Related Posts
– డా॥ పి.వి. సుబ్బారావు
బతుకంతా
బొట్లు బొట్లుగా
కాలపు వేళ్ళ సందుల్లోంచి
మెలమెల్లగా జారిపోతుంటే
కళ్ళల్లో నింపుకున్న
నిరాశా శకలాల తడిపొరల్లోంచి
అప్పుడప్పుడూ తొంగి చూచే గతం
ఊబిలోంచి బయటపడ్డానికి
నిస్సహాయంగా ఆక్రందించే
జీరబోయిన చీకటి గొంతు కేక!
ఆత్మీయంగా వినడానికీ
అభయ హస్తమందించి
బయటకు లాగడానికి
ఎవరూ లేరని తెలిసినా
లోపొరల్లో ఎక్కడో పరుచుకొన్న
ధైర్యపు తెర
వెలుగును సంగ్రహించుకొంటూ
ఆశాశ్వాసల రంగుల్ని
ముద్దలు ముద్దలుగా
పులుముకొంటూనే వుంటుంది
ఒక సర్రియలిస్టు చిత్రంలా
గడచిన కాలంలో
ఘనీభవించిన అనుభవ దొంతర్ల రంగుల వెల్లువలోంచి
లిప్తకాలం ఒళ్ళు విరుచుకలేచే తటిల్లతలా మెరిసి
మరకల్ని వొదిలి మాయమవుతుంది
అందుకే ఎప్పుడో ఎక్కడో
రెక్కలు విప్పుకొన్న ఆనంద పారావతం
నవాగమన వసంతంలా వచ్చి ఒళ్ళో వాలుతుందని నా నిరీక్ష!