వెర్రిగోవులు

వెర్రిగోవులు

– కసిరెడ్డి గౌరీశంకర్

       ‘‘ఓలమ్మో! ఓర్నాయనో! యెంత పన్జేసిందిరా మాయదారి గొడ్డూ! దీన్నోట్లో మన్ను వడ…. దీని కాళ్ళిరగ…. బంగారవంటి పంటని మింగేసిందిరా తల్లోయ్‌! ఇప్పుడు నానేంజెయ్యాల? ఎందల పడాల దేవుడోయ్‌….?’’

       ‘‘యేంది రావులమ్మా…. యేందట్టా శోకాలెడతా వుండావ్‌ యామైందే?’’

       ‘‘ఇంకేమవ్వాలి దేవుడోయ్‌…. యేపుగా ఎదిగొచ్చిన నా ఆవాలు పంటని గొడ్లు మేసీసినాయే తల్లా…. యెవురికి జెప్పుకనే తల్లా…?’’

       ‘‘అన్నన్నా యెంత పన్జేసినాయమ్మా దిక్కుమాలిన గొడ్లు! నిన్నటికి నిన్న మంకు చిమ్మాచెలం, సన్నాసి గోర్ల పంటల్ని గూడా ఒక్కాకు గూడా ఆగపడకుండా సేసినాయంట. మాయదారి గొడ్లు మందలు మందలుగా ఊర్లకు ఊర్లే మేసెత్తున్నాయట. ఊరూ వాడా గగ్గోలై పోతన్నాది. యెట్టా వదులద్దో యీటి బెడద?’’

       ‘‘నిజవేనర్రా, ఎవుల్ని కదిపినా యిదే మాట…. మా పంటని తినేసాయ్‌ అంటే మా పంటని తినేసాయంటున్నారు. ఇట్టా కాదు గానీ పదండి అందరం కల్సి రాజుగోరికి పోయి మొరెట్టుకుందాం. ఔను! పదండి…. పదండి వెళ్దాం!’’

* * *

       ‘‘ఏమిటి మంత్రిగారూ, ప్రజలంతా ఇలా కట్ట కట్టుకుని వచ్చారు ఏదైనా జరగరానిది జరిగిందా?’’

       ‘‘చిత్తం ప్రభూ! మనం ఒట్టిపోయిన పశువుల్నీ, పనిచెయ్యలేని వాటినీ కబేళాలకు తరలించడం నిషేధించాం కదా. లక్షలుగా వున్న ఆ పశువుల్ని మేపలేక రైతులు వాటిని స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. దాంతో అవి తమ కంటికి కనిపించిన పంటలన్నిటినీ ఆనందంగా మేస్తున్నాయి. అలా పంటల్ని పోగొట్టుకున్న వందల మంది రైతులు తమ గోడును ప్రభువులకు విన్నవించుకుందామని వచ్చారు.’’

       ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న ప్రభువు తన తెలివికి తానే మురిసిపోతూ ‘‘శహభాష్‌! అలా అడ్డూ అదుపూ లేకుండా ఊరిమీద పడి మేసేస్తున్న పశువులన్నిటినీ తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కట్టేయమనండి, ఇది నా ఆజ్ఞ’’ అని సెలవిచ్చారు. తమ సమస్య తీరిందనుకున్న రైతులు ఆనందంగా వెనుదిరిగారు.

* * *

       ‘‘అబ్బబ్బబ్బ! ప్రాణం తినేస్తున్నారు వెధవ పిల్లలని…. వెధవ పిల్లలు. కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందని, పంటల్ని మేసేత్తున్న పసువుల్నుండి రచ్చించండయ్యా అంటే ఆటిని తీస్కెల్లి బళ్ళల్లో కట్టేమన్నారు. సదువులు కొండెక్కి కూసున్నాయి…. ఇళ్ళల్లో మా బుర్రలు యేడెక్కిపోతన్నాయి.’’

       ‘‘అంతేనా?  నిన్న మీ మావకి ఒల్లంతా పులుసుపోయి ఒళ్ళెరక్కుండా  జొరమొచ్చి తొంగుంటే రిచ్చా గట్టించి ఆసుపత్రికి తీస్కపోయానా…. ఆసుపత్రి  నిండా సొమ్ములు గట్టేసున్నాయి. డాట్రుబావూ లేడు, మందులూ నేవు. యేటిసేత్తాం? ఆసారి గారింటికి తీస్కపోయి ఆయన సేతిల పైసలెడితే  సూదిమందేసాడు. యిగో యిప్పుడే లేసి కూకున్నడు. యిట్టైతే సేతిల దుడ్డు లేనోల్లందరి మాట ఏటయ్యేట్టు…. గోదాట్లో దూకాల్సిందేనా? తాటిసెట్టెందుకెక్కేవురా అంటే  దూడ  గడ్డి కోసం అన్నాట్ట యెనకటికెవడో,  అట్టాగుంది అయ్యవారి యవ్యారం…..’’

* * *

       ‘‘యేమిటి మంత్రీ! మరలా వచ్చారు ప్రజలంతా. మరలా ఏమైంది?’’

       సమస్య తీరలేదట ప్రభూ! పైపెచ్చు తమ బిడ్డలకు చదువు సంధ్యలు లేకుండా పోయాయనీ, పేదలకు వైద్యం అందడంలేదనీ, ఇలాగే కొనసాగితే వచ్చే పర్యాయం ఎన్నికల్లో మిమ్మల్నెలాగైనా గద్దె దించాలని అనుకుంటున్నారు ప్రభూ!’’

       యధావిధిగా ప్రభువు ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచాడు. ‘‘శహభాష్‌! ఒక పని చేద్దాం రాజ్యంలో విచ్చలవిడిగా మద్యపానం సేవిస్తున్నారు. కనుక, దానిని మానుకోవడం కష్టం కనుక దానిపై అదనంగా పన్ను వేద్దాం. అదే విధంగా వాహనాలు లేకుండా ప్రజలు ప్రయాణాలు చేయడం కష్టం గనుక టోలు పన్నుపై అదనపు సుంకం చేద్దాం… ఇంకా వినోదంపై అదనపు సుంకం వసూలు చేద్దాం.’’

       ‘‘ఎందులకు ప్రభూ ఈ అదనపు పన్నులు?’’

       ‘‘చెబుతాను ముందు మీరు వెళ్ళి ప్రజల సమస్యను వెంటనే తీర్చగలమని చెప్పి వారిని పంపండి.’’

       ‘‘వెర్రి గోవులు తలలూపుకుంటూ వెళ్ళిపోయాయి ప్రభూ! ఇప్పుడు చెప్పండి దేవర వారి ఆంతర్యమేమిటో.’’

       ‘‘చక్కగా సెలవిచ్చావు వెర్రిగోవులని. ఇదంతా గోవుల కొరకే చేస్తున్నానటుకుంటున్నారు వెర్రిగోవులు అసలు సంగతి తెలిస్తే గుడ్లు వెళ్ళబెడతారు.’’

       ‘‘ప్రభూ! ఇదేదో తెలుగు సస్పెన్స్‌ థ్ల్రిల్లర్‌ సినిమాలా వుంది త్వరగా చెప్పండి. లేకపోతే ఆందోళనతో నా బుర్ర బద్దలయ్యేలా వుంది.’’

       ‘‘వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఒట్టిపోయిన పశువుల్ని కబేళాకు తరలించడం ఎవరు నిషేధించారు?’’

       ‘‘మనమే కదా, సందేహమెందుకు?’’

       ‘‘ఫలితంగా ఏం జరిగింది?’’

       ‘‘ఏముంది వేలాదిమంది పేదలకు తక్కువ ధరకే లభించే పోషకాహారం అందకుండా పోయింది….’’

       ‘‘అబ్బా! అది మనకెందుకు వేరే ఏమైనా చెప్పు.’’

       ‘‘చాలా తోలు పరిశ్రమలు మూతపడిపోయి లక్షలాదిమంది కార్మికులకు పని లేకుండా పోయింది. అవునా?’’

       ‘‘మంత్రీ నీ బుర్రకు కూడా పని లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి? మనకు పనికిరాని విషయాలు చెబుతున్నావు. నేనాశించినవి ఈ సమాధానాలు కావు….’’

       ‘‘క్షమించండి ప్రభూ! అసలు విషయం ఇప్పుడు తట్టింది నా మట్టిబుర్రకు. మన నిషేధం ఫలితంగానే కదా పనికిరాని గోవుల్ని పోషించలేక బయటకు వదిలేస్తున్నారు. అందువల్లనే ఆ పశువులన్నీ అందినకాడికి అందినట్లు పొలాల్లోని పంటలన్నిటినీ మేసేస్తున్నాయి.’’

       ‘‘కదా! అవి అలా ఎక్కడపడితే అక్కడ మేసేయకుండా ఉండాలంటే ఏం చేయాలి?’’

       ‘‘ఏముంది. వాటి కొరకు ప్రభుత్వ ఆధీనంలో వున్న గడ్డి భూముల్ని కేటాయిస్తే సరి.’’

       ‘‘చక్కగా సెలవిచ్చావు అయితే రాజ్యంలో ఎక్కడైనా ఖాళీగా ఉన్న భూములున్నాయా?’’

       ‘‘ఎక్కడున్నాయి ప్రభూ? అవన్నీ ఎప్పుడో మనవారు కైంకర్యం చేసేసారు. కొన్నింటిని తమరు వాణిజ్య ప్రముఖులకు కేటాయించేసారు. అందువల్లనే గదా భస్మాసురిడి హస్తంలా వారి ఒట్టిపోయిన గొడ్లు వారి పొలాల్నే మేసేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మనం అలా చేసాం, ఔనా?’’

       ‘‘ఔను, గడ్డి భూముల్ని కేటాయించలేం కనుక ప్రజల అసంతృప్తిని దారిమళ్ళించేందుకు గోరక్షణ శాలల్ని నిర్మిస్తాం. అదనంగా వసూలు చేస్తున్న సుంకాల ద్వారా వచ్చిన పైకాన్ని వాటికి కేటాయిస్తాం….’’

       ‘‘ప్రభూ! మిగిలింది నేను చెబుతాను. ఆ శాలలన్నిటినీ మన వాళ్ళకే అజమాయిషీ చేయమని అప్పజెబుతారు. ఆ నిధులు కూడా మనవాళ్ళే  జేబుల్లో వేసుకుంటారు. ఇంతవరకూ బాగానే వుంది. పశువుల్ని మేపడానికే ఆ నిధులన్నీ సరిపోతాయేమో కదా మరి….?’’

       ‘‘ఆ! అక్కడే వుంది అసలు మతలబు అంతా. మన రాజ్యం నుండి ఇతర రాజ్యాలకు గొడ్డుమాంసం ఎగుమతి జరుగుతున్నదా, లేదా.’’

       ‘‘లేకేం ప్రభూ! నిక్షేపంగా జరుగుతోంది. గొడ్డు మాంసం ఎగుమతిదార్లంతా యించుమించు మనవాళ్ళేకదా, కోట్లలో జరుగుతుంది వ్యాపారం…. మీకు తెలియనిదేమున్నది?

       ‘‘గో రక్షణ శాలల్లోని గోవులను, గొడ్లనూ అలా అలా మనవారి కబేళాలకు తరలిస్తాం….’’

       ‘‘ప్రభూ! మీ సేవకునిగా నా జన్మ చరితార్ధమైంది, మీరు కారణజన్ములు, మీ మేథస్సుకు నా జోహార్లు! ఆహా! గోవుల్ని పరిరక్షించడానికి పడరాని పాట్లు పడుతున్నట్లు కనిపిస్తూ, అదనపు సుంకాల పేరుతో గోరక్షణ శాలలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తూ, తీరా చివరికొచ్చేసరికి…. ఓహో! ఓహో! వట్టిపోయిన గోవుల్ని కూడా వదలకుండా మన రాజతంత్రానికి వాడుకోగల్గిన మీరు అపర చాణక్యులు ప్రభూ! చివరికి ప్రజలే అసలైన వెర్రిగోవులు కదా!!

admin

leave a comment

Create AccountLog In Your Account