాల్సిన కర్తవ్యం నిర్దేశించుకోవటానికీ యీ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

                1970 వరకూ అమెరికాలోనూ ప్రపంచంలోని యితర దేశాల్లోనూ ప్రపంచాన్ని మార్చటం అంటే అర్థిక, రాజకీయ, సామాజిక పాలనావ్యవస్థలను మార్చటం, సమస్యలకు గల మూలకారణాన్ని నిర్మూలించటం అనే అభిప్రాయం వుండేది. కానీ ఆ తర్వాతి సంవత్సరాల్లో ప్రపంచమంతటా ప్రత్యేకించి అమెరికాలో ప్రపంచాన్ని మార్చాలంటే ఏది మంచి విధానం అనే సిద్ధాంతం ముందుకొచ్చి, పాత అభిప్రాయాన్ని అధిగమించి ఒక కొత్త సిద్థాంతం బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనినే నయా ఉదారవాద సిద్ధాంతంగా పిలుస్తారు. ఇది ఆర్థిక, రాజకీయ ఆచరణకు సంబంధించిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ‘‘ఒక సంస్థాగత చట్రంలోగ వ్యక్తుల చేతుల్లో వున్న వ్యాపార-వాణిజ్య పరిశ్రమల స్థాపనాస్వేచ్ఛలను, నైపుణ్యాలను వారి నుండి విముక్తం చేయటం ద్వారా, మానవజాతి యొక్క శ్రేయస్సును అత్యుత్తమంగా పెంపొందింపవచ్చును’’ అని ప్రతిపాదిస్తోంది. నియంత్రణల సడలింపు, ప్రైవేటీకరణ, పలుసామాజిక వ్యవస్థల నుండి ప్రభుత్వనిష్క్రమణ’ ద్వారా యిది సాధ్యమవుతుందని యీ సిద్ధాంతం చెబుతుంది. ఈ సిద్ధాంతం మార్కెట్టు ప్రాంతంలో వ్యక్తుల, వ్యక్తిగత స్వేచ్ఛలకు గ్యారంటీయిస్తూనే, ప్రతి వ్యక్తి యొక్క చర్యలకు, శ్రేయస్సుకు ఈ వ్యక్తినే బాధ్యునిగా, జవాబుదారునిగా చేస్తుంది. ఈ సైద్ధాంతిక సూత్రమే వ్యక్తుల యొక్క వ్యక్తిగత సంక్షేమం, విద్య, ఆరోగ్యరక్షణ, పెన్షనును పొందటానికి వర్తింపచేయబడుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఎవరి కర్మకు వారే బాధ్యులు’ – వ్యవస్థ మాత్రం బాధ్యురాలు కాదు అని. ఆ రకంగా ప్రతీ వ్యక్తీ తాను స్వయంసమృద్ధిగా వుండటానికి ఆ వ్యక్తే బాధ్యుడు, ఆ రకమైన బాధ్యత ప్రతీ వ్యక్తిదీ ! అని ఈ సిద్ధాంతం నొక్కి చెబ్తుంది. దీన్నే ఒక విప్లవంగా ఈ సిద్ధాంతకర్తలు అభివర్ణిస్తారు. ఈ నూతనతరహా విప్లవాన్ని కనుగొన్న ఆద్యులు, మితవాద రాజకీయ నాయకులైన రోనాల్డు రీగన్‌, మార్గరేట్‌ ధేచర్‌లు. ప్రభుత్వ యొక్క పాత్రను తక్కువచేసి, దానిని నిందించటం ద్వారా వీరిర్వురు’’ రాజకీయాల్లో పైకి వచ్చారు.

                అయితే ఈ విప్లవాన్ని కేవలం రాజకీయ మితవాదులే ముందుకు తీసుకుపోలేరు. అందువలన ఈ పనిచేయటానికి విశ్వసనీయమైన ప్రతిపక్షం అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని అమెరికాలో బిల్‌ క్లింటన్‌ తీర్చాడు. మితవాదానికీ, విపక్షవాదానికి మధ్యస్థంగా వుండే మూడవ విధానవాదుల పేరుతో బిల్‌ క్లింటన్‌, అతని సైద్ధాంతిక విధానాన్ని సమర్థిస్తున్న యితరులూ ఒక వర్గంగా ఏర్పడ్డారు. 1996లో ‘‘పెద్ద ప్రభుత్వాల శకం అంతరించింది’’ అనే ప్రకటనతో బిల్‌ క్లింటన్‌, అతడి సహచరవర్గంవారు ముందుకొచ్చారు; అప్పటిదాకా అమెరికాలోని విద్యాప్రాంగణాలలో (కాంపస్‌లు)లో వున్న సోషల్‌ క్లబ్బులు స్థానంలో పెట్టుబడిదారీ విధానం అమలులోకి తెచ్చిన మార్కెట్‌ పదజాలం, మార్కెట్‌ విలువలు, అభిప్రాయాలు, కల్పనలతో నిండిన సామాజిక వాణిజ్య నిర్వహణా క్లబ్బులు ఉనికిలోకివచ్చి అవి పెంపొందటానికి సహకరించాయి. అప్పటికే ‘‘మిలియన్ల మందికి మేలు చేయటం’’, ‘ప్రపంచాన్ని మార్చటం’ అన్న భావనలు వ్యాప్తిలోకి వచ్చి అమెరికన్‌ యువజనుల మెదళ్ళను ఆక్రమించాయి. యువజనులు, విద్యార్థుల్లో ఎక్కువమంది ‘‘మంచిని నిర్మించటంలోనే ఎక్కువ శక్తి వుంది తప్ప ఏ చెడును సవాలు చేయటంవల్ల మేలు జరగదు’’ అనే అభిప్రాయాన్ని నమ్మారు. అటువంటి నేపధ్యం నుండి వచ్చినదే హిల్లరీ కోహెన్‌. అమె ప్రపంచాన్ని మార్చాలని కోరుకొంది. ఆమె ఒక యూదు కుటుంబం నుండి వచ్చిన యువతి. ఆమె తండ్రి ఫైనాన్సురంగమైన మున్సిపల్‌ బాండ్లు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో పనిచేశాడు. ఆమె తల్లి మానసిక ఆరోగ్యరంగంలోనూ, యూదు సమాజంలోనూ వాలంటీర్‌గా పనిచేసింది. కోహెన్‌ తండ్రి నుండి పెట్టుబడుల విశ్లేషణ (స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడుల) నైపుణ్యాన్ని నేర్చుకొంది. అరిస్టాటిల్‌ నైతిక విలువలపై వ్రాసిన గ్రంధపు ప్రభావంలో పడ్డ ఆమె ప్రపంచాన్ని మార్చే సకారాత్మక ఏజెంటుగా వుండాలని కోరుకొంది. అమె తన చదువును ముగించేనాటికి ‘వాల్‌స్ట్రీట్‌ అక్రమణ’ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ ప్రభావం కూడా ఆమె మీద పడింది. అప్పటికే ‘కెరీరిస్టు సంస్కృతి’ అమెరికన్‌ యూనివర్సిటీలన్నంటినీ ఆక్రమించినది. ఆ ప్రభావంతో ఆమె గోల్డ్మన్‌ సాక్స్‌ కంపెనీలో విశ్లేషకురాలిగా జేరింది. అప్పటికే వాల్‌స్ట్రీట్‌లో ఆర్థికసంస్థలు ‘‘నువ్వు ప్రపంచంలో నాయకుడివి కాదల్చుకొంటే నీకు ఆ నైపుణ్యాలను అందిస్తాం’’ అంటూ పలుకార్యక్రమాలు చేపట్టాయి. గోల్డ్మన్‌ సాక్స్‌ ‘‘10,000 మంది మహిళలు’’ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని ద్వారా ఆమె మహిళా వాణిజ్య వ్యాపార పెట్టుబడిదార్లను తయారుచేసేందుకు పెట్టుబడి పెట్టింది. వారికి సలహాదారుగా, గురువుగా వ్యవహరించింది. అసమానతను తగ్గించేందుకు అవసరమైన ముఖ్యసాధనమైన, ఆర్థికాభివృద్ధిని అందరూ పంచుకోవటమే – తాను తీసుకొన్న కార్యక్రమం అంటూ ప్రచారం చేసింది. అంతేకాదు గోల్డ్మన్‌ సాక్స్‌ కంపెనీ మరో ప్రయోగాత్మక కార్యక్రమంలో కూడా 10 మిలియన్ల డాలర్లను న్యూయార్కులో ఒక జైలుకు సంబంధించిన కార్యక్రమంలో పెట్టుబడి పెట్టింది. అందుకోసం ఆ సంస్థ విడుదల చేసిన ‘‘సామాజిక ప్రభావబాండు’’, జైలులో విద్యగరిపే కార్యక్రమంలో పెట్టుబడిపెట్టిన ప్రతీ ఒక్కరికే లాభాన్ని చేకూర్చిపెట్టడమే కాకుండా, పదేపదే నేరాలు చేసే ప్రవృత్తిపై నేరస్థుల రేటు తగ్గిస్తుందంటూ, ‘పుణ్యం-పురుషార్థం’ ఒకే దెబ్బతో కలసివస్తుందని ప్రకటించింది.

                మరోవైపు కార్పోరేట్లు క్లైంట్లుగా వున్న మెక్కిన్సీ సంస్థ కూడా యువతను ఆకర్షిస్తూ వారిని సంస్థలోకి రిక్రూట్‌ చేసుకొంటోంది. ఆ సంస్థ కూడా తన సంస్థలో పనిచేస్తే ప్రపంచాన్ని మార్చటం సాధ్యమవుతుంది అంటూ ప్రచారం చేస్తోంది. అప్పుడే కాలేజీ నుండి బయటకు వచ్చిన వాణిజ్య విశ్లేషకులు తమ సంస్థలో గనుక జేరితే వారు యీ క్రింది వాటిని సాధిస్తారు అంటూ ఒక కరపత్రం విడుదల చేసింది. అవి ఏమిటంటే ప్రపంచాన్ని మార్చటం, జీవితాలను మెరుగుపరచటం, క్రొత్త విషయాలను ఆవిష్కరించటం, క్లిష్టమైన సమస్యను పరిష్కరించటం, నైపుణ్యాలను విస్తరించుకోవటం, సహనశీలతతో కూడిన దీర్ఘకాలిక సంబంధాలను నిర్మించటం. ఇటువంటి ఘనమైన వాగ్దానాలు చేసిన మెక్కిన్సీ కంపెనీ ‘సామాజిక రంగపు ఆచరణ’ (Social Sector Practice) అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ‘మొబైల్‌ఫోన్‌తో ఆర్థిక సేవలు అందించి మిలియన్ల కొద్దీ మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చటంతోపాటు అందరినీ యిముడ్చుకొనే సమ్మిళిత అభివృద్ధిని సాధించవచ్చు’’ అనే అంశం మీద పుస్తకాలను ప్రచురించింది. మరోవైపు ఆ సంస్థ యొక్క పోటీ సలహాదారు కంపెనీ అయిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు కూడా ‘‘మన సామాజికరంగం కోసమూ, మా వ్యాపారవర్గ క్లైంట్లు కోసము ప్రపంచాన్ని మార్చివేస్తానంటూ’’ ప్రతిజ్ఞ చేసింది. బైన్‌ అండ్‌ కంపెనీ అయితే ‘‘మేము మొత్తం సామాజికరంగాన్నే మార్చే లక్ష్యంతో వున్నాం’’ అంటూ ప్రకటించింది. మోర్గన్‌ స్టాన్లీ అయితే ‘‘పెట్టుబడి మార్పును సృష్టిస్తుంది’’, ‘‘పెట్టుబడి యొక్క విలువ కేవలం సంపదను సృష్టించటంకాదు, అవసరమైన వాటిని సృష్టించటం కూడా!’’, ‘‘మోర్గన్‌ స్టాన్లీ కోసం పనిచేయటమంటే మిలియన్ల మంది ప్రజలకు మంచి జీవితం యివ్వటానికి పూనుకోవటం’’, ‘‘ప్రపంచాన్ని మార్చగలిగే వస్తువులను నిర్మించగలిగే పెట్టుబడిని మనం వృద్ధి చేద్దాం!’’ అనే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఆ రకంగా మార్కెట్టు ప్రపంచం రెండు లక్ష్యాలను – ‘‘ప్రపంచాన్ని మార్చటం’’, మరియు ‘‘లాభాలనార్జించటం’’ – అన్నవాటిని ఒకే లక్ష్యంగా మార్చివేసింది. ‘‘వ్యాపారాన్ని, మంచిని కలుగజేసే ఒక శక్తిగానూ’’, ‘‘మనం వాంఛించే మార్పును’’ పెంపొందించేదిగాను ‘‘పరస్పర ఆధార ప్రకటన’’ అనబడే ఒక నూతన ప్రకటనను బి కార్పొరేషన్లు అనేవి ప్రకటించాయి. ఆ రకంగా ‘బహిరంగ ప్రజాసమస్యలకు ప్రైవేటు పరిష్కారం’ అనే ఒక సిద్ధాంతం అమెరికాలో వ్రేళ్ళూనుకుపోయింది. ఈ సిద్ధాంతం నేడు ప్రజలు అనుభవిస్తున్న సమస్యలు, సంపన్నులైన దాతల, ఎన్‌.జి.ఒ.ల, ప్రభుత్వరంగం యొక్క భాగస్వామ్యంలో పరిష్కరింపబడాలని నిర్దేశిస్తోంది. ఈ రకంగా ప్రజల సమస్యల పరిష్కారానికి సంపన్నులను నాయకత్వ స్థానంలో వుంచటం ద్వారా ఆ సిద్ధాంతం ఆ సంపన్నులకు తమను భయపెట్టే పరిష్కారాలను నిరోధించే అధికారాన్ని యిస్తోంది. మరోవైపు నర్మగర్భమైన కపటత్వంతో ‘‘న్యూబీక్‌ సెంటర్‌’’ లాంటి కేంద్రాలు, (New Beck Center for Social Impact and Innovation) ‘‘ఆవిష్కరణలను పెంపొందించే అసమానమైన నైపుణ్యాల అమరికను సమకూర్చటం’’ అనే లక్ష్యం పేరిట ఆ కేంద్రం ‘‘పెట్టుబడి యొక్క సాంకేతిక డేటా శక్తిని, సామర్ధ్యాన్ని పెంచే జీవితాలను మెరుగు పరిచే విధానాలను పెంపొందిస్తా’’ నంటూ ప్రచారం చేస్తోంది. ఆ రకంగా ‘‘వాణిజ్యమే పురోగతి సాధించటానికీ, ప్రజలకు సహాయపడటానికీ, ప్రపంచాన్ని మార్చటానికి ప్రవేశాన్ని కల్పించే కార్డు (card)’’ అన్న విశ్వాసం విజయవంతంగా వేళ్ళూనుకుపోయింది. ఆఖరికి వైట్‌హౌస్‌ కూడా అటు రిపబ్లికన్ల పాలనలోనూ, యిటు డెమోక్రాట్ల పాలనలో కూడా దేశాన్ని ఎలా నడిపించాలి? అన్న విషయంలో ఫైనాన్సీయర్ల, మార్కెట్‌ కన్సల్‌టెంట్ల ప్రత్యేకమైన నైపుణ్యాలపైననే ఆధారపడి నిర్ణయాలు చేసే స్థితికి చేరుకొంది.

                అమెరికన్‌ జీవితాల నిర్ణయంలో కార్పొరేషన్లూ, సంపన్నులూ మరీ ఎక్కువ అధికారాన్ని కలిగివున్నారనీ సామాన్య ప్రజలకు ఆ నిర్ణయాలలో కనీసంగా మాట్లాడే హక్కు కూడా లేదనీ పదేపదే మాట్లాడిన అధ్యక్షుడు ఒబామా కూడా, తన పరిపాలనాకాలం అంతమయే సమయంలో ఒక ఫౌండేషన్‌ను, లైబ్రరీనీ స్థాపించతలపెట్టి, అందుకు మెక్కిన్సీ కంపెనీ సలహాలను తీసుకోవటానికి నిర్ణయించాడు.

                ఈ పరిణామాలన్నీ మెకెన్సీ కంపెనీ వదలిపెట్టి ఒబామా ఫౌండేషన్‌లో పూర్తికాలం పనిచేసేందుకు హిలరీ కోహెన్‌ను ప్రేరేపించాయి. తీరా చూస్తే యిప్పుడు ఆమె తాను ఆ మార్కెట్టు ప్రపంచానికి, ఆ మార్కెట్టు ప్రపంచపు తర్కానికి బయట వుండటానికే ప్రాధాన్యతనిస్తానంటోంది. ఈ రకంగా తాను ఏ సమస్యనైతే పరిష్కరించబూనుకొందో, ఆ సమస్యకు మూలకారణమైన వ్యవస్థను పరిరక్షించటం కోసమే తాను యింత కాలమూ పనిచేసినట్లు కోహెన్‌ అవగతం చేసుకొంది. ఈ రకంగా కోహెన్‌లాంటి వారు ఎందరో మార్కెట్టు విశ్వాసపు వలలో బందీలయ్యారు. ఇప్పుడు కోహెన్‌ అందుకు బదులుగా యూదు మత పూజారిణి ‘రబ్బి’ (rabbi) గా పని చేయటం వైపు మొగ్గుతోంది. ప్రపంచాన్ని మార్పుచేసే అనేక కపట నాటకాల్లో ఇది ఒకటి.

                పేద ప్రజలకు తాను సహాయం చేస్తున్నాaaaనని చెప్పుకొంటున్న స్టేసీ ఏషర్‌ (Stacey Asher) డల్లాస్‌ రాష్ట్రంలోని హైలేండ్‌పార్కులో నివసిస్తోంది. ఆమె ‘‘పోర్టుఫోలియోస్‌ విత్‌ పర్పస్‌’’ అనే ఒక దాతృత్వ సంస్థను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తనను తాను ‘‘ఆరోగ్యవంతమైన పోటీని, దాతృత్వాన్నీ మిళితం చేసే శక్తివంతమైన వేదిక’’గా అభివర్ణించుకొంటుంది. ఈ నినాదం సాంకేతిక ఊహాస్వర్గవాదాన్నీ (టెక్నో ఉటోపయనిజం), పెట్టుబడిదారీ విధాన దాతృత్వపు సారాంశాన్నీ ప్రతిబింబిస్తూవుంటుంది. స్టేసీ ఏషర్‌ యీ సంస్థను స్థాపించటానికి ముందు న్యూయార్కులోని ఆరు లేదా ఏడు హెడ్జిఫండ్‌ ఫైనాన్సు సంస్థల్లో పనిచేసింది. ఆమె తాను ‘‘యితరులకు సహాయపడాలనే’’ కృషికి అంకితమవటానికి కారణం తాను ఒకనాడు కిలిమాంజిరో పర్వతారోహణ చేయడానికి వెళ్ళినపుడు టాంజానీయా దేశంలోని ఒక అనాధ ఆశ్రమాన్ని చూసిందట. ఆ అనాధాశ్రమానికి ఒక పూట తిండి కోసం బాలలు చంటి పిల్లలను మోసుకొంటూ మైళ్ళదూరం నుండి వస్తారు. కొన్నిసార్లు నిధులు లేక అనాధ ఆశ్రమం పిల్లలకు అన్నం పెట్టలేకపోతోందట!. ఈ విషయం తెల్సుకొన్న స్టేసీ ఏషర్‌ జీవితం ‘‘ఆ క్షణాన్నుండే శాశ్వతంగా మారిపోయిందట!’’ తాను ఏదో మంచి పనిచేయాలనుకొందట, ఏంచేయగలను అని ఆలోచించి, తాను చేయబోయే పని ప్రపంచంలో యిప్పటికే యితరులు చేసిన పని కాకూడదని అనుకొన్నదట!. సరీగ్గా ఆకాలంలోనే ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లోని ఒకటైన స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకు, టాంజానీయాలో తానిచ్చిన ‘‘తుచ్ఛమైన అప్పులు’’ను వసూలు చేసుకోవటానికి కోర్టు ద్వారా ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ బ్యాంక్‌ తన ‘‘తుచ్ఛమైన అప్పును’’ (Dirty Debts) ఒక విద్యుత్తు ఉత్పాదన చేసే దివాలా తీయబోయే ఎనర్జీ ప్రాజెక్టుకు యిచ్చింది. ఆ ప్రాజెక్టు దివాలా తీసి బ్యాంకు అప్పు ఎగకొట్టింది. అలా జరుగుతుందని తెలిసే స్టాండర్డు బ్యాంకు ఆ అప్పును యిచ్చింది. అలా దివాలా తీస్తారన్న వారికి అప్పిచ్చే నిధులను ‘‘రాబందు నిధుల పెట్టుబడి’’ (Vulture funds) అంటారు. ఇప్పుడు ఆ బ్యాంకు టాంజానీయా ప్రభుత్వం ఆ దివాలా తీసిన ప్రాజెక్టును జాతీయం చేయాలనీ, తన అప్పు తీర్చాలనీ కోర్టుకు వెళ్తోంది. ఆఫ్రికన్‌ అభివృద్ధి బ్యాంక్‌ గ్రూపు దీన్ని గురించి యిలా అంటోంది: రాబందు నిధులు పెట్టుబడిని పెట్టే స్టాన్‌ఛార్ట్‌ లాంటి ఆర్థిక సంస్థలకు యిది మాములు ఆటే!. అవి తెలిసే దివాలా అంచున వున్న ప్రైవేటు ప్రాజెక్టులలో ఎక్కువ డిస్కవుంటు వేసుకొని పెట్టుబడి పెడతాయి. ఆ ప్రాజెక్టులు దివాలా తీసి చేతులేత్తేస్తే, అవి ఆయా దేశాలకు విదేశాల్లో వున్న ఆస్థులను జప్తు చేసుకొంటామని బెదిరిస్తాయి. అందువల్ల ఆ బడుగు దేశాల ప్రభుత్వాలు ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసే పన్నులను యీ అప్పులు తీర్చటంకోసం వినియోగిస్తాయి. ఈ రకంగా ఆఫ్రికాలోని అంగోలా, బుర్కినాఫాసో, కేమరూన్‌, కాంగో, కోట్‌డిఐనోరీ, ఇధియోపియా, లైబీరియా, మడగాస్కర్‌, మొజాంబిక్‌, నైగర్‌, సొవోటోమ్‌ అండ్‌ ప్రిన్సిపే, సియెర్రా లియోన్‌, ఉగాండా దేశాలు యిటువంటి రాబందు నిధుల పెట్టుబడి యొక్క తుచ్ఛమైన అప్పులకు బలయినవారే. ఈ రకంగా యీ రాబందు నిధుల పెట్టుబడిదార్లు, బడుగు దేశాల అభివృద్ధిని పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తారు. టాంజానీయాలోకి అనాధల, అనాధాశ్రమాల దుస్థితికి కారణం ఇదే.. బడా ఫైనాన్స్‌ రంగంలో జరిగే యీ వివరాలన్నీ తెలిసిన ఏషర్‌, రాబందు నిధుల పెట్టుబడి ద్వారా కొల్లగొట్టిన సొమ్ము (సంపద) ను ఆయాదేశాలకు తిరిగి చెల్లింప జేసే కృషి చేపట్టడానికి బదులు, బాధితదేశంలోని ఆనాధలకు మేలు చేయటానికి కృషి చేయటాన్ని ఎంచుకోవటంలోనే వుంది మర్మం అంతా. ఇంతకీ ఆవిడ పేదలకు సహాయం చేయటానికి చేపట్టిన కృషి ఏమిటయ్యా అంటే’’ ఫాంటసీ క్రీడలు నిర్వహించి అందులో వచ్చే లాభాలలో కొంత భాగాన్ని అనాధాశ్రమాలకు దానం యివ్వటం!. అటువంటి ఫాంటసీ ఫుట్‌బాల్‌ సంస్థనొకదాన్ని ఆమె స్థాపించింది. ఆ కంపెనీ ‘స్టాకు’ (షేర్‌ పెట్టుబడి) ని అమ్మి, వచ్చిన లాభాల నుండి కొంత భాగం దానం యిస్తుంది. ఆ ఫాంటసీ ఫుట్‌బాల్‌ క్రీడలో ఆటాడేది వృత్తి ఫుట్‌బాల్‌ క్రీడాకారులు కాదు. ఫైనాన్సు కంపెనీల ఉద్యోగులు. ఈ రకంగా ఆమె చేపట్టిన యీ ‘‘ప్రజలకు మేలు’’ చేసే కృషి పరస్పర లాభదాయక లక్ష్యంతో కూడినది. మార్కెట్టు ప్రపంచంలోని అత్యంత సంపన్న వర్గాలవారు అనుసరించేది యీ పరస్పరలాభదాయకమైన దాతృత్వ ‘వ్యాపారమే’!. ఆ రకంగా ఏషర్‌ లాంటివాళ్ళు సమస్యకు మూలకారణాన్ని పట్టించుకోకుండా, ఆ మూలకారణంలో తాము కూడా కలసివున్నా, అందుకు తాము కారకులైనా ఆ విషయాన్ని వారు కావాలనే దాచి వుంచుతూ దోపిడీకి గురయిన బాధిత ప్రజలకు సహాయం చేస్తామనే దాతలుగా ముందుకొస్తున్నారు.

                జస్టిన్‌ రోజెన్‌స్టీన్‌ ఐతే, తాను ప్రజలకు సహాయం చేయటానికి గల మంచి మార్గమేమిటి అని ఏషర్‌ కన్నా కూడా ఎక్కువ మధన పడిపోయాడు. ఇతడు ప్రపంచమంతటా తెలియకపోయినా, సిలికాన్‌ వ్యాలీలోని ఒక ఔత్సాహికుడు. అక్కడ భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే సాంకేతిక ఆవిష్కరణలను చేసినవారిలో భాగస్వామి. అతడు గూగుల్‌ డ్రైవ్‌ను ప్రారంభించటానికి సహాయపడ్డాడు. జి.మెయిల్‌ చాట్‌ను కనుగొన్నవారిలో ఒకడు. అతడు ఫేస్‌బుక్‌ కంపెనీలో ‘పేజెస్‌’ ను ‘లైక్‌’ లు చెప్పే బటన్‌ను కనుగొన్న వారిలో ఒకడు. ముఫ్పై సంవత్సరాల వయస్సులోగానే అతడు పదుల మిలియన్ల డాలర్లు విలువ చేసే స్టాక్‌లు (షేర్లు) బహుమతిగా పొందాడు. మార్కెట్టు ప్రపంచపు విలువలైన ‘‘నేనూ బాగుపడతా – నువ్వు బాగుపడుతావు’’ (Win – Win) అన్న విలువలను జీర్ణం చేసుకొన్న రోజెన్‌స్టీన్‌, ‘‘ఆసనా’’ (Asana) అనే ఒక కంపెనీని ప్రారంభించటం ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచ నిశ్చయించాడు. ఈ సంస్థ ఉబర్‌, ఎయిర్‌ బబ్‌, డ్రాప్‌బాక్స్ లాంటి కంపెనీలకు యితరులతో కలసి సహవ్యాపారులుగా వ్యాపారం చేయటానికి అవసరమైన సాఫ్ట్వేర్ కార్యక్రమాన్ని అమ్ముతుంది. అతడు ఆ రకంగా తన కంపెనీ సాఫ్ట్వేర్‌తో మానవాళి స్థితిగతులను శక్తిమంతంగా మార్చగలనని బలంగా నమ్ముతున్నారు. ఆయన ఉద్దేశ్యం ‘ప్రతి ఒక్కరినీ కొంత ఉత్పత్తి చేసేవారిగా మార్చడం వలన ప్రజల జీవితాలను మెరుగుపర్చటం అన్నది ఒక ఉదాత్తమైన విషయం’ కానీ వాస్తవ మేమిటంటే: అమెరికాలో ఉత్పాదకత అసాధారణస్థాయికి పెరిగినప్పటికీ, సగం మంది అమెరికన్ల వేతనాలు ఘోరమైన స్థితిలో ఎటువంటి పెరుగుదలా లేకుండా స్థంభించిపోయాయి. వాషింగ్‌టన్‌లోని ఒక మేధావుల వేదిక అయిన ఆర్థిక విధానాల సంస్థ (ఎకనిమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌) ప్రకారం: ‘‘1973 నుండీ మెజారిటీ అమెరికన్‌ కార్మికులకు ఒక గంటకు చెల్లించే వేతనాల్లో ఉత్పాదకత పెరుగుదలకు అనుగుణంగా పెంచలేదు. 1973 నుండి 2014 వరకూ గల మధ్యకాలంలో సగటు కార్మికుని యొక్క ఉత్పాదకత 72 శాతం మేరకు పెరిగింది. కానీ ఈ కాలంలో సామాన్య కార్మికుడి వేతనం కేవలం 9 శాతం మేరకే పెరిగింది’’. ఇటువంటి పరిస్థితికి కొంత బాధ్యత, మరింత లాభాలు పిండుకొనే ఆర్థిక రంగానిదే (ద్రవ్యరంగానిదే)!. అందువలన రోజెన్‌స్టీన్‌ చేసిన ఈ ప్రయత్నం వల్ల అతడు వాగ్దానం చేస్తున్నటువంటి మార్పు ఎన్నటికీ సాధ్యంకాదు. అతడు సేవలందించిన గూగుల్‌, ఫేస్‌బుక్‌లు కూడా ఒక స్వేచ్ఛాసమాజంలోని సమాచారంపైనా, ప్రజల వ్యక్తిగత వివరాలపైనా, ప్రజలు ఎక్కడెక్కడ వుంటున్నారనే నిఘాపైనా, వారి సంభాషణల సారాంశంపైనా, వివరాలను సేకరించుకుంటున్నాయి. ఇది ప్రమాదకరమైన పాక్షిక-గుత్తాధిపత్యపు పరిణామం. రోజెన్‌స్టీన్‌లాంటివారు తాము శ్రమించి, చేస్తున్న వృత్తిలోని మెళకువలు, నైపుణ్యాలు సాధిస్తున్న అభివృద్ధి నుండి, చింది, జారిపోయే అభివృద్ధి ప్రభావమే గొప్ప గొప్ప నాగరికతా ప్రయోజనాలను కలుగజేస్తాయని భావించటం అన్నది ‘‘సమస్య పరిష్కరింపబడాల్సిన ప్రపంచపు అవసరాలకన్నా సమస్యను పరిష్కరించే వర్గంవారి అవసరాలకే ప్రయోజనకరంగా ఈ అభివృద్ధి వుండాలి’’ అన్న అవగాహనపై ఆధారపడి వుంది. అందువలన వారు ప్రపంచానికి మేలు చేసేకన్నా, కీడే చేస్తారు.

                ప్రపంచాన్ని మార్పు (బాగు) చేయాలన్న యీ అభిప్రాయాలు యింతటితోనే ఆగిపోలేదు. అవి మరింత ముందుకుసాగి ‘పెట్టుబడిదారులు ఏ ప్రభుత్వంకన్నా కూడా సమర్ధులయినవారు. వారు ప్రభుత్వాలకన్నా సమాజపు అట్టడుగు స్థాయిలో వున్నవారి సమస్యలు మరింత సమర్ధవంతంగా పరిష్కరిస్తారు’ అనే దాకా వెళ్ళింది. ఈ క్రొత్త సిద్ధాంత ప్రకారం: పారిశ్రామిక-వ్యాపార వ్యవస్థపనాతత్వం అన్నది మానవత్వ వాదానికి సమానార్ధకం. అది పారిశ్రామిక స్థాపనారధపు చక్రాలకు కందెనపూసేది!. ఇటువంటి అభిప్రాయాన్ని, అంటే పారిశ్రామిక-వాణిజ్యస్థాపనను మానవతావాదంగా పరిగణించే అభిప్రాయాన్ని విశ్వసిస్తున్నవారు ఎక్కువ మంది సిలికాన్‌ వ్యాలీలో వున్నారు. అక్కడ కంపెనీలు స్థాపించినవారు తరచుగా తమను తాము మానవాళి విముక్తిదాతలుగాను తమ యొక్క సాంకేతికతలు మానవాళిని విముక్తి చేయగల అంతర్గతశక్తి కలవిగా చెబుతూవుంటారు.

                మార్కెట్టు ప్రపంచం వ్యాప్తిలో పెడుతున్న యీ అభిప్రాయాలు, సమాజంలోను విభిన్న వర్గాలు విభిన్న ప్రయోజనాలను కలిగివున్నాయనీ, అందువలన తమ అవసరాల కోసం హక్కులు కోసం వర్గాల మధ్య పరస్పర సంఘర్షణ, పోరాటాలు జరగాల్సివుందన్న భావనను తిరస్కరిస్తాయి.

                కార్సన్‌ (Emmett Carson) అనే వ్యక్తి చికాగోలోని దక్షిణ భాగంలో, నల్లవారిపట్ల వుండే ప్రాంతంలో, ఒక మున్సిపల్‌ కార్మికుని కుమారునిగా పెరిగాడు. తదనంతర కాలంలో అతడు ప్రిన్స్ టన్ గ్రాడ్యుయేటు కాలేజీలో చదివి, ఫోర్డు మరియు మిన్నెపోలిస్‌ ఫౌండేషన్‌లో ప్రతిష్టాకరమైన పదవుల్లో పనిచేశాడు. ఆ తర్వాత కాలంలో అతడు సిలికాన్‌ వ్యాలీలో సాంకేతిక పారిశ్రామిక వ్యవస్థాపకులకు సలహాలు యిచ్చే ఒక పేరుగాంచిన సలహాదారుడిగా మారాడు. ఫోర్డు, మిన్నెపోలిస్‌ ఫౌండేషన్ల యాజమాన్యాలు కోరిన ప్రకారం అతడు ‘‘సామాజిక న్యాయం’’ అన్న పదబంధాన్ని వాడలేదు. సిలికాన్‌వ్యాలీలో పనిచేసిన మొదటి ఇరవై సంవత్సరాల వరకు సామాజిక న్యాయం అన్నపదబంధాన్ని వాడటం ముఖ్యమనిపించింది. సిలికాన్‌ వ్యాలీలో ఈ పదానిక వేరే భాష్యం చెబుతారు. అంటే లాభమా, నష్టమా అన్న అర్థంలో వాడతారు. కొందరి ప్రకారం సామాజిక న్యాయం అంటే ధనవంతుల వద్ద తీసుకొని పేదవారికి ఇవ్వడం. మరికొందరి ప్రకారం ఏమీ సంపాదించనివారికి సహాయం చేయడం అని కార్సన్‌ చెప్పారు. కనుక ‘‘సామాజిక న్యాయం’’ అనే పదం స్థానంలో ‘‘సామాజిక బాగు’’ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించాడు. పారిశ్రామికవేత్తలను వారికి అంత సంపద ఎలా వచ్చిందని వారు ఉన్నత సామాజికస్థాయి ఎలా అందుకున్నారని ప్రశ్నించకపోతే, వారు ప్రజలకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారట. దాతలుగా వుండటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ దాత అనే పేరు వారికి ఉపయోగపడ్తోంది గనుక.

                జేన్‌ లీబ్రాక్‌ అనే యువతి ఫేస్‌బుక్‌లో ఉద్యోగం మానుకొని, ఆదాయాలు చాలక సతమతమవుతున్న మిలియన్ల అమెరికన్‌ కార్మికుల సమస్యకు ఒక ఫోన్‌ ఏప్‌ (APP) ద్వారా పరిష్కారాన్ని అందిస్తున్న ఈవెన్‌ (Even) అనే కంపెనీలో జేరింది. ఈ సంస్థ యొక్క ఉదాత్తమైన ఆశయాలపట్ల ఆమె ప్రభావితమయింది. పెరిగిపోతున్న తీవ్ర ఆర్థిక అసమానతలను నిరసిస్తూ గూగుల్‌ ఉద్యోగులను విధులకు, విధుల అనంతరం యిళ్ళకు తీసుకువెళ్తున్న బస్సులపై నిరుపేద శ్రామిక ప్రజలు రాళ్ళు విసిరిన ప్రాంతానికి చెందినట్టిది. అందువలన ఆమె అట్టడుగునున్న అమెరికన్‌ కార్మికులకు సహాయం చేస్తున్న ఈవెన్‌ సంస్థను మెచ్చుకొంటూ, దానిలో జేరింది.

                ఇంతకీ ఆ ఈవెన్‌ సంస్థ అట్టడుగు కార్మికులకు చేస్తున్న సహాయం ఏమిటయ్యా అంటే, అది ఎగుడుదిగుడుగా సంపాదిస్తున్న కార్మికవర్గానికి, వారి సంపాదనను చదునుచేసి సాఫీ చేస్తుందట!. ఈ రకమైన సేవ చేసినందుకుగాను అది సంవత్సరానికి ప్రతీ ఒక్కరి నుండీ 260 డాలర్లు రుసుముగా తీసుకొంటుంది. అది ఏరకంగా వారి ఆదాయాన్ని చదును చేస్తుంది అంటే, సగటు సంపాదన కన్నా ఎక్కువ సంపాదన పొందిన వారాల్లో ఆ కార్మికుడి అదనపు వేతనాన్ని తన వద్ద వుంచుకొని, సగటు సంపాదన కన్నా తక్కువ సంపాదన పొందిన వారాల్లో ఆ కార్మికుడికి సగటు సంపాదన మేరకు అవసరమైన మొత్తాన్ని యిస్తుందట ! ఉదాహరణకి ఒక కార్మికుడు వారానికి సగటున 500 డాలర్లు సంపాదిస్తున్నాడనుకొందాం. కానీ సంపాదనలో ఆటుపోట్ల వలన ఒకవారం అతడు 650 డాలర్లు సంపాదిస్తే అతడి బ్యాంకు అకౌంటుకు 500 డాలర్లను ఆ కంపెనీ పంపిస్తుంది మిగిలిన 150 డాలర్లను తన అకౌంటులో వుంచుకొంటుంది. మరోసారి ఆ కార్మికుడు ఒక వారంలో కేవలం 400 డాలర్లే సంపాదిస్తే, సగటు మొత్తం పూడ్చటానికి అవసరమయిన 100 డాలర్లను ఆ కంపెనీ అతడి బ్యాంకు అకౌంటుకు పంపిస్తుంది. ఈ రకంగా ఆ కార్మికుడి ఆదాయాన్ని ఆ ఈవెన్‌ కంపెనీ చదును చేసి, సాఫు చేయటం ద్వారా, ఆ కార్మికుల నుండి రుసుం తీసుకొని వారికి ‘‘సహాయ’’పడుతోంది. ‘‘నీ జీవితంలో ఏదైనా రక్షణ (భద్రతా) జాలం కావాలని, మొట్టమొదటి సారిగా అనుకుంటే, అందుకు జవాబు ఈవెన్‌’’ అంటూ ఆ కంపెనీ ప్రచారం చేసుకొంటోంది. ఈ రకంగా మూలాలను ప్రశ్నించి వాటిని సరిచేయకుండా, రుసుం తీసుకొని కార్మికుల వేతనాలను సాఫీ చేస్తూ సహాయం చేయటమన్నది మార్కెటు ప్రపంచపు మాయాజాలపు రూపాలలో ఒకటి.

                ఈవెన్‌ కంపెనీలో పనిచేసే సమయంలో లీబ్రాక్‌ కొందరు కార్మికులను యింటర్వ్యూ చేసింది. వారిలో నైక్‌ స్టోర్సులో పనిచేసే ఉద్యోగిని ఒకరు. అమె భర్తను వదలిన ఒక ఒంటరి తల్లి. తనకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన సౌకర్యాలు కల్పించకుండా తప్పించుకోవటం కోసం తన యజమాని తనకు రోజూ తక్కువ గంటల పనియిస్తూ, వారం అంతా తనకు (పనిచేయటానికి) అవసరమైనప్పుడు పనికి రప్పించడానికి వీలుగా నిరంతరం తనను అందుబాటులో వుండే విధంగా ఎలా ఏర్పాటుచేసాడో, అందువలన తనకు పని దొరకని యితర గంటలలో తాను వేరే పనిని చేసుకోవటం ఎలా కుదరటల్లేదో వివరించింది.

                ఉర్సులా అనే స్ట్రిప్‌మాల్‌లో పచారీ విభాగంలో పనిచేసే ఆవిడ, తాను వారానికి ముప్ఫై ఆరు గంటలుపాటు పని చేసినా, శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న తన మనవలను ఒక్కసారైనా తెచ్చుకోవటానికి అవసరమైన పెట్రోలు కొనుక్కోవడానికి ఆర్థిక స్థోమత లేకుండా పోయిందని వాపోయింది.

                హేదర్‌ జాకోబు అనే మరో మహిళను స్కైప్‌ ద్వారా లీబ్రాక్‌ యింటర్యూ చేసింది. జాకోబ్సు తాను ఒక కార్పొరేట్‌ మసాజ్‌ (వళ్ళుపట్టే) ఛైన్‌లో, అదనపు ఆదాయం కోసం ఫ్రిలాన్సు ఉద్యోగిగా పనిచేస్తున్నాననీ, తనకు అక్కడ వారానికి ఇరవైఆరు గంటల నుండి ముప్ఫైరెండు గంటల మేరకు పనిదొరుకుతుందనీ దీనితోపాటు జిమ్స్‌ లాంటి చోటుకి వెళ్ళి పనిచేస్తాననీ అక్కడ, జిమ్‌ వాళ్ళకు తనకు ఏమీయివ్వరనీ, అయితే క్లైంట్లుయిచ్చే టిప్పులు తీసుకోవటానికి అనుమతిస్తారనీ, అయినా ప్రతీనెలా ఇరవైఏడవ తేదీ వచ్చేటప్పటికి బిల్లులు చెల్లించలేక జుట్టు పీక్కోవలసి వస్తుందనీ ఆమె వాపోయింది. తాను మసాజ్‌ శిక్షణ పొందిన స్కూలు ఫీజు కోసం 3.700 డాలర్ల క్రెడిట్‌కార్డు మీద చేసిన అప్పు తిరిగి చెల్లించటానికే తన సంపాదన అంతా సరిపోతుందని ఆమె బాధపడింది. పైపెచ్చు సరయిన పౌష్టికాహారం కొనుగోలు చేయగల స్థోమత తనకు లేకపోవటంతో, డాలర్‌ స్టోర్సులో అమ్మే అనారోగ్యపు ఆహార పదార్ధాలు తినటం వలన తానూ, తన భర్తా ఊబకాయరోగం వాత పడ్డామని బాధపడింది.

                జాకోబ్స్‌ జీవితకధ వలన మనకు అర్ధమవుతున్నదేమిటంటే, అమెరికా దేశపు పురోగతిలో ఎన్నో వైఫల్యాలున్నాయనీ, అక్కడి ఆరోగ్య-వైద్య వ్యవస్థలో వైఫల్యం, సామాన్య ప్రజలకు మందులు కొనుగోలు చేసుకోగల స్థోమత లేకపోవటం, ప్రజారవాణా వ్యవస్థ వైఫల్యం, వేతన – కార్మికచట్టాల వైఫల్యం, అక్కడి ఆహారవ్యవస్థ యొక్క వైఫల్యం, అక్కడి ఆహారం అందుబాటులో లేని స్థితి, విద్యార్థుల రుణ సంక్షోభం, ఇలా అనేక విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి వాటి ద్వారా కార్పోరేటు అమెరికా తన ఆదాయాలను స్ధిరీకరించుకోగలిగిందనీ, ఒకతరంపాటు కార్పొరేటు అమెరికా తన అనిశ్చయస్థితిని కార్మికులపైకి చాకచక్యంగా నెట్టిందనీ, కంపెనీలలోని వాటాదారులు తమ కంపెనీలను మరింతగా, మరీ ఎక్కువగా తమ కోసమే (తమ లాభాల కోసమే) యితర వాటాదారుల ప్రయోజనాలకు హాని కలిగించటం కోసమే నడిపారనీ అర్థమవుతుంది. ఆర్థిక వ్యవస్థలో ఆటోమేషన్‌ (స్వయం చాలిత యంత్రాలు) వ్యాప్తి చెందటం వలన అప్పటికే అతలాకుతలం చేయబడ్డ కార్మికుల జీవనస్థితిగతులు మరింతగా విధ్వంసం చేయబడుతున్నాయనీ అర్ధమవుతుంది. అందుకనే దాతృత్వం పేరుతో, మంచి పనుల పేరుతో అట్టడుగు ప్రజలను, శ్రామిక ప్రజలను అత్యంత సంపన్నవర్గానికి చెందినవారు, దోపిడీవ్యవస్థ మార్పు కోసం పట్టుబట్టి పోరాడకుండా, ప్రక్కదారి పట్టిస్తున్నారని కూడా అర్థమవుతుంది.

                ‘‘నువ్వు యితరులకు మంచి చేయటం ద్వారా, నీకు నువ్వు బాగుపడు’’ అన్న సూత్రం నేడు మార్కెట్టు ప్రపంచంలో వేదవాక్కుగా వెలుగొందుతోంది. మార్కెట్టు ప్రపంచపు పౌరులు (అత్యధిక సంపన్నులు) యీ ‘సువార్త’ ను సదస్సు తర్వాత సదస్సు ద్వారా నిరంతరం ప్రచారం చేస్తున్నారు. డావోస్‌, టెడ్‌ (TED), సన్‌వేలీ, ఏస్పెన్‌, బిల్డర్‌బర్గ్‌, డైయాలాగ్‌, సౌత్‌ బై సౌత్‌ వెస్ట్‌, బర్నింగ్‌మాన్‌, టెక్‌క్రంచ్‌ డిస్రప్టు, వినియోగదారుల ఎలక్ట్రానిక్‌ షో, బహానా ద్వీపానికి విహారం చేస్తూసాగే నార్వేకు చెందిన యుద్ధనౌకలో సదస్సు (సముద్రంపై శిఖరాగ్ర సభ) లాంటివి యీ రకానికి చెందిన సదస్సులు. ఇటువంటి సదస్సులకు హజరయ్యే వారంతా ప్రసిద్ధి పొందిన తెగువతో వ్యాపారం చేసే ప్రసిద్ధ పెట్టుబడిదారులు, సిలికాన్‌ వ్యాలీలోని సాంకేతికత ప్రపంచానికి చెందిన విజేతలు. వీరంతా తమ అధికారం, శక్తివల్లనే ఈ యుగంలోని ప్రజలందరూ దౌర్భాగ్యస్థితికి చేరుకొన్నారన్న వాస్తవానికి చాకచక్యంగా ముసుగువేసి, తామే యీ ప్రపంచాన్ని పురోగతివైపు నడుపుతున్నామని బుకాయిస్తూ దోపిడీ (సంపదను) చేస్తున్నవారు. నేడు సిలికాన్‌ వ్యాలీకి చెందిన విజేతలే కొత్తగా అవతరించిన శక్తికి, అధికారానికీ భూమధ్య కేంద్రంగా వున్నారు. ‘‘వీళ్ళు తిరుగుబాటుదారుల్లా పోట్లాడుతారు. మహారాజుల్లా తమ కార్యకలాపాలను (వాణిజ్య – ఆర్థిక) నిర్వహిస్తారు’’.

                వీరు స్థాపించిన ఎయిర్‌బన్బ్‌, ఉబర్‌లాంటి సంస్థలు పలు చట్టాలను ఉల్లంఘిస్తూ డ్రైవర్లుగావున్న కార్మికుల శ్రమను మోసపూరితంగా దోచుకొంటూ, పలు సందర్భాలలో జాత్యహంకార వ్యాపారచర్యలకు పాల్పడుతూ, తాము చట్టపరిధిలోకి రావటానికి నిరాకరిస్తూ, తమది కేవలం ‘‘ప్రయాణీకులకూ డ్రైవర్లకూ మధ్యన సంబంధం ఏర్పాటు చేసేందుకు ఏర్పడిన సాంకేతిక వేదికలేనంటూ, లేదా గది అద్దెకు కావల్సినవారికీ, గదె అద్దెకు యివ్వగలిగినవారికీ మధ్య సంబంధాన్ని ఏర్పరిచే సాంకేతిక సంధానకర్తలమేనని’’ బుకాయిస్తూ ప్రపంచమంతటా ఎటువంటి నియంత్రణకు లొంగకుండా, అంగీకరించకుండా ‘లాభాలను’ దోపిడీ చేసుకొంటున్న సాంకేతిక యుగపు పెట్టుబడిదారుల సంస్థలే!

                1990ల మధ్య కాలంలో ఇంటర్నెట్‌ (సాంకేతిక ఆధారిత)ను ప్రారంభించారు. ఇది అసమాన ప్రపంచాన్ని, సమాన ప్రపంచంగా మారుస్తుందని నాడు బిల్‌గేట్సు జోశ్యం చెప్పాడు. తీరాచూస్తే ఈరోజున ఇంటర్నెట్‌ ‘‘అది ఎన్ని మహత్తరమైన విషయాలను మన ముందుకు తెచ్చినప్పటికీ, ఈ సంస్థ గుత్తాధిపత్య ఆర్ధిక సూత్రాలతోనూ, లాభాలను పిండుకొనే సూత్రంతోనూ, ప్రజలపై నిఘా జరుపుతూ తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇంటర్నెట్‌ వాడే సాధారణ ప్రజలకు తమ వ్యక్తిగత డేటాపై నియంత్రణ పెట్టుకోవటం సాధ్యంకాదు. ప్రతి ఒక్కరి జీవితాల్లోకీ డిజిటల్‌ పని ప్రదేశాలు ప్రవేశిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాలు తరచుగా దోపిడీ చేస్తూ సమాజంలో వున్న అసమానతలను మరింత పెంచివేస్తున్నాయి. కానీ మరోవైపున అసమానతను సమం చేస్తామంటూ అవి ప్రకటిస్తూ వుంటాయి. ఇదీ యీ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంల వ్యాపారంలోని అసలు రహస్యం. ఈవిధంగా ఈరోజున సాంకేతిక కంపెనీలైన అమెజాన్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్లు అన్ని విషయాలను నియంత్రిస్తున్నాయి. ‘‘అవి తమ తమ రంగాల్లో పాతుకుపోయి రోజురోజుకూ విస్తరిస్తూ యితర రంగాల్లో మరింత శక్తిమంతంగా తయారయి సమాజగమనాన్ని శాసిస్తున్నాయి’’.

                వీరంతా తాము జరుపుకొంటున్న యీ సదస్సులను ‘‘న్యాయంకోసం, పరిశ్రమ స్థాపనాతత్వం కోసం ఏర్పడిన వేదికలుగా’’ అభివర్ణించుతారు.

                సాంకేతికతతో రూపొందింపబడ్డ యీ వేదికల గురించి బ్రూక్లిన్‌లో సామాజిక సేవా కార్యక్రమాలను, సాంకేతికతా ప్రపంచంతో సంబంధం లేకుండా కార్మిక సహకార కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఎమ్మాయోరా (Emma Yorra) చెప్పిన అభిప్రాయం తెలుసుకొందాం. పేద వలసదారులైనవారికి గృహాలను శుభ్రపరిచే పనులను, పిల్లల్ని ఆడించే పనులను, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసే పనులను, ఇటువంటి యితర పనులను ఆ కార్మిక సహకార కేంద్రం నిర్వహిస్తుంది. కార్మికులకు చెల్లించే కూలి డబ్బులను మధ్యవర్తులు దోచుకోకుండా, వీలైనంత ఎక్కువ కూలిని యిచ్చేందుకు తోడ్పడుతుంది. ఒకరోజున ఎమ్మాయోర్రా ఒక సబ్‌వేలో ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫారంపైన, అత్యంత సులభంగా యిళ్ళను శుభ్రపరిచేందుకు యిచ్చే సేవలను గురించిన ప్రకటనను చూసి ఆగ్రహం చెందింది. ఆ ప్రకటనలో యిలా వుంది ‘‘ఒక క్లిక్‌ చేస్తే చాలు మీ అపార్టుమెంటు శుభ్రమవుతుంది’’ అని వుంది. దాని ప్రక్కన పసుపు పచ్చ గ్లవ్సు తొడుక్కున్న చేయి, స్పాంజిని పట్టుకొన్న బొమ్మ వుంది. ‘‘ఈ రకంగా గృహసేవలను అందించే సాంకేతికత సేవలు మనుష్యులు చేయటల్లేదు, ఏ మాంత్రికురాళ్ళో చేస్తాయి’’ అన్నట్టుగా ప్రకటిస్తూ, ఆ ఏప్‌ సేవల వెనుక వున్న మానవశక్తిని దాచిపెట్టి, మానవుల మధ్య పరస్పరచర్యల స్వభావాన్ని మార్చివేస్తున్నాయనీ, ఆ రకంగా బేరసారాలు ఆడగలిగే శక్తి బాగా తగ్గిపోయిన సామాజిక వాస్తవాన్ని కప్పిపెట్టుతున్నాయనీ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

                గతంలో మాదిరి సమస్యలకు మూలకారణాలను వెతికి, వ్యవస్థను విమర్శించి, దానిని వ్యతిరేకించి అది మార్పు చేయాలని నిర్ధారించే విమర్శకులను కాదంటూ, మార్కెట్టు ప్రపంచం యిప్పుడు మేథో నాయకులు (Thought Leaders) అన్నవారిని పెంచి పోషిస్తోంది. ‘‘ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద భయంకరమైన సమస్యలుగా పేదరికం, వాతావరణ మార్పులు లాంటివి ఎన్నో వున్నాయి. ఐతే ప్రపంచం యీ సమస్యలను నిర్మూలించటంపై కేంద్రీకరించటంకన్నా, వాటితో సహజీవనం చెయ్యగలగటంపై కేంద్రీకరించాలి…. ‘‘బహుశా యీ సమస్యలన్నీ కలకాలం అలాగే వుండిపోవచ్చు. అందువలన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సమస్యలతో పోటీపడాలని మనం ప్రజలకు నేర్పాలి’’…. ‘‘దుర్మార్గులైన రాక్షసులకు వ్యతిరేకంగా మనం పవిత్ర యుద్ధం జరుపుతున్నా ఫలితం లేకపోయిందని మనం అంగీకరించాలి. చాలకాలం వరకూ ఆ పవిత్రయుద్ధంలో మనకు విజయం లభించదు.’’ …..‘‘అందువలన మనకు ఆచరణీయమైన (రాజకీయంగా) వైఖరులు అవసరం – అంటే మనం సముద్రపు కెరటాలను ఆపటానికి ప్రయత్నించటానికి బదులు సముద్రకెరటాలతోపాటు దొర్లుకుంటూ పోవాలి’’ అన్న సైద్ధాంతిక ప్రాతిపదికతో యీ ‘‘మేథో నాయకులను’’ మార్కెట్టు ప్రపంచం ఉత్పత్తి చేస్తోంది.

                ఆవిధంగా మార్కెట్టు ప్రపంచం చేత మలచబడి, ఉత్పత్తి చేయబడ్డ ‘‘మేథో నాయకుల్లో’’ అమీ కడ్డీ (Amy Cuddy) ఒకరు. ఆమె హార్వార్డు బిజినెస్‌ స్కూల్లో ఒక సామాజిక మానసిక శాస్త్రవేత్త. ఆవిడ ఒక దశాబ్దకాలంపాటు ‘‘మానవుల్లో ఏవిధంగా పక్షపాత భావాలు, వివక్షలు, అధికార వ్యవస్థలు ఏర్పడతాయి’’ అన్న అంశంపై పలు పరిశోధనా పత్రాలను ప్రచురించింది. ప్రపంచమంతటా పురుషాధిక్యత స్థానిక పరిస్థితుల్లో వ్రేళ్ళూనుకున్న విషయంపైనా, స్వేచ్ఛగా, స్వార్ధపూరితంగా వుండటంలాంటివి ‘‘సాంస్కృతిక ఆదర్శాలు’’గా ఏర్పడటం మొదలైన లాంటి విషయాలపై పరిశోధనలు జరిపి పలు వ్యాసాలు వ్రాసింది. కానీ ఆమెను తమ సదస్సులో ప్రసంగించమని మార్కెట్టు ప్రపంచం ఆహ్వానించగా, ఆమె గతంలో ఏర్పరుచుకొన్న తన అవగాహనకు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. పురుషాధిక్యతకు కారణభూతమైన వ్యవస్థను మార్చాలన్న దానికి బదులు, మహిళలు తమ శక్తిని సూచించే భంగిమలను ప్రదర్శించడం, ‘‘బాడీలాంగ్వేజ్‌ ద్వారా అధికారాన్ని (స్త్రీలు) గెలుచుకోవడం’’ అనే ఐడియాను ముందుకు తెచ్చింది. ఆ రకంగా ఆమె ‘‘ఒక సమస్యను పరిష్కరించడానికి అధికారం వున్నవారి నుండి ఆ అధికారాన్ని గుంజుకోకుండా, ఆ అధికారాన్ని లేనివారికి కొద్దికొద్దిగా యివ్వటం’’ అనే కొత్త సిద్ధాంతాన్ని రూపొందించింది. అడ్డుగా వున్న గోడను కూల్చడం కన్నా, దాన్ని ఎక్కడానికి నిచ్చెన సమకూర్చడం అన్నమాట.

                మూడు అంచెల్లో ఈ ‘‘మేథో నాయకులు’’ రూపొందుతున్నారు.

                మొదటిది : ఒక సమస్య వచ్చినపుడు, అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని చేసినవారి గురించి ఆలోచిస్తే ఆగ్రహం పెరుగుతుంది. అందువలన ఘర్షణ చోటు చేసుకొంటుంది. అందుకు బదులు నీ ఆలోచనను బాధితుడివైపుకు మారిస్తే నీవు అతడి పట్ల సానుభూతి చూపిస్తావు. అందువలన నీ ఆలోచన నిర్మాణాత్మక దిశ వైపు సాగుతుంది. హానిని కలిగించిన వారిని శిక్షించటానికి ప్రయత్నించేబదులు, నువ్వు హానికి గురికాబడ్డవారికి సహాయం చేయగల్గుతావు. మానసిక శాస్త్రవేత్త, మేథో నాయకునిగా ఇటీవల గుర్తింపబడిన ఆడం గ్రొంట్‌ సూచించిన పద్ధతి ఇది.

                రెండవది : రాజకీయాన్ని వ్యక్తిగతం చేయటం. ప్రజలకు సహాయపడేవానిగా నీవు చేయాల్సినది ఏమిటంటే వారు సమస్యలను వ్యవస్థాపరమైనవిగాకాక, వ్యక్తిగతమైనవిగా చూసేటట్లు, సమస్యలను సమష్టిగా కాక వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని వారికి తెలియజేయటం. ఇది సమస్యపై మన ఆలోచనలను కేంద్రీకరించడానికి సంబంధించిన అంశం.

                వాస్తవానికి వ్యక్తిగత సమస్యలు కూడా రాజకీయ సమస్యలే. వాటికి వ్యక్తిగత పరిష్కారాలన్నవే లేవు. అందువలన సమష్టి పరిష్కారం కోసం, సమష్టి కార్యాచరణే జరగాలి, కానీ యిప్పుడు మార్కెట్టు ప్రపంచం యీ అవగాహనను చాకచక్యంతో మార్చివేసింది.

                మూడవది : ఆలోచనలను లాభదాయకమైన వ్యాపార వస్తువులుగా మలచగలగటం. ఈ ఆలోచనలను అందరికీ విరివిగా అందుబాటులోకి వచ్చేవిధంగా నిరంతరం (ఉపన్యాసాల ద్వారా) బోధించటం.

                ఎవర్నీ సవాలు చేయకుండానే, మనిషిలో ఆశలు కల్పించేవిగా వుండటమన్నది ఈ ఆలోచనల అంతస్సూత్రం. ఈ మేధో సంబంధమైన ఆలోచనలన్నీ క్రింది సైద్ధాంతిక ఊహల పునాదిపై ఆధారపడ్డాయి :- వ్యాపార – వాణిజ్యాలే పురోగతికి చోదక యంత్రాలు. అందువలన రాజ్యాంగయంత్రం (ప్రభుత్వం) సాధ్యమైనంత తక్కువగా పనిచేయాలి. సమస్యలను పరిష్కరించటానికే కాదు, దుర్లభంగా అరుదుగా వున్న వనరులను కేటాయించటానికి కూడా మార్కెట్టు శక్తులే శ్రేష్టమైన మార్గం. సారాంశంలో ప్రజలు హేతుబుద్ధిగలవారే అయినా, స్వార్ధ ప్రయోజనాలకోసం మసిలే వ్యక్తులుగా వుంటారు.

                వాస్తవానికి అసమానత్వం అన్నది, సంపదను తిరిగి యిచ్చివేయడానికి సంబంధించిన విషయంకాదు. అసలు అంతటి సంపదను నువ్వు ఏవిధంగా కూడబెట్టావన్నదే ప్రశ్న? ఆ రకంగా సంపదను కూడబెట్టుకోవటాన్ని సాధ్యం చేసిన వ్యవస్థ యొక్క స్వభావం ఏమిటన్నదే ప్రశ్న.

                కానీ యీ మార్కెట్టు ప్రపంచపు మేధావులు ‘‘అసమానత అన్నది అవాంఛనీయమే అయినప్పటికీ, అసలైన అభివృద్ధి (పురోగతి) సాధించటానికి అది (అసమానతే) అనివార్యంగా చెల్లించాల్సిన మూల్యం’’. ‘‘నీకు పురోగతి (అభివృద్ధి) కావాల్సివస్తే సంపన్నులు ఎంత సంపాదిస్తారో అంత సంపాదించుకోనివ్వు! దానివలన అసమానత ఎంతగా విస్తరించినా ఫర్వాలేదు’’ అని వాదిస్తారు. ‘‘దాతృత్వం అనేది విజేతలకు అన్ని రకాల ఎదురు ప్రశ్నల నుండీ, నియంత్రణ నుండీ మినహాయింపు పొందే హక్కునిచ్చింది’’ అంటూ వారు నచ్చజెపుతున్నారు.

                దాతృత్వ ప్రపంచం యొక్క పై స్థాయికి చేరుకొంటున్న వారిలో డారెన్‌ వాకర్‌ (Darren Walker) ఒకడు. డారెన్‌ అవివాహితగా వున్న ఒక నల్లజాతి స్త్రీకి పుట్టిన యిద్దరు పిల్లలలో ఒకడు. అతడు లూసియానోలోని, లఫాయెటి ఛారిటీ హాస్పటల్‌లో జన్మించాడు. అతని తల్లి తన బిడ్డలను తీసుకొని టెక్సాస్‌లోని నల్లజాతివారి పట్టణమైన అమేస్‌ (Ames)కు మారింది. ఆమె ఒక నర్సుకు సహాయకురాలిగా పని చేసేందుకు కావల్సిన చదువు చదివి సర్టిఫికేట్‌ సంపాదించింది. అయినా ఆమెకొచ్చే సంపాదన ఆమెను పేదరికం నుండి తప్పించలేకపోయింది. 1965లో అధ్యక్షుడు లిండన్‌ బి జాన్సన్‌ ప్రభుత్వం చేపట్టిన బాలల విద్యాపథకం క్రింద ఏర్పాటు చేసిన స్కూల్లో జేరిన డారెన్‌ అక్కడి పనిచేసే ఒక ఉపాధ్యాయురాలి సహాయంతో ప్రత్యేక విద్యను అభ్యసించగలిగాడు. ఆవిడ సహాయం దొరకకపోతే ఎందరో యితర నల్లజాతి బాలుర మాదిరిగానే అతడు కూడా అనివార్యంగానే జైలుపాలయి వుండేవాడు. అతడి తోటివారైన ఆరుగురు మగ దాయాదులు (కజిన్సు) జైలుపాలయ్యారు. అతడు పన్నెండేళ్ళ వయస్సులో, తన తల్లికి ఆసరాగా వుండటం కోసమని ఒక హోటల్‌లో క్లీనర్‌గా చేరాడు. తన దాయాదులు (కజిన్సు) జైళ్ళకూ, బయటకు మధ్య తిరుగుతున్న కాలంలో అతడు టెక్సాస్‌ యూనివర్సిటీలో చదివాడు. అనంతరం ఏడేళ్ళపాటు ఒక ఫైనాన్సు కంపెనీలోని పెట్టుబడి మార్కెట్ల విభాగంలో పనిచేశాడు. అనంతరం అబిసీనియన్‌ డెవప్‌మెంటు కార్పొరేషన్లో పని చేసి, అక్కడి నుండి రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌లోకి మారాడు. అంతే ఇక అప్పటి నుండి అతడి సామాజిక స్థాయి పైపైకి పెరిగిపోయింది. అతడిప్పుడు న్యూయార్కు నగర సమాజంలో ఉన్నతస్థాయి (సంపన్న) వారిలో ఒకడయిపోయాడు. అతడు విదేశీసంబంధాల సమితిలో సభ్యుడు. రాక్‌ఫెల్లర్‌ దాతృత్వ సహాదారుల బోర్డులో సభ్యుడు. ఫ్రండ్స్‌ ఆఫ్‌ ది హైలైన్‌లో సభ్యుడు. అయితే ఒక రోజున అతడు సంపన్నులతో డిన్నర్‌ చేస్తుండగా అతడి సోదరి అతడికి, వాళ్ళ మేనత్త బెర్తా యొక్క అంతిమక్రియలు జరిపిన ఫోటోలు పంపింది. ఆ ఫోటోలలో ఒక దానిలో వాకర్‌ తన కజిన్‌ ఒకరిని గుర్తించాడు. అతడు జైలు దుస్తులు ధరించి వున్నాడు. ఎవరో తెలియని ఒక తెల్లజాతి మనిషి అతడి వెనకనుంచున్నాడు. ఎవరా వ్యక్తి అని అతడు తన సోదరిని ప్రశ్నిస్తే, ‘లూసియానలో కొన్ని సమయాల్లో జైల్లోవున్న వారిని బంధువుల అంత్యక్రియలకు పంపిస్తారు. అందుకు కొంత రుసుం చెల్లించాలి. తోడుగా ఒక పోలీసు ఆఫీసరు కూడా వస్తాడు’ అని చెప్పింది.

                మరో రోజున అతడి కజిన్‌ (దాయాది) మరొకరు చనిపోయాడు. అతడి కుటుంబం నిరుపేదలు. అందువలన అతడి అంత్యక్రియలకు అయిన ఖర్చునంతటినీ డారెన్‌ తల్లి డారెన్‌ తన కిచ్చిన క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లించింది. ఈ ఘటనలు అతడ్ని ఆలోచనలకు పురికొల్పాయి. అప్పటికి అతడికి సంవత్సరానికి 789000 డాలర్లు ఆదాయం వస్తుంది. ఖరీదైన బట్టలు ధరిస్తాడు. బిలియనీర్లు స్నేహితులుగా వున్నారు. మాడిసన్‌ స్క్వేర్‌ పార్కులో విలాసవంతమైన ప్లాట్‌లో నివసిస్తున్నాడు. అతడు బిలియనీర్లు, మిలియనీర్లు అయినవారు తమ అపార్టుమెంట్లకు చెల్లించాల్సిన పన్నులో రాయితీని పొందిన వారి మధ్య జీవిస్తున్నాడు. ‘అయితే ఎన్ని ఆదర్శాలుంటే మాత్రం పన్ను రాయితీని వద్దనుకొని విడనాడేవాడు ఎవడుంటాడు?’ అనుకొన్నాడు. అప్పటి నుండీ అతడు వ్యవస్థల గురించి మాట్లాడాలనుకొన్నాడట!. ‘‘ఇటువంటివి సంభవించే సమాజంలో మనం ఎందుకు జీవించాలి? అనుకొన్న అతడు, ‘‘ప్రత్యేక హక్కులు సౌకర్యాలు వున్న మనం యీ సమాజాన్ని మార్చాలి’’ అనుకొన్నాడట! పూర్తిగా అవినీతిపాలైన యీ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలనుకొన్నాడట. ఇటువంటి ఆలోచనను సామాజికశాస్త్రవేత్తలు ‘‘విపరీత ప్రవర్తనా ప్రతిష్టలు’’ (Idiosynerasy Credits) అని పిలుస్తారు. అప్పుడప్పుడు యిటువంటివారు తమ బృందం అనుసరించే నియమాలనే వ్యతిరేకిస్తారు. అదే వాకర్‌ యిప్పుడు చేస్తున్నపని. ఇంతకీ అతడు చేస్తున్నదేమిటయ్యా అంటే విజేతలను బ్రతిమాలి, ఒక పక్షపాతం లేని సమసమాజాన్ని గురించి ఒక సంభాషణ ప్రారంభించగలగడమట?. ఇదీ ప్రపంచాన్ని మార్చే అత్యంత సంపన్నుల ఆలోచనాసరళి!

                అతడు బ్రతిమాలి ఒప్పించాలనుకొంటున్న వారిలో సేక్లర్‌ సోదరులు ఒకరు. వారు అనేక ప్రతిష్ట గలిగిన దాతృత్వసంస్థలకు భారీ విరాళం ఇచ్చినవారు – యిస్తున్నవారు. ఆ సోదరులు వ్యక్తిగతంగానే కాకుండా, తమ కంపెనీ ఏ ఏ ప్రాంత ప్రజాసమూహాల్లో నిర్వహింపబడుతోందో అక్కడ తమ కంపెనీ ద్వారా స్థానిక బృందాలకు గ్రాంట్లను యిస్తున్నారు. ‘‘యువకులలో పెను ప్రమాదపు ప్రవర్తనను (High Risk Behaviour) తగ్గించే’’ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు యీ గ్రాంట్లు యిస్తున్నారు. అంతేకాక ‘‘మందుల దుర్వినియోగాన్ని తగ్గించే విషయం వైద్యులు గుర్తించేందుకు’’ సహాయపడే విద్యాసంబంధ కార్యక్రమాలకు నిధులు యిస్తున్నారు. అమెరికాలోనూ, ప్రపంచమంతటాగల అధికార ప్రభావిత ప్రాంగణాల్లో యీసేక్లర్‌ సోదరుల ఉదారమైన వితరణను, దాతృత్వాన్ని తప్పించుకోగల వారెవ్వరులేరు. ఇంతకీ వీరు సంపదను కూడబెట్టిన విధమేమిటంటే : 1996లో వీరు నెప్పి నివారణ మందు ఆక్సీకాన్‌టిన్‌ (Oxycontin)ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇది ఒక శక్తివంతమైన మత్తుమందు-మాదకద్రవ్యం. 12 గంటలపాటు నొప్పి నుండి ఉపశమనం కలుగచేస్తుంది. మొదట యీ మందును విడుదల చేసినప్పుడు యిది దుర్వినియోగపర్చబడనిదనీ, యీ మందు వాడకం ఒక వ్యసనంగా మారకుండా వుంటుందనీ ప్రచారం చేశారు. కానీ ‘టైమ్స్‌’ పత్రిక ప్రకారం, ‘‘అలా ప్రచారం చేస్తూనే ఆ మందును మార్కెట్లో అమ్మడానికి పలు రకాల కార్యక్రమాలు వారి కంపెనీ ‘పర్‌డ్యూఫార్మా’ చేపట్టింది. ఆ ప్రచారోద్యమం అంత వరకు ఏ మందుల తయారీ కంపెనీ,  నొప్పినివారణ మందులు మార్కెటింగ్‌ చేయటానికి చేపట్టనటువంటి తీవ్ర ఉధృతస్థాయిలో సాగింది. ఆ మందును అమ్మే డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీ పెట్టి బహుమతులిచ్చే సమావేశాలరూపంలోనూ, డిన్నర్‌ పార్టీ సమావేశాల రూపంలోను, ఆఖరికి ఆ పర్‌డ్యూ కంపెనీతోపాటు, దాని భాగస్వామ్యమైన ఏబట్‌ లాబరేటరీలతో కలసి, డాక్టర్లను, ఎముకల – కీళ్ళ వైద్యం చేసే డాక్టర్లను, సర్జన్లను ప్రలోభపెట్టి ఆక్సోకాన్‌ను ఎక్కువగా ప్రిస్క్రైబ్‌ చేసేటట్లు చేసింది. ఆ రకంగా 1990లలో చిన్న మందుల తయారీ కంపెనీగా వున్న పర్‌డ్యూ కంపెనీ 2001 నాటికి 3 బిలియన్ల డాలర్లు సంపాదించే స్థాయికి చేరుకొంది. ఈ మందు ఓవర్‌డోస్‌ వాడకం వల్ల (ఆ మందుకు బానిసైనవారితో సహా) ఈ మత్తు మందు ప్రిస్కిప్షన్లు 1999 నుండి 2014 దాకా నాల్గురెట్లు పెరగగా, కేవలం 2014 సంవత్సరంలోనే 14,000 మంది ఈ మందు వాడడం వల్ల చనిపోయారు. ప్రతీరోజూ యీ మందు వ్యసనానికి గురయిన వేలాదిమంది ఎమర్జన్సీ చికిత్సకు లోనవుతున్నారు. ఎట్టకేలకు యీ మందు దుష్పరిణామాలను గుర్తించిన అమెరికన్‌ మందుల నియంత్రణ సంస్థ ఈ కంపెనీని కోర్టుకీడిస్తే ముందు కాదని బుకాయించిన కంపెనీ ఆఖరుకు 635 మిలియన్ల డాలర్ల అపరాధ రుసుంను చెల్లించటానికి అంగీకరించింది. ఈ పర్‌డ్యూఫార్మా ద్వారా అనంతమయిన సంపదను అన్యాయంగా కొల్లగొట్టిన సేక్లర్‌ సోదరులనే ఒప్పిస్తానని వాకర్‌ చెబుతున్నాడు. ఈ రకంగా మార్కెట్టు ప్రపంచం న్యాయానికి ప్రత్యామ్నాయంగా ఔదార్య, దాతృత్వాలకు అనుమతినిస్తోంది.

                వాకర్‌ మాదిరిగానే ప్రశ్నలు వేస్తూనే, మార్కెట్‌ ప్రపంచపు భావజాల సిద్ధాంతాలతో రాజీపడుతూ, వాటి ద్వారా ప్రపంచాన్ని మార్చవచ్చునన్న దానిని హేతుబద్ధం చేసుకొన్న వ్యక్తులలో కేట్‌ కోల్‌ (Kat Cole) ఒకరు. ఈవిడ ప్రస్తుతం ఫోకస్‌ బ్రాండ్‌ అనే సంస్థకు చెందిన ప్రైవేటు ఈక్విటీ కంపెనీకి చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌. సిన్నబాన్‌ అనే ఆహారపదార్థాల కంపెనీతోపాటు, పలుపేర్లతోగల ఆహారపదార్థాల కంపెనీలకు ఫోకస్‌ బ్రాండ్‌ సంస్థ స్వంతదారు. కోల్‌ తల్లిదండ్రులు తెల్లచొక్కా ఉద్యోగాలు (మధ్యస్థాయి గుమాస్తాలు) చేసేవారు. వీరి బంధువులలో ఎక్కువ మంది పేదవారుగా వుంటూ ట్రైలర్‌పార్కుల్లో (ట్రక్కుల నివాసాలు నిలిపే పార్కులు) నివసిస్తూన్న పేదవారే!. కోల్‌ తండ్రి త్రాగుబోతు. అతడు తరచు కుటుంబాన్ని వదలిపెట్టి పోతూవుండేవాడు. అందువలన వాళ్ళు కూడా పేదవారుగా మారిపోయారు. వారికి తాజాగా వుండే ఆహారం తినగలిగే ఆర్థికస్థోమత లేకపోవటంతో, చవకబారు ప్రాసెస్డ్‌ ఆహారం తింటూ కాలం వెళ్ళబుచ్చాల్సివచ్చేది. కోల్‌ తల్లి ఒక చోట ఆఫీసు సెక్రటరీ ఉద్యోగం చేస్తూనే రాత్రిపూటల్లో, వారాంతాల్లో యితర పనులు చేసేది. కోల్‌ తన పదిహేనవఏట మాల్‌లో బట్టలు అమ్మేది. హైస్కూలు జూనియర్‌ సంవత్సరంలో హూటర్స్‌ అనే రెస్టారెంటులో వెయిటర్‌ (సర్వర్‌) గా చేరింది. బాలికా సర్వర్‌ల వక్షోజాలను తమ అమ్మకపు ఆకర్షణగా హూటర్స్‌ వ్యాపారం చేస్తుందన్న ప్రతీతివుంది. అయితే ఆ ఉద్యోగం తనకు సాధికారత నిస్తుందని కోల్‌ భావించింది. కాలేజీ విద్యార్థినిగా వున్నప్పుడే ఆమె ఒక షిప్టులో 400 డాలర్లు సంపాదించటం మొదలెట్టింది. ఆ హూటర్స్‌ రెస్టారెంట్‌ యొక్క అడ్వర్టయిజ్‌మెంట్లు వెల్లడి చేస్తున్నాకూడా, కోల్‌ మాత్రం ‘‘ఆ సంస్థ వక్షోజాల ఆకర్షణతో వ్యాపారం చెయ్యటల్లేదు. ఓవర్‌ ఆల్‌ (మొత్తం) సెక్స్‌ అప్పీలును అమ్ముతుంది’’ అంటూ సమర్థిస్తుంది. ఆ రెస్టారెంటులో కొన్నిసార్లు కష్టమర్లు సర్వర్ల్లపై భౌతికదాడులు చేస్తారు కూడా ! అయినా అవి అన్నీ మామూలేనంటుంది కోల్‌. ఆమె తన నైపుణ్యం వలన హూటర్స్‌ మేనేజిమెంటు స్థాయికి చేరుకొంది. ఆమె ‘‘హూటర్స్‌ మహిళలను దోచుకోదు. మహిళల సెక్స్‌ అప్పీలును పెంచి ఆ మహిళలకు ఉద్యోగాలనిస్తారు’’ అంటూ హేతుబద్ధం చేసి సమర్థించింది. కాలక్రమంలో ఆమె ఎం.బి.ఎ చదువుకొని ఫోకస్‌ బ్రాండుకు చెందిన సిన్నబన్‌ ఆహార కంపెనీలో చేరింది. ఆ కంపెనీ అమ్మే ఆహార పదార్థాలను ఆరోగ్యం కోరుకొనేవారు తినకుండా తప్పించుకోవాలి ! ఆ అనారోగ్యకర ఆహార పదార్థాలన్నీ కోల్‌ ఆధ్వర్యంలోనే తయారు అవుతున్నాయి. కానీ ఆమె ఏరకంగా దాన్ని సమర్థిస్తుందంటే ‘‘మాది శతాబ్దాల కాలంగా సాగుతున్న బేకరీ. ఇప్పుడు మేము భారీ ఎత్తున పంచదార వాడుతున్నాం. ఇది వందల సంవత్సరాలలో జరిగిన అర్థవంతమైన పరిణామం’’…..‘‘స్వేచ్ఛామార్కెట్టు సమాజంలో డిమాండు వుంటుంది. అది పంచదార ఉత్పత్తులకే కావొచ్చు. ఆల్కహాల్‌కే కావొచ్చు. లేదా అరకొరగా బట్టలు కట్టుకొన్న మహిళా సర్వర్లతో నిర్వహించాల్సిన రెస్టారెంట్లు కావొచ్చు.’’ అవి అలాగే ఉనికిలో వుంటాయి. అప్పుడు మనం పట్టించుకోవల్సిన విషయమేమిటంటే! ఎలాగ ఉనికిలో వున్నాయి అన్నదానినే.’’ నేను (కోల్‌) నా విధిని సక్రమంగానే నిర్వర్తించాను. సిన్నబన్‌ రోల్సు తినే వారికి వాటి నిండా పంచదార, క్రొవ్వు వుందని చెప్పాం !. వాటిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్లలో తినవద్దు అని మీడియాలో హెచ్చరిస్తాం! అంటూ, హానికరమైన ఆహారపుటలవాట్లు, పౌష్టికాహారం ఎంచుకోవటానికి గల అవకాశాలు, ఊబకాయం లాంటి వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలను గురించిన ప్రశ్నలను విస్మరించమంటోంది! ఇటువంటి ‘‘పారదర్శక’’ ప్రయత్నాల ద్వారా హానికర ఆహార పదార్థాల గురించి హెచ్చరించటమే ‘కార్పొరేటు సుగుణం’ అని ఆమె చెబ్తోంది.

                లారీ (Laurie Tisch) టిష్‌ అనే ఆమె లోయాస్‌ కార్పొరేషన్‌ స్థాపించిన వ్యక్తి. ఆ కంపెనీ ద్వారా అపారసంపదను కూడబెట్టింది. న్యూయార్కు నగరంలో టిష్‌ కుటుంబం దాతృత్వానికి పేరొందిన కుటుంబం. ప్రస్తుతం ఏభై-అరవై సంవత్సరాల మధ్య వయస్సులో వున్న ఆమె 21 బిలియన్ల డార్ల ఆస్థికి వారసులు. ఆమె యిప్పుడో బడా దాత. 1968లో లోయిస్‌ కంపెనీ, పొగత్రాగటం పై ప్రజలకు పెరుగుతున్న ఆరోగ్యపు పట్టింపు (పొగత్రాగటానికి వ్యతిరేకంగా)ను సొమ్ము చేసుకొంది. చవకబేరానికి సిగరెట్లు తయారు చేసే ఒక కంపెనీని కొనుగోలు చేసింది. తాను కొనుగోలు చేసిన సిగరెట్టు కంపెనీ లోరిల్లార్డ్లో ‘న్యూపోర్టు’ బ్రాండు సిగరెట్లును ఉత్పత్తి చేసింది. ఈ సిగరెట్లు ఆఫ్రికన్‌ అమెరికన్లను లక్ష్యంగా పెట్టుకొని ఉత్పత్తి చేసారు. ఈ వివాదాస్పద సిగరెట్లు యితర వాటికన్న పొగత్రాగే వారిని బాగా ఆకర్షిస్తాయి. కానీ చాలా ప్రాణాంతకమైనవి. వీటిలో సగటు స్థాయి కన్నా ఎక్కువ నికోటిన్‌ వుంటుంది. కానీ అది తెలియకుండా మెంథాల్‌ వీటిలో కూర్చబడుతుంది. అందువల్ల ఈ సిగరెట్లు పొగత్రాగే వారిని సునాయాసంగా వలలో వేసుకొంటాయి. 1994లో ఏడు సిగరెట్ల తయారి కంపెనీలతో పాటు లారీ యొక్క పినతండ్రి ఆండ్రూ, సిగరెట్లు త్రాగటం ఆరోగ్యానికి హానికరం కాదు అన్నదానికి వ్యతిరేకిస్తూ, అమెరికన్‌ కాంగ్రెస్‌లో బలంగా వాదించాడు. తర్వాత ఒక సంవత్సరానికి పొగాకు పరిశ్రమ సృష్టించే హానిపై జాగృతం చేస్తూ తీసిన 60 నిముషాల డాక్యుమెంటరీ చిత్రాన్ని, లారీ కజిన్‌ లారెన్మొ చైర్మన్‌గావున్న సి.బి.ఎస్‌ టివి. నెట్‌వర్కు నాశనం చేయటం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకిత్తించింది. ఈ విషయాలన్నీ లారీ టిష్‌కు తెలుసు. అయినా అమె యీ విషయాలు పట్టించుకోనవసరం లేదన్నట్టుగానే నూయార్కు నగరంలో ఆఫ్రికన్‌ అమెరికన్లు నివసించే హార్లెం మురికివాడలో ఆఫ్రికన్‌ అమెరికన్‌ ప్రజాసమూహాలలో కళలను అభివృద్ధి పరిచేందుకు, లేదా యువత జీవితాలను మెరుగు పర్చటం కోసం పెట్టుబడులు పెట్టేందుకు, లేదా ఆ సమాజాల వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు చేపట్టే కార్యక్రమాలకు నిధులను దానం చేసింది. ఇంకా గొప్ప వైరుధ్యమైన విషయం ఏమిటంటే ప్రజల ప్రాణాలను రక్షించే ఆస్పత్రులకు భారీ ఎత్తు విరాళాలు యిస్తుంది. ఎవరైనా యీ వైరుధ్యాన్ని ఆమెకు గుర్తు చేస్తే ‘‘సిగరెట్లు ఆల్కహాల్‌ కన్నా ప్రమాదకరమైనదా ? ఆ్కహాల్‌ పంచదార కన్నా ప్రమాదకరమైనదా ?’’ అంటూ తనకు సంపద ప్రోగుపడిన కారకాన్ని సమర్ధించుకొంటుంది. ప్రపంచాన్ని మార్చే దాతృత్వ కపట ప్రహసనం ఇదొకటి.

                ఈ రకంగా అత్యధిక సంపన్నులైన వ్యక్తులే కాదు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా యిటువంటి పద్ధతుల్లో ప్రపంచాన్ని మార్చవచ్చుననే సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. అటువంటి వారిలో ప్రముఖుడు జనవరి 2001లో అమెరికా అధ్యక్ష పదవిని విడిచి పెట్టిన క్లింటన్‌. అతడు పలు కుంభకోణాల్లో నిందితుడై వున్నాడు. ప్రతినిధుల సభలో అభిశంసనకు గురికాబోయి బయటపడ్డారు. అతడు వైట్‌హౌస్‌లోని ఫర్నిచర్‌ను దొంగలించాడనే అభియోగాన్ని ఎదుర్కొన్నాడు. అటువంటి క్లింటన్‌ యిప్పుడు ప్రపంచ దాతృత్వానికి ఒక ఆదర్శవంతమైన ప్రతినిధి (ఐకాన్‌)గా రూపొందాడు.

                ఆయన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమ్మే హెచ్‌.ఇ.వి. / ఎయిడ్స్‌ మందు ధరలు తగ్గించే క్లిష్టమైన ఒప్పందాలకు బ్రోకర్‌గా పనిచేశారు. 2005లో కాలానుగుణంగా ‘‘నువ్వు నిజంగా యిప్పుడు ప్రపంచాన్ని మార్చాలనుకొంటే నీకు కార్పొరేట్ల, ధనిక వర్గాధిపతుల సహాయం అవసరం’’ అని నిర్ణయించుకొన్నాడు. అందుకోసం మార్కెట్టు ప్రపంచపు సర్క్యూట్‌లో తన స్వంత సదస్సుల అవసరం అని నిర్ణయించుకొన్నాడు. ఆ ప్రకారం 2005లో దావోస్‌లోని ప్రపంచ ఆర్ధిక వేదికపైన తాను స్థాపించిన ‘‘క్లింటన్‌ గ్లోబల్‌ ఇన్షియేటివ్‌’’ వేదికను ప్రకటించాడు. ఐక్యరాజ్యసమితి ప్రతీ సంవత్సరం సెప్టెంబరు నెలలో జరిపే సభల సందర్భంగానే, తన సంస్థ కూడా సదస్సు జరుపుతుంది. ఈ సభకు ప్రపంచమంతటి నుండి రాజకీయ నాయకులనూ అత్యంత సంపన్నులను, పారిశ్రామికవేత్తలనూ, కార్మికసంఘాలను, పౌర సమాజాన్నీ ఆహ్వానిస్తాడు. సామాజిక మెరుగు కోసం చొరవ తీసుకోవటం కోసం కలిసి పనిచేసి, తాము ఏం సాధించాలనుకొని పథకం వేశామో దాన్ని బహిరంగంగా వాగ్దానం చేద్దామన్నాడు. ఈ సదస్సులకు హాజరయేవారందరినీ గ్లోబలిస్టులు అని పిలుస్తారు. క్లింటన్‌ లెక్క ప్రకారం క్లింటన్‌ గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ 3,600 వాగ్దానాలకు (ప్రపంచాని మార్చే చొరవలను బట్టి) స్ఫూర్తినిచ్చిందట! 180 దేశాలలోని 435 మిలియన్లకు మించిన జీవితాలను బాగుచేసిందట! ఈ గ్లోబలిస్టులు చేపడుతున్న ప్రపంచాన్ని రక్షించే విధానాలు ప్రైవేటువి. ఐచ్ఛికమైనవి. ఎవరికీ జవాబుదారీతనం వహించనివి. ‘‘ప్రధానమైన పెద్ద కార్పొరేషన్లతో సౌభాగ్యాన్ని సృష్టించటం’’ అన్న పేదరిక వ్యతిరేక సలహా సంస్థ టెక్నో సర్వీసు సంస్థతో ముందుకు తీసుకువచ్చిన ఒక వాగ్దానంలో వాల్‌మార్ట్‌, కోకా-కోలా, కార్గిల్‌, మెక్‌డొనాల్డు, ఎస్‌.ఎ.బి. సంస్థలు భాగస్వాములు. ఆ సంస్థ యొక్క పురోగతి రిపోర్టులో తాము ‘‘పిరమిడ్‌కు అడుగుభాగంలో పారిశ్రామిక స్థాపనావేత్తల మధ్య పోటీ కార్యక్రమం వుండే వాణిజ్య పథకాన్ని’’ అమలుపరిచాము అంటూ చెప్పుకొన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేవారందరూ, పదిమంది యితర సంపన్నులతో పరిచయం చేసుకోవటానికి, వ్యాపార అభివృద్ధి అవకాశాలు కల్పించుకోవటానికీ, పరస్పరం లాభం పొందటానికీ వస్తారు. ఈ సదస్సులో ప్రవేశానికి భారీ ఎత్తు రుసుం చెల్లిస్తారు. వీరు చేపట్టే కార్యకలాపాలు ఎలా వుంటాయంటే వీరు నైగర్‌ నదీ డెల్టా ప్రాంతంలో కాలుష్యకారకమైన పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదిస్తారు. మరోవైపు నైజీరియా డెల్టా ప్రాంతంలో వ్యాధులు, డయేరియా లాంటి రోగాలు తగ్గించటానికి చేపట్టే చొరవలకు మద్దతునిస్తారు. గ్లోబలిస్టుల అభిప్రాయం ప్రకారం ‘‘మంచి సమాజం అంటే పరిశ్రమలను స్థాపించే వాళ్ళ సమాజం. వీళ్ళ విజయం అంటే సమాజం యొక్క విజయమే! ఇందుకోసం ప్రభుత్వాలు ప్రైవేటురంగంతో భాగస్తులుగా పనిచేయాలి తప్ప ప్రైవేటురంగానికి వ్యతిరేకశక్తిగా వుండకూడదు.’’

                క్లింటన్‌ ఏర్పాటు చేసే సదస్సులో నైజీరియాలో మంత్రిగా ప్రపంచబ్యాంకు అధికారిణిగా పనిచేసిన ఒకిన్జో – ఇవియేలా (Okonjo – Iweala, Ngozi) అనే ఆమె ప్రపంచాన్ని మెరుగు పరచే ఒక ఆలోచన చెప్పింది. ఆమె గ్లోబల్‌ వేక్సిన్‌ అలయన్స్‌ అనే సంస్థలో న్యాయ వ్యవహారాల నిపుణురాలుగా పనిజేస్తోంది. బ్యాంకులకు కష్టకాలంలో (దివాలా తీసిన సమయంలో) వాటిని ప్రభుత్వం ఆదుకొనేందుకోసం ఆమె పనిచేస్తుంది. ఆవిడ చెప్పిన ‘ఐడియా’ ఏమిటంటే ‘‘సంఘర్షణ నమూనా’’లో ఆర్ధికసంక్షోభ కాలంలో మెరుగ్గా మేలు చేయవచ్చునట! అంటే వాక్సిన్లు మరింత అందుబాటులోకి ముమ్మరంగా తీసుకురాగలిగితే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చునట. అంటే వాస్తవంలో వాక్సిన్లు ఉత్పత్తి చేసే కంపెనీల అమ్మకాలు ముమ్మరంగా పెరిగి లాభాలు వస్తాయి. ప్రజల ప్రాణాలు నిజంగా కాపాడబడుతున్నాయా, లేదా, అన్నది సందేహాస్పదమే! సరీగ్గా యీ రకమైన దాతృత్వ పద్ధతుల్లోనే మనదేశంలో మిలిందా గేట్సు ఫౌండేషన్‌ ద్వారా బిల్‌ గేట్స్‌ కుమార్తె మిలిందా బాలికలకు గర్భాశయ క్యాన్సర్‌ నివారణ కోసం అనే వ్యాక్సిన్లు అందజేస్తోంది; ఈ రూపంలో ఆ క్యాన్సర్‌ నివారణ మందు యీ బాలికలపై ప్రయోగం చేయటంతోపాటు, ఆ వాక్సిన్ల అమ్మకానికి, విస్తృతమైన మార్కెట్టు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ‘కూటి కోసం కోటి విద్యలు’ అన్నది ఒకనాటి మాటైతే, ‘లాభార్జన కోసం లక్షలాది బూటకాలు’ అనే మార్గాన్ని చేబట్టారు నేటి గ్లోబలిష్టులైన అత్యంత సంపన్నవర్గ పెట్టుబడిదారులు! ఇదీ ప్రపంచాన్ని మార్చే కపట ప్రహసనం!

                ఈ సదస్సులో ‘‘మహిళల సమానత్వం’’ అన్న విషయంపై జరిగిన చర్చలో జేన్‌ వుర్‌వేండ్‌ (Jane Wurwand) అనే ఆమె ప్రసంగించింది. ఆమె డెర్మాలోజికా అనే చర్మ సౌందర్య సాధనాలు, క్రీంలు ఉత్పత్తి చేసే కంపెనీ స్థాపకురాలు. ‘‘మహిళ సమానత్వ సమస్యకు పరిష్కారం స్త్రీలు పారిశ్రామిక వ్యవస్థాపకులుగా రూపొందటం’’, ‘‘నాకు దానర్దం అంతా స్త్రీలకు ఉద్యోగాలు కల్పించటమన్నదే!’’ అంటూ ఆమె నొక్కి చెప్పింది. ఆ రకంగా ఆమె చర్చిస్తున్న అంశాన్ని ఉద్యోగులకూ, తమ రంగాల అభివృద్ధికీ పరిమితం చేసింది. నిజంగా జండర్‌ సమానత్వం వస్తే సౌందర్య సాధనాల పరిశ్రమ కుంచించుకుపోదూ? అందువలన ప్రధానంగా స్త్రీత్వాన్ని ఒక స్త్రీ జీవితంలోని భావవ్యక్తీకరణగా ఆమె శరీరం యొక్క మృదుత్వ స్థితిగా, ప్రసవానంతరం ఆమె యొక్క చర్మపు స్థితిగా ఆమె వక్షోజాల యొక్క ఆకారాల స్థితిగా పునర్‌ వ్యవస్థీకరిస్తూ, అందవిహీనం అన్నదానిని ఒక జబ్బుగా చూపెట్టడం, ఈ అంద విహీనత్వం అన్నదానిపై రిటైల్‌ వాణిజ్యం, అడ్వర్‌టయిజ్‌మెంటు వ్యాపారులు సొమ్ము చేసుకొంటూ, సెలూన్లూ, ప్లాస్టిక్‌ సర్జన్లూ, పార్లర్లూ లాభాలు దండుకొంటున్నాయి. అందువలన డెర్మలాజికా సంస్థ కూడా సౌందర్య సాధనాల, సౌందర్య క్రీంల వ్యాపారంలో లాభం చేసుకోవాలంటే ఆ కంపెనీ స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ తమ పరిశ్రమను విస్తరించాలి. అందుకే, జేన్‌ వుర్‌వేండ్‌కు స్త్రీలకు ఉద్యోగాలు అన్నది స్త్రీల సమానత్వ సాధనాపరిష్కారం అయింది. ఇది ప్రపంచాన్ని మార్చే మరొక కపట ప్రహసనం.

                అమెరికాలో టైపు 2 చక్కెర వ్యాధి పిల్లల్లో వ్యాపించటం అన్నది ప్రబలింది. ఇందువలన గుండెజబ్బులు కూడా వస్తాయి. విపరీతంగా కూల్‌డ్రింక్స్‌ త్రాగటం వలన పిల్లల్లో యీ చక్కెర వ్యాధి వస్తోందని తేలింది. ఇందుకు క్లింటన్‌ చూపిన పరిష్కారమేమిటంటే, ఆ కూల్‌డ్రీంక్‌లను నిషేధించటం కాదు. ఆ కంపెనీ వారిని బ్రతిమాలి తక్కువ కేలరీలు పానీయాలను ఉత్పత్తి చేసేలా చూడటం. ఈ రకంగా క్లింటన్‌ ప్రకారం అటు కూల్‌డ్రింక్‌ పరిశ్రమలవారూ నష్టపోరు. ఇటు కూల్ డ్రింకులు తాగేవారూ (బాలలూ) చక్కెరవ్యాధి బారిన పడరట! ఇదీ క్లింటన్‌ మార్కు గ్లోబలిష్టుల పరిష్కారం.       

                694కు పైగా సదస్సుల్లో ప్రసంగాలు చేసి భారీ మొత్తం ఫీజును ఆదాయంగా పొందిన క్లింటన్‌, అందులో కొంత మొత్తాన్ని దాతృత్వ సంస్థలకు యిచ్చాడు! వాస్తవానికి దాతృత్వానికి యిచ్చిన మొత్తాలపై పన్ను చెల్లించనవసరంలేదు! అంటే ఎక్కువ మొత్తం దానం యిచ్చినట్టు చూపించి పన్ను కట్టకుండా మిగుల్చుకోవచ్చును.

                అయితే క్లింటన్‌ లాంటి మధ్యేవాద రాజకీయవేత్తకు డోనాల్డు ట్రంపులాంటి తీవ్ర మితవాద రాజకీయవేత్త యొక్క పోటీ ఒక సవాలుగా మారింది. అతడు ప్రజాకర్షక ఉపన్యాసాలతో అసమానతను నిరసిస్తున్న అమెరికన్‌ ఓటర్లను అసమానతకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి, అందుకు కారకులు వలసదారులు, ఇస్లాం మతస్థులైన ముస్లిములు యితర జాతులవారు అన్నట్టుగా వారిని భూతాలుగా చూపెట్టుతూ సంకుచిత జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ముస్లిం రాజ్యాలపై దురాక్రమణకు పాల్పడుతూ, అసమానతకు కారకమైన దోపిడీ గ్లోబలిష్టు పెట్టుబడిదారులను తప్పిస్తూ అధ్యక్ష పదవిని సాధించాడు. తిరిగి ఆ పదవిని సాధించటానికి పలు జనాకర్షక కట్టుకధలతో ముందుకు వస్తున్నాడు. ప్రపంచాన్ని ముందుగా అమెరికా దేశాన్ని మెరుగుపరుస్తానని డబాయించి మరీ చెబుతున్నాడు. అయినా యితడూ డెమోక్రాట్లయిన క్లింటన్‌ లాంటి రాజకీయవేత్తల సిద్ధాంతాలకు వ్యతిరేకి కాదు. వ్యవస్థ మార్పు గురించి ఎన్నడూ పట్టించుకోడు. ప్రాముఖ్యత లేని అంశాలను ఊదరగొడుతూ అదే దోపిడీ వ్యవస్థను, అత్యంత సంపన్నవర్గాల వారి ప్రయోజనాలనూ మరో రూపంలో పరిరక్షిస్తున్నాడు.

                ఇతడు అదే నాణేనికి మరోవైపే కానీ, మరో భిన్నమైన నాణెం ఎంతమాత్రం కాదు.

                ఈ రకంగా ప్రపంచాన్ని తమ దాతృత్వం ద్వారా మార్చివేస్తామని బూటకమాడుతున్న ప్రపంచంలోని అత్యధిక సంపన్నవర్గంవారైన గ్లోబలిష్టులు, ప్రపంచాన్నంతటినీ కొల్లగొట్టడానికి చేసే కుట్రలను ఎంతో అధ్యయనం చేసి యీ పుస్తకంలో రచయిత ఎన్నో ఉదాహరణలతో వివరించాడు. సామ్రాజ్యవాదం తన ప్రపంచదోపిడీ కోసం ఎన్నెన్ని క్రొత్త ఎత్తులు పన్నుతోందో అర్ధం చేసుకోవటానికి యీ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుందన్నది నిస్సందేహం. నిజమైన వ్యవస్థ మార్పు అంటే ఏదికాదో తెలుసుకోవటానికి యీ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

admin

leave a comment

Create Account



Log In Your Account