నేటి విచ్ఛిన్న సంస్కృతిలో యువత ఎదుర్కొంటున్న సవాళ్ళు!

నేటి విచ్ఛిన్న సంస్కృతిలో యువత ఎదుర్కొంటున్న సవాళ్ళు!

	ఉపఖండం యువతకు నెత్తురు మండే, శక్తులు నిండిన నిలువెత్తు ప్రతినిధిగా కనిపించే భగత్‌సింగ్‌ చెప్పినట్లు - యవ్వనంలో మనిషికి రెండే రెండు మార్గాలు. అయితే అతను ఔన్నత్యపు ఉన్నత శిఖరాన్ని అధిరోహించనూ వచ్చు; లేదా అధః పాతాళపు చీకటి కందకంలో పడిపోనూవచ్చు.
	ఒకనాటి చరిత్ర పుటల్ని తిరగేస్తుంటే దేశంకోసం, ప్రజలకోసం జీవిత సర్వస్వాన్నీ గడ్డిపరకలా తీసిపారేసి, రక్త ప్రభంజనంతో ఒక యువ మార్క్స్‌, ఒక నవ గోర్కీ, ఒక గరిమెళ్ళ, ఒక అల్లూరి, ఒక ఓస్ట్రవ్‌స్కీ, ఒక మైకోవ్‌స్కీ, ఒక కలం సైనికుడు శ్రీశ్రీ,  ఒక చేత్తో కలం, మరోచేత్తో తుపాకీ పట్టిన ఒక సుబ్బారావు పాణిగ్రాహి, ఒక క్రిస్టోఫర్‌ కాడ్వెల్‌, ఒక పాబ్లో నెరుడా, జేమ్స్‌ జాయిస్‌, మంటో.... వీళ్లంతా నూనూగు మీసాల నూత్న యవ్వనంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిన మిస్సైళ్ళు!
	జాతీయోద్యమ కాలంలో భారత ఉపఖండం ప్రసవించిన నిప్పుల కొండలకు లెక్కేలేదు. ఆనాటి యువత ముందు దేశ పరిస్థితులు అట్టుడుకుతూ వుండేవి. ప్రజల జీవితాల్లో గాయాలకు కారణమైన శత్రువు స్పష్టంగా కనిపించేవాడు. దేశభక్తి అంటే ఖచ్చితమైన నిర్వచనం వుంది. ఉద్వేగం వుంది. జీవితానికొక లక్ష్యం వుంది. కానీ ఇవాళ కనిపించని శత్రువు అనేక కోణాల నుండి ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, విచ్ఛిన్న రసాయనాలను విరజిమ్ముతున్నాడు.
	ఈనాటి యువతరానికి తన సమస్యలపట్ల అవగాహన కల్గివుండే స్పష్టతనివ్వని విధ్వంసక విధానాలు విచ్చలవిడిగా కమ్ముకొని వున్నాయి. లక్ష్యశూన్యతలో కొట్టుమిట్టాడుతున్న కుర్రకారు - రోజుకో కొత్త సంవత్సర వేడుకల పొంగుల్లో - క్షణిక భావోద్రేకాల పొంగుల్లో, పొగలో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, మత్తులో, మాదకద్రవ్యాల్లో, కులమతాల తిరుగు గుమ్ముల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దేశం ఇంజనీర్లతో, సాఫ్ట్వేర్‌ మేధో కూలీతో - పరిశోధక విద్యార్థులతో, విద్యాధిక్యతతో ఎంత విరగపండి పోతుందో, సాంస్కృతికంగా అంత పతన విలువ మురుగులో పడుతోంది.
	మార్కులు, ర్యాంకులు అంటూ విలువైన విద్యార్థి జీవితమంతా పుస్తకాల పిరమిడ్‌లలో సమాధి అయిపోతూ తీరా ప్రపంచ వాస్తవికతలోకి అడుగుపెడితే - కాణీకి ఠికాణాలేని విలువలేని పట్టాలతో దారి లేక, ఉపాధి రాక - జీవితానికి గమ్యం కనిపించక, కెరీరిజం కోరల్లో కొట్టుమిట్టాడే నేటి తరానికి ఉమ్మడి లక్ష్యాలు లేవు. సమష్టి స్వభావం లేదు. సంఘటితత్వం లేదు. అలా విడివిడిగా, పొడిపొడిగా, శకలాలు శకలాలుగా - పగిలిన గాజుముక్కల్లాగా జాతి భవిష్యత్తు బాటలో చెల్లా చెదురుగా పడవేస్తున్న దేశ రాజకీయ, ఆర్థిక విధానాలను ప్రశ్నించడానికి ఇక్కడి నవతరాన్ని సిద్ధం చేయలేకపోవడమే పెద్ద విషాదం. ఒక తరం అడుగులు తడబడితే, మరో తరం అణగారిన ఆర్తనాదాలు కొనసాగించబడతాయి. వాళ్ళ ఆలోచనలు భ్రమ పడుతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగుతున్నంత కాలం భారత సమాజానికి ఈ వేదనలు తప్పవు.
	దళితులకు కేటాయించిన రిజర్వేషన్లతో వారి నిరుద్యోగ సమస్య పరిష్కారమయిపోయినట్లేనని ప్రచారం చేసిన పాలకవర్గాలే నిరుద్యోగ సమస్యకు  దళితులకిచ్చిన రిజర్వేషన్లే కారణమన్నట్లు అగ్రకులాల మధ్యతరగతికి చెప్పారు. నిజానికి రిజర్వేషన్లు అనేవి ఉద్యోగావకాశాలను పెంచవు. పంచుతాయి. అంతవరకే! నిరుద్యోగానికి మూలకారణమైన వ్యవసాయ - పారిశ్రామిక రంగాల సంక్షోభాన్ని పరిష్కరించకుండా ప్రశ్నించే యువతరాన్ని పక్కదారి పట్టించే ప్రచారాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు కులాలవారీ రిజర్వేషన్లే పరిష్కారమన్న భ్రమల్ని పాలకపక్షాలే పెంచి పోషిస్తున్నాయి. తద్వారా కులాల కుంపట్లను రాజేసి తమతమ కులస్తులు మాత్రమే అణగారిపోతున్నట్లు మిగిలిన అందరూ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నట్లు భ్రమాత్మక భావాలను పోషిస్తున్నారు. నిరుపేదలలో 100కి  73 మందికుండిన మొత్తం సంపద కేవం నూటికి ఒక్కరి సంపన్నవర్గాల గుప్పెటనున్న సొత్తుతో సమానమైతే ఇక్కడ అన్ని కులాల పేదలు, మధ్యతరగతి మొత్తంగా ఉమ్మడిగా కునారిల్లుతున్నారని గ్రహించాలి. ఈ ఎరుకను కలుగనీయకుండా పాలకవర్గాలు జాగ్రత్తపడుతున్నాయి.
	సినిమా వ్యాపారానికీ పదవీ జూద అరాచకాలకీ, పెద్ద బజార్లకీ - రికామీ తిరుగుళ్ళకీ నెత్తుటి వసంత ఋతువుని తాకట్టు పెడుతున్న పాలక విధానాలపై సుదీర్ఘ యుద్ధం ప్రకటించాల్సి ఉంటుంది. కానీ నేటి చదువులు ఆ ఎరుకని ఇవ్వవు. కాలేజీ వాతావరణం విశ్వవిద్యాలయాల ఆవరణం కాషాయీకరణతో ''దేశభక్తి'' భావజాంతో నెత్తుటి వాసన తెస్తున్నాయి. ''ప్రేమ'' పేరుతో చిత్తకార్తె సంస్కృతిని పెంచి పోషిస్తున్న మిథ్యా విద్యా'లయాలు' పిల్లల్లో నేరస్త ఉద్వేగాల్ని రెచ్చగొట్టే మాఫియా కేంద్రాలుగా మార్చే ప్రక్రియ నడుస్తోంది.
	వారాంతపు వినోద హింసలతో, రేవ్‌ పార్టీలతో, సులభ మార్గాల్లో డబ్బు పొంగుల్తో - ముఠా పోరాటాల హంతక సంస్కృతితో, విలాసాలకు, బలహీనతలకీ  బానిసలైపోయిన, రికామీ కుర్రకారు విద్యాధికులైనా, చెయిన్‌స్నాచర్స్‌గా, ''డబ్బు కావాంటే ఏమైనా చెయ్యవచ్చు'' అనే హీన తాత్వికతతో లోలోన కుళ్ళిపోతున్నారు - పైపైకి మేడిపళ్ళుగా నవనవ లాడుతున్నారు.
	మరోపక్క పేదరికంలో మగ్గే యువత అవకాశాల కోసం పోటీపడుతూ ఏదో ఒకటి చెయ్యాలి అనే కసితో జీవితంతో రాజీపడలేక, బతుకుతో పోరాటం చెయ్యలేక - నిస్తేజానికీ, నిస్సహాయతకీ, అసంతృప్తికీ గురై మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోతున్నారు.  క్షుద్ర భావజాలాన్ని ఆశ్రయిస్తున్నారు. అయ్యప్ప భక్తులుగా, భవానీ దీక్షలతో - గుళ్ళూ గోపురాల చుట్టూ, రాళ్ళూ రంగుతాళ్ళూ కట్టుకొని, చుట్టుకొని చీకటి లోయల్లో గిరికీలు కొడుతున్నారు.
	ఒకనాటి చైనా, రష్యా యువకుల త్యాగపూరిత విప్లవ అనుభవాలు ఇప్పుడు కాలంచెల్లిన భావజాలంగా నెట్టిపారేస్తున్నారు. ఒకనాటి బోల్షివిక్‌ మహిళల చైతన్యం, ప్రపంచ యువత మీద చూపించిన ప్రభావాలు ఇవాళ ప్రమాదకరమైనవిగా ప్రచారం చేస్తున్నారు. సామాజిక చలన సూత్రాలపై అవగాహనలేని ప్రాప్తకాలజ్ఞతలో యువత గుడుగుడుగుంచం ఆడేలా, గానుగెద్దుల్లా, గుర్తింపుల కెరీరిజానికీ, స్వసుఖవాదానికీ పరిమితమయ్యేలా దేశ ఆర్థిక, రాజకీయ చట్రాన్ని దళారీ బూర్జువా పాలక ముఠాలు బిగించి వుంచాయి. ఎందుకంటే -
	యువత ఒకటై కదిలితే రాకపోకలు స్థంభిస్తాయ్‌!
	యువత ఆగ్రహిస్తే ఆకాశహర్మ్యాలు నెర్రలిస్తాయ్‌!
	యువత కళ్ళెర్రజేస్తే సంకెళ్ళు బద్ధలవుతాయ్‌!
	యువత పూనిక వహిస్తే దేశ పతాకలే అవనతమవుతాయ్‌!
	ఆ మహోదయం కోసం దేశం దేశం అంతా చిమ్మ చీకటిలో తూర్పులా పోరాట సహనంతో పురిటినొప్పు పడుతోంది!!

admin

leave a comment

Create Account



Log In Your Account