ప్రగతిశీల సినిమా దర్శకుడు మృణాల్‌సేన్ కు సంతాపం

ప్రగతిశీల సినిమా దర్శకుడు మృణాల్‌సేన్ కు సంతాపం

ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలు నిర్మించిన, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరింపచేసిన బెంగాలీ సినీ దర్శకులు మృణాల్‌సేన్‌ మరణానికి జనసాహితి సంతాపం ప్రకటిస్తోంది. ఆయన 1923 మే 14న తూర్పుబెంగాల్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లోని ఫరీదాపూర్‌లో జన్మించారు. 2018 డిసెంబర్‌ 30న కలకత్తాలోని భొవానిపురేలో తన 95వ ఏట మరణించారు. మృణాల్‌సేన్‌ 1956లో మొదటిసినిమా ‘రాత్‌భూమి’ని తీశారు. మొదట్లో సంప్రదాయ ధోరణిలో కథా కధనాలతో సినిమాను నిర్మించినా ఆ తర్వాత సామాజిక అంతరాలను చూపెడుతూ, అప్పటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను చిత్రీకరిస్తూ ఉద్యమావశ్యకతను తెలియచేసే శక్తివంతమైన సినిమాలను నిర్మించారు. అప్పటికప్పుడే సెట్స్‌పై సన్నివేశాలను, సంభాషణలను రూపొందించుకుంటూ చిత్రాలను నిర్మించిన సృజనశీలురాయన. 1956లో మొదలైన ఆయన సినిమా ప్రయాణంలో 27 ఫీచర్‌ ఫిలిమ్స్‌, 13 ఎపిసోడ్స్‌ టివి సీరియల్‌ నిర్మించారు. ఎనిమిది పదుల వయసులోనూ 2002లో తీసిన ‘ఆమార్‌ భుభోన్‌’ ఆయన ఆఖరి సినిమా. ఆయన చివరివరకూ సినిమా ద్వారా సామాన్య ప్రజల్ని సమస్యలపై మేల్కొలిపే కృషిలో నిమగ్నమయ్యారు. పద్మభూషణ్‌ బిరుదును ఫాల్కే పురస్కారాన్ని పొందారు. ఫ్రాన్స్‌, రష్యా ప్రభుత్వాలు ఆయన్ని గౌరవించాయి. ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమ సాంగత్యంలో పెరిగిన ఆయన 1946 ఆగష్టు అల్లర్లు, బెంగాల్‌ కరువు వంటి విపత్తులను చూస్తూ సమాజంలో వున్న అసమానతలు తొలగిపోయేందుకు పరిష్కార మార్గాల చైతన్యంతో సాగుతూ సినిమా మీడియా ద్వారా ప్రగతిశీల భావాలను, కమ్యూనిస్టు భావాలను వ్యాప్తిచేశారు. సాహిత్యాన్ని సినిమాలుగా మలచటంలో ఆసక్తిని కనబరుస్తూ మున్షీ ప్రేమ్‌చంద్‌ కథ ‘కఫన్‌’ ఆధారంగా ‘ఒక ఊరికథ’ (1977)గా తెలుగు భాషలో సినిమా తీశారు. అలాగే హిందీలో ‘భువన్‌ శ్యామ్‌’ (1969) ఆయన తొలిచిత్రం. ఒరియా భాషలోనూ ఆయన సినిమాలు తీశారు. యాభై లక్షల మంది ఆకలి కేకల బెంగాల్‌ కరువు నేపథ్యంతో వచ్చిన ‘బైషే శ్రావణ్‌’ (1960) అలాగే ‘ఇంటర్వ్యూ (1971)’ ‘కలకత్తా 71’, ‘కోరస్‌ (1974)’, ‘మృగయా (1976)’ ఉద్యమ చిత్రాలుగా పేరెన్నికగలవి. ఫిలిం సొసైటీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ సినిమాలపై భారతీయ ప్రగతిశీల ప్రభావాన్ని వేసిన మృణాల్‌సేన్‌ మరణానికి జనసాహితి సంతాపాన్ని ప్రకటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేస్తోంది.

admin

leave a comment

Create Account



Log In Your Account