తాత్కాలిక ఉపశమనం కాదు! శాశ్వత నివారణోపాయం కావాలి!!

తాత్కాలిక ఉపశమనం కాదు! శాశ్వత నివారణోపాయం కావాలి!!

          ఈ నెల మొదటివారంలో ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్ల దాడి (ప్రతిపక్షాలపై సర్జికల్‌ స్ట్రైక్‌) చేయటానికి ముందే వెలువడిన జనవరి ‘ప్రజాసాహితి’ సంపాదకీయంలో వాక్యాలను ఒక్కసారి గుర్తుచేస్తాను. ‘‘దళితులకు కేటాయించిన రిజర్వేషన్లతో వారి నిరుద్యోగ సమస్య పరిష్కారమయినట్లేనని ప్రచారం చేసిన పాలకవర్గాలే, అగ్రకులాలలోని మధ్యతరగతి ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు దళితులకిచ్చిన రిజర్వేషన్లే కారణమన్నట్లు చెప్పారు. నిజానికి రిజర్వేషన్లనేవి ఉద్యోగావకాశాలను పెంచవు. పంచుతాయి. అంతవరకే! నిరుద్యోగానికి మూలకారణమైన వ్యవసాయ – పారిశ్రామికరంగాల సంక్షోభాన్ని పరిష్కరించకుండా,  ప్రశ్నించే యువతరాన్ని పక్కదారి పట్టించే ప్రచారాలకు ఒడిగడుతున్నారు. ఇపుడు కులాలవారీ రిజర్వేషన్లే పరిష్కారమన్న భ్రమల్ని పాలకపక్షాలే పెంచిపోషిస్తున్నాయి. తద్వారా కులాల కుంపట్లను రాజేసి, తమతమ కులస్తులు మాత్రమే అణగారి పోతున్నట్లూ మిగిలిన అందరూ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నట్లూ భ్రమాత్మక భావాలను పోషిస్తున్నారు.’’                                (‘ప్రజాసాహితి’ – జనవరి 2019)

          గడిచిన 20 సంవత్సరాలుగా చట్టసభలలో మహిళా రిజర్వేషను (33%) గురించి ప్రతి ఎన్నికల ముందూ పాలకవర్గాలు వాగ్దానాలు గుప్పిస్తూనే వున్నారు. దాని ఆమోదానికి పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రవేశపెట్టే పది సంవత్సరాలు పైనయింది. కానీ దానికి అతీగతీ లేకుండా  నేలమాళిగలో వుంచేశారు. 41/2 సంవత్సరాలపాటు ఊసెత్తకుండా, పార్లమెంటు సమావేశాల ఆఖరిరోజున, అకస్మాత్తుగా ప్రస్తుతం అమలులో వున్న రిజర్వేషన్ల పరిధి వెలుపలనున్న ఆర్ధిక బలహీన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ మెరుపు వేగంతో, బిల్లు రూపంలో ప్రవేశపెట్టిన వెంటనే కేవలం 2 రోజులలో చట్టంగా ఆమోదించారు. వెలుపల సమాజంలో  చర్చకే కాదు పార్లమెంటులో కూడా చర్చకు కనీస అవకాశాన్ని యివ్వకుండా హడావుడిగా పని కానిచ్చేశారు. ఈ చట్టం సుప్రీంకోర్టు గతంలో యిచ్చిన తీర్పుల ప్రకారం, రాజ్యాంగ రూపకర్తల ఆదేశిక సూత్రాల ప్రకారం చెల్లదని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. అయినా మోడీ ప్రభుత్వ తక్షణ లక్ష్యం అది ఆమోదం పొందటంకాదు, నాలుగు నెలల్లో రానున్న పార్లమెంటు ఎన్నికలలో అగ్రకులాలనుకునేవారిని దీని సాకుతో తమ వెనుక ఓటు బ్యాంకుగా నిలబెట్టుకోవటం ద్వారా గెలుపును సాధించటం!

          భాజపాతో సహా పాలకపక్షాలన్నీ దళితుల వర్గీకరణకు హామీలపై హామీలను దశాబ్దాలుగా యిస్తూనే వున్నారు. వారి నడుమ చిచ్చును రగిలిస్తూనే వున్నారు. సచార్‌ కమిషన్‌ రిపోర్టు ప్రకారం ఆర్ధిక, విద్యా, ఉపాధిరంగాలలో బాగా వెనుకబడి వున్న ముస్లిములకు ‘మైనారిటీ’ కోటా కింద జనాభా దామాషా ప్రకారం రిజర్వేషను కల్పించటానికి ససేమిరా అంటున్నారు. ఇపుడు అత్యంత వెనుకబడి వున్న ముస్లిములను కూడా 10% రిజర్వేషను కేటగరీలో వున్న అగ్రకులాల మధ్యతరగతితో విద్యా, ఉపాధిరంగాలలో పోటీ పడమని చెప్పకనే చెప్పారు.

          రిజర్వేషన్ల ద్వారా ఉపాధికల్పన అనేది – వంద ఉద్యోగాలకు వందమంది ఉద్యోగార్ధులే వుంటే పంపిణీ సమస్య వుండదు. కానీ నిరుద్యోగసమస్య ఎంత తీవ్రంగా వుందో మొహాన గుద్దినట్లుండే ఒక్క ఉదాహరణ చూద్దాం. 3 ఏళ్ళక్రితం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 386 ప్యూన్‌ పోస్టుల భర్తీకోసం ప్రకటన యిస్తే 23 లక్షలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అందులో 255 మంది పిహెచ్‌.డిలు, 2 లక్షల 22 వేలమంది ఇంజనీర్లు వున్నారు. పై ఉద్యోగానికి కావాల్సిన కనీస అర్హత 5వ తరగతి చదివి వుండటం, సైకిల్‌ తొక్కటం వచ్చి వుండటం. లభించే నెల జీతం రూ. 16,000/- (సంవత్సరానికి ఒక లక్షా 92 వేల రూపాయలు) అత్యంత తీవ్రమైన పై పోటీలో ప్యూను ఉద్యోగం పొందినవారి సంతానం, అంతకు 4 రెట్లు (8 లక్ష రూ॥లు) ఆర్ధిక స్థితిమంతుల బిడ్డలతో పోటీపడి ఉద్యోగం పొందే ఏర్పాటును ప్రస్తుత 10% కోటా చట్టం యిస్తోంది. 5 ఎకరాల భూమి,  వెయ్యి చదరపు అడుగుల యిల్లు, 8 లక్షల రూ॥ల వార్షిక ఆదాయానికి లోబడినవారందరూ 10% కోటా పరిధిలోకి వస్తారు. ఇది వెనుకబడిన గ్రామీణుల అవకాశాలను కుదించే వివక్షను చట్టబద్ధం చేసినట్లవుతుంది.

          8 లక్షల రూపాయల వార్షికాదాయం ఆర్ధిక బలహీనతను కొలిచే ప్రమాణమయినప్పుడు, ఈ తరహా బలహీనుల నుండి (నెలకు 66 వేల రూ॥ల ఆదాయం కంటే తక్కువ వున్నవారి నుండి) ఆదాయం పన్ను వసూలు చేయటంలో ఔచిత్యమేముంటుంది?

          భారత లేబర్‌ బ్యూరో 5వ వార్షిక ఇటీవలి నివేదిక (2015-16) ప్రకారం నెలకు 50 వేల రూ॥ల నుండి ఒక లక్ష రూ॥ల దాకా ఆదాయం కలవారు (పల్లెలు + పట్నాలు కలుపుకుని) ఒక వెయ్యిమందికి 18 మంది మాత్రమే! (పేజీ 37) అంటే సంవత్సరానికి 6 లక్షల నుండి 12 లక్షల రూ॥ల ఆదాయంకలవారన్నమాట. దీన్ని ప్రస్తుత 10 శాతం కోటా చట్టం విధించిన పరిమితికి సమన్వయిస్తే దేశంలో నూటికి 99 మంది వార్షిక ఆదాయం 8 లక్షల రూ॥ల కంటె తక్కువని తేలుతుంది. అత్యధిక సంపన్నులయిన తొమ్మిదిమంది మొత్తం దేశ సంపదలో సగంకంటే ఎక్కువ అనుభవిస్తున్నారనీ, ఒక్కశాతం ధనస్వాముల మొత్తం సంపద పెరుగుదల ఒక్కరోజుకి 2200 కోట్ల రూపాయలనీ, గడిచిన సంవత్సరంలో ఈ ఐశ్వర్యవంతుల సంపద 39 శాతం వృద్ధిచెందితే, మొత్తం జనాభాలో సగంమంది పేదల సంపద నూటికి 3 వంతులు మాత్రమే పెరిగిందనీ ఇటీవలే (23 జనవరి 2019) ‘‘ఆక్స్ ఫాం’’ (ప్రపంచ ఆర్ధిక వేదిక) ప్రకటించింది. సుమారు 14 కోట్ల నిరుపేద జనాభా (10 శాతం) గడిచిన 15 సంవత్సరాల కాలంలో (సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు లొంగిపోయిన 12 ఏళ్ళ తర్వాత) అప్పు ఊబిలో కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరవుతూ దుర్భర జీవితాల్ని గడుపుతున్నట్లు కూడా ‘ఆక్స్ ఫాం’ చెప్పింది. అదే పై శ్రేణి 10 శాతం వారి సంపద 77 శాతం పేదవర్గాల మొత్తం సంపదతో సమానంగా వున్నట్లు కూడా అదే నివేదిక ప్రకటించింది.

          10% కోటా రిజర్వేషను ప్రకారం, ముస్లిములతోసహా అగ్రకులాల వారిలో గల నిరుపేద, పేద, మధ్యతరగతివర్గాల పిల్లలు నెలకు రూ. 50 వేలు పైగా ఆదాయం పొందే కుటుంబాల బిడ్డలతో పోటీపడి విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నమాట! ఇదెంత హాస్యాస్పదం!!

          పోనీ ఉపాధి అవకాశాలేమయినా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయా అంటే…. సరిగ్గా అవి వెనక్కి ప్రయాణిస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యసంస్థ (ఐ.యం.ఎఫ్‌) ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగంలో విద్య, ఉపాధి అవకాశాలను ఘోరంగా కత్తిరించిపారేశారు. ఉద్యోగాల కల్పన ఎంత అన్న సంగతి అలా వుంచినా ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు లేవు. కేవలం కేంద్ర ప్రభుత్వ రంగంలో 14 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నా భర్తీచేయటం ఆపేశారు. పెద్దనోట్ల రద్దు తర్వాత, జీఎస్టీ అమలు ఫలితంగా 35 లక్షల ఉద్యోగాలు నష్టపోయినట్లు పారిశ్రామిక వర్గాలే ప్రకటిస్తున్నారు. కనుక…. సారాంశంలో లేని ఉద్యోగాలకు, వందమంది నిరుద్యోగులలో  ఒక్కరికి కూడా రాని ఉద్యోగాలకు నిర్దాక్షిణ్యమైన పోటీలుపడి, ఆదాయం, కులం సర్టిఫికేట్లకు లంచాలు పోసి ప్రవేశ పరీక్షలకు వేల – వేల రూపాయల ఫీజులకు తగలేసి, పొరపాటున ర్యాంకు తెచ్చుకున్నా, లక్షల రూ॥ల లంచాలు సమర్పించుకుంటేగాని రాని ఉద్యోగాలపేరుతో పాకులాడుతున్న హైడ్రామా, ఈ రిజర్వేషన్లు. నిన్న రైల్వేశాఖలో ఉద్యోగాల గురించి ‘ఈనాడు’ పత్రిక ఈ క్రింది వివరాలిచ్చింది. మొత్తం ఉద్యోగాలలో (15 లక్షలు +) సుమారు 19 శాతం (2.82 లక్షలు +) ఖాళీలుండగా, వీటికి తోడు రెండేళ్ళలో 99000 మంది రిటైర్‌ అవుతుండగా, ఒక లక్షా 31 వేల పోస్టులు. త్వరలో భర్తీ చేయనున్నామని ప్రకటించారు. నిజంగానే ప్రకటించినమేరకు భర్తీచేసినా ఇంకా భర్తీచేయవలసిన ఉద్యోగాలు మిగిలే వుంటాయి. అదే ప్రకటనలో వున్నట్లు రెండేళ్ళలో మరో లక్ష భర్తీ చేసినా లక్షన్నర ఖాళీ ఉద్యోగాలు అలాగే వుండిపోతాయి. కొత్త ఉద్యోగాల కల్పన సంగతి అలా వుంచి పదవీ విరమణ పొందినందువల్ల ఏర్పడిన ఖాళీ పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయటానికి ఈ పాలకులు సిద్ధంగా లేరు అన్నది స్పష్టం. (ఇంకా రాష్ట్రాలలో సంగతి సరేసరి!!).

          కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో కార్మికుల సంఖ్య 2014 నుండి 2018 మధ్య 12.8 లక్షల నుండి 10.9 లక్షలకు దాదాపు 13 శాతం తగ్గిపోయింది. కాగా అదే కాలంలో తాత్కాలిక కార్మికుల సంఖ్య 3.3 లక్షల నుండి 3.8 లక్షలకు పెరిగింది. మొత్తం కార్మికుల్లో వీరి శాతం 26 నుండి 35 శాతానికి పెరిగింది. ప్రభుత్వరంగంలోనే ఉద్యోగాలను తగ్గించివేస్తూ, ఏ రకపు రిజర్వేషన్లు రక్షణలూ వర్తించని ఉద్యోగులను పెంచుతూ వస్తున్న గత కాంగ్రెసు పాలనలోలాగే నేటి బిజెపి కూడా ఆర్ధిక బలహీనవర్గాలకు రిజర్వేషన్లపేరిట మరో వంచనకు తెరలేపింది.

          సమాచారహక్కు చట్టం (ఆర్‌.టి.ఐ) ప్రకారం రైల్వేశాఖలో మొత్తం ఉద్యోగులలో 53.7% పోస్టులు ఎలాంటి రిజర్వేషను లేనివారితో (ఓ.సి.) నిండి వుండగా,  ఉన్నతశ్రేణి (కేటగిరీ ‘ఎ’)  ఉద్యోగాలలో 69.7%,  రెండవ శ్రేణి  (కేటగిరి ‘బి’)లో 69.5%  ఉద్యోగాలలో ఓ.సి.లున్నారు. రిజర్వేషన్ల అమలులో నిమ్నవర్గాలవారికి కేంద్ర ప్రభుత్వంలోనే అన్యాయం జరుగుతోందనటానికి యిది మచ్చుతునక.

          ఖచ్చితమైన  ఉద్యోగ  నియామకపత్రాలు,  నిర్ధిష్ట  వేతనాలు, ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలు, వేతనాలతో కూడిన సెలవులు, ఆరోగ్యబీమా సౌకర్యాలు లాంటి కనీస శ్రామిక చట్టాలతో కూడిన సంఘటితరంగ (ప్రభుత్వ + ప్రైవేటు) ఉద్యోగులు 3 కోట్ల కంటె తక్కువమంది కాగా, ఏ ఉద్యోగ భద్రతా లేని అసంఘటితరంగ శ్రామికులు 44 కోట్లమంది మనదేశంలో వున్నారు. వీరిలో సుమారు 451/2 కోట్లమంది ఉద్యోగులకు ఏ రిజర్వేషన్‌ చట్టాలు  అమలుకావు. అమలుజరిగే ప్రభుత్వరంగ ఉద్యోగాలను ఘోరంగా కత్తిరిస్తూ, శాఖలకు శాఖలనే కాంట్రాక్టు, క్యాజువల్‌, ఔట్‌సోర్సింగులతో నింపేస్తూ వున్నారు.

          సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి మీద ఆధారపడినందువల్లే మన పారిశ్రామిక – వ్యవసాయరంగాలు రోజురోజుకీ కునారిల్లుతున్నాయి. సంపద  పంపిణీలో ఘోరమైన అసమానతలు, ఉపాధికల్పనలో దారుణమైన అవకాశాలలేమి, పాత నిరుద్యోగ సైన్యం అలా వుండగా ప్రతి ఏటా సరికొత్త నిరుద్యోగులు లక్షలాదిమంది పోటీకి సిద్ధమౌతుండటం…. వ్యవస్థీకృత లక్షణంగా వుంది.

          ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన భాజపా నేత నరేంద్రమోడీ, తన ప్రభుత్వ వైఫల్యాలకు జవాబు యిచ్చుకోలేని స్థితిలో, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి విసిరిన ఎన్నికల వల – ఈ 10% రిజర్వేషన్లు. దీనివల్ల అగ్రకులాలు, ముస్లిములలో గల నిజమైన పేద – మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు లభించే అవకాశాలు చాలా తక్కువ.

          ఉన్న ఉద్యోగాలన్నీ ఆయా కులాల, వర్గాలవారీ దామాషా ప్రకారం పంపిణీ చేసినా, నేటి నిరుద్యోగ సంక్షోభానికి అసమానతలను పెంచే ఈ వ్యవస్థలో నివృత్తి లేదు. పెచ్చరిల్లుతున్న ఆర్ధిక అసమానతలను అగ్రకులాలతో సహా మొత్తం పేద, మధ్యతరగతివర్గాల విద్యార్థి యువజనులు ప్రశ్నించకుండా, అందుకు కారకులైన దోపిడీ పాలక వర్గాలను నిలదీయకుండా ఈ సమస్యకు నిజమైన పరిష్కారానికి దారి ఏర్పడదు.

          అసమానతల వ్యవస్థలో అత్యంత అసమానులు దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ వర్గాలు. వారికి రాజ్యాంగం కల్పించిన చిరు ఆసరా రిజర్వేషన్లు. అవి కేవలం ఉపశమనాన్నిచ్చేవే తప్ప పరిష్కారం చూపేవి కాదు. అవికూడా ఆయా సాంఘికవర్గాలలో ఒకడుగు ముందున్నవారికి లాభించినట్లుగా, వెనుకబడినవారిని ఇంకా ఇంకా వెనక్కి నెట్టివేసే స్వభావంకలవి. అందుకే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లనే చిరు ఆసరాను కాపాడుకుంటూనే అంతటితో సంతృప్తిపడకుండా మొత్తంగా నేటి ఆర్ధిక – సాంఘిక – సాంస్కృతిక అసమానతల రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకై ఆలోచనా, అవగాహనా పెంపొందించుకోవాలి.

25-1-2019                                                  – దివికుమార్‌

admin

leave a comment

Create Account



Log In Your Account