పరుగు

పరుగు

– నౌగాపు

          అతను పరిగెడుతూ ఉన్నాడు….
          ఊపిరి ఆడడం లేదు, శ్వాస అందడం లేదు, శరీరం సచ్చు బడింది, ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు, ఎంతవరకు పరిగెట్టాలో తెలియటం లేదు….
          గతంలో ఎంతగానో పరిగెట్టాడు. ఆ అనుభూతి వేరు.
          చిన్నప్పుడు ఆటలాడుతూ పరిగెట్టాడు, సంతోషం పొందాడు. ఆ పరుగులో కాలు జారి పడ్డాక బోవురు మన్నాడు.

          బస్సు అందుకోవటం కోసం పరిగెత్తాడు, అందుకున్నాక తృప్తి పొందాడు, అందనప్పుడు బాధపడ్డాడు.
          కుక్కో, క్రూరమృగమో వెంట పడ్డప్పుడు పరిగెత్తాడు,  తప్పించుకున్నాక ఊపిరి పీల్చుకున్నాడు, చిక్కుకున్నాక చికిత్స తీసుకున్నాడు.
          అందలమెక్కడానికి అడ్డదారుల్లో పరిగెట్టాడు,
          అక్కడకు చేరుకున్నాక, ప్రక్కోడిని సాటి మనిషన్నదే మరిచి పైశాచిక ఆనందాన్ని పొందాడు, ఎక్కలేనప్పుడు గోతులు త్రవ్వి కసి తీర్చుకున్నాడు.
          కానీ ఈరోజు పరుగులో ఏ ఆనందమూ లేదు, దుఃఖమూ లేదు, తృప్తి లేదు, అసూయ లేదు… ఉన్నదల్లా ఒకటే భయం.
          ఇంతకు మునుపు….
          ఎండ,వానలనుండి రక్షణకు మేడలు కట్టాడు, తరతరాల విలాసాలకు సరిపడే సంపదలు కూడబెట్టాడు, శత్రువుల దాడులను తిప్పి కొట్టేందుకు యుద్ధ సామగ్రిని సృష్టించాడు….
          కానీ, ఇప్పుడవేవి అతనిని కాపాడలేకున్నాయి.
          అతను సృష్టించుకున్న హైటెక్ యంత్రాలు, శాస్త్రాలు, వైద్యం, మందులు… అన్నీ కర్ణుడి విద్యలా సమయానికి పనికిరాకుండా పోయాయి…
          అతని ఎత్తులు-కుఎత్తులు, వ్యూహాలు-ప్రతివ్యూహాలు, మేధస్సు- మేనేజ్మెంట్ లు అన్నీ దాసోహం….
కనబడుట లేదు, శబ్దం లేదు, స్పర్శ లేదు, రుచి లేదు, వాసన లేదు… పంచేంద్రియాల కందకుండా అగోచరమై వెంటాడుతోంది.
          వేరే మార్గం లేక,
          అతను పరిగెడుతున్నాడు.
          అతను వేసుకున్న అందమైన రోడ్డు పై పరిగెడుతున్నాడు….
          రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది.
          అతను పరిగెడుతూ ఉన్నాడు….
          బస్ స్టాప్ లో ఒక బిచ్చగత్తె  కూర్చుని ఉంది.
          ఆమెను కూడా పరిగెత్తమని అతను సైగ చేశాడు, దాడి జరుగుతోందని హెచ్చరించాడు, చచ్చిపోతావని బెదిరించాడు…
          అంత భయంగా ఉంటే తన పక్కన వచ్చి దాక్కొమ్మని నిర్భయంగా చెప్పింది ఆమె.
          ఆమె కళ్ళల్లో కాసింతైనా భయం కనబడలేదు.
          తన పరుగును యధావిధిగా  కొనసాగించాడు అతను…
          ఆ రోడ్డుకు ఒకవైపు కార్లు, కంప్యూటర్లు, ఆకాశహర్మ్యాలు, రంగురంగుల విద్యుత్ కాంతులు… మరోవైపు రంగురంగుల పూలు, పొడవాటి చెట్లు, ఎటు చూసినా పచ్చదనం…
          మధ్యలో అతను గీత గీసుకొని సాగుతున్నట్లు ఉంది. ఆ గీతకు ఒకవైపు ఎక్కిరిస్తూ ఉంటే మరోవైపు తల్లిలా చల్లగా దరిచేర మంటోంది. కానీ ఆ చల్లదనం వైపు వెళ్లే ధైర్యం చాలటం లేదు.
          అతను అదిరిన కోడిపిల్లలా బెంబేలెత్తి ఉన్నాడు….
          ముందు ఈ దాడి నుంచి బయట పడాలి, బతికి బట్ట కట్టాలి… బ్రతికుంటే గా ఆ బలుసాకు కోసం వెళ్ళేది…
          అతను పరిగెడుతూ ఉన్నాడు….
          రోడ్డు అకస్మాత్తుగా మాయమయ్యింది…
          అతను అదే వేగంతో క్రిందకు పడ్డాడు….
          అంతే, అదో అగాధం…

……    …….    …….

          అతను అదిరి మంచం పై నుంచి  చొప్పకట్టలా నేలపై పడ్డాడు. లోయలో కాదు పడింది, కలలో అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు.  కష్టాన లేచి  ముందుకు సాగాడు.
          స్టూల్ అంచున బొంగరంలా తిరుగుతూ ఊగుతున్నాడు మనుమడు. ఎదురుగా కంప్యూటర్ స్క్రీన్, చేతిలో జాయ్స్టిక్… వాడిదేదో లోకం. కంప్యూటర్ గేమ్ ఆడుతూ పడిపోతాడేమోనని సందేహం వచ్చి పట్టుకోబోయాడు అతను. “ తాతయ్య! సోషల్ డిస్టెన్స్…” నాకేం కాదన్నoత ధీమాతో అన్నాడు మనవడు. “ఆ  గీతేదో మనుషుల మధ్య కాకుండా, మనిషికి కంప్యూటర్ కి మధ్య ఉంటే బాగుండేది” తాతయ్య మనసులోని మాట మనసు లోనే ఉంది “వెళ్ళు తాతయ్య! ఈ నాలుగు రోజులైనా నన్ను వదిలేయండి. ఆ తర్వాత తెల్లవారి లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు… ఆ స్కూలు, పుస్తకాలు, ట్యూషన్లు…  మళ్లీ పరుగే కదా… ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆ వైరస్ కనబడితే గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోవాలని ఉంది” అత్యుత్సాహంతో శరీరాన్ని ఝలిపిస్తూ అన్నాడు మనవడు. ఆ మాటతో పిల్లిపిల్లలా వులిక్కి పడ్డాడు అతను. ఎక్కడ ఆ వైరస్ ఈ మాట విని, ఇంట్లోకి దూరేస్తుందే మోనని, ఒక్క పరుగున లేడిపిల్లలా చెంగున చేరి తెరిచి ఉన్న తలుపుల్ని మూయబోయాడు అతను.
          అప్పుడే గుమ్మం లో పడింది, న్యూస్ పేపర్. కానీ ఇప్పుడది అతనికి న్యూస్ పేపర్ కాదు, బాంబు. మనుమడి మాట విన్నదేమో ఈ మాయదారి వైరస్? పేపర్ ద్వారా వచ్చి ముద్దు పెట్టేసుకుంటే… అమ్మో?!!! తలుపులు మళ్లీ ఈదురుగాలికి పడ్డట్టు దబాల్నాపడ్డాయి.
          అతనికి తెల్లవారి వార్తా పత్రికల ద్వారా ప్రపంచ వీక్షణం చేయందే దినం మొదలవ్వదు. కానీ ఏం చేయగలడు, ముందుకెళ్తే మహమ్మారి… ముందు ప్రాణం, తర్వాతే ఏదైనా? అందుకే న్యూస్ పేపర్ కు గీయాల్సి వచ్చింది లక్ష్మణ రేఖ, నాలుగు గంటల క్వారంటైన్.
          “ఏవండోయ్! అలా బోను లో పడ్డ ఎలుకలా తిరిగే కన్నా, వీధిలోకి వెళ్లి ఓ పాల ప్యాకెట్ తీసుకు రాకూడదు” ఆవిడ మాట పిడుగులా పడింది అతని చెవిలో. ఆవిడ ఆర్డర్ వేసిందంటే, అతను తూచా తప్పకుండా పాటించాల్సిందే… లేకపోతే ఆరోజు ఇంట్లో ప్రపంచయుద్ధమే. ఇలాంటి ప్రపంచ యుద్ధాల్లో అరితేరిన అతను… ఇంట్లో యుద్ధం గురించి భయపడడం లేదు, ఇల్లు దాటి బయట అడుగుపెట్టాలంటేనే గుండెలు పగిలేలా ఉన్నాయి. బయట ప్రాణాలు తీసే కనబడని వైరస్, కనబడితే వీపు వాయించే పోలీస్… అమ్మో! మళ్లీ గుండెల్లో భయం పరుగులు.
          ఇంతలో సైకిల్ బెల్ మోగింది. చిన్న పిల్లవాడికి ఐస్క్రీమ్ బండివాడు వచ్చినంత ఆనందం అతనిది. ఆపద్బాంధవుడులా పాలవాడు వచ్చాడని మరో ఆలోచన లేకుండా తలుపు తీసాడు అతను. అవును పాల వాడే.
           “ఏమే! ఏం వరాల నోరే నీది, పాలు అనగానే పాల వాడు వచ్చాడు, ఏదీ ఆ గిన్నె తీసుకురా” ఆమెతో అతను అన్న మాట పూర్తవక ముందే, ” డబ్బు” లన్నాడు బుర్రగీక్కుంటూ పాలవాడు. ” పొగిడితే గిన్నె తీసుకొస్తుందని అలా అన్నానులే రా. డబ్బు అనగానే డబ్బేo వచ్చేయదు, తనేo ధనలక్ష్మి కాదు” పాల వానితో నెమ్మదిగా అంటూ ” అవును రరేయ్… వరం కోరుకుంటే వైరస్ ను చంపాలని కోరుకోవాలి గాని, ఈ చావు కాలంలో కూడా డబ్బు గోలేంట్రా నీకు?” యధావిధిగా రెండడుగులు ముందుకు వేసి, సోషల్ డిస్టెన్స్  గుర్తుకు వచ్చి ఆగిపోయాడు అతను.
           “అయ్యా నేను అడుగుతుంది ఏ వరమో కాదు, గత నెల పాల బిల్లయ్యా… ఈ మహామ్మారి వల్ల ఎందరు పోతారో ఉంతారో తెలీదు గాని, ఇదే పరిత్తితి కొన్ని రోజులు సాగితే మాలాటోలు ఎంతోమందిమి పుటుక్కు మని పోతారు.” దీనంగా మొహం పెట్టాడు పాలతను. “అదేట్రా అలాంటి అపశకునం మాటలు మాట్లాడుతున్నావు?” అన్నాడు అతను. “అయ్యా! రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి. రెండ్రోజులుగా తీసిన పాలు అమ్ముకోలేక, మేమే తాగాల్సి వచ్చింది. పాలేం ఊరికే రావు గదయ్య, గడ్డి కావాలి, మేత కావాలి, మందులు వాడాలి… వీటన్నిటికీ డబ్బు కావాలి, అప్పులు చేయాలి, వడ్డీ కట్టాలి. మరాపాలు అమ్ముడైతే గదయ్యా దినం గడిచేది” పాలతను తన బాధ చెప్పుకొనేలోగా, భూమి కంపించేలా అడుగులు వేస్తూ వచ్చింది ఇంటామె.
          ” ఏం, నాలుగడుగులు నడిస్తే కొంపలు మునిగిపోతాయా? ఆ గిన్నేదో మీరే తీసుకోవచ్చుగా…. మంచి సీరియల్ మిస్సయింది, పైగా బయట ఎలానో ఉన్నారు మీరు… మీతో పాటు ఆ మహమ్మారి మమ్మల్నీ అంటుకోవాలా ఏంటి?” చేతిలో బాలు పడ్డట్టే స్పీడ్ తో గిన్నె పెట్టి, మెరుపులా మాయమైంది ఆమె.
           “మొగుడి పోయినా పర్వాలేదు, సీరియల్ మాత్రం పోకూడదు. ఎంతగా పరాధీనమయిపోయామయ్య”  గిన్నె పాలవాని చేతిలో పెట్టాడు అతను. పాలు నింపి “అయ్యా మరి డబ్బులు” గిన్నె అందిస్తూ అన్నాడు అతను. “ఇస్తానులేరా, రేపు కనబడు” మరో మాటకు అవకాశం లేకుండా ఇంట్లోకి వెళ్లి తలుపు వేశాడు అతను.
           “ సార్, ఎస్సార్… డెఫినిట్లీ సార్..” ఆ రూమ్ మీదగా వెళ్లిన అతనుకు సార్ అనే మాట తప్ప మరొకటి వినబడలేదు. ఉద్యోగం చేస్తున్నాడో, ఊడిగం చేస్తున్నాడో అతనికి అర్థం కాలేదు.  కొడుకుది మరీ పరాధీనం. వీడియో కాన్ఫరెన్స్, వర్క్ ఫ్రొం హోమ్ … లోపల  రూమ్ లో కంప్యూటర్తో కుస్తీ పడుతున్నాడు, సాఫ్ట్ వేర్ ఇంజనీరు. ఒకప్పుడు ఎంత సాఫ్ట్ గా ఉండేవాడు, నేడంత హార్డ్ గా తయారయ్యాడు. కాదు కాదు అలా తయారుచేసింది ఈ కంప్యూటర్ కంపెనీ. ఎంతమంచి బట్టయినా రంగెలిసిపోయే బట్టతో కలిపి ఉతికితే  ఆరంగు అంటకుండా పోదు. ఏదడిగినా కోపం, నోరు విప్పితే బూతులు.
           “హాయ్! హౌ ఆర్ యు?” ఇంకోవైపు మనుమరాలు వీడియో చాటింగ్ లో…
          కన్నీళ్లు కేరింతలు నవరసాల ఒలకబోస్తూకోడలు, అత్త టీవీ ముందు….
          ఇంటి నిండా జనం ఉన్నా దేవాలయాల్లో విగ్రహాల్లా ఒకడితో ఒకడికి సంబంధం లేదు. పేరుకే  ఒకచోట ఉన్నారన్న మాట గాని, మనిషి మనిషికీ మధ్య ఓ లక్ష్మణ రేఖ. సంబంధాలు మనుషుల మధ్య నుంచి మెషిన్ల మధ్యకు మారాయని ఆరేఖ స్పష్టంగా తెలియజేస్తోంది.
          అతను భారంగా అడుగులు వేస్తూ మళ్ళీ తన రూమ్ లోకే చేరాల్సి వచ్చింది.

……     ……..     …….

          ఇంతకీ కలలో కనబడిన ఆ బిచ్చగత్తె ఎవరు? అంత నిర్భయంగా తను ఎలా ఉండగలుగుతోంది? ఇటువంటి లాక్ డౌన్ టైంలో ఆమె దినం గడిచేది ఎట్లా?….
          అవునూ, నా వద్ద డబ్బులు ఉన్నా  ఆ పాలతనకు ఎందుకు ఇవ్వలేదు? పాపం ఎంత ఇబ్బంది లేకపోతే ఇంత కష్టకాలంలో కూడా తను బయటకు వచ్చాడు? తనకు ఎంత అవసరమో, నాది కూడా అంతే అవసరం గదా… నన్ను బయటకు పోనివ్వకుండా, పోలీసుల బారిన పడకుండా కాపాడేడే….
          మరి నా లోని మనిషి ఏమైనట్లు? డబ్బే ఒక మాయా? ఆ మాయే మనిషిని అలుపెరగకుండా పరిగెట్టిస్తోందా? ఆ పరుగే మనిషిని గుడ్డివాన్ని చేసి విచక్షణ కోల్పోయేలా చేస్తోందా? ఆ విచక్షణ లేమి ప్రకృతితో ఆటలాడి సాటి ప్రాణుల పాలిట సంకటం అవుతోందా? ఆ సంకటమే తిరిగి మనిషి పైకి పడగై తరుముతోందా?
          ఇలా పరిపరి ఆలోచనలతో అతను మంచంపై దొర్లుతున్నాడు.
          ” తాతయ్య!” మనుమడు కరెంట్ వెళ్లిపోవడంతో అతని పక్కకు చేరాడు. “అదేంట్రా! ఇందాక సోషల్ డిస్టెన్స్ అన్నావు” కొంచెం దూరం జరిగాడు అతను.
           “మనం బయటికి వెళ్లలేదు, బయటి వాళ్లు మన ఇంటికి రాలేదు. అలాంటప్పుడు ఆ వైరస్ మన ఇంటికి వచ్చేది లేదు. వీడియో గేమ్స్ లో డిస్టర్బ్ చేస్తున్నావ్ అని అలా సోషల్ డిస్టెన్స్ అని డ్రామా ఆడానులే”
           “అంటే ఇంత చిన్న వయసులోనే నాటకాలు నేర్చేసుకుంటున్నావన్నమాట”
          “అది సరే, తాతయ్యా! ఆకలి బాధతో చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ కలిసి ఇలా ఒక్కసారిగా దెయ్యాలై దాడి చేస్తున్నాయట గదా? ఆవే వైరస్ లంటగా….మా ఫ్రెండ్ శీను గాడు చెప్పాడు.”
          “నువ్వు అన్నట్టు ఆ దేవుడు, దెయ్యం ఉంటే….. మరి ఆ ఆకలితో బాధపడుతున్న వారి పక్షాన ఇప్పుడైనా నిలబడాలి కదా.  ఎక్కువగా ఆ బీద ప్రాణాలే పోతున్నాయి… అందుకే దాన్ని పక్కన పెట్టు. కానీ బాధ… అన్నావ్ చూడు, అది మాత్రం ఖచ్చితంగా వైరస్ పుట్టుకకు కారణమయి ఉంటుంది”
           “ఏంటి తాత అది?”
          “మనిషి ప్రకృతిని బాధపెట్టాడు. ప్రకృతి ఎన్నాళ్లని ఊరుకుంటుంది? అట్టి తిన్న రాంబోతుకు ఒకటే గాలివాన అని ఊరకే అన్నారు? ఇప్పుడు తన ప్రతాపం చూపుతోంది “
          ” అంత బాధ ఏం పెడుతున్నాడు తాతయ్య?”
           “తన స్వార్థం కోసం అరణ్యాలపై కత్తి వేసి ఎడారి భూములు తయారు చేస్తున్నాడు. తన సౌలభ్యం కోసం యంత్రాల్ని సృష్టించి కాలుష్యాన్ని పెంచి భూమండలాన్ని వేడెక్కిస్తున్నాడు. క్రిమి కీటక నాశకాల్ని విపరీతంగా వాడి,  ప్రకృతి అన్ని జీవాలకు ఇల్లు అనే విషయాన్ని మరిచి, మిగతా జీవులకు స్థానం లేకుండా చేస్తున్నాడు. తల్లి తన అందరు బిడ్డలు ఒకేలా చల్లగా ఉండాలని కోరుకుంటుంది. మరి తేడాలు వస్తే ఊరుకుంటుందా?”
          “మనిషికి తెలివితేటలు ఉన్నాయి, మిగతా జీవులకన్నా తెలివిగా బ్రతకడంలో తప్పేముంది?”
           “సోషల్ డిస్టెన్సింగని తాతయ్యతో నాటకమాడావు చూడు…. అది, మీ కాలం తెలివితేటలు. తెలివిగా బ్రతకటం అంటే తోటివారితో కలిసి బ్రతకడం, ఒక్కడే పరిగెట్టడం కాదు. కలసి ఉంటేనే కలదు సుఖం అన్న విషయాన్ని మరువరాదు. ముఖ్యంగా ప్రకృతితో తెలివితేటలు చూపడం కాదు.”
           “తాతయ్య,  ప్రకృతి ప్రకృతి అంటున్నావు, చెట్లు నాటు తున్నాo, కార్బన్ వ్యర్థాల తొలగింపుకు మీటింగులు జరుపుతున్నాo, నిధులు కేటాయిస్తున్నాo… వీలైనన్ని పనులు చేస్తున్నాo గదా. మరది ఒంటరి పరుగు ఎలా అవుతుంది?”
          “అవన్నీ ముస్తాబు చేసిన పెళ్లికూతురులా…. కాగితాలపై అందంగా కనబడుతాయి. పెళ్లిసందడిలో సొన్నాయి పాటలా… చెప్పుకునేందుకు వినసొంపుగా ఉంటాయి. కానీ వాస్తవాలు వేరు. అది తెలుసుకునేందుకు నీ తెలివితేటలు ఇంకా పెరగాలిలే. మరో విషయం… ముఖాన యాసిడ్ పోసి చికిత్స చేస్తే ప్రయోజనం ఏముంది? ఆ మునుపటి అందం రాదుగా”
           “అదేదో అర్థమయ్యేలా చెప్పండి తాతయ్య!”
           “మనిషి ఈజీ మనీ ఎర్లీ మనీ మాయలో ప్రకృతి సహజ ప్రక్రియని తారుమారు చేస్తున్నాడు” అతను మనుమడి వైపు చూసి, అర్థం కాలేదు అని గ్రహించి, “అంటే ఆరు మాసాల్లో సహజంగా పండాల్సిన పంటను, జన్యు మార్పిడి చేసి రెండు మూడు మాసాల్లో పండిస్తున్నాడు. అలాగే మాంసం ఉత్పత్తిలో కూడా హార్మోన్లను సర్దుబాటు చేసి, వేగంగా అధిక దిగుబడి చేస్తున్నాడు. గుడ్లు, పాలు, నీళ్లు, నూనెలు, పండ్లు, కాయగూరలు ఇలా ఏది చూసుకున్న అన్నింటిలో తన అధిక తెలివితేటలు వాడి, తాత్కాలికంగా పొందే ప్రయోజనాలు చూసి బలుపని సంబరపడుతున్నాడే తప్ప అది వాపనే నిజాన్ని పెడచెవిన పెడుతున్నాడు. ఇలాంటి విపత్తులు కొనితెచ్చుకుంటున్నాడు.” అన్నాడు.
           “అధిక ఉత్పత్తులు, సులభ పద్ధతులు నేటి ప్రపంచ పరుగుకు అవసరమే కదా. దీనికి,  ఈ విపత్తుకు సంబంధం ఏమిటి?”
           “నీటిలో ఏ రంగు కలిపితే, నీటికి ఆ రంగు వచ్చినట్లు….జన్యుమార్పిడిలు, హార్మోన్లలో మార్పులు తిరిగి మనిషి శరీరంలో మార్పులు తీసుకొస్తున్నాయి. రోగనిరోధకశక్తిని తినేస్తున్నాయి. అనేక రుగ్మతలకు దారి తీస్తున్నాయి.  ఆఖరికి మనం గాజు బొమ్మల్లా తయారవుతున్నాం.”
          “సరే, మనం వీక్ అయిపోయాo. ఓకే. కానీ, ఈ మహమ్మారి ఎలా వచ్చింది?”
           “ఇంతకు ముందు వచ్చిన సార్స్, ఇబోలా, జికా, ప్లేగ్, నెఫా లానే ఈ వైరస్ కూడా జంతుసంబంధమైనదిగా తెలియవస్తోంది. ఇది జంతువుల్లో ముఖ్యంగా అడవుల్లో ఉన్నంతవరకు ఇబ్బందిలేదు. ఎప్పుడైతే మాంసం ఉత్పత్తులు కార్పొరేట్ రేంజ్ కు ఎదిగాయో, ఒకే చోట జంతువుల్ని కిక్కిరిసి పెంచడం…అలా కిక్కిరిసి పెంచడానికి ఏ సి వంటి ప్రత్యేక వాతావరణం అవసరం కావడం…., అలా ప్రత్యేక వాతావరణంకు అలవాటు పడటంతో ఆ జంతువులు కూడా గాజుబొమ్మలవుతున్నాయి. ఈ వీక్ ఇమ్యూనిటీగల జంతువులు వైరస్ లకు ఆశ్రయం కల్పించి, మ్యుటేషన్ ద్వారా రూపాల్ని మార్చుకొని బలాన్ని పుంజుకొనేందుకు అవకాశాన్నిస్తున్నాయి.
          నిత్యం ఆ జంతువులతో మనిషి కూడా అదే చోట పని చేస్తుండడంతో ఈ వైరస్ లు మనిషికి సోకుతున్నాయి.  ఒకవైపు వైరస్ బలమౌతుండగా, మరో వైపు మనిషి బలహీనమౌతున్నాడు. అందుకే ఈ వైపరిత్యం అని కొందరి అభిప్రాయం.”
          “దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందన్న మాట.”
          “అవును. పైగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూన్నకున్నాకనే ఈ అనర్ధాలన్నీ. అంతకుముందు శ్రమనే దోపిడీ చేస్తే, ఈ వ్యవస్థ ప్రకృతినీ దోపిడీ చేస్తోంది.  మన పరుగు ఎలా ఉందంటే, తూనీగను పట్టుకోనేoదుకు తుమ్మముల్లు తొక్కినట్టుంది.”
          “మరి ఇవన్నీ తెలిసే మనిషి ఎందుకు చేస్తున్నాడు?”
          “ఇందాక మాట్లాడుకున్న స్వార్ధమనే పరుగు. చిన్న ఉదాహరణ, ఉదయం పాలవాడికి డబ్బులున్నా రేపు రమ్మన్నాను. పాపం ఎంతో అవసరం లేకపోతే వాడు అడగడు. వాడు వెళ్ళిపోయాక ఆలోచించాను, కానీ అప్పుడే ఎందుకు ఆలోచించ లేదు.”
          “అవును ఎందుకు ఆలోచించలేదు తాతయ్యా?”
          “అప్పుడు వాడి కష్టాన్ని మన కష్టంగా చూడలేదు గనక. తర్వాత చూద్దాంలే అన్న ధీమా. మనందరం అదే చేస్తున్నాం. సరైన సమయానికి సరైన ఆలోచనలు చేయడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నాం. మన ఆరోగ్య బడ్జెట్ ఒక శాతం కూడా ఉండట్లేదు. ప్రతి సంవత్సరం మన దేశంలోనే నాలుగు లక్షల మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారు. అంటే ఆయుధాలకు, యుద్దాలకు ఇస్తున్న శ్రద్ద ఆరోగ్యాలకు, జీవితాలకు ఇవ్వడం లేదు.”
          “అవును తాతయ్య, ఇప్పుడు మాస్కులు, మందులు , వెంటిలేటర్లు, డాక్టర్లను  వెతుక్కుంటే సడెన్ గా ఆకాశం నుంచి ఊడిపడతాయా?”
          “శభాష్ మనమడా! బాగా చెప్పావు.” మనమడి భుజం తట్టాడు అతను.
          “నువ్వన్నట్లు మనవాళ్ళు సమయానికి స్పందించరు. జనవరి 31 న WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పుడు చేసిన లాక్ డౌన్ లా అప్పుడే మనం మన బోర్డర్లని కట్టుదిట్టం చేసి సరైన చర్యలు తీసుకొనిఉంటే మన దేశానికి ఈ మహమ్మారి వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చాక  కష్టమే మరి. అమెరికా లాంటి నెంబర్ వన్ దేశాలే తట్టుకో లేక పోతున్నాయి. “
           “అసలీ ప్రపంచo ఇలా తగలబడి పోవడానికి కారణం ఆ అమెరికావాడే… పెట్టుబడిదారీ వ్యవస్థను పోషించి ధనిక, పేద వాళ్ళ మధ్య అంతరాల్ని పెంచింది వాడు. కార్పోరేట్ రాక్షసిని ప్రపంచం మీదకి వదిలి ప్రజల రక్తాన్ని తాగుతున్నది వాడు. యుద్ధ సంస్కృతికి బీజం వేసి అశాంతిని సృష్టిస్తున్నది వాడు. అభివృద్ధి పేరుతో ప్రకృతి పై యుద్ధం ప్రకటించింది వాడు. ఆ ఉసురు తగలకుండా ఉంటుందా ఏంటి?”
          ” ఏంటి, తాతా మనవళ్ళు ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు.” సాఫ్టువేరు ఇంజినీర్ కూడా ఎప్పటికీ కరెంట్ రాకపోవడంతో వచ్చి చేరాడు.
          ” ఏం లేదురా…ఈ మహమ్మారి గురించి మాట్లాడుకుంటున్నాం.”
          “అవును నాన్నా! ఈ లాక్ డౌన్…ఇదే పరిస్థితి కొనసాగితే నా ఉద్యోగమూ ఊడేటట్టుంది. తుమ్మితే వైరస్ వస్తుందో లేదో గాని, ఉడిపోయే ముక్కులు మావి” సాప్ట్ వేర్ ఇంజినీర్ మంచంపై కూర్చున్నాడు.
          “బతికుంటే బాలుసాకు తిని బతకొచ్చులేరా… ఏదో ఒకటి చేద్దాం లే” లోలోన గుండెలు పీకేస్తున్నా, ధైర్యం చెప్పాడు అతను.
          “మన వరకూ పర్వాలేదు, మరీ దర్జాగా కాకపోయినా ఏదోలా బ్రతుకు బండి లాగిoచేయగలం… నాలుగు బలుసాకులు ఉన్నాయి గనక. పాపం, రోజువారి కూలీలు, వలస కూలీలు, టెంపరరీ ఉద్యోగులు, బీద జనం పరిస్థితి తలచుకుంటూనే గుండెలదురుతున్నాయి” సాఫ్ట్వేర్ ఇంజనీర్.
          “అవునబ్బాయ్, ఎవరి ఉద్యోగాలకూ ఢోకా లేదని పైవాళ్ళు చెబుతున్నా, అసలు కంపెనీలే మునిగిపోయేలా ఉంటే ఇక ఉద్యోగాల సంగతి వేరేగా చెప్పేదేముంది?చెట్టుంటేగా ఫలం కోసం ఎదురుచూడగలం.” అతను.
          “అది డైరెక్ట్ ఎంప్లాయిమెంట్. ఇక ఇండైరెక్టుగా కొన్ని కోట్లమంది బలైపోతారు”
          “ఇండైరెక్టుగా?” అర్థం కానట్టు మొహం పెట్టాడు మనుమడు.
           “ఉదాహరణకు మీ డాడి ఉన్నారనుకో. మీ డాడీ కంపెనీ మూత పడిందే అనుకో… ఖర్చు తగ్గించుకోవడం కోసం పాల వాడకం మానేస్తాం. మన బట్టలు మనమే ఉతుక్కొని ఐరన్ చేసుకుంటాం. జుట్టు కటింగ్ లు కోసం ఆలోచిస్తాం. రోజూ వచ్చే న్యూస్ పేపర్ ని ఆపుచేస్తాం. పనిమనిషిని వద్దనుకుంటాం. మనం కొత్తగా కడుతున్న ఇల్లుని అక్కడితో ఆపేస్తాం. ఈ వరుసలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు చెప్పు” సాఫ్ట్వేర్ ఇంజనీర్.
           “ఊ… మిల్క్ బాయ్, వాషర్ మాన్, బార్బర్, పేపర్ బాయ్, మేషన్…” అంటుండగా, ” వీళ్లతో పాటు వీళ్ల ఫ్యామిలీలు రోడ్డున పడతాయి. ఇల్లు కట్టడం ఆపేసావు అనుకో సిమెంట్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ, ఇటుకల తయారీ కంపెనీ… ఇలా రకరకాల పరిశ్రమలు… వాటి కార్మికుల మీద ప్రభావం పడుతుంది. వాళ్ల ఫ్యామిలీలూ రోడ్డున పడతాయి.ఇవన్నీ ఒకదానికొకటి లింకన్నమాట. మరి మా ఒక్క కంపెనీలోనే నాలాంటి ఎంప్లాయిస్ 200 మంది ఉంటారు. అంటే ఒక్క కంపెనీ మూతపడితే కొన్ని వేలమంది పనిదొరక్క విలవిలలాడిపోతారన్న మాట. భారతదేశంలో సుమారు 94 శాతం మంది ఈ అసంఘటిత రంగంలొనే పనిచేస్తున్నారు.”  సాఫ్ట్వేర్ ఇంజనీర్.
          “అవున్రా! రాబోయే రోజులు తలుచుకుంటేనే భయమేస్తోంది” అతను
           “తాతయ్యా! ఇంతకు ముందు ఇలాంటి వైరస్ లు చాలా వచ్చాయి, చాలా మంది చనిపోయారన్నావు కదా! మరి వీటినుంచి గుణపాఠం నేర్చుకోవాలి గదా” మనుమడు.
           “ఎలక్షన్స్  అనగానే నాయకులు  వచ్చినట్లు, విపత్తు రాగానే హడావుడి చేస్తారు. ఆ తర్వాత దానిగురించి మర్చిపోతారు.” అతను.
          “కానీ ఇప్పటి విపత్తు మానవజాతి ఎన్నడూ ఎరుగనిది. ఈసారి బుద్ధిగా ఇంట్లో ఉన్నట్టే, మునుముందు బుద్ధిగా మసలుకుంటాడు  కూడా.” సాఫ్ట్వేర్ ఇంజనీర్.
           “ఏమోరా అబ్బాయి! నాకైతే నమ్మకం లేదు. ఆపద వచ్చినప్పుడు చెప్పే నీతి కబుర్లు,  అందల మెక్కాక ఉండవంటారు. చూద్దాం…” చిన్న విరామమిచ్చి, “అవునూ… తెల్లవారి జామున ఓ కలొచ్చింది. నేను పరిగెడుతూ ఉన్నట్టు, నన్ను ఆ వైరస్ తరుముతున్నట్టు, మనం సంపాదించి పెట్టుకున్న డబ్బు , బంగ్లాలు  ఏవీ కాపాడనట్టు, అందమైన ప్రకృతి మరోవైపు పిలుస్తున్నట్టు, కానీ  భయంతో ముందుకు పరిగెత్తి ఓ లోయలో పడిపోయినట్టు…”అతను.
           “రోజు రకరకాల వార్తలు చూస్తున్నాము కదా, ఆ భయము,ఆందోళనలతో అటువంటి కలొచ్చుoటుంది. అంతగా భయపడవలసిన పనేం లేదులే” సాఫ్ట్వేర్ ఇంజనీర్.
           “ఆ కలలో ఒక బిచ్చగత్తె కనబడింది. కానీ దాని ముఖంలో ఏ భయమూ లేదు, ఎటువంటి ఆందోళన లేదు… మనిషన్నాక అంత ప్రశాంతంగా ఉండటం ఎలా సాధ్యం?” కొడుకు మాటల్ని పట్టించుకోకుండా కొనసాగించాడు అతను.
           “నాన్న! తలా తోకా లేని కలల్ని జీవితాలతో పోలుస్తావెందుకు?” సాఫ్ట్వేర్ ఇంజనీర్.
           “అది కాదు రా, ఎందుకో ఆ బిచ్చగత్తె మరీమరి గుర్తుకొస్తోంది… మన బస్టాప్ వద్ద బిచ్చగత్తె… పాపం,ఎలా ఉందో ఏమో?! ఒక్కసారి చూడాలని ఉంది” అతను.
           “గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదో ఒక షెల్టర్ లో చేర్పించి ఉంటారులే, ఆవిడని చూడటానికి వెళ్లి పోలీసులతో తన్నులు తినే కన్నా… ఆ విషయాన్ని ఇక్కడితో మర్చిపోవడం మంచిది” సాఫ్ట్వేర్ ఇంజనీర్.
           “ఒరే… ఒకవేళ ఆమె అక్కడే ఉంటే?! మామూలు రోజుల్లో అయితే ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడతారు. పాపం, రోడ్లన్నీ నిర్మానుష్యంగా అయిపోయాయి, ఆమెకేం దొరుకుతుంది?” అతను.
           “తాతయ్య పద! అన్నం పట్టుకొని దాక్కొని వెళ్దాం. పోలీసులు కనబడితే వెనక్కి వచ్చేద్దాం.ఇక ఆ మహమ్మారి అంటకుండా సోషల్ డిస్టేన్సింగ్ మెoటైన్ చేద్దాం” మనుమడు.
          అలానే తాతా మనుమలు కదిలారు.

…..        ……     ……

          ఆమె చేయి బస్ షెల్టర్ నుంచి బయటికి చాచి ఉంది….
          ఆకాశాన్ని చూస్తూ ఉన్న ఆచేయి శూన్యం లోంచి ఏదో అడుగుతున్నట్లు ఉంది….
          ఎన్నో రోజులు కడుపు మంటను గాలితో చల్లార్చుకున్న ఆ జీవికి ఇక ఆ మంటను భరించే శక్తి లేనట్లుంది…
          కేక వేతకు బలం చాలని ఆ ప్రాణం సైగ చేస్తున్నట్లుంది…
          కుల మతాల భేదాలు లేకుండా అందరూ అంటరాని వాళ్ళయిన ఈ క్షణాల్లో…
          బయట కనబడితే అంతుచూస్తానని మహమ్మారి  కాచుకు కూర్చున్న ఈ క్షణాల్లో ….
          ఆ ఆకలి ఆఖరి కేక వినబడేదెవరికి?
          ఓ వీధి కుక్క మాత్రం బోరుమని ఆకాశానికి తలెత్తి విలపించింది. దాంతో నాలుగైదు కుక్కలూ అందుకున్నాయి.
          తక్కువ శబ్దాల వినికిడి శక్తి గల కుక్క ఆమె ఆఖిరి హృదయ స్పందనను పసిగట్టి లోకానికి వినిపించాలి అనుకుందేమో?
          ఎదురుగా ఎత్తైన అందమైన భవంతులు కదలిక లేకుండా దిష్టిబొమ్మల్లా నిలబడి చూస్తున్నాయి.
          నల్లని రిబ్బన్లా సాగిన అందమైన తారు రోడ్డు  పరుగునాపి మూగవానిలా మౌనంగా  ఉంది .
          ఆమె చుట్టుపక్కల   ఉన్న నాణేలు,ఇటలీ రోడ్లపై పరుగిడిన నోట్లలా కాక, గుండె బరువెక్కి అంటిపెట్టుకుని ఉన్నాయి.
          కొద్ది దూరంలో పొడవాటి చెట్లు మౌనాన్ని పాటించేందుకేమో సోకశస్త్ర్ కోసం నిలబడ్డ జవానుల్లా తలలు దించాయి.
          అంతలోనే  హృదయం కలచివేసిందేమో  ఆ చెట్లన్నీ ఒక్కమారుగా  పైకి లేచాయి. హోరుగాలి రేగింది. ధూళి రేణువులు పైకి లేస్తూ రోడ్డు వెంబడి పరుగులు తీశాయి.
          ఎవరో తెలియని ఆమె…
          తన పేరు తనే మర్చిపోయిన ఆమె…
          పేదరికంలో పడిలేచి, జీవన పరుగులో నోట్ల మూటలు  కూడగట్టని ఆమె…
          బ్రతుకు పోరులో ఓడి , ఏ ఒక్కరి గెలుపుకూ (కనీసం ఓటరుగానైన) పనికిరాని ఆమె…
          యవ్వనసొంపులు పిడసగట్టుకుపోయి, ఏ పక్కకు అక్కరకు రాని ఆమె…
          ఇప్పుడెవరికి కావాలి?
          కుక్కలు మొరిగినా, గాలి వీచినా, చెట్లు చేమలు అల్లాడినా, ధూళి రేగినా, ఉరుములు గర్జించినా, ఆ మహమ్మారి వెంటపడినా…
          ఆ బిగి తెగిన చేతులు మరింత ఊగాలే తప్ప, నిలకడగా మళ్ళీ యాచించేనా?
          మరి ఏమడుగుతోంది  శూన్యం లోకి ఆ చేయి?
          ఆకలి బిగువతో ముద్దయిన  ఆ శరీరానికి
          నాలుగడుగుల నేలైనా ఎక్కువేనని, ఆమె లెక్కల్ని తెలిసిన బస్సు షెల్టర్ లోని సిమెంట్ బల్ల చెబుతుంది….
          చలిలో ముద్దై, ఎండలో మండి, వానలో తడిచిన ఆ శరీరoపై సాక్షిగా ఉన్న గుడ్డ పీలికలు చెబుతాయి ఆమెది ఆకాశమంత ఆశని….
          ప్రపంచాన్ని ఆడించే జగన్నాటక సూత్రధారి ఆ నాణేన్నడిగితే  చెబుతుంది…ఆమె ఏనాడూ తను ఆడించే నాటకాల్లో ఏ పాత్రా పోషించలేదని…
          ముద్దై ముడుచుకు పోయిన అందాల్ని అడిగితే చెబుతాయి… ఒకప్పుడు తాగితాగి పిప్పిచేసిన మగతనం తనకంటూ ఏమీ మిగల్చలేదని…
          ఇప్పుడు ఆమె ఓ మాంసం ముద్ద. ఆశలు ఎండి, కోర్కెలు చచ్చి, అనునిత్యం చావుతో సహవాసం చేసిన ఆమెను ఈ వైరస్ లు ఏమి చేయగలవు?
          ఎంత పరుగు పరిగెత్తినా, అఖిరికి చేరేది ఆ ఆరడుగుల మరుభూమికే అని నిజమెరిగిన ఆమెకు పరుగుకోసం తాపత్రయం ఎందుకు?
          తనదంటూ ఏమీ లేని ఆమెకు, ఎవరో దాడి చేసి, ఎదో దోచేస్తారని భయమెందుకు?
          ప్రేమ,బంధాలు అడ్డుతగిలి ఉంటే… ఓ తల్లి ఆకలి బాధల్ని తీర్చలేక తన ఐదుగురి బిడ్డల్ని గంగానదిలో  పడేసి, ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కూడా ఆలోచించేదేమో?
          ఆటాడే బాలులుండి ఉంటే…. నోటి ముందు ముద్ద మృగ్యమై బీహార్ లోని పసిపిల్లల్లా కప్పల్ని కాల్చుకుతినమని నేర్పించేదేమో ఆమె?
          పనిదొరకని వలసకూలీ అయిఉంటే…
          వాహణాల్ని లెక్కచేయక వేల్లాది మైళ్ళు నడిచి సొంతూరు చేరుకోవాలని ఆరాటపడేదేమో? 
          సొంతూరంటూ వుండి ఉంటే…      వందలాది మైళ్ళు నడిచి నడిచి జన్మభూమిలో ప్రాణం విడిచిన చత్తీస్ ఘడ్ అమ్మాయిలా ఆమె కూడా ఆరాట పడేదేమో?
          దర్జాగా బ్రతికే మిగతా మనుషుల్లా అయిఉంటే…. హేండ్ వాషులు, సేనిటైజర్లు, మాస్కులు, క్వారెంటయిన్లు, మందులు మాకులు పద్దతులన్నీ పాటించేదేమో?
          ఎక్కడినుంచో కబురందినట్లుంది…  ఏమీ మిగలని చోట ఏదో దోచేసేందుకు దాడిని ప్రారంభించాయి ఈగలు ఒక్కొక్కటిగా చేరుతూ.    
          కంటికి కనబడని ఒక ఏక కణ జీవి, మనిషిని పరిగెట్టిస్తోంది. సూటూబూట్లు, సూట్కేసులు, ధనం దర్పం, హంగులు ఆర్భాటాలు అన్నీ ఆ పరుగులో అలసి కలుగులో ఎలుకల్లా ఇళ్ళల్లోంచి మిక్కీ మిక్కి చూస్తున్నాయి.
          షేక్ హ్యాండ్ స్థానంలో నమస్కారం, ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడం, తుమ్మిన వారికి దూరంగా ఉండటం, ఫాస్ట్ ఫుడ్డు స్థానంలో ఇంటి వంటకాలు రావడం, జీవితానికి కావలసింది డబ్బు వెనుక పరుగు కాదని….. అనేక వాస్తవాల్ని మనిషి గుర్తించేలా చేసింది సూక్ష్మజీవి.
          పరుగుల్ని నిలువరిస్తూ ఏకకణ జీవి ప్రపంచ జనజీవితంలో ఎన్నెన్ని వాస్తవాల్ని , ఎన్నెన్ని దుస్సహ దృశ్యాల్ని చూపిస్తోందో.. అన్నింటినీ ఎదుర్కొంటూ.. పాలసైకిల్ గణగణగణ మని ముందుకు పరుగిడుతోంది…
          మడిచెక్క మీద మట్టి మనిషి పోషకాహార రచయితగా కొత్త చరిత్ర రాయడానికి ….. మట్టిపుటల్ని తిరగేస్తున్నాడు…

…….

admin

leave a comment

Create Account



Log In Your Account